సాహితీ కిరణం

1
3

[dropcap]ప్రి[/dropcap]న్సిపాల్ ప్రమోషన్ కౌన్సిలింగ్ కోసం మా జాయింట్ డైరక్టర్ దగ్గర నుండి పిలుపు వచ్చింది. సీనియారిటీ ప్రకారం పిలుస్తూంటే.. ఉన్న ఖాళీలలో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ జూనియర్ కాలేజీ నంగునూర్ కావాలని ఎన్నుకున్నాను. నా స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. కారణం అడిగితే నవ్వుతూ..

“నంగునూరు ఎన్నుకోడానికి రెండు కారణాలున్నాయి” అన్నాను. ఏంటో అవి.. అన్నట్లుగా ఎకసక్కెంగా చూసారంతా.. నేను ఆవేశ పడలేదు. నెమ్మదిగా సమాధానమిచ్చాను.

“ఒకటి అది సిద్దిపేట జిల్లాలో మండల కేంద్రమైనా చాలా వెనుకబడింది. అక్కడ చదివే పిల్లలంతా పక్క పల్లెటూల్ల నుండి వచ్చే వాళ్ళే.. వాళ్ళకు సరియైన రీతిలో విద్యనందించి.. కాలేజీ ఉత్తీర్ణత శాతం మెరుగు పరుద్దామని.

ఇక రెండవది.. నేను బాల్యంలో మూడవ తరగతి వరకు బచ్చన్నపేట ప్రైమరీ పాఠశాలలో చదువుకున్నాను. అప్పుడప్పుడు వెళ్ళి ఆ పాఠశాలను చూసి రావచ్చనే.. నా చిరకాల కోరిక తీర్చుకుందామని”

నా సమాధాన విని ఫక్కున నవ్వారు. నన్నొక పిచ్చివాని కింద జమకట్టారు.

“ఆ కాలేజీ సంగతి తెలిస్తే అలా మాట్లాడవు సురేంద్రా.. అది రహదారికి చాలా దూరం. లెక్చరర్లెవరూ సరిగ్గా కాలేజీకి వెళ్ళరు. వాళ్ళు రావడం లేదని పిల్లలు.. పిల్లలు రావడం లేదని లెక్చరర్లు. కాలేజీ దాదాపు ఎత్తివేసే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఉద్ధరిద్దామని నువ్వు వెళ్తాననడం.. హస్యాస్పదం. మరో కాలేజీ తీసుకో..” అంటూ మరో మారు అంతా హేళనగా చూసారు.

నేను వారికి చిరునవ్వే సమాధానమయ్యింది.. నా నిర్ణయం మారదన్నట్టుగా.

***

కొత్తగా ప్రిన్సిపాల్ వస్తున్నాడంటే.. కాలేజీ స్టాఫంతా హాజరవడం మామూలే. అయితే దాన్ని శాశ్వతం చెయ్యాలని.. అదే రోజు సాయంత్రం స్టాఫ్ మీటింగ్ పెట్టాను. నా పరిచయమనంతరం..

“మనం ఒట్ఠి మాటల మనుషులం కాము.. చేతల మనుషులమని నిరూపిద్దాం. మనమంతా కలిసి ఐకమత్యంగా కాలేజీని చక్కదిద్దుదాం. విద్యార్థులంతా మన పిల్లలే అని వారి భవిష్యత్తుకు పునాదులు వేద్దాం. మరో విషయం.. మీకెవరికైనా డబ్బులు అవసరమైతే నన్ను అడగండి. కాని డబ్బుకోసం.. ఇతర మార్గాలు ఎన్నుకొని పిల్లల నోరు కొట్టొద్దు. ఆ తరువాత జరుగబోయే పరిణామాలకు బలికావద్దు” అంటూ స్టాఫ్‌ను కలియ జూస్తూ.. రెండే రెండు ముక్కలు మాట్లాడాను.

కొందరిలో నిర్లక్ష్యధోరణి కనబడింది. ఏ సంస్థ అయినా.. నడిపించే వాణ్ణి బట్టి ఉంటుంది. ‘యధా రాజా తధా ప్రజా..’ అనే సామెత మనకు తెలియంది కాదు. అని మనసులో అనుకున్నాను.

నంగునూర్‌లోనే ఒక గది అద్దెకు తీసుకున్నాను. స్వయంపాకం మొదలుపెట్టాను. మా అఫీసు సహాయకుడు సారయ్యకు నా స్వంత పనులు ఆవగింజంతైనా అప్పగించక పోవడం. ఒకింత ఆశ్చర్య పోయాడు. ఇలా ఎన్నాళ్ళో.. చూద్దాంలే.. అన్నట్లుగా సారయ్య ముఖం పెట్టడం చూసి లోలోన నవ్వుకున్నాను.

ఆ మరునాడు కాలేజీకి అందరికంటే ముందుగా వెళ్ళాను. హాజరు రిజిస్టరు నా టేబుల్ మీద పెట్టుకున్నాను. ఒక్కొక్క లెక్చరరు రావడం.. వారి ఆలస్యానికి వారే సిగ్గుపడుతూ.. సంతకం పెట్టడం గమనించాను. రెండు రోజుల్లో వారి హాజరు క్రమబద్ధమయ్యింది.

ఇక పిల్లల కోసం సాయంత్రం అదనంగా ఒక గంట కేటాయించి వారి చదువుపై శ్రద్ధ పెట్టాను. మొదటి రోజు పిల్లందరిని కళాశాల డాబాపై కూర్చోబెట్టి వారితో బాటుగా నేనూ కింద కూర్చున్నాను. పిల్లలు.. స్టాఫ్ అంతా వద్దని వారించారు. కుర్చీ తీసుకు వస్తానని సారయ్య పరుగెడుతుంటే.. వద్దని సున్నితంగా తిరస్కరించాను.

నా గణితశాస్త్రానికి మళ్ళీ పని కల్పించాను. పిల్లలకు క్లిష్టమైన సమస్యలు బోధిస్తుండడం చూసి మిగతా లెక్చరర్లూ .. నన్ను అనుసరించసాగారు.

పిల్లలకు స్కాలర్‌షిప్ హాజరైన దినాలకు మాత్రమే ఉంటుందని.. హాజరు కావాలంటే.. స్టడీ అవర్స్‌లో ఉంటేనే.. పూర్తి హాజరు పడుతుందని.. పిల్లలకు చదువు చెప్పడానికే మాకు ప్రభుత్వం జీతాలిస్తుందని.. అర్థమయ్యేలా విద్యార్థులకు వివరించాను. వారం రోజుల్లోనే.. కాలేజీ ఒక గాడిన పడింది.

ఇక పిల్లల చదువుపై మరింత శ్రద్ధ సారించాను.. పరీక్షల సమయమాసన్నమయ్యిందని.

ప్రవీణ్‌కుమార్ అనే కామర్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థి చేతి వ్రాత చాలా బాగుంటుంది. చాలా బాగా చదువుతాడు గూడా. అతని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నేనూహించినట్లుగానే ఆ సంవత్సరం ర్రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల నుండి తృతీయ స్థానం పొందాడు.

మా డైరక్టర్ గారు హైద్రాబాదులో కళాశాల లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ళతో ఒక సభ ఏర్పాటు చేయించి నన్నూ.. ప్రవీణ్ కుమార్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించాడు.

సభలో నేను మా అధ్యాపక బృందం కలిసి చేసిన కృషిని వివరించాను. ప్రవీణ్‌కుమార్ తాను చదివిన అనుభవాలను చెప్పాడు.

డైరక్టరు గారు నా సన్మాన కార్యక్రమం ప్రకటించగానే నివ్వెర పోయాను. నేనూహించనిదది. నేను వెంటనే స్పందించాను. “నాకు బదులుగా.. మా కాలేజీ పేరు నిలిపిన ప్రవీణ్‌కుమార్‌ను సన్మానిస్తే బాగుంటుంది” అని విన్నవించుకున్నాను.

సభలో చప్పట్లు మారుమ్రోగాయి. ఆ చప్పట్ల మధ్యలో ప్రవీణ్‌కుమార్ చదువులకయ్యే ఖర్చులు నేను భరిస్తానని ప్రకటించాను.

సభలో మరో మారు కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here