[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
జడ్జి గారితో మాలకొండ దైవదర్శనం:
[dropcap]1[/dropcap]967-1975లో నేను కందుకూరు కళాశాల అధ్యాపకుడిగా వున్న రోజుల్లో 1974లో రచయితల సంఘం స్థాపించాం. దానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. రచయిత్రి పవని నిర్మల ప్రభావతి ఉపాధ్యక్షురాలు. వారి ఆహ్వానం మేరకు మాలకొండపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఒక శనివారం కవి సమ్మేళనం ఏర్పాటు చేశాం. కొండమీద వున్న ఆ గుడిని శనివారాలే తెరుస్తారు. మా సంఘానికి చెందిన ఎనిమిది మంది కవులం స్వామిపై పద్యాలు వ్రాసి చదివాం. ఆ సభకు ముఖ్య అతిథిగా కందుకూరు సబ్ జడ్జి బి.నరసింహం విచ్చేశారు. ఆయన సౌజన్యమూర్తి.
అలా న్యాయమూర్తులతో ప్రారంభమైన పరిచయాలు 1998లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు సాగాయి. 1975లో నేను కడప ఆకాశవాణిలో చేరినప్పుడు జిల్లా జడ్జిగా ఏ. సంజీవరావు వుండేవారు. అక్కడ ప్రభుత్వోద్యోగుల క్రీడా సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శిగా కొన్ని కార్యక్రమాలు చేశాను. అందులో ప్రఖ్యాత సినీనటులు హరనాథ్‌కు సంజీవరావు చేత సన్మానం చేయించాము. ఆయన తర్వాత నెల్లూరు జిల్లా జడ్జిగా వెళ్ళారు. జిల్లా జడ్జీలు ప్రసాదరావు, ఏ. వెంకటరెడ్డి, మాల్యాద్రి, పట్టాభిరామారావు, రావినూతల శ్రీనాధరావు పరిచయాలు విశేషంగా చెప్పుకోవాలి.
జడ్జిగారితో బంధుత్వం:
నేను 1993-95 మధ్య కడప ఆకాశవాణి డైరక్టర్‌గా వుండగా జిల్లా జడ్జిగా దూబగుంట సుబ్రమణ్యం వచ్చారు. ఆయనతో దూరపు బంధుత్వం వుంది. స్వయంకృషితో న్యాయవాది స్థాయి నుండి హైకోర్టు న్యాయమూర్తి స్థాయికెదిగారు. రిటైర్‌మెంట్ ముందు ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీలో పదవి లభించింది. దురదృష్టవశాత్తు హఠాన్మరణం చెందారు. 2001-03 మధ్య హైకోర్టు న్యాయమూర్తి.
న్యాయమూర్తులైన మా నెల్లూరీయులు:
నెల్లూరు జిల్లా (విక్రమ సింహపురి) కేవలం రాజకీయ నాయకులకే గాక ఉన్నత స్థానం అలంకరించిన న్యాయమూర్తులకు పుట్టినిల్లు. వారిలో జస్టిస్ పి. వెంకట్రామారెడ్డి నెల్లూరీయుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2001-05 మధ్య వ్యవహరించారు. 2010-12 మధ్య 19వ లా కమీషన్ అధ్యక్షులు. జ్యుడీషియల్ అధికారుల జీతభత్యాల సమీక్షా సంఘానికి అధ్యక్షులుగా 2017లో నియమితులయ్యారు. ఆమంచర్ల గంగాధరరావు హైకోర్టు న్యాయమూర్తిగా 1975-83 మధ్య వ్యవహరించారు. అప్పట్లో ఆయన ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ అధ్యక్షులు. నేను ఆ సంస్థలో క్రియాశీల సభ్యుడిగా తరచూ వారి యింటికి వెళ్ళి కలిసేవాడిని.
నెల్లూరికే చెందిన జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి (1974-76) న్యాయమూర్తిగా విశిష్టులు. కోవూరుకు చెందిన జస్టిస్ సన్నపురెడ్డి చంద్రశేఖరరెడ్డి 1993-97 మధ్య హైకోర్టు న్యాయమూర్తి. వారి జ్యేష్ఠ సోదరులు చంద్రశేఖరరెడ్ది ప్రసిద్ధ రాజకీయ నాయకుడు. వారికి దూబగుంట పాళెంలో భూకమతం 50 ఎకరాలు, ట్రావెలర్స్ బంగళా వుండేవి. వారి పొలంలోకి జీపు వెళ్ళడానికి వీలుగా రోడ్డు వేయించారు. ఆ కమతాన్ని మా పెదనాన్న రామయ్య 40 ఏళ్ళు దక్షతతో సంరక్షించారు. నెల్లూరుకు చెందిన యం.యన్.రావు 1986-97 మధ్య హైకోర్టు న్యాయమూర్తి.
న్యాయమూర్తి ముందు పండితుల హాజరు:
నేను కడపలో పని చేస్తున్నప్పుడు ప్రొద్దుటూరు సబ్ కోర్టు భవనాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (1978-79) ప్రారంభించారు. ఆ సాయంకాలం జస్టిస్ ఆవుల సాంబశివరావు పండిత దర్బారు నడిపారు. కడప, ప్రొద్దుటూరు పట్టణాలలోని కవి పండితులు పదిమందిలో నేనూ వున్నాను. ఆయన సాహిత్యాభిలాషి. ఎన్నో విషయాలు ప్రస్తావించారు. 1984లో నేను వ్రాసిన ‘ప్రకాశం జీవితచరిత్ర’కు ఆయన మంచి పీఠిక వ్రాశారు. ఆ సందర్భంగా వారి యింటి వద్ద కలిశాను. వారి కుమార్తె డా. ఆవుల మంజులత (తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి) తెలుగు విశ్వవిద్యాలయంలో సాంబశివరావు స్మారక పురస్కారం ఏటా యిచ్చే ద్రవ్యనిధి ఏర్పాటు చేశారు. 2014లో ఆ ఎంపిక కమిటీలో నేను సభ్యుడను.
స్కూలు బెంచిలో కూచొన్న గవర్నరు:
కడప జిల్లాకు చెందిన పలువురు హైకోర్టు న్యాయమూర్తులతో నాకు మంచి పరిచయాలు కలిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఓబుల్‌రెడ్డి 1975 జనవరి నుంచి 1976 జనవరి వరకు సంవత్సర కాలం రాష్ట్ర తాత్కాలిక గవర్నరుగా వ్యవహరించారు. 1975 నవంబరులో రాష్ట్రావతరణ దినోత్సవాలకు వారిని కడప కలెక్టరు పి.యల్.సంజీవరెడ్డి ఆహ్వానించారు. కడప జిల్లా నందలూరు హైస్కూలులో ఓబుల్‌రెడ్డి చదువుకొన్నారు. ఆ స్కూలు సందర్శించి తాను చదువుకొన్న బెంచిపై కూచొని ఆనందించారు. అదే జిల్లాకు చెందిన జస్టిస్ పి. చెన్నకేశవరెడ్డి, ఇటీవలే పదవీ విరమణ చేసిన జస్టిస్ నాగార్జున రెడ్డిలతో సభలలో పాల్గొన్నాను.
కడప జిల్లా జడ్జిగా పని చేసిన ఐ. పాండురంగారావు నన్ను ఆదరంగా చూసేవారు. హైకోర్టు న్యాయమూర్తిగా వారి యింట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పిలిచారు.
మహాకవి మనుమడు:
వరవిక్రయ నాటకకర్త కాళ్ళకూరి నారాయణరావు సుప్రసిద్ధులు. వారి కుమారుడు కె.పి. నారాయణరావు నెల్లూరు, గుంటూరు జిల్లాల జడ్జిగా పని చేశారు. గుంటూరులో ప్రసాదరాయ కులపతి ఆధ్వర్యంలో జరిగిన భువన విజయ సభలో ఆయన శ్రీకృష్ణదేవరాయలు. కులపతి తిమ్మరుసు. నేను పింగళి సూరన. నారాయణరావు హైకోర్టు రిజిస్ట్రారు చేసినట్లు గుర్తు. వరవిక్రయ నాటకంలో కోర్టు సీను వుంది. మూడు తరాల వారు న్యాయవాదులుగా వుండటం కాళ్ళకూరి వంశ విశిష్టత.
సూక్తిముక్తావళి చెప్పిన న్యాయమూర్తులు:
నేను హైదరాబాదు ఆకాశవాణిలో పని చేసిన 1982-85 మధ్య రావూరి భరధ్వాజ ప్రసంగశాఖ ఆధ్వర్యంలో సూక్తి ముక్తావళికి న్యాయమూర్తులను ఆహ్వానించేవారు. అలా వచ్చిన వారిలో జస్టిస్ కె. పున్నయ్య మంచి ఆత్మీయులు. లక్ఢీకాపూల్‌లో వారి బంగళాకు చాలా సార్లు వెళ్లాను. అదే బంగళాలో ఆయన కుమార్తె ప్రతిభా భారతి రాష్ట్రమంత్రిగా బస చేశారు. ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడేవారు. జస్టిస్ అమరేశ్వరి తదితరులు ప్రసంగాలకు వచ్చారు. న్యాయశాఖామంత్రి అయ్యపురెడ్డి ఇంటర్వ్యూ కొచ్చారు.
ప్రధాన న్యాయమూర్తి అందించిన స్వర్ణ పతకం:
1985లో నేను భవన్స్ సాయంకాలం కళాశాలలో పిజి డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సులో చేరాను. సంవత్సరం రోజులు క్లాసులు హాజరయ్యాను. దేశవ్యాప్తంగా ప్రథముడిగా ఉత్తీర్ణుడనై బంగారు పతకం, రజత పతకం సంపాదించాను. స్నాతకోత్సవంలో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. భాస్కరన్ నాకు రెండూ బహుకరించారు. అదే భవన్స్ ఛైర్మనులు జస్టిస్ వై.వి. ఆంజనేయులు, జస్టిస్ వై. భాస్కరరావు (జాతీయ మానవ హక్కుల సంఘ సభ్యులు) సుపరిచితులయ్యారు.
న్యాయమూర్తితో మార్నింగ్ వాక్:
హైదరాబాదు శ్రీనగర్ కాలనీలో 1985లో ఒక ఫ్లాట్ కొన్నాను. అదే వీధిలో జస్టిస్ పమిడిఘంటం కోదండరామయ్య నివసించేవారు. ఉదయం పూట మార్నింగ్ వాక్‍లో కలిసి తిరిగే వాళ్ళం. ఆయనకు వాల్మీకి రామాయణం ఆరో ప్రాణం. ‘Light of Ramayana’ అనే ఆంగ్ల పరిశోధనా గ్రంథం ప్రచురించారు. పుల్లెల వారి వ్యాఖ్యలతో వాల్మీకి రామాయణం ప్రచురించారు. పునర్వసు నుండి పునర్వసు వరకు 27 రోజులలో వాల్మీకి రామాయణ పారాయణ పూర్తి చేసి శ్రీరామపట్టాభిషేకం చేసేవారు. భద్రాచలంలో శ్రీరామనవమి నాడు వారి అన్నసత్రంలో బ్రాహ్మణులకు వెయ్యి మందికి పైగా రెండు రోజులు అన్న సంతర్పణ చేస్తారు. నేను 20 సంవత్సరాలు కళ్యాణోత్సవ వ్యాఖ్యానాలు చేశాను. అప్పుడు వారి వితరణను ప్రత్యక్షంగా చూశాను. వారు నాకు రామాయణం సెట్ ఇచ్చారు. నేను కూడా రెండు సార్లు రామాయణ పారయణ భక్తి శ్రద్ధలతో పూర్తి చేశాను. 2000 సంవత్సరంలో తొలిసారి పారాయణ పూర్తి చేసి హారతి ఇవ్వగా చూసి మా తండ్రిగారు ఆగస్టు 5న దైవ సన్నిధికి చేరుకొనడం విశేషం.
హైదరాబాదులో పదవీ విరమణానంతరం నేను పలు సాంస్కృతిక సభలలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్ మద్దాళి రఘురాం సారథ్యంలో రవీంద్రభారతి, త్యాగరాయ గాన సభలలో పాల్గొన్నాను. ఆ సభలలో అతిథులుగా విచ్చేసిన జస్టిస్ రామలింగేశ్వరరావు, జస్టిస్ రజని, జస్టిస్ భవానీ ప్రసాద్, జస్టిస్ చంద్రకాంత్ సరసన వేదికపై ప్రసంగించాను. సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి. సుదర్శనరెడ్డి పబ్లిక్ రిలేషన్ సొసైటీ వారి చర్చాగోష్ఠిలో పాల్గొన్నపుడు నేనూ పాల్గొన్నాను. పలువురు లోకాయుక్తలు ఆకాశవాణి రికార్డింగులకి స్టూడియోకి వచ్చారు. ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ పి.బి.సావంత్‌ని ఇంటర్వ్యూ చేశాను.
పట్టు సడలించిన సుప్రీంకోర్టు:
2000 జనవరి 28న సుప్రీంకోర్టు స్వర్ణోత్సవాలలో రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ విజ్ఞాన్ భవన్‌లో పాల్గొన్నారు. మామూలుగా న్యాయమూర్తులు ప్రెస్ ముందుకు రారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం డైరక్టరుగా నేను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ని కలిశాను. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ. యస్. ఆనంద్ గారి సందేశం రికార్డింగుకు ఒప్పించాము. వారి బంగళాలో రికార్డింగు చేసి జాతీయ రూపకం ఒకటి నా ఆధ్వర్యంలో ప్రసారం చేశాం. అప్పుడు న్యాయమూర్తిగా సుపరిచితులు జస్టిస్ యం.జగన్నాథరావుని కూడా రికార్డు చేశాం.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ కె.రామస్వామి, జస్టిట్ శ్రీనివాసన్, జస్టిస్ జయచంద్రారెడ్డి, జస్టిస్ యస్. యం. ఖాద్రి లను పలు సందర్భాలలో కలిశాను. పండారా రోడ్డులో మా క్వార్టర్స్ సమీపంలో జస్టిట్ జాస్తి ఈశ్వర ప్రసాద్ నివసించేవారు. మా నాన్నగారి సంస్మరణ సభకు వారు మా యింటికి విచ్చేయడం వారి సహృదయతకు నిదర్శనం. అలానే జస్టిస్ వి. రాజగోపాలరెడ్డి (క్యాట్ సభ్యులు) మా యింటిని సందర్శించారు.
ప్రసారభారతిపై కోర్టులో నా కేసు:
2000 సంవత్సరానికి నేను క్లాసు I అధికారిగా 18 ఏళ్ళు పూర్తి చేశాను. నాకు డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా ప్రమోషన్ ఇవ్వాలి. ప్రసారభారతి సి.ఇ.ఓ. అనిల్ బైజాల్‌ని కలిసి అభ్యర్థించాను. “తప్పనిసరిగా 18 ఏళ్ళు నిండగానే ఇవ్వాలని రూల్ లేదు” అన్నాడాయన. నాతో బాటు డైరక్టరుగా పని చేసి రిటైరయిన మిత్రుడు యస్. వై. ఖాన్ నా పక్షాన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో కేసు వేశాడు. అడ్మిషన్ దశలోనే జడ్జి కుట్టి ఇలా ఆదేశించారు:
“అర్హులైన అందరికీ అనంతపద్మనాభరావుతో బాటు ప్రమోషన్లు మూడు నెలల్లో ప్రసారభారతి ఇవ్వాలి.”
మూడు నెలలు పూర్తయినా ఉలుకు పలుకూ లేదు. కంటెంప్ట్ కేసు నోటీసు చూపించాను. నాతో బాటు 12 మందికి ఒకే రోజు డిప్యూటీ డైరక్టర్ జనరల్స్‌గా పదోన్నతి ఆర్డర్లు 2000 ఆగస్టులో జారీ అయ్యాయి.
కోర్టులో నాపై కంటెంప్ట్ కేసు:
నేను 1997-2000 మధ్యలో ఆకాశవాణి ఢిల్లీ డైరక్టర్‌ని. మా ఆఫీసులో 14 మంది తాత్కాలిక ప్రాతిపాదికపై పది సంవత్సరాలుగా ప్రొడక్షన్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వాళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో ఆర్డర్లు తెచ్చుకొన్నారు. డైరక్టరేట్ వాళ్ళు పట్టించుకోలేదు. డైరక్టరుగా నాపై కోర్టులో కంటెంప్ట్ వేశారు. అప్పుడు నిద్ర లేచిన డైరక్టరేట్ వాళ్ళు 14 మందికి శాశ్వత ఉద్యోగ నియామకాలు జారీ చేయమని నన్ను ఆదేశించారు. రేపు కోర్టులో హాజరవ్వాలి. జడ్జిగా పరిచితులైన జస్టిస్ వి. రాజగోపాలరెడ్డి, శ్రీమతి శాంత నన్ను చూశారు. మా తరఫు న్యాయవాది ఆర్డర్లు ఇచ్చామని కోర్టుకు విన్నవించారు. జడ్జిగారు నా వైపు చిరునవ్వు చిందించి “యు కెన్ గో” అన్నారు. అలా కోర్టు వారు దయ తలిచారు.
50 ఏళ్ళ జీవన గమనంలో బచ్చు పార్థసారథి, లా కౌన్సిల్ చైర్మన్ డి. వి. సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది పి.పి.రావు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వి.ఆర్.రెడ్డి, శ్యామలా పప్పు పరిచయమయ్యారు. లా కమీషన్, న్యాయ శాఖకు చెందిన పేరి శాస్త్రి, జి.వి.జి.కృష్ణమూర్తి, వి.యస్. రమాదేవి సౌహార్ద్రం మరువలేనివి.