బ్రిటీషు వారిని శాంతియుతంగా ఎదిరించిన ‘రాణి రాష్మోణి’

4
6

[box type=’note’ fontsize=’16’] 28 సెప్టెంబరు 2020న రాణి రాష్మోణి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

భారత స్వాతంత్ర్యోదమంలో ఒక రాణి చెన్నమ్మ, ఒక లక్ష్మీబాయి వంటి వీరనారీమణులు మనకు తెలుసు. వారిది ఆయుధ పోరాటం.

కాని “హైలో! హైలో! హైలెస్సా! హంస కదా నా పడవా!” అని ఉల్లాసంగా పాడుకునే మత్స్యగంధి వారసుల కోసం కృషి చేసి, వారి మీద ‘బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ’ విధించిన పన్నును రద్దు చేసే వరకు సమ్మె చేయించి, చేపల వ్యాపారాన్ని ఆపించి విజయం సాధించిన వీర వనిత ‘రాణి రాష్మోణి’.

ఈమె 28-9-1793వ తేదీన బెంగాల్ లోని ‘కోనా’ అనే గ్రామంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు రాం ప్రియాదేవి, హరేకృష్ణ దాస్‌లు. ఏడేళ్ళ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్నారామె.

ఈమె వివాహం కలకత్తాలోని ‘జాన్ బజార్‌’కు చెందిన జమీందార్ రాజా చంద్రదాస్‌తో జరిగింది. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు.

ఈమె 43 ఏళ్ళ వయసులోనే భర్త మరణించారు. ఈమె జమీందారీ నిర్వహణ బాధ్యతను స్వీకరించవలసి వచ్చింది. ‘బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం’ పరిపాలనా సంస్కరణలలో భాగంగా కొత్త పన్నులు విధించింది. వీటిలో భాగంగా అంతకు ముందు కనీ వినీ ఎరుగని విధంగా మత్స్యకారులు పట్టిన ‘చేపల’ మీద కూడా పన్ను విధించింది. ప్రభుత్వాన్ని ఎదిరించలేని పరిస్థితిలో చేసేదేమీ లేక పన్ను చెల్లించారు. వారి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలలేదు. తిండికి కటకటలాడే పరిస్థితి సంభవించింది. వీరి బాధలను చూసిన రాణి రాష్మోణి తిరుగుబాటును నడిపించారు. చేపలు పట్టడాన్ని ఆపించారు. సత్యాగ్రహ పద్ధతిలో సాత్వికంగా ఉద్యమాన్ని నడిపించారామె.

నదీ తీర ప్రాంతాల ప్రజలు, ప్రభుత్వ అధికారులతో సహా అందరూ చేపలు దొరకక అల్లాడిపోయారు. కంపెనీ ప్రభుత్వం ఆశ్చర్యానికి అంతులేదు.

ఒక స్త్రీ మాట విని మత్స్యకారులందరూ సమ్మె చేయడం, చేపలు దొరకక పోవడం, చేపల వ్యాపారస్తులు దివాళా తీయడం వారికి వింతగా అనిపించింది. వారు దిగి రాక తప్పలేదు. చేపల మీద పన్నుని తొలగించారు.

తమ జీవనోపాధిని మళ్ళీ చిగురింపజేసిన రాణి పట్ల మత్స్యకారులకు అమిత గౌరవం కలిగింది. ఆమె పట్ల వారి ప్రేమాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు ఎనలేనివి, ఎన్నలేనివి.

ఈమె సేవలు ఇంతటితో ఆగలేదు. కాలువలను త్రవ్వించారు. ప్రాజెక్టులను కట్టించారు. నదులపైన ముఖ్యమైన ఘాట్‌లను కట్టించి ప్రజలకు సౌకర్యంగా ఉండే ఏర్పాటు చేశారు. పొడవైన రహదారులను నిర్మింపజేశారు. కంపెనీ ప్రభుత్వం ఈమెకు జరిమానా విధించింది. ఆ జరిమానాని కూడా రద్దు చేయించుకోగలిగారామె.

బెంగాల్ లోని ప్రజలు చదువుకునే ఏర్పాట్లు చేశారామె. నాటి ‘హిందూ కళాశాలే’ నేటి ‘ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం’. నాటి ‘ఇంపీరియల్ లైబ్రరీ’యే నేటి ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’. వీటి స్థాపనకు నిధులు సమకూర్చారు రాష్మోణి.

ఈమె భక్తురాలు కూడా! దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని పునరుద్ధరింపజేశారు. శ్రీ రామకృష్ణ పరమహంస పూర్వాశ్రమంలో (గదాధరుడిగా ఉన్నప్పుడు) ఈ ఆలయానికి పూజారిగా నియమింపజేసిన వారు కూడా రాణి రాష్మోణి కావడం ఒక చారిత్రక విశేషం.

ఈ విధంగా మత్స్యకారులు, వ్యవసాయదారుల కోసం సౌకర్యాలు కల్పించి; ప్రజలలో అక్షరాస్యతను పెంచడం కోసం విద్యాలయాలను స్థాపించి; దేవాలయాలను పునరుద్ధరింపజేయడం కోసం బ్రిటీష్ వారినే ఎదిరించి ‘ఓహ్! వావ్! రాణీ రాష్మోణీ!’ అనిపించుకున్నారు.

ఆవిడ జ్ఞాపకార్థం 1994 ఏప్రిల్ 9వ తేదీన ఒక స్టాంపును విడుదల చేసింది భారత ప్రభుత్వ తపాలాశాఖ. వారి జయంతి సందర్భంగా ఈ నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here