[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
ఏవమ్మా..! బొట్టు పెట్టుకో..!!
సంస్కృతీ, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే, మనదేశం ఇతర దేశాలకు భిన్నంగా ఉంటుంది. మనలో కొన్ని ఎవరూ ఆచరించని ప్రత్యేకతలు వున్నాయి. ఇతర ప్రపంచ దేశాలు, కొన్ని తప్ప, మిగతా అన్ని దేశాలూ, మిశ్రమ సంస్కృతిని, ఆచార వ్యవహారాలనూ మూటగట్టుకుని వున్నాయి. మనదేశంలో మరిన్ని ప్రత్యేకతలు ఏమంటే, మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ, కులాలకు, మతాలకూ ప్రాంతాలకూ ముడిపెట్టబడ్డాయి. అందుచేత ఒకే దేశంలో భిన్న రూపాల్లో సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ మనకు కనిపిస్తాయి. వీటిలో వేషధారణను,ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. పండుగల విషయం వేరే చెప్పనక్కరలేదు. పెళ్లిళ్ల విషయానికి వస్తే, ఈ అంశం కూడా ఒక్కొకరిలో ఒకోలా భిన్నంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆధునికత పేరుతో, మనం కూడా, ఇప్పటివరకూ మనల్ని అంటిపెట్టుకుని మనతో పయనిస్తున్న సంప్రదాయాలూ విడిచి, సంస్కృతిని విదేశాలనుండి దిగుమతి చేసుకుని,మనం ఏమిటో తెలియకుండా పోతున్నాం. నూతన పోకడలకు దాసోహం అయిపోతున్నాం.
చీర.. పురాతన కాలంనుండి మన స్త్రీమూర్తుల వెంట నడిచి వస్తున్న కట్టుబడి ఆచారం. అది మన సంస్కృతితో, సంప్రదాయంతో, ముడిపడి వున్న అంశం. నిజానికి చీర అందంగా కట్టుకోవడం ఒక కళ. అది ఇతర మహిళామణులకు అబ్బని విద్య. మనదేశ స్త్రీలు అమెరికా వంటి పాశాత్య దేశాల్లో చీర కట్టుకుని తిరుగుతుంటే, అక్కడి వనితలు వింతగా చూడడం నేను గమనించాను. అంత మాత్రమేకాదు, చిన్నగా పరిచయం చేసుకుని, చీరకట్టే విధానాన్ని అక్కడి మహిళలు ఆసక్తిగా అడిగి తెలుసుకున్న సందర్భాలూ నేను గమనించక పోలేదు. దేవతా స్త్రీ మూర్తులకు కూడా చీరకట్టి సింగారించడం మన సాంప్రదాయాల్లో ముఖ్యమైనది. సరే.. దేవతలు కాబట్టి ఆ సంప్రదాయమేదో గుడ్డిలో మెల్లలా ఇప్పటికీ కొనసాగుతూ వున్నది. మరి చీరలు కట్టేవారి సంఖ్య తగ్గిపోవడం లేదా? మహా అయితే పెళ్లిళ్లకు, పండగలకూ, అతి బలవంతం మీద ఇప్పటి ఆధునిక ఆడపిల్లలు చీరలు కడుతున్నారు తప్ప మిగతా రోజుల్లో అంతా డ్రెస్సులే! చీరలు కట్టే సంప్రదాయం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. దీనికి భిన్నంగా విదేశీ స్త్రీలు మన ఆచారాలను దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మనం మాత్రం జీన్ పేంట్లు, మిడ్డీలు, చుడీలు, ఇతర ఫ్యాషన్లు ఆహ్వానిస్తున్నాం. మగాళ్లు పంచ కట్టడం ఎప్పుడో మరచిపోయారు, లుంగీలు మాయమైపోతున్నాయి. పల్లెల్లో సైతం షార్టులు వివిధ రూపాల్లో వెలుస్తున్నాయి. సరే, అలంకారం – ఆహార్యం గురించి మాట్లాడవలసిన సమయం కాదేమో.. అతి సున్నితమైన అంశం అయిపొయింది. ఎవరి ఇష్టం వారిది. కాలంతో పాటు కదలి పోవలసిందేనేమో!
కట్టుతో పాటు బొట్టు ఒకటి మన సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడి వుంది. ఇది కూడా, కులం -మతంతో కలసి ప్రయాణం చేస్తున్నది! అంటే కొంతమందికి, బొట్టు తప్పనిసరి. బొట్టు లేకుండా ఇంట్లో కనపడరు, బయటకు కదలబోరు. హిందూ సంప్రదాయానికి, సంస్కృతికి, ఇది పెద్ద గీటురాయి. ఎందుచేతనంటే, హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఆడపిల్లకు, మహిళకు బొట్టు అవసరం. నుదుట బొట్టు లేకుంటే, ఎదుటి వారి ఆలోచనలు పరి పరి విధాలా పరిభ్రమిస్తుంటాయి మరి!
దీనికి భిన్నంగా కొన్ని మతాలలో, వర్గాలలో బొట్టు పెట్టుకోవడం నిషేధం! అది వారి సంస్కృతి. అంతే!! ఈ కోవకు చెందినవారిలో, నాకు తెలిసినంత వరకూ మూడు వర్గాలున్నాయి. వారిలో క్రైస్తవులు వున్నారు (ఇందులో మళ్ళీ ఒక ఉప వర్గం వారు బొట్టు పెట్టుకుంటారు, విగ్రహ పూజలు కూడా చేస్తారు). అలాగే, ముస్లింలు కూడా బొట్టు పెట్టుకోరు! తరువాత నాస్తికులు సైతం బొట్టు పెట్టుకోరు. అయితే ఆధునిక నాస్తికులు కొందరు ఇప్పుడిప్పుడే ఆ సంప్రదాయానికి గుడ్ బై చెప్పేసి, చక్కగా బొట్టుపెట్టుకుని ‘జస్ట్ ఫర్ చేంజ్..!!’ అంటున్నారు. సరే ఇలాంటి అతి సున్నితమైన విషయాలు ఇంతకు మించి చర్చించడం కూడా సబబు కాదు. ఈ వ్యాస రచయితకు మాత్రం బొట్టు పెట్టుకున్న ఆడపిల్లలు, మహిళామణులు అంటే ఇష్టం. అది వేరే విషయం.
ఇక సంస్కృతి – బొట్టు అనే అంశాలు ఇంతగా చర్చించడానికి గల ముఖ్య కారణం, బొట్టుతో నాకున్న గత అనుభవం గురించే!నా జీవన మూలాలు పూర్తిగా నాస్తిక జీవన విధానంతో సహవాసం చేసినవి. మా నాయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను (అప్పటివి) నూటికి నూరు శతం నమ్మి ఆకళింపు చేసుకుని ఆచరించిన వ్యక్తి. అందుకే ఇంట్లో పొరపాటున కూడా ‘దేవుడు’ అనే పదం వినపడేది కాదు. మా అమ్మమూలాలు పూర్తిగా క్రైస్తవత్వానికి చెందినవే! అయినప్పటికీ, మా కుటుంబం వల్ల ఆవిడ కూడా నాస్తికత్వానికి తలవొగ్గక తప్పలేదు.
ఇక నా శ్రీమతి కుటుంబం మూలాలు వాళ్ళతాత ముత్తాతల నుండీ కూడా క్రైస్తవమే! మా మధ్య బంధుత్వం కూడా వుంది. కానీ మతం అన్నింటి కంటే పవర్‌ఫుల్. అయినా పెళ్ళికి, ‘బొట్టు’ సమస్య కాకూడదని నా మనస్సులో వున్నా.. పెళ్ళైన తర్వాత తప్పకుండా బొట్టుపెట్టుకోవాలనే నిబంధన పెట్టాను. కాదు.. మంకుపట్టు పట్టాను, కారణం నాకు బొట్టు ఇష్టం కనుక! కానీ.. నా శ్రీమతి మాత్రం అవునని కానీ, కాదని కానీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. దీని వల్ల పెళ్ళికి ఎక్కడ అంతరాయం వస్తుందో అన్నది ఆమె భయం కావచ్చు. పెళ్లి తతంగం అయిపోయిన తర్వాతనే అసలు సమస్య ఉత్పన్నం అయింది ఆమెకు.
మహబూబాబాద్‌లో కాపురం పెట్టాక మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు, ఒక్క బొట్టు విషయం తప్ప. బయటికి వెళితే తప్పక బొట్టు పెట్టుకోమని హింసించేవాడిని. ఆమెకు సుతారమూ బొట్టు పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా, నా భయానికో భక్తికో, తప్పక పెట్టుకునేది. తర్వాత వాళ్లకు ప్రతి ఆదివారం చర్చికి వెళ్లడం తప్పనిసరి అలవాటు. నేను వెళ్లనిచ్చేవాడిని కాదు. అయినా ఆమె ఎప్పుడూ దాని గురించి ఎదురు తిరిగిన సందర్భాలు లేవు. అయితే, కొన్ని నెలల తర్వాత నేనే ఆలోచనలో పడ్డాను. మానసికంగా ఆమె ఎంత బాధ పడుతున్నదో కదా! ఆమె కనీస స్వేచ్ఛను నేను ఎందుకు అడ్డుకోవాలి? అన్న ఆలోచనలతో చాలా రోజులు బాగా అలోచించి సకాలంలోనే ఒక నిర్ణయానికి వచ్చేసాను. చర్చి విషయంలో గానీ, ఆమె బొట్టు విషయంలో గానీ నేను ఎలాంటి ఆంక్షలూ విధించ కూడదని అనుకున్నాను. ఒక శుభోదయాన ఇదే విషయం ఆమె చెవిన వేసాను. అది విన్న ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పంతాలకూ పట్టింపులు జోలికి పోకుండా నిశ్శబ్ద యుద్ధం చేసి ఆమెనే గెలిచింది. గెలిచామన్న అహంభావం కూడా ఆమె ఎప్పుడూ చూపించలేదు. అంతేకాదు నన్నుకూడా చర్చి వైపు మళ్లించింది.
కొంత కాలం నా శ్రీమతి ఒక్కతే చర్చికి వెళ్ళేది. తర్వాత ఆమెను తీసుకుని నేను కూడా వెళుతుండేవాడిని. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. నేను చర్చికి వెళితే శ్రద్ధగా కూర్చుని ప్రసంగం వింటాను. మంచిని కాదనే దమ్ము ఎవరికుంటుంది?
పెళ్ళైన కొత్తలో నా శ్రీమతి ఫోటోలు చాలా మట్టుకు బొట్టుతోనే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశంలేదు – పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా!
(మళ్ళీ కలుద్దాం)