కాజాల్లాంటి బాజాలు-60: గోల్డెన్ డేస్

10
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap] మధ్య ఇళ్ళల్లో కూర్చుని అందరూ ఆన్‌లైన్‌లో మీటింగులు పెట్టేసుకుంటూంటే నాకూ ఆవేశం వచ్చేసి మా కాలేజీ ఫ్రెండ్స్‌ని కొంతమందిని కూడేసి నేనూ ఓ మీటింగెట్టేసేను. అందరం కలిసి అప్పటి లెక్చరర్స్ గురించి చెప్పుకుని ఇంకోసారి హాయిగా నవ్వేసుకున్నాం. అందులో కొన్ని నలుగురితో పంచుకోవాలనిపించింది.

అసలు మొట్టమొదట నేను కాలేజీకి వెళ్ళే దారి తెలియక కొట్టుకున్న రోజు గుర్తొచ్చింది. నేను కాలేజీలో జేరిన రోజుల్లో మా ఇంటికీ, కాలేజీకీ మధ్యలోఒక తోట ఉండేది. ఆ తోట మధ్యనుంచి వెడితే కాలేజీ చాలా దగ్గర. అదే మైన్ రోడ్ మీంచి వెళ్ళాలంటే రిక్షా ఎక్కాల్సిందే.. అందుకని చాలామంది మా ఇంటి దగ్గరున్నవాళ్ళు కాలేజీకి వెళ్ళాలంటే ఆ తోటలోంచే వెళ్ళేవారు. నేనూ మొదటిరోజు వాళ్లతో కలిసి అలాగే వెళ్ళేను. రెండోరోజు వాళ్లకి ఫస్ట్ అవర్ లేదుట, అందుకని ఇంకో గంటాగి వెడతామన్నారు. సరే.. మరి నాకు ద్వితీయ విఘ్నం చెయ్యడం ఇష్టంలేక ఒక్కదాన్నే బయల్దేరి ఆ తోటలోకి ప్రవేశించేను.

కాస్త దూరం వెళ్ళేటప్పటికి అన్నీ చెట్లే తప్పితే నాకెక్కడా దారి కనిపించలేదు. ఎటు వెళ్ళాలో, ఎలా వెడితే కాలేజీ వస్తుందో తెలీలేదు. పోనీ వెనక్కి వెడదామంటే వెనకాల కూడా అన్నీ చెట్లే.. ఎటొచ్చేనో అంతకన్నా తెలీలేదు. ఎటు వెళ్ళాలిరా భగవంతుడా అనుకుంటుంటే ఎట్నుంచి వచ్చేరో ఒకాయన నాకు పదడుగుల ముందు వెడుతూ కనిపించేరు. ఆయన కోటు వేసుకుని ఉన్నారు. “ఓహో కోటు వేసుకున్నారు కనక ఈయన కాలేజీలో లెక్చరర్ అయి ఉంటారూ, (ఆ రోజుల్లో కాలేజీ లెక్చరర్లు కోట్లు వేసుకునే వచ్చేవారు క్లాసులకి..) ఈయన వెనకాల పడితే మనం కాలేజీ దగ్గర తేలొచ్చు” అనుకుంటూ, కాస్త నడకవేగం పెంచి ఆయనకి నాలుగడుగుల దూరంలో వెనకాల అనుసరించడం మొదలెట్టేను.

ఆయనకి ఏమైనా అనుమానం వచ్చిందేమో మరీ, వెనక్కి తిరిగి చూసేరు. పుస్తకాలు పట్టుకుని వెనకొస్తున్న నన్ను చూసేరు. ఆయన్ని ఫాలో అవుతున్నాననుకున్నారో యేమో నడకవేగం పెంచేరు. నేనూ పెంచేను. తగ్గించేరు. నేనూ తగ్గించేను. (మరి గబగబా నడిస్తే అయన కన్న ముందుకెళ్ళిపోతే దారి తెలీదుకదా!) ఆయనేదో అనుమానంగా చూసేరు. నిజమే,  అలా వెనకాల పడడం తప్పుకదా మరీ.

అందుకనీ నేను నా సినిమా తెలివినంతా ఉపయోగించేసేను. ఆ రోజుల్లో సినిమాల్లో హీరోయిన్ వెనక హీరో పడుతుంటే, హీరోయిన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు హీరో గబుక్కున వెనక్కి తిరిగి, క్రాఫు సద్దుకుంటున్నట్టో, కిందపడ్ద ఏదో వస్తువును తీసుకుంటున్నట్టో నటించేవాడు. అందులో షమ్మీకపూర్ ఇలాంటివి భలే చేసేవాడు. అది గుర్తు చేసుకుంటూ నేను ఆయన వెనక్కి తిరిగినప్పుడల్లా ఓసారి వెనక్కి తిరిగిపోతూ, ఇంకోసారి కిందదేదో తీస్తూ నా శాయశక్తులా నటించేసేను.

అలా ఇద్దరం మూకాభినయం చేసుకుంటూ మెయిన్‍రోడ్ దాకా వచ్చేసేం.. హమ్మయ్య.. ఎదురుగా కనిపిస్తూ రోడ్డు దాటగానే కాలేజీగేటు. లోపలికి ఓ కిలోమీటర్ నడిస్తే కానీ కాలేజీ రాదనుకోండీ.. కానీ నేను మటుకు అక్కడే కాసేపు ఆగిపోయేను. ఎందుకంటే ఆయన బాగా లోపలికెళ్ళేక నేను వెళ్ళొచ్చని. వెనక్కి తిరిగి నన్ను చూసుకుంటూ ఆయన కాలేజీలోకి వెళ్ళిపోయేరు. అప్పుడు నేను గేట్లోకి వెళ్ళేను. అలాగ కాలేజీలో పేరు కూడా తెలీని ఒక లెక్చరరుతో ఆడిన దాగుడుమూతలాటతో నా కాలేజీలో ఆ రోజు మొదలైంది. అది తల్చుకుంటే ఇప్పటికీ ఎంత నవ్వొస్తుందో!

అదే మాట నా ఫ్త్రెండ్‌కి గుర్తు చేస్తే ఆమె ఇంకో విషయం గుర్తు చేసింది.

ఆ రోజుల్లో ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని బి.యె. చదివేవాళ్లకి వారానికి ఒక క్లాసు జనరల్ సైన్స్ అంటూ ఉండేది. అలాగే సైన్స్ గ్రూప్ వాళ్లకి కూడా వారానికో రోజు ఆర్ట్స్ క్లాస్ ఉండేది.

ఆ రోజుల్లో కాలేజీ లాబ్స్‌లో డిమాన్‌స్ట్రేటర్స్ అని ఉండేవారు. వాళ్లకి అప్పటికి ఇంకా లెక్చరర్ కున్నంత క్వాలిఫికేషన్ ఉండేది కాదు కనుక వాళ్ళు లాబ్‌లో స్టూడెంట్స్ చేత ప్రాక్టికల్స్ చేయించేవారు.

అలాగే ఆ రోజు మమ్మల్ని కెమిస్ట్రీ లాబ్‌కి తీసికెళ్ళేరు. చిన్నప్పుడు స్కూల్లో అందరూ చదువుకునే వుంటారుకదా, లిట్మస్ టెస్ట్ గురించి దాని గురించి మాకు బోధిస్తున్నాడు ఆ డిమాన్‌స్ట్రేటర్. లిట్మస్ కాగితం మీద యాసిడ్ పోస్తే అది రంగు మారుతుంది కదా!  అందుకోసం.. ఓ చేత్తో లిట్మస్ పేపర్ పట్టుకున్నాడు. మరో చేత్తో జాగ్రత్తగా టెస్ట్ ట్యూబ్‌లో ఉన్న ద్రవాన్ని దాని మీద పోస్తున్నాడు. ఆ లిట్మస్ పేపర్  ఎర్రగా మారితే ఆ ద్రవం యాసిడ్ అనీ, కాకపోతే కాదనీ ఇంగ్లీషులో చెప్పడానికి బహు బాగా కష్టపడిపోతున్నాడు పాపం.

అదెలా చెపుతున్నాడంటే.. ఆ ద్రవం పోస్తూ.. “డోంట్ పొర్ పొర్ పొర్ పొర్ పొర్  పొర్ పొర్ —- పోఓఓఓఓఓఓఓఓఓఓఓర్.. పోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓర్… పోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓర్ పోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓర్..” అన్నాడు.

అంటే యాసిడ్ గబగబా పోయొద్దూ, నెమ్మదిగా పోయండీ అని ఇంగ్లీషులో చెప్పడానికి అతను పడ్డ కష్టం చూస్తుంటే మాకు ఒకటే నవ్వు. మా నవ్వు చూసి పాపం అతను బెదిరిపోయి, పారిపోయేడు.

కానీ మేమూరుకుంటామా! ఆ తర్వాత నుంచి అతను కాలేజీలో ఎక్కడ కనిపించినా మేం “డోంట్ రన్రన్రన్రన్రన్రన్రన్రన్రన్రన్రన్—-రాఆఆఆఆఆన్ రాఆఆఆఆఆన్ రాఆఆఆఆఆన్ రాఆఆఆఆఆన్ రాఆఆఆఆఆన్” అనేవాళ్లం.

పాపం.. ఇప్పుడెక్కడున్నాడో..

ఇంకో ఫ్రెండ్ మా ఇంగ్లీష్ సర్‌ని గుర్తు చేసింది. డిగ్రీ చదువుతున్నప్పుడు మాకు ఇంగ్లీష్‌కి ఒక లెక్చరర్ వస్తుండేవారు. ఆయన పేరు సరిగా గుర్తు లేదు.. పోనీ సర్ అనుకుందాం. ఆయనకి మేం చాలా ఇష్టపడి చదివే తెలుగు కథలూ, నవల్లూ, అంతకన్నా ఇష్టపడి చూసే తెలుగు సినిమాలూ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆయనకి ఇష్టం లేకపోతే మానె.. అవన్నీ చదవడం, చూడడం ఎంత చెత్త పనో అన్నట్టు చెప్పేవారు. అస్తమానం ఇంగ్లీషు నవలల ప్రాశస్త్యం గురించీ, బెంగాలీ సినిమాల గొప్పతనం గురించీ చెప్పేవారు. అవేమిటో మాకు తెలియవాయె.. వెర్రి మొహాలేసుకుని చూస్తుండేవాళ్లం. మాట్లాడితే మిల్టన్, షేక్స్‌పియర్ అనేవారు. వాళ్ళని కోట్ చేస్తూ ఏంటో మాకు అర్థం కాని డైలాగులు చెప్పేవారు. అసలు సినిమా అంటూ చూస్తే సత్యజిత్ రే తీసిన “పథేర్ పాంచాలీ” చూడాలనేవారు. అందులో ఒక చిన్న పిల్లవాడు నడుస్తూ వెళ్ళడం చూపించడానికి ఆ డైరక్టరు ఒక పిల్లవాడు ఎలా నడుస్తాడో ఆరు నెలలు అబ్సర్వ్ చేసాడని ఆ డైరక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈయన పరవశించిపోతూ చెప్పేవారు. ఒక చిన్నపిల్లాడు రోడ్డుమీద నడవడం తీయడానికి ఆరునెలలు వేస్ట్ చేసేడా అని మేం కిసుక్కున గుసగుసలాడుకుంటూ నవ్వుకునేవాళ్లం.

ఆ సత్యజిత్ రే సినిమాలని మెచ్చుకోవడమే కాకుండా మన తెలుగు సినిమాలు ఎంత చెత్తగా ఉంటాయో విశ్లేషించేవారు. “రిక్షా తొక్కి ఎవడైనా చెల్లెలి పెళ్ళి అంత గొప్పగా చెయ్యగలడా, ఒక్క మన తెలుగు సినిమాలో హీరో తప్ప..” అని వెక్కిరించేవారు. ఆ ముందురోజే అలాగ కష్టపడి రిక్షా తొక్కి చెల్లెలి పెళ్ళి చేసిన హీరో సినిమా చూస్తూ, గుండెలు పిండేసినంత బాధ పడిపోయిన మాకు ఈ కామెంట్ వింటుంటే ఈ సర్ ఎంత దుర్మార్గుడు, ఒక అన్న పవిత్ర హృదయాన్ని అర్ధం చేసుకోలేకపోయేడూ…అనుకునేవాళ్లం.

అన్న హృదయాన్ని అర్ధం చెసుకోలేని రాతిగుండే కాదు.. ఈ సర్‌కి అసలు ప్రేమ అంటేకూడా తెలీదనీ, మనం పరవశించిపోయి వినే యుగళగీతాలు కూడా ఆయన విమర్శకు గురవుతాయనీ తెలుసుకుని నివ్వెరపొయేం. ఆయన ఏదో సినిమాలోది ఒక డ్యూయట్ విన్నారుట.

అందులో “నువ్వంటే నాకెందుకో ఇంత ఇదీ.. ఇంత ఇదీ.. ఇంత ఇదీ..” అని హీరో పాడితే

“నువ్వన్నా నాకెందుకో అదే ఇదీ.. అదే ఇదీ.. అదే ఇదీ..” అని హీరోయిన్ పాడుతుందిట.

ఆ పాట విని ఆ సర్ మమ్మల్ని అడుగుతారూ.. “వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఇదీ..” అని..

“ఇదీ..” అంటే “ఇదే..”… దానికి అర్థం చెప్పమంటే ఎవరు చెప్పగలరూ! అర్థం చేసుకోరూ…. అని తెగ గింజుకునేవాళ్ళం..

ఇలాగ అప్పటి రోజులనీ, మేం చేసిన పిచ్చిపనులనీ తల్చుకుంటూ ఎంతసేపో నవ్వుకున్నాం నేనూ నా ఫ్రెండ్సూ..

ఎంతైనా కాలేజ్ డేస్ అంటే గోల్డెన్ డేస్ కదా! మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తో ఆన్‌లైన్ మీట్ పెట్టేసుకుని ఎంజాయ్ చేసేయండి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here