[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
అభారతీయం 5
విష్ణుపురాణం
స్వాతంత్య్రం రావడానికి ముందు భారతదేశం అన్నది లేనేలేదు.. అప్పుడున్నవన్నీ చిన్న చిన్న రాజ్యాలే.. బ్రిటిష్‌వాళ్లే వాటన్నింటినీ ఒకటిచేసి దేశంగా మార్చారు. దాన్ని నెహ్రూ అండ్ కో కొనసాగించారు అన్నది… సోకాల్డ్ స్వయం ప్రకటిత మేధావులు మాట్లాడుతుంటారు. కానీ, ఈ దేశంలో అష్టాదశ పురాణాలని ఓ 18 ఉన్నవి. వాటిలో విష్ణుపురాణమన్నది ఒకటి ఉన్నది. ఇందులోని రెండో చాప్టర్‌లో మూడో అధ్యాయంలో మొదటి పద్యం ఉన్నది. ‘ఉత్తరం యత్ సముద్రస్య, హిమాద్రేశ్చైవ దక్షిణమ్.. వర్ష్ తద్భారతం నామ భారతీ యత్ర సంతతి:’ సముద్రానికి ఉత్తరం వైపు.. హిమాలయాలకు దక్షిణం వైపు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని భారతవర్షమని పిలుస్తారు. ఇక్కడ భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు అని పరాశరుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. ఈ పురాణాలైతే బ్రిటిష్‌వాళ్లు, ముసల్మానులు.. బుద్ధుడు పుట్టకముందు రాసినవే కదా.. (వాస్తవానికి బుద్ధుడు కూడా ఉపనిషత్తుల మార్గాన్ని అనుసరించి బోధించినవాడే తప్ప మరొకటి కాదు. దానిపై చర్చ తర్వాత).
వేదాలు
వేదాల్లో అన్నీ ఉన్నాయిష అని వెటకరించిన మహానుభావులు చాలామందే ఉన్నారు. ఇంతకీ ఈ వేదాల్లో ఏమున్నది? చతుర్వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలోని పదవ మండలంలో.. ఒక మంత్రం ఉన్నది. ఋగ్వేద శ్లోకాలను మంత్రాలనే అంటారు. ఇందులో ఒకటి ‘సమితి: అస్మత్కర్త్రక: స్తుతిసమ్హతి: యాజతా యాజతేశు, యస్తవ్యేశు, దేవేశు, మధ్యే దేవి ద్యోతమానా భవతి’ అని సమితి అనేది ప్రజలందరి భాగస్వామ్యంతో, వారి ప్రతినిధులతో ఏర్పడేది. ఇది ఒక అసెంబ్లీ వంటిది. ఇందులో ప్రజల కష్టసుఖాలను చర్చించుకొని పరిష్కారాలను కనుగొనాల్సి ఉంటుంది. దీన్ని రాజరికమంటారో.. ప్రజాస్వామ్యమంటారో పెద్దలకే తెలియాలి. వేదకాలంలో ఇంద్రుడు, అగ్ని, సూర్యుడిని దేవుళ్లుగా ఉన్నారు. ఆ కాలంలో రాజ, అధిరాజ, సామ్రాజ్య అనే పదాలుండేవి. జనపదాల్లో ఒక వ్యక్తి అక్కడి ప్రజలకు నాయకుడిగా ఉండేవాడు. ఈ నాయకులే తరువాతి కాలంలో రాజులుగా చెలామణి అయ్యారు. సమితి సమావేశాలకు రాజు హాజరయ్యేవాడు. రాజుపట్ల సమితి విధేయంగా వ్యవహరించేది. రాజు పదికాలాలు చల్లగా ఉండాలని ప్రార్థనలు చేసేది.
తమ ప్రతినిధులను ప్రజలే ఎన్నుకొంటారట. ఇది నాలుగో వేదమైన అథర్వవేదంలో ఓ మంత్రం కనిపించింది. దీని ప్రకారం ‘ధ్రువా ద్యౌధ్రువా పృథివీ విశ్వమిదం జగత్, ధ్రువాస:పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయమ్’ అంటే.. సూర్యుడు మున్నగు పదార్థములు తమ తమ కర్తవ్యములందు దృఢముగా ఉన్నట్లే నిశ్చల స్వభావుడు ధర్మాత్ముడైన వానినే ప్రజలు తమ రాజుగా ఎన్నుకొని నియుక్తుని చేయాలి అని అర్థం. అంటే రాజుకు సంపూర్ణమైన అధికారాలు ఉండవు. అతడు ప్రజలకు ప్రతినిధిగా ఉండి.. అత్యున్నత స్థానంలో ఉండి.. ప్రకృతిలోని సహజ సంపదను ప్రజలందరికీ పంచాలని వేదాల్లోని మాట. ‘దేశ, క్షేత్ర, రాజ్య, రాష్ట్ర, మండల, జనపద, చక్ర, వర్ష’ గా దేశాన్ని పలు ప్రాంతాలుగా విభజించి అధికారాన్ని వికేంద్రీకరించారు.
వేదాలు అంతా మిథ్య. లేకపోతే.. ఇంకోటి.. ఏవేవో అంటారు. పోనీ.. వాటిని దేవుడు చెప్పలేదు. బ్రహ్మ నాలుగు తలల్లోంచి రాలేదు.. ఇదంతా ట్రాష్ అనే అనుకుందాం. అవైతే పుస్తకాలుగా వచ్చాయి కదా.. వీటిలోని ఇలాంటి అనేకానేక అంశాలు కనీసం పరిశీలించడానికైనా పనికిరాకుండాపోయాయా?
ఇట్లా భారతదేశానికి సంబంధించి భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక వివరాలు సంస్కృత సాహిత్యంలో కుప్పలుతెప్పలుగా కనిపిస్తాయి. యుద్ధ నైపుణ్యంలో, వీరత్వంలో, వర్తక వ్యాపారాల్లో, శాస్త్ర విజ్ఞానంలో, కళా ప్రావీణ్యంలో నిష్ణాతులైనవారున్నారని వివరంగా చెప్పుకొచ్చారు.
నానావీర్యా ఓషధీర్యా బిభర్తి (అధ 2)
తం దేవ నిర్మితం దేశం బ్రహ్మావర్తం ప్రచక్షతే (117)
యస్యాం గాయన్తి నృత్యన్తి భూమ్యాం మర్త్యా త్యేలవా.. యుద్ధ్యన్తే యస్యా మాక్రన్దో యస్యాం వదతి దున్దుభి: (అధ 12141)
ఇట్లా సంస్కృత సారస్వతం నిండా భారతదేశానికి సంబంధించి అనేకానేక అంశాలు కనిపిస్తాయి. కానీ.. మన పాలకులు మొట్టమొదట చేసిన పని సంస్కృతాన్ని నాశనం చేయడమే కదా..
రామాయణం
వేదాల మాట అటుంచుదాం. రామాయణ కాలంలో పరిపాలన వ్యవస్థ ఎలా ఉన్నది.. ఎట్లా ఉండాలో అయోధ్య కాండలో రాముడి నోటివెంటే వాల్మీకి చెప్పించారు. భరతుడు అడవికి వచ్చి రాముడిని కలుసుకున్నప్పుడు రాజు ఎలా ఉండాలి.. రాజ్యం ఎలా ఉండాలో శ్రీరాముడు సవివరంగా వర్ణించాడు. అయోధ్యకాండలోని నూరవ సర్గలోని 17వ శ్లోకం నుంచి భరతుడితో రాముడి సంభాషణ రామాయణకాలం నాటి రాజ్యవ్యవస్థను విశదీకరిస్తున్నది.
- రాజు నిద్రమత్తులో ఉండకూడదు. తెల్లవారుజామునే లేచి ఆ రోజు చేయాల్సిన పనులను గురించి ఆలోచించాలి.
- తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం వచ్చే పనిని చేపట్టి.. దాన్ని కూడా ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి.
- రాజు పూర్తిచేసిన పనులు మాత్రమే ఇతరులకు తెలియాలి. ముందుముందు చేయతలపెట్టిన పనులు బయటకు తెలియకూడదు.
- ఇతరులు లేదా ప్రత్యర్థులు తమ తెలివితో.. లేక ఇతర అడ్డదారుల్లో మన రహస్యాలను తెలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- వేలమంది మూర్ఖులను విడిచిపెట్టినా.. ఒక మేధావిని మాత్రం చేరదీయాలి. ఎందుకంటే ఏవైనా తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు మేధావి సహాయం చేయగలడు కానీ, ఎంతమంది మూర్ఖులున్నా ఏమీ చేయలేరు.
- మంచి మేధస్సు, వీరుడు, సమర్థుడైన మేధావి మంత్రిగా ఉంటే.. గొప్ప అభివృద్ధి సాధ్యపడుతుంది.
- ఎక్కువ సామర్థ్యం ఉన్నవాళ్లను పెద్ద పనులు చేయడానికి, మామూలు సామర్థ్యం కలిగినవారిని సామాన్య పనులను, సామర్థ్యం లేని వారిని చిన్న చిన్న పనులు చేయించడానికి వినియోగించుకోవాలి.
- ప్రజలకు తీక్షణమైన శిక్షలు వేసి భయకంపితులను చేయవద్దు.
- విద్యావంతుడైనా.. శూరుడెవడైనా.. అధికారవాంఛతో రాజు అంతరంగిక సేవకులలో భేదం కలిగించడానికి ప్రయత్నిస్తే అట్లాంటివాడిని వధించాలి.
- తృప్తి కలిగిన వాడు, శూరుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, నిజాయితీ కలవాడు, రాజభక్తి కలవాడు, సమర్థుడైనవాడిని సేనాధిపతిగా నియమించాలి.
- యుద్ధంలో వీరులైన సైనికులు, గొప్ప గొప్ప పనులు చేసిన వారిని ఎప్పుడూ గౌరవించాలి.
- సైన్యానికి సరైన ఆహారాన్ని అందించాలి. యథోచితమైన జీతాన్ని ఆలస్యం చేయకుండా సమయానికి అందించాలి. ఆహారం, వేతనం సరైన సమయానికి ఇవ్వకపోతే మన కింది ఉద్యోగులు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. దీనివల్ల గొప్ప అనర్థం కలుగుతుంది.
- ప్రజలందరూ పాలకుడు (రాజు) పట్ల అనురాగంతో ఉండాలి. అవసరమైతే రాజుకోసం ప్రాణాలర్పించడానికి కూడా వెనుకాడకూడదు. అంటే.. వారికి రాజు ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి. వారి కష్టసుఖాల్లో పూర్తిగా పాలుపంచుకోవాలి.
- మన దేశంలో పుట్టినవాడు, అన్ని విషయాలు తెలిసినవాడు, సమయస్ఫూర్తి కలిగినవాడిని రాయబారిగా నియమించాలి.
- శత్రు పక్షంలోని 18 విభాగాలు, మన పక్షంలోని 15 విభాగాల్లో ఒక్కో విభాగానికి ముగ్గురు చొప్పున గూఢచారులను నియమించాలి. ఈ 18 విభాగాలు ఏమిటంటే.. మంత్రులు.. పురోహితుడు (సలహాదారులు), యువరాజు, సేనాధిపతి. ద్వారపాలకులు, అంతఃపురాధికారులు, కారాగారాధికారులు (జైళ్ళు) ధనాధ్యక్షుడు (ట్రెజరీ), కార్య నియోజకులు (పనులు చేయించేవారు), ప్రాడ్వివాకులు (న్యాయాధికారులు లేదా జడ్జిలు) సేనానాయకులు, నగరాధ్యక్షుడు (మేయర్), కర్మాంతికులు (పనులుచేసేవారు లేదా ఉద్యోగులు), దండపాలులు, దుర్గపాలులు, రాష్ట్రాంత పాలకులు (సరిహద్దుల్లో ఉండే అధికారులు).. ఇలా పద్ధెనిమిది ఉంటాయి. మన పక్షంలో మొదటి ముగ్గురు మన దగ్గరే ఉంటారు కాబట్టి.. వారిపై నిఘా అవసరంలేదు. మిగతావాటిపై నిఘా అవసరం. శత్రుపక్షంలో అన్ని విభాగాలపైనా నిఘా పెట్టాల్సిందే.
- మన వల్ల ఓడిపోయి, తిరిగి వెళ్లిపోయిన శత్రువులను బలహీనులుగా పరిగణించవద్దు. వారిపై ఎప్పుడూ ఒక కన్నేయాలి
- మేమే మేధావులని తమంత తాముగా అనుకునేవాళ్లు అజ్ఞానులు. వీళ్లు చాలా నష్టాన్ని కలిగిస్తారు. శుష్కతర్కాలుచేస్తారు. ఏవేవో మాట్లాడుతుంటారు. వాళ్లపట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
- అయోధ్య అంటే యుద్ధానికి శక్యము కానిదని అర్థం. దృఢమైన ద్వారాలున్నది.. గజాశ్వారథములున్నది, ఉత్సాహవంతులైన ప్రజలు ఉన్నది, తమ తమ పనులను క్రమం తప్పకుండా చేసేవారున్నది, అనేక ఆకారాలున్న భవనాలు ఉన్నది, సర్వ సమృద్ధమై అందరూ ఆనందిస్తున్న నగరం మనది.
- అక్కడక్కడ భూముల సరిహద్దులను చూపే రాళ్లున్న రాజ్యం మనది. చక్కగా నివాసం ఏర్పరుచుకొని ఉంటున్న జనులది. దేవాలయాలు, చలివెందళ్లు, చెరువులతో విరాజిల్లుతున్నది, స్త్రీ పురుషులంతా సంతోషంగా ఉంటున్నది, సమాజంలో జరిగే ఉత్సవాలతో ప్రకాశిస్తున్నది.. చక్కగా దున్నిన భూములు, పశుసంపద కలిగినది, హింస లేనిది, గనులతో నిండి ఉన్నది మన అయోధ్య రాజ్యం.
- వ్యవసాయ, గోరక్షణపై ప్రజలు ఆధారపడి సుఖంగా ఉన్నారు.
- స్త్రీలతో మంచిగా మాట్లాడుతూ వారిని బాగా రక్షించుకోవాల్సిన బాధ్యత రాజుది.
- ప్రతిరోజూ ఉదయాన్నే రాజు.. చక్కగా తయారై.. రాజవీధిలోకి వచ్చి ప్రజలను కలుసుకోవాలి. మాట్లాడాలి. రాజుకు ప్రజలు భయపడవద్దు. అలా అని అలుసు ఇవ్వవద్దు.. మధ్యేమార్గాన్ని అనుసరించాలి.
- రాజ్యంలోని అన్ని దుర్గాలలో (కోటలు) ధనధాన్యాలు, ఆయుధాలు, ఉదకము (నీళ్లు) యంత్రాలు, శిల్పులు, ధనుర్ధారులు (ఆ కాలంలో బాణమే ప్రధాన ఆయుధం) కావలసినంతమంది ఉండాలి.
- ఆదాయం ఎక్కువగా ఉండి, ఖర్చు చాలా తక్కువగా ఉండాలి. అపాత్రుల చేతుల్లోకి డబ్బులు వెళ్లకూడదు.
- ఎవరైనా నేరం చేసినప్పుడు పూర్తిగా విచారించకుండా వాళ్లను శిక్షింపకూడదు.
- అట్లాగే డబ్బుమీద ఆశతో నేరగాణ్ణి విడిచిపెట్టవద్దు.
- ధనికుడికైనా, పేదవాడికైనా కష్టం వచ్చినప్పుడు ఆ అంతరాలేవీ లేకుండా, పక్షపాత బుద్ధి లేకుండా వారికి న్యాయంచేయాలి.
- రాజు ఇష్టంవచ్చినట్టు చట్టాలు చేయవద్దు. అందరినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి.
- శాస్త్రోక్త లక్షణాలు కలిగిన ముగ్గురు నలుగురు మంత్రుల (కోర్ కమిటీ) తో కలిసికానీ, వేర్వేరుగా కానీ రహస్యంగా మంత్రాంగం చేయాలి.
- దేశంలో పండిన పంటను అందరికీ అందేలా చూడాలి.
మహాభారతం
ఇక మహాభారతాన్ని ఒకసారి చూద్దాం
భారతంలో రాజధర్మాన్ని గురించి శాంతి పర్వంలో చర్చించారు. ధర్మరాజుకు భీష్ముడిచేత రాజధర్మాన్ని వ్యాసుడు చెప్పించాడు. ఇందులోని కొన్ని అంశాలు ఇట్లా ఉన్నాయి.
- అధికారం అనేది లగ్జరీ లైఫ్ అనుభవించడానికి కాదు. ధర్మం అంటే.. కొన్ని విలువలకు కట్టుబడి పరిపాలించడం.
- పాలకుడి మనసులో ఎప్పుడూ ప్రజల సంక్షేమమే ఉండాలి. తనకు ఉన్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజా సంక్షేమం కోసం కృషిచేయాలి.
- పాలకుడు కచ్చితంగా మంచి విలువలతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి.
- పాలకుడు తనకోసమో.. తన కుటుంబం కోసమో పాలించకూడదు. దేశంకోసం, ప్రజలకోసం పాలించాలి. వ్యక్తిగతానికి ఎంతో దూరంగా ఉండాలి.
- నిర్ణయాలు ఎంతో పారదర్శకంగా ఉండాలి.
- భవిష్యత్తుకోసం సమర్థమైన ప్రణాళికలు ఎప్పటికప్పుడు రచిస్తూ ఉండాలి. వాటిని అమలుచేయాలి.
- అహింస, సత్యం, అక్రమ సంపాదన లేకుండా ఉండటం, నిబద్ధత, ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి (మనుసంహితలో కూడా ఇవే అంశాలు చెప్పారు. ఒక వేళ వీటిలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా.. అది దేశ అనర్థానికి దారితీస్తుంది.
- భారతరాజ్యంలో ఆరింట ఒకవంతు ఆదాయం భూమి నుంచి వచ్చేది. పన్నులు చెల్లించనివారిపై ఒత్తిడి తెచ్చి వసూలుచేసేవారు. వారిని శిక్షించేవారు. పరిపాలన కేంద్రస్థానం ఢిల్లీ ఉండేది. దానికి అనుబంధంగా చిన్న చిన్న జనపదాలు లేదా రాష్ట్రాలుగా పరిపాలన వికేంద్రీకరణ జరిగేది. చెల్లించేవాడి సామర్థ్యాన్ని అంచనావేసి మరీ పన్నులు వేసేవారు. వ్యవసాయవేత్తలు (పారిశ్రామికవేత్తల మాదిరిగా.. రైతులను వ్యవసాయవేత్తలు అని అనేవారు), వ్యాపారవేత్తల పైనా దేశ ఆదాయం ఆధారపడి ఉండేది.
- దేశం అనేది ముఖ్యంగా పౌరుల సంక్షేమం కోసం మాత్రమే ఉన్నది. బలమైన దేశం.. ప్రజల సుసంపన్నతకు కారణమవుతుంది.
- ప్రభుత్వ అధికారుల నియామకం కచ్చితంగా వారి సామర్థ్య స్థాయిని బట్టి మాత్రమే ఉండాలి. రెవెన్యూ పరిపాలన, ఉద్యోగుల పనివిభజన సైతం వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు జరగాలి. (ఇప్పుడు ఒక మార్కు వచ్చినా పాలిటెక్నిక్‌లో సీటు దొరుకుతుంది. రిజర్వేషన్ల ఆలోచన ఆనాటికి రాలేదేమో). ఉద్యోగులు ఎట్టి పరిస్థితిలోనూ శాసనోల్లంఘన చేయవద్దు.
బౌద్ధుల కాలం..
లలిత విస్తరం అని ఒక బౌద్ధ గ్రంథం ఉన్నది. అందులో బుద్ధుని జన్మస్థానం గురించిన చర్చ జరిగింది. జంబూద్వీపంలో పదహారు అత్యంత సంపన్నమైన, ప్రసిద్ధమైన దేశాలు ఉన్నాయని అక్కడ పరిపాలిస్తున్న రాజవంశాలు ఫలానా అని ప్రస్తావించారు. మగధలో వైదేహులు, కోసలలో కోసలులు, కౌశాంబీలో వత్స రాజవంశీయులు, వైశాలిలో వైశాలికులు, ఉజ్జయినిలో ప్రద్యోతన వంశీయులు, (చైనావాళ్లు ఈ రాజ్యాన్ని మావంతి అని పిలిచారు.) మధురలో కంస వంశీయులు, హస్తినాపురంలో పాండవుల వంశీయులు, కపిలవస్తును ఏలిన శాక్యులు ఉన్నారని పేర్కొన్నారు.
ఇదే గ్రంథంలోని పదో అధ్యాయంలో బోధి సత్త్వుడు పలు జనావాస స్థానాలను పేర్కొన్నాడు. 1. అంగం, 2. వంగం, 3, మగధ, 4. శకారి, 5. బ్రహ్మవల్లి, 6.ద్రావిడం, 7.దక్షిణం, 8.ఉగ్రం, 9.దరదము, 10. ఖసయం, 11. చీనా, 12. హూణం.
వీటన్నింటిలోనూ ప్రజాపరిపాలన వ్యవస్థలు ఉన్నాయని పేర్కొన్నారు.
కౌటిల్యుడి అర్థశాస్త్రం
మౌర్యచక్రవర్తి కాలంలో దేశం భౌగోళికంగా ఎంత విస్తారంగా ఉన్నదో.. ఉత్పాదక, వాణిజ్య రంగాల్లో ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది. ముఖ్యంగా మౌర్య చంద్రగుప్తుడి ప్రధానామాత్యుడు.. చాణుక్యుడిగా ప్రసిద్ధి చెందిన కౌటిల్యుడి అర్థశాస్త్రంలో దేశమంతటా ఎక్కడెక్కడ ఏమేమి లభిస్తున్నాయో సవివరంగా, స్పష్టంగా చెప్పాడు. వాటిలో కొన్ని మీకోసం..
‘హైమవతో దక్షిణాపథాశ్రేయాన్ హస్త్యశ్వగంధ్య దంతాజనరూప్య సువర్ణవణ్య స్సారవత్తరా ఇత్యాచార్యా:’ ఇందులో మొదటిది ఉత్తర భారతానికి చెందినది. దీన్ని హైమవతః అంటారు. రెండవది దక్షిణ భారతానికి చెందినది. దీన్నే దక్షిణాపథమన్నారు.
ఇందులో ఉత్తరభారతంలో ఏనుగులు, గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఏనుగు దంతాలు, జంతు చర్మాలు, వెండి బంగారాలు వంటి విలువైన సరుకులు అమ్మకాలకు వెళ్తూ ఉంటాయి. దక్షిణభారతంలో సముద్రశంఖాలు, వజ్రాలు, వివిధ రత్నాలు, ముత్యాలు, బంగారం మొదలైనవి ఇక్కడ విస్తారంగా దొరుకుతాయి. వీటన్నింటికి తమిళదేశం ప్రసిద్ధమైన మూలస్థానం. వ్యాపార దృష్ట్యా దక్షిణదేశంలో దొరికే వస్తువుల ద్వారానే ఎక్కువగా ఆదాయం వచ్చేలా, లాభం కలిగేలా చేస్తాయి. దక్షిణ భారతంలో వివిధ ఖనిజాలు లభిస్తాయి. దక్షిణభారతంలోనూ, సింహళం (శ్రీలంక) లోనూ ప్రవహించే కొన్ని నదుల్లో ముత్యాలు విస్తారంగా లభిస్తాయి. తామ్రపర్ణి, కుల, చూర్ణ నదులు పాండ్యవతక, మహేంద్ర పర్వతాలు ముత్యాలకు ప్రసిద్ధమైనవి. హిమాలయాల ప్రాంతానికి చెందిన విషి, మహావిషి, ఆరోహ, బహ్లవ గ్రామాలు.. నేపాల్, టోల్షులలో ఉన్ని, కంబళ్లు బాగా లభించే చోట్లు. ఆఫ్గనిస్థాన్‌లోని కాంభోజం (నేటి కాందహార్, దీన్ని హ్యూన్ చ్యాంగూ.. కౌఫూ అని కూడా అన్నాడు సింధు, అరట్టా (రాజు లేనిది అని అర్థం), పంజాబ్ ప్రాంతాలు.. గుర్రాలను ఎగుమతిచేసే చోట్లు. తూర్పు ప్రాంతానికి చెందిన వంగ, పౌండ్ర, సువర్ణ, కుడ్యక, మగధ, కాశీ, కళింగ దేశాలు నూలు వస్త్రాలకు, పట్టు బట్టలకు ప్రసిద్ధి చెందాయి. ఏనుగులు లభించే చోట్లుగా అంగ, కరూశ, తూర్పు కళింగాలు కూడా ప్రఖ్యాతికెక్కాయి. దక్షిణాన మదుర, పశ్చిమాన అపరాంతకం, దక్కను పీఠభూమి లోపలి మహిషము నూలు వస్త్రాలకు నిలయాలుగా ఉన్నాయి. సౌరాష్ట్ర, సౌమీలు ఏనుగులకూ, గుర్రాలకు కేంద్రాలుగా ఉన్నాయి. దేశ సరిహద్దులకు వెలుపల ఉన్న కొన్ని ప్రాంతాల ప్రస్తావన కూడా కౌటిల్యుడు చేశాడు. ఆ ప్రదేశాలన్నింటిలో కూడా సముద్రం మీదుగా వ్యాపారం జరుగుతున్నదని పేర్కొన్నాడు. స్వర్ణభూమి సుగంధ ద్రవ్యాలకు, చీనా పట్టు వస్త్రాలకు, అరేబియా గుర్రాలకు ప్రసిద్ధమైనవని చెప్పాడు.
కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పాలకుడు ఎట్లా ఉండాలో.. పరిపాలన ఎలా ఉండాలో కూడా వ్యవహరించాడు.
- ప్రజల సంతోషమే పాలకుడి సంతోషంగా ఉండాలి. వాళ్ల సంక్షేమమే తన సంక్షేమం కావాలి.
- ఉద్యోగులకు పనివాతావరణం కల్పించాలి. వాళ్ల సౌకర్యాలను రాజు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వాళ్లకు సౌకర్యంగా ఉన్నప్పుడే వారు సమర్థంగా పనిచేయగలుగుతారు. (మన ప్రభుత్వ కార్యాలయాలు ఒకసారి చూడండి.)
- ఉద్యోగుల వేతనాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి.
- పాలకులు జవాబుదారితనంతో ఉండాలి. లేకపోతే వారిని తొలగించే వీలుండాలి. అలా కాని పక్షంలో దేశంలో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంటుంది.
- పాలకులు, ఉద్యోగులు ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతూ ఉండాలి. నేర్చుకొంటూ ఉండాలి. క్రమశిక్షణ అనేది చాలా చాలా ముఖ్యం.
- ఉన్నతవిద్యపై పెట్టే పెట్టుబడి దేశ ఆర్థికాభివృద్ధిపై చక్కని ప్రభావం చూపుతుంది.
- న్యాయం, సమానత్వం, అహింస, ఆర్థిక సమృద్ధి, సంక్షేమం అన్నవి పరిపాలనకు పునాదులు.
- నిబద్ధత, సాహసం, అంకితభావం (దేశ ప్రజల పట్ల), నిజాయతీ వంటివి సుపరిపాలనకు మూలస్తంభాలు.
ఇవి అర్థశాస్త్రంలోని కొన్ని అంశాలు మాత్రమే.
మౌర్యులు
మౌర్యుల కాలంలో రాజకీయ ఐక్యత, దేశ భద్రతను సమాంతరంగా నిర్వహించడానికి పటిష్ఠమైన బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఉండేది. ఈ అధికారవ్యవస్థ దేశంలో ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి దోహదపడింది. ముఖ్యంగా సుస్థిర వ్యవసాయం, వ్యాపార వాణిజ్యాలు నిరంతరం కొనసాగటం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది.
మౌర్య సామ్రాజ్యంలో అధికారం కేంద్రీకృతమైనదే. కానీ, శక్తిమంతమైన మిలటరీ, శక్తిమంతమై ఆర్థిక వ్యవస్థ దేశాన్ని ఒకటిగా, బలంగా ఉంచింది.
మౌర్యుల సైన్యంలో సాధారణ సైనికులు (కాల్బలం) ఆరు లక్షలు. అశ్వికదళం 30,000, గజబలం 9000.
అంతర్గత, అంతర్జాతీయ నిఘాకోసం ప్రత్యేకమైన గూఢచార వ్యవస్థ కొనసాగింది.
అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించినా.. ప్రత్యర్థులనుంచి ఎదురయ్యే దాడులను ఎదుర్కోవడానికి పటిష్ఠమైన సైనిక, నిఘా వ్యవస్థలు కొనసాగించాడు.
మౌర్యుల రాజధాని పాటలీపుత్రం (పాట్నా) దేశానికంతటికీ కేంద్రస్థానం (హబ్)గా వ్యవహరించింది. కేంద్ర ఖజానాకు పన్నులు ఏ విధంగా వసూలుచేయాలో అధికారులు కూర్చొని, చర్చించి నిర్ణయాలు చేసేవారు.
నిరంతరం సైనిక, ప్రభుత్వ ఉద్యోగాలను ప్రక్షాళనచేస్తూ భర్తీచేసేవారు.
వ్యాపారులు, రైతులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. ప్రాంతీయ రాజులు వసూలుచేసే పన్నులు, పంటల భారం నుంచి రైతులకు విముక్తి కలిగించింది ఆనాటి మౌర్య సామ్రాజ్యం. జాతీయస్థాయిలో పర్యవేక్షించే పన్నుల వ్యవస్థకు మాత్రమే వారు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నుల వ్యవస్థ అర్థశాస్త్ర నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేశారు.
ప్రజలకోసం రహదారుల నిర్మాణం, చెరువులు, కాలువలు, విశ్రామ కేంద్రాలు, దవాఖానలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత.
పర్షియా, బాక్ట్రియా తదితర దేశాలకు సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, పట్టు ఎగుమతి అయ్యేవి.
పల్లవులు
పల్లవుల కాలంలో చక్రవర్తి తరహా రాజ్యపాలన కొనసాగినప్పటికీ గ్రామీణ పరిపాలన వ్యవస్థ స్వతంత్రంగా సాగింది. జనసమూహాల నుంచి ఒకరు స్థానిక అధికారిగా ఉండి.. వారి బాగోగులను చక్రవర్తి ద్వారా పరిష్కరించేవారు. గ్రామీణ సమాజంలో ప్రజలు సమూహాలుగా ఏర్పడి, చర్చించుకొనే వ్యవస్థ ఉన్నది. వ్యవసాయంతోపాటు, పల్లవులు నిర్మాణరంగంపై ఎక్కువగా దృష్టి సారించారు. పల్లవుల కాలంలోనే అద్భుతమైన నిర్మాణ రంగ నిపుణులు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధికెక్కారు. వీరు ఇతర దేశాలకు కూడా వెళ్లి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
శాతవాహనులు
శాతవాహనుల కాలంలో రాజరికం వారసత్వంగా కొనసాగింది. అదేసమయంలో అధికారం పలు అంతరాల్లో పైనుంచి కిందికి విస్తరించింది. మహారథులు, మహాభోజులు, మహాసేనాపతులు, మహా తాళవరులు అన్న పేర్లతో వివిధ స్థాయిల్లో అధికారులు ఉండేవారు. వీరితో పాటు దేశంలోని వివిధ ప్రావిన్సులకు వైస్రాయ్‌లను నియమించిన కాలం శాతవాహనులదే. శాతవాహనులు సుస్థిర పరిపాలనా వ్యవస్థను, పన్నులు వసూలుచేసే వ్యవస్థను ఏర్పాటుచేశారు. మహారాష్ట్ర లోని నాసిక్ లోని 11వ గుహలో గౌతమిపుత్ర శాతకర్ణి శాసనం లభించింది. (ఇతడు అమరావతి నుంచి పరిపాలించలేదు. శాతవాహనుల రాజ్యంలోని ఒక భాగంగా అమరావతి ఉన్నది కానీ, అమరావతి శాతవాహనుల రాజధాని కాదు.) ఈ శాసనం శాతవాహనుల అధికార వ్యవస్థ సామర్థ్యాన్ని వ్యక్తం చేస్తున్నది. అన్ని వర్గాల ప్రజలు (కులంతో సంబంధంలేదు) వ్యవసాయం చేసే విధానం తెలుస్తున్నది. వ్యవసాయం చేసే వర్గాలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. వారి వృత్తిలో అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు ఉన్నాయి.
శాతవాహనుల శాసనాల ప్రకారం పరిపాలన మూడు స్తరాలలో విభజితమై ఉన్నది. నగర (సిటీ), నిగమ (మార్కెట్ సిటీ), గ్రామ (గ్రామం).
శాతవాహనుల కాలంలో వ్యవసాయం, ఇతర ఆహారోత్పత్తులు విస్తారంగా జరిగాయి. శాతవాహనుల రాజ్యంలోనే కాకుండా ఇతర దేశాలతో కూడా ఆహారోత్పత్తుల వాణిజ్యం కొనసాగింది. చాలా ప్రాంతాలు సారవంతంగా మారాయి. దీని దృష్ట్యానే నీటిపారుదల రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. భారత దేశ సముద్రతీర ప్రాంతాన్నంతటినీ శాతవాహనులు తమ నియంత్రణలోకి తెచ్చుకొన్నారు. దీనివల్ల రోమన్ సామ్రాజ్యంతో భారత వాణిజ్యం, ఎగుమతులు విస్తారంగా జరిగాయి. ప్రతిష్ఠానపురం, తగర నగరాలు శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రధాన వాణిజ్య నగరాలుగా ఉన్నాయి. వీటితోపాటు, కొండాపూర్, బనవాసి, మాధవ్‌పూర్, నానాఘాట్ వంటివి మరికొన్ని ప్రధాననగరాలుగా ఉన్నాయి. వ్యవసాయం, వాణిజ్యం ప్రధానంగా శాతవాహనుల సామ్రాజ్యం విలసిల్లింది.
పాండ్యులు
పాండ్యులు ప్రధానంగా ముత్యాల వ్యాపారం చేశారు. మధురైకాంచి, నెడునాళ్వడై అన్న రచనల్లో పాండ్యుల కాలంలో సమాజం, వాణిజ్య వ్యాపారాలను చర్చించారు. హతిగుంఫా శాసనంలో, మంగలం శాసనంలో పాండ్యుల రాజ్యవ్యవస్థలను విస్తారంగా చర్చించారు.
మెగస్తనీస్ (గ్రీకు రచయిత) చెప్పినట్టు పాండ్యుల రాజ్యంలో 365 గ్రామాలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి.. ఒక్కోరోజు రాజగృహ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉన్నవి అని పేర్కొన్నాడు. అరేబియా సముద్రం మీదుగా వీరు అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగించారు. వీరికాలంలోనే ఆగ్నేయాసియాతో వ్యాపార సంబంధాలు బలోపేతమయ్యాయి. మధ్యప్రాచ్యంతో సంబంధాలు కొనసాగాయి. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పాండ్యులు తమ వ్యాపారం కోసం నౌకాశ్రయాలు నిర్మించారు. ఇవి ఆ తర్వాత వాణిజ్య స్థావరాలుగా విలసిల్లాయి. తీరప్రాంత వాణిజ్యమనేది పాండ్యుల రాజ్యవ్యవస్థలో అత్యంత కీలకమైన విధానంగా కొనసాగింది. తూత్తుక్కొడిలోని నౌకాశ్రయం ముత్యాల వేటకు, ముత్యాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడినుంచి పెద్ద ఎత్తున ముత్యాలు ఎగుమతి అయ్యాయి.
చాళుక్యులు
చాళుక్యుల రాజ్యవ్యవస్థ అద్భుతమైనది. వీరి కాలంలో హెర్జుంకా (ట్యాక్స్ ఆన్ లోడ్స్), కిరుకుల (ట్యాక్స్ ఆన్ రిటైల్ గూడ్స్), బిల్‌కోడె (సేల్స్‌ట్యాక్స్), పన్నాయా ( బెటెల్ ట్యాక్స్), సిద్దాయ (భూమిశిస్తు), వద్దరవుల (రాజుగారికి మద్దతు పన్ను) వంటి పన్నుల వ్యవస్థ ఉన్నది.
ఇక పరిపాలన వ్యవస్థను గమనిస్తే రాజు తర్వాత ముఖ్యమంత్రి (మహా సంధివిగ్రహి అని అన్నారు) ఉంటారు. ప్రధానమైన పరిపాలనావ్యవహారాలన్నింటినీ ఇతనే చూస్తాడు. ఈ ముఖ్యమంత్రి కింద కమాండర్ (దండనాయకుడు), విదేశాంగమంత్రి (మహాక్షపాతాలాధికృత), ప్రధానమంత్రి (మహామాత్యుడు).. వీళ్లందరూ ఒక కోర్ కమిటీలా వ్యవహరిస్తారు. వీరంతా రాజనీతిలో, సైనిక వ్యూహంలో నిష్ణాతులై ఉంటారు. పలు కీలక ప్రాంతాల్లో మహిళలు పర్యవేక్షణ విధుల్లో ఉండేవారు.
చాళుక్యులు తమ రాజ్యాన్ని మండలాలుగా విభజించారు. ప్రతి మండలానికి రాష్ట్రపతి ఉంటారు. ఇందులో విషయ (నగరం) ను సదరు విషయాధిపతి (నగరాధిపతి) పరిపాలిస్తాడు. ఇతని కింద పలువురు మంత్రులు పనిచేస్తారు. అనేక గ్రామాలు వీరి అధికారంలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్థానికంగా ఒక అధికారి.. కేంద్రస్థాయిలో మరో అధికారి సమిష్టిగా పనిచేస్తారు.
రాష్ట్రకూటులు
రాష్ట్రకూటుల సైనిక వ్యవస్థ పటిష్ఠమైనది. గజ, అశ్వ, పదాతి దళాలు పెద్ద ఎత్తున ఉండేవి. వీరి ప్రధాన దృష్టి కూడా వ్యవసాయము, దాని అనుబంధ ఉత్పత్తులపైనే కొనసాగింది. దీని ఆధారంగానే వీరి అర్థ వ్యవస్థ ఆధారపడింది. పత్తి వీరి ప్రధాన పంట. జౌళి పరిశ్రమ ప్రముఖమైనది. వరంగల్, పైఠాన్‌లలో మస్లిన్ వస్త్రాన్ని తయారుచేశారు. పర్షియా, టర్కీ, పోలండ్, అరేబియా, ఈజిప్టు దేశాలకు వీరు వస్త్రాలను ఎగుమతిచేశారు. కొంకణ్‌తీరం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండింది. కడప, బళ్లారి, చందా, బుధాన, నర్సింగ్‌పూర్, అహ్మద్‌నగర్, బీజాపూర్, ధార్వార్ వంటిచోట లభించిన ఖనిజాలు రాష్ట్రకూటుల ఆర్థికవ్యవస్థకు దన్నుగా నిలిచాయి. సముద్రతీర వ్యాపారం రాష్ట్రకూటుల ముఖ్య వ్యాపారమార్గం. పత్తి, వస్త్రాలు, తివాచీలు, కొబ్బరి, గంధం, టేకు, కలప, నూనెలు ఎగుమతులు చేసేవారు. అరేబియా నుంచి బంగారం, ఖర్జూర, ఇటలీ నుంచి వైన్స్, టిన్, సీసం, గ్లాస్ వంటివాటిని దిగుమతి చేసుకొనేవారు. నేతపనివారు, నూనె వ్యాపారులు, చేతివృత్తుల వారు వ్యక్తిగత వ్యాపారాలు చేసేవారు.
భూమి తీరును బట్టి 8 నుంచి 16 శాతం వరకు పన్ను వసూలుచేసేవారు. యుద్ధం సమయంలో సైనిక అవసరాలకోసం 20 శాతం పన్ను వసూలుచేశారు. దేశంలో చాలా ప్రాంతాల్లో వస్తు సేవల రూపంలో పన్నుల వసూలు ఉండేది. చాలా అరుదుగా నగదు బదిలీ జరిగేది. ప్రభుత్వం వసూలుచేసే పన్నుల్లో 15 శాతం గ్రామాలకు పరిపాలనా నిర్వహణ కోసం పంపిణీచేసేవారు. గొర్రెలు పెంచేవారు, కుండలుచేసేవారు, చేనేతకార్మికులు, నూనెవ్యాపారులు, దుకాణదారులపై పన్నులుండేవి. చేపలు, మాంసం, తేనె, ఔషధాలు, పండ్లు, పెట్రోలు వంటివాటిపై పన్నులుండేవి.
కాకతీయులు
కాకతీయ సామ్రాజ్యం యావత్ తెలుగునేలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన రాజవంశం. ధారణంగా రాజరిక వంశాల్లో వారసత్వం కుమారుడికే ఉంటుంది. కాకతీయులే కూతురుకు కూడా రాజ్యాధికారాన్ని కల్పించారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా చక్రవర్తి రజియా సుల్తానా (నాలుగు సంవత్సరాలు) కాగా, రెండవరాణి రుద్రమదేవి (28 సంవత్సరాలు).
పరిపాలనలో అధికారం చక్రవర్తిదే అయినా పాలనాబాధ్యతలను మంత్రి పరిషత్ పర్యవేక్షిస్తుంది. ఈ పరిషత్‌లో అన్ని కులాలవారు ఉండేవారు. నాయంకర విధానం అమల్లో ఉండేది. ఇది జాగీర్దారీ వ్యవస్థకు ప్రతిరూపం. ప్రతాపరుద్రుడి కాలంలో 72 మంది నాయంకరులు ఉన్నారు. చాళుక్యులు కేంద్రీకృత విధానాన్ని అనుసరిస్తే, కాకతీయులు వికేంద్రీకరణ విధానాన్ని అమలుచేశారు. నాయంకరులు సైనిక వ్యవహారాలు తప్ప ఇతరత్రా విషయాల్లో స్వేచ్ఛనిచ్చారు. వాళ్లను మహా మండలేశ్వరులని పిలిచారు. వారిపై తమ అధికారాన్ని రుద్దలేదు. వారు కూడా నిబద్ధతతో రాజుకు విధేయంగా ఉన్నారు. గ్రామపాలనను పన్నెండు మంది పర్యవేక్షించేవారు. కరణం, రెడ్డి, పురోహితుడు, తలారి, కంసాలి, కమ్మరి, చాకలి, వడ్రంగి, వెట్టి, కుమ్మరి, మంగలి, చర్మకారుడు. వీరిలో మొదటి ముగ్గురు ప్రభుత్వ సేవకులు, మిగతావారు గ్రామసేవకులు. వీరి మధ్య పనివిభజన జరిగింది. పన్నులు వసూలుచేసేవారు, గ్రామాన్ని రక్షించేవారు.. ఇలా బాధ్యతలను పంచుకొనేవారు. భూమి, గ్రామ విస్తీర్ణం, ఆయకట్టు, వ్యక్తిగత ఆస్తి తదితరాల ఆధారంగా పన్ను వ్యవస్థ కొనసాగింది. భూమిపన్ను, ఆస్తిపన్ను, వృత్తిపన్ను, పారిశ్రామిక పన్ను ఇలా వసూలుచేసేవారు.
కాకతీయులు ముఖ్యంగా నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చారు. దాదాపు ఇరవై వేల ఎకరాలకు నీరందించేలా చెరువులను నిర్మించారు. ఏయేటికాయేడు ఆయకట్టును పెంచుకుంటూ వచ్చారు. వ్యవసాయం, పరిశ్రమలపై కాకతీయుల ఆర్థిక వ్యవస్థ ఆధారపడి సాగింది. వరితోపాటు అనేక వాణిజ్య పంటలను కాకతీయ రాజులు ప్రోత్సహించారు. వస్త్ర, కలప, ఖనిజ పరిశ్రమలను పోషించారు. ఆయుధాల తయారీ ఉండేది. కత్తులను ఎగుమతి చేసేవారు.
విజయనగర రాజులు
ఓరుగల్లులో కాకతీయుల పాలన అంతమైన తర్వాత… విద్యారణ్యస్వామివారి ఆదేశంతో.. ఓరుగల్లు నుంచి వెళ్లిన హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించిన రాజ్యం విజయనగరం. విజయనగర రాజ్యంలో ప్రధానంగా రాజు, అమాత్యుడు (మంత్రి), జనపదం, కోట, ఖజానా, సైన్యం, మిత్రపక్షం వంటి ఏడు విభాగాలు పరిపాలనలో ప్రధాన విభాగాలుగా ఉన్నాయి. రాజుదే అంతిమ అధికారం. ఆయనకు మంత్రిమండలి రూపంలో మంత్రులు పరిపాలనలో సహకరిస్తుంటారు. ఈ మంత్రి మండలికి మహాప్రధానుడు (బహుశా ప్రధానమంత్రి అనవచ్చేమో) నాయకత్వం వహిస్తాడు. ఆ తర్వాత కార్యకర్త లేదా రాయస్వామి (ప్రధాన కార్యదర్శి), అధికారులు, గౌడలు (భూస్వాములు) కరనీకులు (అకౌంటెంట్లు), కావలులు (గార్డులు) వేర్వేరు బాధ్యతలను నిర్వహించేవారు. పరిపాలన 72 విభాగాలుగా కొనసాగేది. ప్రతి విభాగంలోనూ మహిళా ఉద్యోగులు ఉండేవారు. విజయనగర సామ్రాజ్యం ముఖ్యంగా ఐదు ప్రావిన్సులుగా (రాష్ట్రాలు) ఉన్నది. ఒక్కొక్కటి ఒక్కో దండనాయకుడి చేతిలో ఉండేది. ఈ ప్రావిన్సులు ప్రాంతాలుగా, మున్సిపాలిటీలు (కంపన లేదా స్థలం) గా విభజనమేరకు పరిపాలన సాగింది. భారతదేశంలో మొట్టమొదటిసారి సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను విజయనగర సామ్రాజ్యంలో మొట్టమొదటిసారి వినియోగించారు. భారీ యుద్ధాలను నిర్వహించడానికి అద్భుతమైన వ్యూహాలను రచించి అమలుచేసింది. కృష్ణదేవరాయల సైన్యంలో లక్ష పదాతిదళం, 20 వేల అశ్విక దళం, 900 ఏనుగులు ఉండేవి. మొత్తంగా 11 లక్షల సైనిక సంపత్తి రాయల వద్ద ఉన్నది. నౌకాదళం కూడా రాయల సైన్యంలో భాగంగా ఉన్నది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సైనిక శిక్షణ ఇచ్చేవారు.
ప్రత్యేకంగా ఆయుధాల తయారీ కర్మాగారం ఉండేది. కత్తులు, కవచాలు, ఇతర ఆయుధాలనుఉ తయారుచేశారు.
దేశంలో నీటిపారుదల వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. కాలువలు, పైపులైన్లు, చెరువుల నిర్మాణం విపరీతంగా జరిగాయి. రాయలు విష్ణు భక్తుడు. ఆముక్తమాల్యద రాశాడు. అయినప్పటికీ కాళహస్తి రాజగోపురాన్ని నిర్మించాడు. మతం కేవలం వ్యక్తిగతమే తప్ప పరిపాలనలో భాగం కాదని రాయల పాలన స్పష్టంచేశారు. తుంగభద్రనదీతీరంలో వ్యవసాయం సుసంపన్నమైంది. ప్రతి ఏటా తొమ్మిదిరోజుల పాటు ఖజానాకు సంబంధించి నిధుల వినియోగంపై ఆడిటింగ్ జరిగేది. బకాయిలు తేలితే వెంటనే ఆయా ప్రావిన్సులకు చెల్లించేవారు. పన్నులు నెలవారీ వసూలుచేసేవారు.
విజయనగర రాజుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడింది. పత్తి, పప్పుధాన్యాలు, చెరుకు, వరి, గోధుమ, సుగంధ ద్రవ్యాలు తదితర పంటలను ఎగుమతిచేసేవారు. పెద్ద ఎత్తున చేనేత పరిశ్రమలను ప్రోత్సహించారు. నైపుణ్యం కలిగిన చేతివృత్తుల వారికి ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించేవారు. విజయనగర సామ్రాజ్యం నుంచి అనేక ఉత్పత్తులు చైనాకు ఎగుమతి అయ్యేవి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 300 ఓడరేవులు రాయల నియంత్రణలో ఉండేవి. మంగళూరు, హొనావర్, బర్కూర్, కొచ్చిన్, కన్ననూరు, మచిలీపట్నం వంటి ఓడరేవులు ఉన్నాయి. అరబ్బులు, పర్షియన్లతోనూ వర్తక వ్యాపారాలు నిర్వహించారు. వివిధ దేశాల నుంచి అనేక వస్తువులు దిగుమతి కూడా చేసుకొనేవారు. తూర్పుతీర ప్రాంతం నుంచి విజయనగర సామ్రాజ్యం వ్యాపారం లావాదేవీలు నిర్వహించింది. గోల్కొండ రాజ్యం నుంచి బియ్యం, చిరుధాన్యాలు, పొగాకు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. అంగట్ల రతనాలు అమ్మినారట ఇచట అని సామెత అందరికీ తెలిసిందే.
నాయకులు
విజయనగర రాజుల తరువాత ద్రవిడ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల్లో నాయకరాజులు ప్రముఖులు. రాజకీయ సుస్థిరతకు, సంపన్నతకు, భద్రతకు, సహనానికి, సౌభ్రాతృత్వానికి పెట్టింది పేరు. తెలుగు, కన్నడ, తమిళ, ఉర్దూ, మళయాల భాషలు మాట్లాడేవారు ఉండేవారు. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, చెట్టియార్లు, చక్లియార్లు, నాయుళ్లు, నాయకులు, రాజులు ఇలా రకరకాల కులాలవాళ్లు ఉండేవారు. నాయకుల రాజ్యంలో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు. నాయకుల పరిపాలనా వ్యవస్థను గమనిస్తే.. ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎంత అవసరమో తెలుసుకోవచ్చు. రాజకీయాలు, మతం, ఆర్థిక వ్యవస్థ ఈ మూడూ కూడా సమాంతరంగా సమాజ నిర్మాణాన్ని ప్రభావితంచేశాయి. నాయకరాజుల కాలంలో మత కల్లోలానికి పెద్దగా ఆస్కారం లేదు. ముస్లింలు, యూరోపియన్ క్రైస్తవులు ఉన్నప్పటికీ.. నాయకరాజ్యాన్ని మతాల పరంగా ప్రభావం చేయలేకపోయారు. అందరికీ వర్తించిన శాసనాలే వీరికీ వర్తించాయి తప్ప వారికో శాసనం.. వీరికో శాసనం అంటూ లేవు. అలాగని నాయకుల రాజుల కాలంలో వీరేమీ అణచివేతలకు గురికాలేదు. ఇతరదేశాల నుంచి వచ్చిన మతాలను ఈ రాజ్య ప్రజలు అత్యంత సహనంతో, ప్రేమతో తమలో కలుపుకున్నారు. సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకొన్నది. కులాల మధ్య అంతరాలు కూడా ఉన్నాయి. నాయక రాజులు తమ బంధువులను వివిధ ప్రాంతాలకు అధికారులుగా నియమమించారు. వివిధ స్థాయిల్లో మంత్రులు, అధికారులు ఉండేవారు. దాల్వాయి, ప్రధాని, రాయసం అనే ముగ్గురు రాజుగారికి కోర్ కమిటీగా ఉంటారు. అధికారులుగా కనక్కన్ (అకౌంటెంట్), స్థానాపతి (విదేశాంగమంత్రి) ఉన్నారు. తిరుచిరాపల్లి, తిరునల్వేలి, సత్యమంగళంలో వీరికి గవర్నర్లు ఉన్నారు. సేలం, మనమదురై, సెందమంగళం, మరమంగళం, ధారపురం నగరాల్లో అధిపతులను నియమించారు. నగరాధిపతులు స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఆయా పరిపాలనాక్షేత్రాలను అనుసరించి ప్రధాన్‌లు షేరోగార్లు, కావల్కర్లు అధికారులుగా వ్యవహరించారు. రాజ్యం గ్రామాలవారీగా నిధులను విడుదలచేసేది. కమ్మవారు, బలిజలు, కంబలట్టర్‌లు నగరాధిపతులుగా, వ్యవసాయదారులుగా వ్యాపారులుగా ఉండేవారు. మొదలియార్లకు అత్యధిక గౌరవం లభించేది. రాజుగారి కోర్‌కమిటీలో వీరే ఉండేవారు. నాయకరాజులు ప్రధానంగా మతపరమైన అంశాలకంటే రాజకీయ వ్యవస్థకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. విదేశీ వాణిజ్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. ముఖ్యంగా వస్త్రాలు, గంధపు చెక్కలను ఎగుమతులు చేశారు. సైన్యంపై ముఖ్యంగా పదాతి దళం, నౌకాదళంపై ఎక్కువగా పెట్టుబడి పెట్టారు.
చోళులు
ఉత్తరాన మౌర్యుల రాజ్య పాలన ఎలాంటిదో.. దక్షిణాన చోళులు అంత శక్తిమంతంగా పరిపాలన సాగించారు. చోళులు ఆలయాల నిర్మాణానికి ఎంత ప్రసిద్ధులో.. ఆర్థిక సంపన్నతకూ అంతే ప్రసిద్ధులు. రాజ్యానికి వచ్చే ఆదాయాన్ని వివిధ గ్రామాల్లో తిరిగి పెట్టుబడి పెట్టే విధానాన్ని (రీఇన్వెస్ట్‌మెంట్) అవలంబించారు. తద్వారా మొత్తం సమాజానికి మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టారు. చోళ సామ్రాజ్యం కూడా అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చింది. మండలాలు (ప్రావిన్సులు లేదా రాష్ట్రాలు)గా, వాటి పరిధిలో వలనాడులు.. ఈ నాడుల పరిధిలో కొట్టంలు ఉండేవి. ఆయా పరిధుల్లో వాటివాటి పరిపాలన సాగేది. చోళ రాజ్యంలో చిన్న చిన్న రాజుల పరిపాలనకు బదులుగా ఆయా ప్రాంతాల్లో రాజు నియమించిన అధికారుల నిర్వహణపై ఆధారపడి పాలన ఉండేది. దీనివల్ల చోళరాజుకు మొత్తం వ్యవస్థమీద పట్టు ఉండేది. రాజరాజ చోళుడు అతి పెద్ద రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటుచేశాడు. అకౌంట్ల నిర్వహణకు, పన్నుల వసూలుకు ప్రత్యేక విభాగాలు ఉండేవి. ఈ విభాగాల్లో వివిధ స్తరాలలో అధికారులు ఉండేవారు. వీరి మధ్య పనివిభజన స్పష్టంగా ఉండేది. ‘నాడు’, ‘సభ’, ‘నగరం’ అన్నవి వేర్వేరు స్థాయి గల స్థానిక ప్రాంతాలు. ఇవి తమ తమ పరిధుల్లో పన్నులను వసూలు చేసి కేంద్రానికి (రాజుగారి ఖజానాకు) పంపించేవి. రాజరాజ చోళుడి కాలంలో పెద్ద ఎత్తున గ్రామాల సర్వే జరిగింది. తద్వారా రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించారు. రాజు తాను ఏదైనా పని తలపెట్టినప్పుడు దాన్ని కార్యనిర్వహణ అధికారి (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) ద్వారా స్థానిక అధికారులకు తెలియజేస్తారు. ఆ తర్వాత ఆ పని అమలుకు కార్యాచరణ మొదలవుతుంది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై సాక్ష్యులు సంతకం చేస్తారు. దాని ఆమోదం అనంతరం పనులు ప్రారంభమవుతాయి. స్థానిక ప్రభుత్వాలు దాదాపుగా స్వతంత్రంగా పరిపాలించుకుంటాయి.
చోళుల రాజ్యంలో న్యాయమనేది పూర్తిగా స్థానికమైన అంశం. రాజుతో పనే లేదు. చిన్న చిన్న వివాదాలన్నీ గ్రామస్థాయిలోనే పరిష్కారమైపోవాలి. దానికి పైదాకా రావాల్సిన అవసరంలేదు. చిన్న చిన్న నేరాలకు నేరస్థుడికి జరిమానా విధించి వదిలేసేవారు. ఆ జరిమానాను అతను లేదా ఆమె చారిటబుల్ ట్రస్టులకు ఆ జరిమానాను కట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హత్యలకు కూడా జరిమానాలతో సరిపెట్టేవారు. రాజు దాకా కేసు వెళ్లిందంటే.. రాజే వినాల్సిన కేసు వస్తే దండన మరణ దండన కానీ, ఆస్తుల జప్తు కానీ జరిగేది.
చోళుల సైన్యం కూడా గజాశ్వ పదాతి దళాలతోపాటు నౌకాదళం ఉండేది. సైనికులు ప్రధానంగా కత్తులు, బాణాలు, బళ్లాలను వినియోగించేవారు. భారత నౌకాదళ శక్తి ఏపాటిదో చోళుల నేవీని చూస్తే అర్థమవుతుంది. రాజ్య విస్తరణకు నౌకాదళం శక్తి సామర్థ్యాలు బాగా ఉపయోగపడ్డాయి.
భూమి శిస్తు, వాణిజ్య పన్ను (కస్టవ్‌సు డ్యూటీ).. ఈ రెండు చోళుల ఆర్థిక వ్యవస్థకు పునాదులు. చోళులకు ఆదాయం ప్రధానంగా వ్యవసాయక్షేత్రాలు, స్థానిక ప్రభుత్వాలు, నగరాల నుంచి వచ్చేది. చోళుల కాలంలో తీరప్రాంత వ్యాపారం పెద్ద ఎత్తున సాగింది.
చోళ రాజ్యంలో రైతులకు అత్యున్నతస్థానం, ెదా లభించింది. అన్ని గ్రామాల్లోనూ భూమి శిస్తు ఎవరు చెల్లించాలి? ఎవరు చెల్లించరాదు అన్న విషయాన్ని స్పష్టంగా నిర్వచించారు. వ్యవసాయ పనులకోసం దినసరికూలీల వ్యవస్థను ఏర్పాటుచేశారు. గ్రామాల్లో నీటిపారుదల వ్యవస్థలకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. కావేరీ నది నుంచి కాల్వలు, చెరువులు తవ్వి వ్యవసాయానికి ఊతమిచ్చారు. కాంచీపురం, మహాబళిపురం వంటివి ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లాయి. చైనాతోపాటుగా ఆగ్నేయాసియా దేశాలకు చోళులు అనేక వస్తువులను సముద్ర మార్గం ద్వారా ఎగుమతిచేశారు.
మరాఠాలు
ఛత్రపతి శివాజీ నేతృత్వంలో సాగిన మరాఠాల పరిపాలన అత్యంత ఆదర్శవంతమైనది. శివాజీ రాజ్య వ్యవస్థ ముఖ్యంగా అష్ట ప్రధానుల మండలిపైన ఆధారపడి ఉన్నది. అంటే ఎనిమిదితో కూడిన మంత్రి మండలి అని అర్థం. వీరిలో పంత్ ప్రధాన్ లేదా పేష్వా.. అంటే ప్రధానమంత్రి.. రాజ్యంలోని సాధారణ పరిపాలన మొత్తం పర్యవేక్షించేవాడు. అమాత్య లేదా మజుందార్.. దేశ ఆర్థిక మంత్రి. సచివ్ అంటే.. సెక్రటరీ, మంత్రి.. అంటే అంతర్గత వ్యవహారాల పర్యవేక్షకుడు. సేనాపతి అంటే సర్వ సైన్యాధ్యక్షుడు (కమాండర్ ఇన్ చీఫ్). సుమంత్ అంటే విదేశాంగ మంత్రి. న్యాయాధ్యక్షుడు అంటే ప్రధాన న్యాయమూర్తి, పండిట్‌రావు అంటే.. దేశంలోని మతపరమైన అన్ని అంశాలను పర్యవేక్షించేవాడు. ముఖ్యమైన అన్ని కార్యాలు ఈ ఎనిమిది మంది పర్యవేక్షణలో జరుగుతాయి. ఇతర పౌరసేవలు వీరి డిప్యూటీలు చూసుకొంటారు. పేశ్వా అంటే మనం ఇప్పుడు చూస్తున్న ప్రధానమంత్రి స్థాయి వాడన్నమాట. ఇప్పుడు ప్రధానమంత్రికి ఎన్ని అధికారాలుంటాయో.. పేశ్వా కూడా సర్వాధికారిగా వ్యవహరిస్తాడు. మిగతావారంతా కూడా పేశ్వా అధికార యంత్రాంగం (బ్యూరోక్రసీ) లో భాగంగానే ఉంటారు. శివాజీ రాజ్యంలో ఏ ఒక్కరినీ కూడా రాజు ఉపేక్షించలేదు. ఎవరిని శిక్షించాలన్నా, ఎవరిని సత్కరించాలన్నా వెంటనే నిర్వర్తించేవారు. ఆయా ప్రాంతాల్లోని గవర్నర్లు.. తమ పరిధిలోని సైనికుల ప్రవర్తన గురించి ఎప్పటికప్పుడు శివాజీ మహరాజుకు తెలియజేసేవారు. దానిని బట్టి ఎవరికైనా వారి వారి ర్యాంకుల్లో ప్రమోషన్లు కానీ, నగదు పురస్కారం కానీ లభించేది. మరాఠా సైన్యం సముద్రదాడులను విస్తృతంగా నిర్వహించింది. మొఘలులు, యురోపియన్ల ఓడలను కొల్లగొట్టింది.
మొఘలులు
మొఘలుల రాజరికం ప్రారంభమైనాక.. మొదటి ఇద్దరు రాజులు.. బాబర్, హుమాయున్.. రాజకీయ సంఘర్షణలోనే ఎక్కువకాలం గడిపారు. అక్బర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొఘల్ సామ్రాజ్యంలో పరిపాలనా సంస్కరణలు విస్తారంగా తీసుకొచ్చాడు. అతను తీసుకొచ్చిన సంస్కరణలను వారసులు షాజహాన్, జహంగీర్ ఏమాత్రం మార్చకుండా కొనసాగించారు. ఔరంగజేబ్ కొంత మార్చినట్టున్నాడు.
మొఘలుల రాజ్య వ్యవస్థలో అనేక స్తరాలలో విస్తరించింది. ఈ మొత్తం వ్యవస్థకు బాద్షా అనంతమైన అధికారాలు కలిగినవాడు. ఇతణ్ణి ఎవరూ ఎదిరించకూడదు. ఎందుకంటే అతడు ప్రజలను ఉద్ధరించడానికి దేవుడు పంపించిన దూతగా బాద్షాను భావించాల్సి ఉంటుంది. బాద్షాను వ్యతిరేకిస్తే అత్యంత భయంకరమైన శిక్ష పడుతుంది. మొఘలుల కొలువులో ప్రధానమంత్రులు, గవర్నర్ల వ్యవస్థ మిగతా రాజ్యవ్యవస్థల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ బాద్షాను కాదని చేయడానికి ఏమీ ఉండదు. బాద్షా వారిని నియమిస్తాడు.. తొలగిస్తాడు. బాద్షా సర్వ స్వతంత్రుడైన రాజ్యాధిపతి. సర్వ సైన్యాధ్యక్షుడు కూడా అతనే.
పౌర వ్యవహారాలు చూసేందుకు వజీర్ అంటే దివాన్ ఉంటాడు. అత్యవసర సమయాల్లో సైనిక వ్యవహారాల్లో కూడా పాలుపంచుకుంటాడు. ఇతని పరిధిలో మరో ఇద్దరు అధికారులు దివాన్ ఎ తాన్, దివాన్ ఏ ఖల్స్ ఉంటారు. రెవెన్యూ వ్యవస్థ ఇతని నియంత్రణలో ఉంటుంది. ప్రావిన్సుల్లో ఉండే గవర్నర్లు తమ లెక్క పత్రాలను దివాన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఒక దివాన్‌కు ఏడాదికి దాదాపు ముప్ఫై లక్షల రూపాయల వరకు వేతనాన్ని అక్బర్ ఇచ్చాడంట. అంటే.. దేశం పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
దివాన్ తర్వాతి అధికారి మీర్ బక్ష్. ఇతను ఒకవిధంగా అకౌంటంట్ అని చెప్పవచ్చేమో. మున్సబ్‌దార్ల లెక్కలు ఇతను పర్యవేక్షించేవాడు. ముస్లిం పాలకులు తమ సైన్యానికి సుప్రీం కమాండర్‌ను ఏర్పాటు చేయనేలేదు. అంతా రాజు నేతృత్వంలోనే సాగేది. తర్వాతి అధికారి ఖాన్ ఏ సమాన్. ఇతను భవన నిర్మాణ మంత్రిగా చెప్పవచ్చు. రాజుగారి భవనాల నిర్మాణాలతోపాటు రహదారులు, పార్కులు తదితర నిర్మాణాల బాధ్యత ఇతనిపై ఉన్నది.
మొఘలుల రాజ్యంలో మరో అధికారి సదర్. ఇతను రాజ్యానికి ప్రధాన న్యాయమూర్తి. ఇతను విద్యామంత్రిగా కూడా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. మతపరమైన వ్యవహారాలను చూడటానికి ముహస్తిబ్ ఉండేవాడు. అన్ని మతాల వ్యవహారాలు ఇతని కనుసన్నల్లో చూసేవాడు.
రాజుగారి ఆదేశాల ప్రకారం మీర్‌బక్ష్ ఒక న్యూస్ రైటర్ ను నియమిస్తాడు. ఇతను వార్తలు రాయాలి. రాజుగారి వార్తలు రాయాలి. ఇతని పదవీకాలం ఐదేండ్లపాటు ఉంటుంది. దరోగా ఏ దౌక్ చౌకి అన్నది పోస్టల్ విభాగానికి సంబంధించింది. ప్రతి ప్రావిన్సులోనూ గవర్నర్లు ఉంటారు. వీరిని సుబేదార్లు, నిజామ్ తదితర పేర్లతో పిలుస్తారు. అక్బర్ కాలంలో 15 ప్రావిన్సులు ఉండేవి. తరువాత మరో రెండు పెరిగినట్టున్నాయి. ఈ ప్రావిన్సులు జిల్లాలుగా.. జిల్లాలు పరగణాలు, పరగణాలు గ్రామాలుగా విభజన జరిగాయి. ఈ జిల్లాల్లో అధికారులు ఫౌజ్‌దార్, కొత్వాల్ లు పరిపాలన, శాంతిభద్రతలు చూసేవారు. పన్నుల వసూలుకోసం ఇతర వ్యవహారాలు చూసేందుకు అమిల్, సదర్, పోత్‌దార్ వంటి అధికారులు ఉండేవారు. గ్రామాల్లో సర్పంచ్‌లు ఉండేవారు. వివిధ స్థాయిల్లో వసూలుచేసే పన్నులు బాద్షాకు వెళ్లేవి.
రాజ్‌పుత్‌లు
ఉత్తర భారతాన మొఘలులతో నిరంతరం సంఘర్షణ పడిన రాజవంశాల్లో రాజ్‌పుత్‌లు ఒకరు. రాజ్‌పుత్‌ల రాజ్య వ్యవస్థ ప్రధానంగా కుల వ్యవస్థపైన ఆధారపడి కొనసాగింది. అగ్రకులాలకు చెందినవారి చేతిలో అధికారం ఉండేది. ముఖియాలు రాజ్‌పుత్‌ల ముఖ్యమైన అధికారులు. ఎవరైనా తప్పుచేసినా తిరిగి అదే కులానికి చెందినవారిని నియమించేవారు. రాజులు తమ సైన్యం కోసం సర్దార్లపైన ఆధారపడలేదు. తామే స్వయంగా నిర్వహించుకునేవారు. సైనిక వ్యవస్థ కూడా ఆయా కులాలమీద ఆధారపడే కొనసాగింది. ఆయా కులాల నాయకులు స్వయంగా సైన్యాన్ని నిర్వహించేవారు. యుద్ధం జరిగినప్పుడు వారినేతృత్వంలోనే ఆయా సైనిక విభాగాలు పోరాటంలో పాల్గొనేవి.
బహుమనీలు
బహుమనీల పరిపాలనలో.. అక్బర్ మాదిరిగానే సుల్తాన్ సర్వ సత్తాక అధికారి. ఇతని కింద పరిపాలన కార్యకలాపాలు నిర్వహించడానికి మంత్రి మండలి ఉండేది. కానీ మంత్రుల మాటకు సుల్తాన్ కట్టుబడి ఉండాల్సిన అవసరంలేదు. సుల్తాన్ దయాదాక్షిణ్యాలు ఉన్నంతకాలం మంత్రుల పదవులు ఉంటాయి. ఆయనకు కోపం వస్తే మంత్రి పదవి ఊడిపోతుంది. ఈ మండలిలో మంత్రులు.. వకీల్ ఏ సుల్తాన్ (ముఖ్యమంత్రి), అమీర్ ఏ జుమ్లా (ఆర్థిక మంత్రి), వజీర్ ఏ అశ్రఫ్ (విదేశాంగమంత్రి), వజీర్ ఏ కుల్ (పేష్వా లేదా ప్రధానమంత్రి) ఉండేవారు. బహుమనీల రాజ్యంలో ప్రధాన న్యాయమూర్తిని సదర్ ఎ జహాన్ అన్న పేరుతో పిలిచేవారు. బహుమనీ రాజ్యం నాలుగు రాష్ట్రాలు (ప్రావిన్సులు) గా విభజించబడ్డాయి. దౌల్తాబాద్, బీరర్, బీదర్, గుల్బర్గాలు ఈ నాలుగు ప్రావిన్సులు. వీటిని తరఫ్‌దార్ లేదా గవర్నర్‌ల పరిపాలన ఉండేది. తన రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ వసూళ్లు చేసే బాధ్యత ఈ గవర్నర్లది. ఈ తరఫ్‌దార్లను సుల్తాన్ తాను అనుకున్నప్పుడు అనుకున్న చోటికి బదిలీ చేయవచ్చు. రాష్ట్రాలు.. పరగణాలుగా.. గ్రామాలుగా విభజన జరిగి ఆయా ప్రాంతాలకు అధికారులు ఉండేవారు. పరిపాలనా యంత్రాంగంలో చిట్టచివరిది గ్రామం అన్నమాట.
***
ఇన్ని రాజ్య వ్యవస్థలను.. పరిపాలన తీరు తెన్నులను పరిశీలిస్తే అనేక అంశాలు స్పష్టంగానే కనిపిస్తాయి. ఈ వ్యవస్థల్లో రాజరికంలో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అమలయిందో అర్థమవుతుంది. కేంద్రీకృత పాలన, వికేంద్రీకృత పరిపాలన వ్యవస్థలు కనిపిస్తాయి. అనేక రూపాల్లో సైనిక వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రాజధాని నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అధికారాల విభజన ఎట్లా ఉన్నదో స్పష్టంగానే తెలుస్తుంది. అధికారంలో ఉన్నవారి క్యారెక్టర్లు అంటే వ్యక్తిత్వాలు లెండి.. ఎలా ఉండాలో అర్థమవుతుంది. పబ్లిక్‌లైఫ్‌లోకి వచ్చి అధికారం చేపట్టిన నాయకుడు లేదా పాలకుడు నిద్రలేచింది మొదలు.. పడుకొనేదాకా ఏమేమి చేయాలి.. ఏమేమి చేయకూడదు, శత్రువుల పట్ల ఎలా ఉండాలి.. ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలన్నది కూడా అవగాహన కలుగుతుంది. నిఘా వ్యవస్థను ఎట్లా ఏర్పరుచుకోవాలో తెలుస్తుంది. వ్యవసాయం, ఇరిగేషన్, రెవెన్యూ, నిర్మాణ రంగం, వివిధ వృత్తులు, పరిశ్రమలు, దేశీయ, అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు ఎలాచేశారు.. ఏ విధంగా చేయాలి అన్నవి తెలిసిపోతుంది. దేశానికి మూడువైపులా ఉన్న సముద్రతీర ప్రాంతం గుండా గతంలో చేసిన వాణిజ్యం తీరుతెన్నులు అవగాహనకు వస్తాయి. గ్రామాల్లో పరిపాలన, నగరాల్లో పరిపాలన, పన్నుల వ్యవస్థ వీటన్నింటి నిర్మాణం ఎలా ఉన్నదో అవగతమవుతుంది. నగదు బదిలీ, వస్తు వినిమయం గురించిన చరిత్రా అర్థమవుతుంది. క్రిమినల్ జస్టిస్ విధానం ఎలా ఉన్నదో తెలుస్తుంది. మహిళలకు ఏయే స్తరాలలో అధికారం అప్పగించారో కనిపిస్తుంది. భారతదేశంలో ఏయే ప్రాంతాల్లో ఏయే వనరులు ఉన్నాయి.. వాటి వివరాలనూ మన రాజవంశ చరిత్రల్లో, బౌద్ధ కౌటిల్య సాహిత్యంలో తెలుసుకోవచ్చు. న్యాయవ్యవస్థ ఎలా ఉన్నదో అర్థమవుతుంది. గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యపు పునాదులు మనకు ఈ వ్యవస్థల్లో స్పష్టంగానే కనిపిస్తాయి. మన ప్రజలకు.. వారిలో నైపుణ్యాన్ని అనుసరించి ఏయే రంగాలపై మనం దృష్టి సారిస్తే.. ఏయే రంగాలపై మనం పెట్టుబడులు పెడితే.. సులభంగా, ప్రామాణికంగా, వేగంగా ప్రగతిపథంలో నడుస్తామో ఈ రాజ్యవ్యవస్థలను ఒక్కసారి పరికిస్తే చాలు తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా మన వైభవానికి ప్రతిరూపాలు. విద్య, వ్యాపార, వాణిజ్య, అర్థ, రాజకీయ, సాంస్కృతిక వికాసానికి నిదర్శనాలు. ప్రపంచంలోనే బృహత్తరమైన రాజ్యాంగాన్ని రచించిన నిర్మాతలకు సరిహద్దులకు ఆవల కనిపించిన మంచి, ప్రామాణిక అంశాలు.. అమలుచేయదగ్గ విషయాలు.. దేశంలో అంతర్గతంగా ఉన్న వ్యవస్థల్లో, శాస్త్రాల్లో ఒక్కటి కూడా కనిపించలేదా? దేవుడు, దెయ్యం, పురాణాలు.. ఇవన్నీ చెత్త అనుకుంటే అనుకొండి. కానీ.. రాజ్యాలు.. వాటి పరిపాలన, వాటి సమాజాల విస్తరణ, నాగరిక వికాసం, చేసిన వ్యాపారం ఇవన్నీ నిజాలే కదా.. గుప్తుల కాలం స్వర్ణయుగమని చెప్పారు కదా.. అశోకుడు గొప్పవాడని కీర్తించారు కదా.. బౌద్ధాన్ని పదేండ్లపాటు పోషించారు కదా.. గుప్తుల యుగంలోనో.. అశోకుడి కాలంలోనో.. బౌద్ధ వాఙ్మయంలోనో చెప్పిన అంశాలు కూడా మనం స్వాతంత్య్రానంతరం అనుసరించడానికి పనికిరాకుండాపోయాయా? అంతటి రాజ్యాంగం రాసినవారికి ఇక్కడి సమాజంలోని పరిస్థితులు, తలెత్తే సమస్యలు, పరిష్కారాలు ఆలోచించకుండా.. కనిపించిన దేశం నుంచి.. కనిపించిన రాజ్యాంగం నుంచి ఒక్కో అంశాన్ని తీసుకొచ్చి గుదిగుచ్చి అత్యద్భుతమైన రాజ్యాంగం రాశారు బాగానే ఉన్నది. దీనివల్ల భారత సమాజానికి ఒరిగిందేమున్నది?
ఫెడరల్ స్ఫూర్తి అన్నారు. కేంద్రం.. రాష్ట్రాల మధ్య అంతరాలు ఎలా ఉన్నాయి?
ఉమ్మడి అంశాలు.. కేంద్ర, రాష్ట్ర అంశాలు అని చెప్పారు.. విద్య, వైద్యం, వ్యవసాయం వంటివి కూడా ఉమ్మడి అంశాల్లో చేర్చారు. ఎక్కడో పల్లెటూళ్లో ఉండే ఓ పాఠశాలలో చెప్పే విద్య, చేసే వ్యవసాయంపై కేంద్రం ఆధిపత్యం ఉండాల్సిన అవసరం ఏమున్నది? రైతులకు మద్దతుధర విషయంలో ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్రం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి కదా..
పలు వ్యవస్థల్లో స్థానికంగా స్వపరిపాలన విషయంలో రాజులే స్వేచ్ఛనిచ్చారు. ప్రస్తుతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న వ్యవస్థలో మాత్రం ప్రతి రంగంపైనా కేంద్ర ప్రభుత్వం అంతోఇంతో నియంత్రణ ఉండేలా చూసుకుంటుంది.
అంతకుముందెన్నడూ లేని జలవివాదాలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చాయి?
పన్నుల వాటాల విషయంలో కేంద్ర, రాష్ట్రాలు దాయాదుల్లా ఎందుకు కొట్టుకొంటున్నాయి?
ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకానేక అంశాలు ప్రశ్నార్థకంగానే ఉండిపోతాయి. వీటికి ఎలాంటి సమాధానముండదు. ఆధునిక భారత నిర్మాత అని మనం నిత్యం శ్లాఘించే నాయకుడి నేతృత్వంలో రాసుకున్న రాజ్యాంగం ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా వివాదరహితం ఎందుకు కాలేకపోయింది? మన దేశంలో.. మనం రాసుకొనే రాజ్యాంగం.. మన భౌగోళిక ప్రాంతాలు, అక్కడ అందుబాటులో ఉన్న వనరులు.. రంగాలు.. ఉత్పాదక సామర్థ్యం, వాటి ఆధారంగా ఎదిగిన సమాజాలు, ఆ సమాజాల్లోని ప్రజలు.. వారి అవసరాలు.. వారిలో ఉన్న నైపుణ్యం.. నిగూఢంగా ఉండి వెలుపలికి తీయగలిగిన శక్తి.. ఆ సామర్థ్యం ద్వారా మనం సాధించగలిగే అభివృద్ధి.. తద్వారా వివిధ మార్గాల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా చేయాల్సిన వర్తక వాణిజ్యం.. ఆదాయం రాబట్టడానికి అన్వేషించాల్సిన మార్గాలు, వాటి పెట్టుబడి, రాబడి, ఎగుమతులు, దిగుమతులు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలు, స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, అధికారాలు, వారి రక్షణ కోసం ఏర్పాటుచేయాల్సిన వ్యవస్థలు.. శత్రుదేశాలనుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏర్పాటుచేసుకోవాల్సిన భద్రతా వ్యవస్థలు.. ఇవన్నీ కూడా.. మనకు అనుకూలంగా ఉండేలా రాజ్యాంగ వ్యవస్థ తీర్చిదిద్దాల్సిన బాధ్యతను స్వతంత్ర భారత దేశ తొట్టతొలి ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చిందని భావించడం కష్టమే. నిజంగా నెరవేర్చి ఉంటే.. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఇన్ని అంతరాలు ఉండేవి కావేమో. రాజ్యాంగ సృష్టికర్తలు రెండున్నరేండ్లపాటు దేశమంతటా తిరిగారే తప్ప దేశం లోపలికి తొంగి చూడలేదు. దేశాన్ని అప్పటికి ఉన్నదున్నట్టుగా ముందుకు తీసుకొని పోదామనుకున్నారే తప్ప.. దేశాన్ని పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి.. యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలనే దూరదృష్టి దురదృష్టవశాత్తూ లేకుండాపోయింది.