సత్యాన్వేషణ-7

2
4

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]ఎ[/dropcap]నిమిది దాటాక వచ్చాడు వైభవస్వామి. నన్ను గుడిలోకి పట్టుకుపోయాడు. లోపల అర్చన చేశారు. ఆ రోజు ప్రత్యేకమైన రోజుట. విపరీతమైన భక్తుల తాకిడి మొదలైనది.

నన్ను ముందుగా అతను వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు.

వాళ్ళ అమ్మమ్మగారు 90 ఏళ్ళ వారు. నడుము బాగా వంగిపొయ్యింది. ఆమె చూపు బానే వుంది. అతని తల్లితండ్రులు ఎక్కడో వున్నారు. ఇతను అమ్మమ్మగారికి తోడుగా వుంటూ, ఆ వేదపాఠశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్నాడు. ఇల్లు కూడా ఎత్తు తక్కువగా వుండి, పూర్వపు బ్రాహ్మణ ఇళ్ళను గుర్తుచేస్తున్నది. ఇంటి మధ్యలో చెక్క స్తంభాలతో, గోడలకు నలుపు తెలుపు ఫోటోలతో మనము పాత సినిమాలలో చూచే ఇంటిలా వుంది.

నన్ను తోపలికి రమ్మన్నారు ఆమె. ఆమెకు హిందీ రాదు. నాకు కన్నడ రాదు.

ఆమె నాతో కన్నడంలో “సుశీల తిన్నిరి” అన్నది.

ఆమె నా పేరు సుశీల అనుకుంటున్నదని భావించి నేను “నేను సంధ్యను” అన్నాను.

ఆమె తిరిగి మళ్ళీ అలానే “సుశీల తిన్నిరి” అని అడిగింది. నాకు ఏమి చెప్పాలో అర్థం కాక వూరుకున్నా.

రెండు మూడు సార్లు అలాగే అని ఆమె లోపలికి వెళ్ళింది.

ఇంతలో ఆ ఆచార్యులు వచ్చి “మీరు సుశీల తింటారా” అన్నాడు.

నాకు నిజంగా ఏమీ అర్థంకాక “అంటే” అని అడిగితే, అదో ఫలహారం అన్నాడు.

నాకు వద్దన్నా అమ్మమ్మగారు బొరుగుల పులిహోర చేసి తెచ్చిపెట్టారు.

అప్పుడు తెలిసింది బొరుగుల పులిహోరను వాళ్ళు ‘సుశీల్’‌ అంటారని. అక్కడి కర్ణాటకలో అలా అంటారుట. అమ్మమ్మగారు తరువాత ‘టీ’ ఇచ్చారు. నే లోపలికి వెళ్ళి చూస్తే ఆమెకు హెల్పుకు కూడా ఎవ్వరూలేరు. నే తిన్న ప్లేటు, మిగిలిన గిన్నెలు కడిగిచ్చి బయటకు వచ్చాను. అక్కడ్నుంచి వచ్చేటప్పుడు ఆమె పాదాలకు వందనము చేసి బయటకొచ్చాను.

అక్కడ్నుంచి మేము మాణిక్యప్రభువు తర్వాతి పీఠాధిపతుల సమాధులను దర్శించినాము. మాణిక్యప్రభువు తర్వాతి పరంపర గురువుల సమాధులు, భక్త వెంకమ్మ సమాధి చూచి వేద పాఠశాలకు వెళ్ళాము.

అది ఉచిత వేదపాఠశాల. విద్యార్థులు ఎనిమిది సంవత్సరములు ఉచితముగా వేద విద్యను అభ్యసిస్తారు. మొత్తము 100 మంది విద్యార్థులు. ఆనాడు వేదపాఠశాలకు సెలవు. కాబట్టి ఆ పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. చిన్న పిల్లలు. అక్కడ చదివిన వారు వివిధ నగరాలలో దేశాలలో స్థిరపడినారు.

ప్రభువు భక్తులకు అన్నదానము ఎంతో ముఖ్యమైనది. అన్నదానానికి ప్రాముఖ్యత వుంది. అక్కడ నిత్యాన్నదానము జరుగుతుంది. భక్తులు ప్రసాదముగా అన్నదాన సత్రానికి వెళ్ళి భోజనము చేసి తృప్తిగా వెడతారు.

“మధుకరా”నికి సమయమైనదన్నాడు వైభవస్వామి. మధుకరమంటే ఏమిటని అడిగానతడిని. మధుకర మంటే భిక్షాన్నము. మాణిక్యప్రభువు ప్రత్రిరోజూ కేవలము ఐదుగురి గృహాల నుంచే భిక్ష స్వీకరించేవారు. నేటికీ ఆ పద్ధతి కొనసాగుతోంది. మధ్యాహ్నము పదకొండుకు ఉదయము దత్తస్వామికి పూజ చేసిన ఆ బ్రహ్మచారి బాలుడు తలకు తలపాగా, బుజానికి ఒక జోలెతో వచ్చి దత్తునికి హారతిచ్చి వెళ్ళాడు. అతను ఐదు గృహాలలో భిక్ష చేసి వచ్చాక, ఆ పదార్థాలను మందిరములో సమాధికి నివేదన చేస్తారుట. ఆ భిక్ష మడితో చేస్తారుట. అతనికి ఎవరూ ఎదురు వెళ్ళరు. అది మధుకరము. ఆ బ్రహ్మచారికి నన్ను భిక్ష సమర్పించమని నాతో వున్న వైభవస్వామి చెప్పాడు.

‘నేనేమివ్వగలను?’

అదే అంటే అతను బజారు నుంచి మధురమైన ఆపిల్, కొన్ని డ్రై ప్రూట్స్ తెప్పించాడు. ఈ బ్రహ్మచారి వచ్చి నా వద్దకొచ్చి వేదమంత్రముల నడిమి భిక్ష తీసుకుంటుంటే నాకు దత్తుని మీద తగని తపన, ఆర్తి కలిగింది. శ్రీ దత్తుడు దయతో ఆ భిక్ష స్వీకరించాడని భావన కలిగింది. ఎంత ఆపినా నా కళ్ళ వెంట నీరు ఆగదే!

“శ్రీ దత్తా. దేవా… ఇల్లూ వాకిలీ వదిలి నీ దర్శనముకై ఇలా వచ్చాను. నన్ను కరుణించవె పరంధామా!” నా హృదయము మౌనముగా ఘోషించింది.

మేము అక్కడి నుంచి మధ్యాహ్న భోజనము జరిగే ప్రదేశానికి వెళ్ళాము. అప్పటికే పిల్లలు బారులుగా వస్తున్నారు. భక్తులు వరసలుగా మరోవైపు కూర్చుంటున్నారు. నన్ను విద్యార్థుల ప్రక్కన కూర్చోపెట్టి వైభవస్వామి మాయమయ్యాడు. నన్ను ఆ పిల్లలు విచిత్రంగా చూస్తున్నారు. వారికి నాకు ప్రసాదముగా ఇచ్చిన ఆపిల్ పళ్ళు ఇచ్చి, పంక్తికి వడ్డించినవి నేను తిని బయటకొచ్చా. ఆ వేద పాఠశాల ఆఫీసుకు తీసుకువెళ్ళారు నన్ను. మా నాయనగారు వేదమాతను సేవించిన భక్తులు. వేద పండితులను ఆయన ఎంతో గౌరవించేవారు. అందుకే నేను నాన్న పేరున అక్కడ పాఠశాలకు కొంత దానము చేసి నమస్కరించి వస్తుంటే ఆ ఆఫీసులో వున్న అతను చెప్పాడు “వేదం చెప్పించుకునే విద్యార్థులు తగ్గిపోతున్నారు రోజురోజుకీ” అని.

‘అవును, ఇవి అంతటా గడ్డురోజులు’ అనుకున్నా. ఇక నేను అక్కడ్నుంచి సీదా బసకు వచ్చి నా బ్యాగు సర్దుకున్నాను.

నా తదుపరి మజిలి గాణ్గాపురము.

***

“ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణమూర్తయే నమః

గురవే సర్వలోకానం భిషజే భావరోగినాం
నిధయే సర్వవిద్యానం దక్షిణామూర్తయే నమః” (శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం)

మాణిక్యనగరు నుంచి గాణ్గాపూర్ వంద కిలోమీటర్లు దూరములో వుంది.

హూమానాబాదులో బస్సు ఎక్కవచ్చు, కాని డైరెక్టు బస్సులు లేవు. మనము ముందు గుల్బర్గా వెళ్ళి మరో బస్సు మారాలి. సరే మారవచ్చు కాని బస్సుల మీద అన్నీ కన్నడములో రాసి వున్నాయి. మనకు తెలీదు ఏ బస్సు ఎటు వెడుతుందో. కొద్దిగా ఇబ్బందిగా అనిపించిన మాట వాస్తవము. పైపెచ్చు ఈ వంద కిలోమీటర్లు అంటే మా లెక్కలలో దాదాపు అరవై మైళ్ళ దూరము. మేము ముప్పావు గంట లేదా గంటలో వెడతాము. అదే దూరము ఇక్కడ ఐదు గంటల ప్రయాణము.

హుమనాబాదు బస్టాండుకు ఆటో తీసుకు వచ్చి, గుల్బర్గా బస్సులో కూలేశాడు ఆటోడ్రైవరు. అతనిని వైభవస్వామి పంపాడు మరి. అలా మాణిక్యనగర్‌ నుంచి గుల్బర్గా ప్రయాణము మొదలైనది. నేను మూడు, నాలుగు గంటల మధ్య బస్సు ఎక్కినట్లున్నాను. అది రెండు గంటలు ప్రయాణం చేసి మునిమాపు వేళ గుల్బర్గా చేరింది.

బస్టాండు కౌంటరులో ఒక ఆపద్భాందవుడు హిందిలో గాణ్గాపూరు బస్సు ఆగే చోటు, బస్సు వచ్చే టైం చెప్పాడు. ఒక ముప్పావు గంట ఆ బస్టాండులో అటు ఇటూ చూస్తూ నిలుచున్నా. ఒక బస్సు వచ్చింది. కన్నడపు బోర్డులో పేరు గాణుగాపూరు కాదు. కన్నడ కొంత తెలుగులా వుంటుంది. మనము చదవవచ్చు కొంత ప్రయత్నిస్తే. వచ్చిన బస్సు మీద బోర్డులో పేరు వేరేది. ఆగినది మటుకు అటుగా వెళ్ళే వైపే. డ్రైవరు నడిగి, అతను తలవూపితే బస్సుఎక్కాను.

రాత్రి 9.30 కి నేను గాణుగాపూరులో దిగాను. అక్కడ బస్సు దిగినది నే ఒక్కతినే. చుట్టూ చిమ్మ చీకటి. కరెంటు పోతే ఎలా వుంటుందో అలా వుంది ఆ ప్రాంతము. పిట్ట లేదు, కన్ను పొడుచుకున్నా కనపడటములేదు ఏమీ. బస్సు వెళ్ళిపోయాక చీకటికి అలవాటు పడి చుట్టూ చూస్తే నక్షత్రాల కాంతిలో ఒక ఆటో కనపడింది.

ఆ పూరి పూజారితో ఒకరితో మునుపు మాట్లాడినప్పుడు “శంకరమఠము”లో బస చెయ్యవచ్చుని చెప్పాడు. నెమ్మదిగా ఆటో దగ్గరకు వెళ్ళి “శంకరమఠము” అని చెప్పాను.

అతను తలవూపి ఆటోను బయలుదేరదీశాడు. మేము అరగంటకు అంటే పదింటికి శంకరమఠము చేరాము. నేను అతనికి డబ్బు చెల్లించి, లోపలికి వెళ్ళి మేనేజరుని పిలిచాను.

చుట్టూ అంతటా తాళాలు. ఎవ్వరూ పలకలేదు. కొంత సేపటికి ఒక పెద్దాయన బయటకు వచ్చి ,

“రూములు లేవు పెళ్ళిపార్టీతో మఠము నిండిపొయ్యింది” అన్నాడు.

మళ్ళీ ఆయనే “ఒక్కదానివే వచ్చావా” అడిగాడు హిందీలో. అవునన్నాను.

లోపలికెళ్ళి కాసేపటికి వచ్చి ఒక రూములోకి తీసుకుపోయాడు. అది వాళ్ళ ఆఫీసు గది. అంతటా కాగితాలు. కాస్త జాగా కూడా ఖాళీగా లేదు.

“ఇక్కడ వుండు రాత్రికి. రేపు చూద్దాము” అన్నాడు.

“బాతురూము” అడిగా నెమ్మదిగా.

“లేదు. బయటకుపో” చెప్పాడు కొద్దిగా కరుకుగా.

నేను తెల్లబోయాను.

నా ముఖం చూసి ఏమనుకున్నాడో, “ప్రక్కన ఒక సత్రం వుంది. అందులో గది వుందేమో చూసి వస్తా” చెప్పి వెళ్ళిపోయాడు.

నేను అక్కడ కుర్చీలో కూర్చున్నాను. ఎదురుచూస్తూ.

పావు గంటకొచ్చి “ఒక గది వుంది సర్దుకోమ్మా” అన్నాడు.

నేను తలవూపి అతని వెనకనే నా బ్యాగు లాకుంటూ నడిచాను.

ప్రక్కన సత్రంలోకి తీసుకుపోయాడు. ఆఫీసులో రాసుకొని డబ్బు తీసుకొని నాకు గది తాళం ఇచ్చారు.

ఆ గది మురిగా వుంది. పక్క నూనే వాసనతో దిండు మట్టిగా వుండింది. (అంతటి మురికి గది నే మళ్ళీ ఎక్కడా చూడలేదు. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు తలకు మట్టి, తలలో పేలతో వెళ్ళాను. గురువు కోసము వెతుకులాట అంటే ఇంత మురుకిగా వుండనక్కర్లేదు కాని అది గమనించే పరిస్థితిలో నే లేను).

నేను దిండు తీసి ఓ మూల పెట్టి, నాతో తెచ్చుకున్న దుప్పటి పక్క మీద పరచి, శాలువ కప్పుకు పడుకున్నా. అప్పటికి ఒంటి గంట. “సచ్‌ ఏ లాంగ్ డే”.

***

“ఇందుకోటి తేజ కిరణ సింధు భక్త వత్సలం
నందనాత్రి సూనుదత్త ఇందిరాక్షి శ్రీగురం
గంధమాల్య అక్షతాది వృందదేవ వందితం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం॥

మోహపాశ అంధకార ఛాయదూర భాస్కరం
అహితాక్ష పాహిశ్రియా వల్లభేశ నాయకం
సేవ్య భక్తవృంద వరద భూయోభూయో నమామ్యహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం॥” ( నృసింహ సరస్వతీ స్త్రోత్రం)

కైలాసం శివ నివాసం, వైకుంఠం శ్రీమహా విష్ణువు నిలయం. అలానే గాణుగాపురం శ్రీ దత్తుని నివాసం. దత్తస్వామి ఈ భూమి మీద స్థిర నివాసం ఉన్న పవిత్ర పట్టణం.

శ్రీ గురుచరిత్ర పరమ పవిత్రమైన గ్రంథము. భౌతికమైన ఇచ్ఛలకు సమాధానముతో పాటూ పారమార్థిక ఫలలానివ్వటానికైనా గురుచరిత్ర పారాయణానికి మించిన మార్గము నాకు తెలిసీ లేదు. అటువంటి శక్తివంతమైన గ్రంధరాజ్యము పామరులకు సైతం గురువును చూపగల దివ్యగ్రంథము. ఆ గ్రంథములో వున్నదంతా శ్రీ దత్తుని రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ యతివరేంద్రుల లీలలు. అవ్వన్నీ కూడా గాణ్గాపురములోనే జరిగాయి. స్వామి అక్కడ నిత్యనివాసముంటానని మాట ఇచ్చారు. ఆయన అక్కడ మనము చేసే సేవలకూ పూజలకు తప్పక పలుకుతారు. లేకపోతే ఏమిటి? ఎక్కడ అట్లాంటా? ఎక్కడ గాణుగాపురము? రాత్రి పదింటికి నేను చిమ్మచీకటిలో భాష, వూరు తెలియని చోట దిగి ఎవరో ఆగంతకుల వెంట సత్రానికి వెళ్ళగలిగానంటే, నన్ను నడిపించిన శ్రీగురుని మహిమకు ఇంతకు మించి సత్యప్రమాణము వున్నదా?

సర్వ రోగాలు, సర్వ బాధలు గాణుగాపూరములోని శ్రీగురుని పాదుకల దర్శనముతో తీరుతాయి. అంతటి దివ్యధామము ఆ పట్టణము.

స్వామి నేటికీ మధ్యాహ్నం పూట ఏదో ఒక రూపములో వచ్చి మధుకరం స్వీకరించే దివ్య క్షేత్రం ఇది.

అమరజ భీమా నదుల సంగమం ప్రక్కన ఉన్న ఈ పట్టణం. శ్రీగురుడుని నమ్మి వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలింగించడు. మీది మిక్కిలి వెంటనుండి తన వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. అన్నిటికి మించి గురువు దర్శనం తప్ప మరో ధ్యాస లేని నాకు ఎందుకో ఎక్కడా నేను ఒంటరిగా ఉన్నానని, భాష లాంటివి అడ్డు అని గాని, నా కేదైనా కీడు జరగొచ్చని కానీ అనిపించలేదు. అసలు ఆ ధ్యాసనే లేదు.

సాలకరి పూజారులని కొందరు అక్కడికి వచ్చే యాత్రికులకు బస ఏర్పాట్లు చేస్తారు. ముందుగా మనము వారిని సంప్రదించవచ్చు. వారి వివరాలు మనకు ఇంటరునెట్‌లో దొరుకుతాయి. వారు యాత్రికుల బస, భోజనము అక్కడ మనము చెయ్యవలసిన పూజలు మొదలైన వాటిని కూడా మనకు అమరుస్తారు. నేను అలా ఒక పూజారితో మాట్లాడాను. కాని ఆయన నేను వెళ్ళిన రోజున వూరిలో లేరు. నేను శ్రీగురు కృపతో మఠములో చేరాను.

గాణగాపురంలో ముఖ్యంగా శ్రీ గురువైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మఠం వున్నది. ఆయన నిజ పాదుకలు అక్కడ విడిచి, వారు శ్రీశైలములో జలములో మాయమయినారని మనము గురుచరిత్రలో చదువుతాము. మఠమే కాకుండా మహాదేవుడు, దత్తపాదుకలు కూడా వున్నాయి. ఔదుంబర వృక్షము, దాని క్రింద గణపతి, శివపార్వతులు వున్నారు. నది వడ్డున వున్న రావి చెట్టు బహు ప్రశంసమైనది. దాని మీదనే బ్రహ్మరాక్షసుని మీద శ్రీగురుడు కరుణ చూపుతాడు.

మఠములో స్వామి పాదుకలను మనము చూడలేము. వాటికి బంగారు తొడుగులు వుంటాయి. ఈ నిర్గుణ పాదాలే భక్తులకు చింతామణి. ఎందరో నిజ భక్తులకు ఈ పాదుకల వద్దనే శ్రీ గురుని దర్శనము లభించినదట.

“అనంతసంసారసముద్రతార-
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం|
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్||

కామాదిసర్పవ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్యనిధిప్రదాభ్యామ్|
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్|” (గురుపాదుకా స్త్రోత్రం)

సంగమము తీరాన ఉన్న పురాతనమైన అశ్వత్థ వృక్షం, దత్తస్వామి గుడి ముఖ్యమైనవి. వాటితో పాటూ సంగమ స్నానం ఎంతో ముఖ్యమైనవి, ఎందరికో జబ్బులు తగ్గించినదని మనము చరిత్రలో చదువుతాము. గాణుగాపురములో అన్నదానము పరమ విశిష్టమైనది. కాశీలో చేసిన అన్నదానంకు సరిసమానంగా ఇక్కడ చేసిన అన్నదానానికి అంత ఫలము ఉన్నదని భక్తుల నమ్మకం. ఇక్కడ చదివే గురుచరిత్రకు వెంటనే సమాధానం వస్తున్నాదని, శ్రీగురుని ప్రత్యక్ష అనుగ్రహం కలుగుతున్నదని కూడా భక్తుల నమ్మకం. ఇక్కడ చాలా మంది భక్తులే కాదు ఎంతో మంది పూజారులు గురుచరిత్ర చదువుతూ కనిపిస్తారు. ఎవరైనా చదవలేని వారు ఉంటే, వారి కోసం కొంత ధనం తీసుకొని చరిత్ర పారాయణం చేస్తారు. మన కోరిక నివేదిస్తే, సంకల్పంలో ఆ విషయం చెప్పి మన కోసం గురుచరిత్ర చదివే  వీలు కూడా అక్కడ ఉంది. ప్రస్తుత కాలంలో కూడా దయాళువైన శ్రీగురుడు ప్రజలమధ్య తిరగాడి, కష్టాలను తీరుస్తాడని నిదర్శనం ఉన్నది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here