[dropcap]దే[/dropcap]శంలో నేటి సామాజిక స్థితిగతులపై తన ఆలోచనలను ‘వారెవ్వా’ అంటూ కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు ఐతా చంద్రయ్య.
తెలుగు సినిమా తెగువ జూడగ
తెలివి పారిపోవు నందురు.
పేరు పెద్ద, ఊరు దిబ్బయను
సామెతకు సరిపోవునంట.
విశ్వభాషల సిన్మాకంటె
తెలుగు సినిమా లెక్కువాయె.
నటనలో జీవమ్ము కరువు
పాటలో పాటవము లేదు.
మాటలలో మానితము కరువు
ఆటలో అంకితము శూన్యము.
***
రాశి పెద్దది వాసి చిన్నది
ప్రచారమున పండిపోయెను.
గీతమెంతో గొప్పదైనను
సంగీతము మింగివేసెను.
పాత సినిమా కళా రూపము
కొత్త సినిమా కుండదాయె.
సినీ ‘పరిశ్రమ’ స్థాయి కెదిగి
ఉత్పత్తుల ఉన్నతాయెను.
కళాదృష్టియె కల్లలాయెను
పోటీ మాత్రం పెరిగిపోయెను.
***
భారతీయ సంస్కృతి మహా
భాగ్యముగా దలచరాయె.
నటీనటులే పెరిగిపోయిరి
నాణ్యత గమనించరైరి.
అఖిల భారత స్థాయినందున
అందిరాదు అసలు బహుమతి.
క్లాసు నవలల కథలు సిన్మా
కథలుగా రూపొందించరు.
ఆస్కారు అవార్డుకైననూ
ఆస్కారమె లేదు బాబూ!