స్నిగ్ధమధుసూదనం-14

0
3

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 14వ భాగం. [/box]

[dropcap]ఉ[/dropcap]దయాన్నే లేచింది తన్మయి ఎప్పటిలాగే.

శ్రావణ మేఘాలు ఆ రోజు ఉదయాన్నే ఆకాశాన్ని అలంకరించెయ్యడంతో ఇంకా చీకటిగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఏ నిముషంలో అయినా కుంభవృష్టి కురిసేలా ఉంది.

మనసెందుకో చాలా తేలిగ్గా అనిపిస్తోందామెకి. తన మొబైల్ తీసుకుని మేడ మీదకి వెళ్ళింది.

వాన రాకని మోసుకొస్తూ చల్లటి గాలి తనువుని తాకేసరికి అకస్మాత్తుగా ఏదో లోకంలో అడుగుపెట్టినంత హాయి కలిగింది. మేడ మీద ఒక పక్కగా గుల్మొహర్ చెట్టు కొమ్మలు గొడుగులా పరుచుకుని ఉంటాయి. వాటి నుంచి రాలిన ఎర్రటి పువ్వులు చూడగానే ఆమె వదనం గులాబిలా వికసించింది.

గోడని ఆనుకుని ఆ పూలని చూస్తూ కింద కూర్చుంది. మొబైల్లో తనకిష్టమైన పాట పెట్టింది.

“సఖీ… కేశీ మథన ముదారం …
…నిభృత నికుంజ గృహం గతయా నిశి
రహసి నిలీయ వసంతం
చకిత విలోకిత సకల దిశా
రతి రభస భరేణ హసంతం..”

పాట వింటూ ఆ పాటలో భావానికి మైమరచిపోతూ, ఎదురుగా కనిపిస్తున్న ఎర్రటి తురాయి పూలని చూస్తూ కళ్ళు మూసుకుంది తన్మయి,

ఆ పాటలో భావాలకి అనుగుణంగా ఆమె అంతర్నేత్రంలో ఆమెకి రాధ, పాటలో రాధ వేదనంతా వింటున్న ఆమె స్నేహితురాలు, రాధ హృదయాకాశంలో కృష్ణుడు అందరూ కనిపిస్తున్నారు. మెల్లగా ఆ భావానికనుగుణమైన భంగిమలో రాధాకృష్ణుల్ని దర్శిస్తోందామె.

“ప్రథమ సమాగమ లజ్జితయా పటు చాటు శతైరనుకూలం…
మృదు మధురా స్మిత భాషితయా
శిథిలీకృత జఘన దుకూలమ్‌
కేశిమథన ముదారం”

ఈ చరణం వింటూనే అర్ధనిమీలంగా ఉన్న ఆమె కన్నులు ఎదురుగా ఉన్న ఎర్రటి పూలని చూస్తూనే ఆమెకి తెలీకుండానే తన్మయి కళ్ళులో వర్షం మొదలైంది. సన్నటి జలపాతపు పాయలా ఆమె చెక్కిళ్ళ మీంచి జారుతున్న కన్నీళ్ళు మెడమీదకీ జారుతున్నాయ్.

ఏదో తెలీని భావన పట్టి లాగినట్టు అయోమయంగా పరిసరాల్ని చూసింది. ఎర్రటి ఆ పూలు, ఈ పాట మనసు పొరల్ని ఒక్కసారిగా కుదిపేసిన భావన. చిత్రంగా అనిపించి మళ్ళీ ఆ చరణాన్ని పెట్టింది.

“ప్రథమ సమాగమ లజ్జితయా పటు చాటు శతైరనుకూలం…
మృదు మధురా స్మిత భాషితయా
శిథిలీకృత జఘన దుకూలమ్‌
కేశిమథన ముదారం”

అయోమయంగా అనిపింఛింది తన్మయికి. ఈ పాట తను అప్పుడప్పుడూ వింటూనే ఉంటుంది. కానీ ఈ రోజెందుకో ఈ చిరు చీకట్లతో ఉన్న వాతావరణం, ఎదురుగా ఎర్రటి పూలు మరింత సమ్మోహనంగా అనిపిస్తున్నాయ్ తనకి. ఏదో తెలీని ఆవేశం కలుగుతోంది. అలజడి ఆపుకుంటూ కళ్ళు మూసుకుని తన ఊహల్లో రూపు దిద్దుకుంటున్న చిత్రాన్ని చూస్తోంది.

రాధ కృష్ణుడితో జరిగిన తన ప్రథమ సమాగపు విషయాల్ని సిగ్గుతో తన స్నేహితురాలికి వివరించడాన్ని, ఆ సమయంలో ఆమె మనసులో మెదులుతున్న ఆనాటి జ్ఞాపకాల్ని కూడా చిత్రంలో చూపించినట్టు.

తన్మయి పూర్తిగా ఆ దృశ్యంలో మునిగిపోయింది. అందమైన ప్రదేశంలో ఓ పూల పొదరింట్లో కృష్ణుడు తనను తొలిసారి కౌగిలించుకోవడాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్న రాధ వదనం సిగ్గుతో కందిపోయి ఎర్రటి తామరపూవులా ఉంది. అదే సమయంలో కృష్ణుడి విరహాన్ని భరించలేని వేదన కూడా ఆమె ముఖంలో కనిపిస్తోంది.

అలా ఎంతసేపు ఉండిపోయిందో తెలియలేదు తన్మయికి. ఊహల్లో రూపు దిద్దుకుంటున్న ఆ అద్భుత చిత్రంలో ప్రతి అణువునీ మెల్ల మెల్లగా మెదడులో నిక్షిప్తం చేసుకుంటోంది. ఆ చిత్రంలో ఉన్న రాధా మాధవులు, రాధ ప్రియ సఖీ, వెనుక చిత్రించిన రాధ ఆలోచనల్లోని చిత్రాల్లోని హావభావాలని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తూ మెల్లగా ఆ చిత్రాన్ని అలాగే మెదడులో ఘనీభవింపజేసుకుంటోంది.

ఆ క్షణంలో తన్మయి వదనం మూసుకున్న కళ్ళతో అసలీ లోకంతో తనకు సంబంధమే లేదన్నట్టుగా ఉంది.

సరిగ్గా ఆ క్షణంలోనే తన్మయి తనువు గట్టిగా కుదపబడింది. ఆ కుదుపు శరీరమంతా మరింత వేగంగా వ్యాప్తిచెందాక, ఉలిక్కిపడింది తన్మయి. అతి మెల్లగా కళ్ళు తెరిచిన ఆమెకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఎదురుగా తన తల్లి తన ముఖంలోకి ఆందోళనగా చూడటం కూడా ఆమెకు తెలియలేదు. ఎక్కడో మార్మిక లోకాల్లో ఆనందవిహారం చేసిన ఆమె మనసు ఈ క్షణంలోకి రావడానికీ, ఈ క్షణాన్నీ, ఈ పరిసరాల్నీ స్వీకరించి , తిరిగి తన ఉనికిని ఇక్కడ అంగీకరించడానికీ చాలా సేపే పట్టింది.

కానీ, ఆ సమయం తన్మయి తల్లి దేవకిలో తొలిసారిగా విపరీతమైన భయాన్ని రేపింది.

మనసు కూడా శరీరంతో కలిసి ఇహంలోకి పూర్తిగా వచ్చాక ఆశ్చర్యంగా తల్లి ముఖంలోకి చూసింది తన్మయి.

దేవకి కళ్ళు ఏడ్చినట్టుగా ఉన్నాయి. జోరు వానలో ఆమె తడిసిపోతున్నా కూడా ఎరుపెక్కిన ఆమె కళ్ళనుంచి జారుతున్న వెచ్చటి కన్నీరుకీ, ఆమె తల నుండి ముఖం మీదకి జారుతున్న వాన నీరుకి బేధం తెలుస్తోంది.

తన్మయి భృకుటి ముడిపడింది. అప్పుడు చూసింది పైకి. జోరుగా వాన. తల్లి పూర్తిగా తడిసి ముద్దైపోయింది.

“అమ్మా, ఏమిటిది? ఎందుకు ఇలా వానలో తడుస్తున్నావు?”

తన్మయి వేసిన ప్రశ్నకి దేవకి అవాక్కై మరింత ఆందోళనగా తన్మయి ముఖంలోకి చూసింది. రెండు చేతులతో తను పట్టుకున్న కూతురి భుజాల్ని మరింత గట్టిగా కుదుపుతూ, “నేను తడుస్తున్నానా? మరి నువ్వు?” అంది మెల్లగా తీక్షణంగా.

అప్పుడు చూసుకుంది తన్మయి తన వైపు. అప్పుడు తెలిసింది ఆమెకి తన శరీరం మొత్తం తడిసి ముద్దైపోయిందని. అప్పుడే వీచిన గాలికి శరీరం చిన్నగా వణికింది. అయోమయంగా ఒకసారి పరిసరాల్ని చూసింది. చాలాసేపుగా పెద్ద వర్షం కురుస్తున్నట్టుగా ఉంది చుట్టూ. డాబా పైన సెలయేరులా పారుతున్న వాన నీటిలో ఎర్రటి గుల్మొహర్ పూలు కొట్టుకుపోతున్నాయ్.

చుట్టూ ముసురుకున్న వానకి ఏమీ కనపడటం లేదు. ఆకాశం కిందకి దిగొచ్చినట్టుగా ఉంది.

వెంటనే తేరుకుని తల్లి చేతుల్ని తన భుజాల మీద నుంచి విడిపించుకుని, తనే తల్లిని పొదవి పట్టుకుని వేగంగా క్రిందకి తీసుకువెళ్ళింది తన్మయి. దేవకి మౌనంగా కన్నీరు కారుస్తూ కూతుర్ని అనుసరించింది.

తల్లీ, కూతురూ మేడ దిగి ఇంటిలోపలికి ప్రవేశించేసరికి అప్పుడే బజారు నుంచి వచ్చిన ప్రకాశరావు తడిసి ముద్దై ఇంట్లోకి వస్తున్న తల్లీ, కూతుర్ల వైపు విచిత్రంగా చూశాడు. తడిసి నీరు కారుతున్న వాళ్ళ బట్టలు ఇల్లంతా తడపకుండా ఉండాలని తన్మయి తల్లిని అలాగే బాత్రూం లోకి తీసుకువెళ్ళింది.

“అమ్మా, ముందు బట్టలు మార్చుకో. నేను నా గదిలో మార్చుకుని వస్తాను” అని తల్లిని కుదిపి తన గది వైపు వెళిపోయింది.

తన్మయి వైపు అభావంగా, భయంగా చూస్తూ దేవకి యాంత్రికంగా తలుపు మూసింది.

పది నిముషాల తరువాత దేవకి పొడి బట్టలతో హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది.

అప్పటికి తను తెచ్చిన కూరలన్నీ ఫ్రిడ్జ్‌లో సర్ది లేచి తనూ ఆమె పక్కన విశ్రాంతిగా కూర్చున్నాడు ప్రకాశరావు.

“ఏమిటి దేవకీ, ఇద్దరూ పైన వానలో డ్యూయెట్ పాడుకుని వచ్చారా ఏంటి” అన్నాడు భార్య వంక చూసి విలాసంగా నవ్వుతూ.

దేవకి బదులివ్వలేదు. వడిలిపోయిన ఆమె ముఖాన్ని అప్పుడు గమనిస్తూ ముందుకి వంగాడతను.

“ఏమయింది దేవకీ? ఏడుస్తున్నావెందుకు?” ఆమె కళ్ళలో చెమ్మ చూసి చలించిపోతూ అడిగాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here