కంటి చూపుకు హాని చేసే కొన్ని అలవాట్లు

0
4

[box type=’note’ fontsize=’16’] కంటి చూపుకు హాని చేసే కొన్ని అలవాట్లను పేర్కొంటూ, నేత్రాలను ఎలా సంరక్షించుకోవాలో ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]మ[/dropcap]న అవయవాలలో అన్నిటికన్నా కంటికి ప్రాధాన్యత ఇచ్చి పెద్దలు “సర్వేంద్రియనాం నయనం ప్రధానం” అన్నారు. కళ్ళతోనే మనము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. అందులో కళ్ళు చాలా సున్నితమైనవి. అటువంటి కళ్ళను మనము ఏమాత్రము అజాగ్రత్తగా చూసుకున్న చాలా నష్టము వాటిల్లుతుంది. ముందు చూపు మందగిస్తుంది. ప్రస్తుతము మనకు అలవాటైన టీవిలు, సెల్ ఫోనులు చిన్న పిల్లల దగ్గర నుండి కంటికి హానికరంగా తయారు అయినాయి. చిన్న పిల్లల దగ్గర నుండి కళ్లజోళ్లు వాడవలసిన అవసరము వస్తుంది. ఈ విధముగా మన అలవాట్లే మన కంటి ఆరోగ్యానికి ప్రమాదకరంగా తయారు అయినాయి. అవి ఏమిటో అవి ఏవిధముగా కంటి చూపుకు హానికరమో తెలుసుకుందాము.

ప్రకృతిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు, పొడిగాలి లాంటివి కంటి చూపును డేమేజ్ చేస్తాయి. ఇవి తెలుసుకుంటే అప్పుడు కొద్దిగానైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. పూర్వము మంచి బలవర్ధకమైన ఆహారము, కంటి నిండా నిద్ర వంటి ఆలవాట్ల వలన వృద్ధాప్యము వచ్చేవరకు కళ్ళజోళ్ళతో పనిలేకుండా చూపును రక్షించు కొనేవారు కానీ నేటి పరిస్థితి వేరు.

  1. పోషకాహార మరియు విటమిన్ బి లోపము: కంటిచూపు మందగించటానికి ప్రధాన కారణము సరిఅయిన పోషకాహారము తీసుకోకపోవటమే. బి 12 విటమిన్ లోపము శాఖాహారులలో చూపు మందగించటానికి కారణమయి క్రమముగా అంధత్వానికి దారితీస్తుంది. కాబట్టి కంటికి మంచిచేసే ఆహారాలు సాల్మన్, ట్యూనా, నట్స్, ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లములు ఉండే పదార్ధాలను, గ్రుడ్లను, బి విటమిన్ ప్రొటీనులు అధికముగావుండే ఆహారపదార్ధాలను తీసుకోవాలి. అలాగే ల్యూటెయిన్ అధికముగా వుండే ఆకుకూరలు, ఆరంజ్ పండ్లు, మామిడి పండ్లు, కెరోటినాయిడ్స్ అధికముగా వుండే క్యారెట్ అధికముగా తీసుకుంటే కంటి చూపు బాగా ఉంటుంది.
  2. సెల్ ఫోనులు, కంప్యూటర్లు వంటి పరికరాలను ఎక్కువగా వాడటం: ప్రస్తుత పరిస్థితిలోచిన్న పెద్ద తేడా లేకుండా కంటి చూపు మందగించటానికి మనము వాడే ఈ పరికరాలే. రోజు మొత్తము మీద ఈ పరికరాలతో కాలము గడపటం వలన కంప్యూటర్ స్క్రీన్, టివి తెర, స్మార్ట్ ఫోనులు కంటికి అధిక శ్రమను కలుగజేస్తాయి. దీనివలన క్రమముగా డ్రై ఐ (కళ్ళు పొడిబారటము) ఏర్పడుతుంది. అంతే కాకుండా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) వ్యాధి లక్షణాలు బయలుదేరుతాయి. ఈ వ్యాధిలో తలనొప్పి, కళ్లనొప్పి, మెడ భుజాలనొప్పి, చూపు అలికినట్లుగా వుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి రాకుండా కంప్యూటర్ వాడేటప్పుడు సరిఅయిన భంగిమలో కూర్చోవటం, తెర బ్రైట్‌నెస్‌ను అడ్జస్ట్ చేసుకోవటం వంటి పనులు చేయాలి.
  3. నిద్ర లేమి: మెడికల్ పరిశోధనల ప్రకారము మన కళ్ళకు రోజుకు కనీసము ఐదు గంటలపాటు నిరాఘాటంగా నిద్రకావాలి. అలా ఉంటేనే మన దైనందిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనగలము. శ్రమ ఎక్కువయితే కళ్ళకు దురద వస్తుంది. కంటికి వచ్చే రక్తనాళాలు ఉబ్బుతాయి. కళ్ళు పొడిబారుతాయి. చూపు మసకగా ఉంటుంది. ఈ నిద్ర పట్టకపోవటం లేదా నిద్ర లేమి వల్ల ఇంకా అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. నేత్ర నాడి దెబ్బతినటం వలన గ్లూకోమా(నీటి కాసులు) వచ్చే అవకాశము కూడా ఉంది.
  4. మాటిమాటికి కళ్ళను నలుపుతు ఉండటం: కొంచెము సేపు కళ్ళను నలుపుకోవటం వలన తాత్కాలికంగా ఉపశమనము అనిపించవచ్చు కానీ ఎక్కువసార్లు రుద్దుకోవటం వలన కళ్ళకు హాని జరుగుతుంది. ఇలా ఎక్కువ సార్లు కళ్ళు రుద్దుకోవటం వలన కెరటోకొనస్ అనే డిజార్డర్ డెవలప్ అవుతుంది. ఈ డిజార్డర్ వలన కార్నియా పలచబడుతుంది. దీనివలన అలికినట్లుగా కనపడటము రెండు ప్రతిబింబాలు కనిపించటం జరుగుతుంది. ఈ రకమైన ఇబ్బంది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తెలియక ఎప్పుడు కళ్ళను నలుపుకుంటూ ఉంటారు.
  5. కొన్ని మందుల వాడకము: మనము వాడే మందులలో కొన్ని దురదృష్ట వశాత్తు కంటి చూపుకు హాని చేసేవి కూడా ఉంటాయి. ఉదాహరణకు యాంటీ హిస్టమైన్, యాంటీ దిప్రసెంట్స్, కొలెస్ట్రాల్ తగ్గించేవి, బీటా బ్లాకర్లు, గర్భ నిరోధక మాత్రలు మొదలైనవి. అలాగే కొన్ని యాంటీ బయోటిక్స్, ఆస్తమాకు వాడే మందులు, పార్కిన్సన్ వ్యాధికి వాడే మందులు కూడ గ్లూకోమా వ్యాధి వచ్చే అవకాశాలను పెంచుతాయి. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. ఏదైనా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి మరేదైయినా ప్రత్యామ్నాయము గురించి ఆలోచించాలి.
  6. ఎక్కువగా ఐ డ్రాప్స్ వాడటం: డాక్టర్ ఏదో సందర్భముగా కంటిలో వేసుకోవటానికి ఐ డ్రాఫ్స్‌ను వాడమని చెపుతాడు. చాలా మంది ఆ తరువాత డాక్టర్ సలహా లేకుండా అటువంటి డ్రాప్స్‌ను అధికముగా వాడుతుంటారు. అలా డాక్టర్ సలహా లేకుండా ఐ డ్రాప్స్ వాడటం కంటి చూపుకు ఎక్కువ హాని చేస్తుంది. వీటిని ఎక్కువ కాలము వాడటం వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ విషయము తెలుసుకొవటానికి చాలా టైం పడుతుంది. అప్పటికి సరిచేయలేని నష్టము జరుగుతుంది.
  7. ఎయిర్ కండిషనింగ్ మరియు సెంట్రల్ హీటింగ్ వ్యవస్థలు: ఈ రెండు కూడా గదిలోని గాలిని పొడిగా చేస్తాయి. ఫలితముగా కళ్ళు పొడి బారతాయి. కళ్ళు పొడి బారినంత మాత్రాన పెద్ద ప్రమాదం ఏమిలేదు, కానీ కళ్ళు పొడి బారడం వలన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. కళ్ళు పొడిబారటము వలన కంటి ఉపరితల భాగము దెబ్బతింటుంది. క్రమముగా చూపు దెబ్బతింటుంది. కాబట్టి బెడ్ రూమ్‍లో ఎయిర్ హ్యుమిడిఫైయిర్ ఉంచుకోండి. లేదా ఒక పాత్రలో నీరు పోసి ఉంచుకోండి. ఈ పాత్రలో నీరు ఆవిరి అయి గదిలో తేమ శాతాన్ని పెంచుతుంది.
  8. ధూమపానం: ధూమపానం లేదా పొగత్రాగటం అనేది మాములు ఆరోగ్యముతో పాటు కంటి ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయి. ఒక సర్వేలో – రోజుకు 20 లేదా అంతకు మించి సిగరెట్లు కాల్చే వారిలో రంగులను గుర్తించటంలో ఇబ్బందులు ఉండటాన్ని గమనించారు. ధూమపానము వల్ల కంటికి సంబంధించిన ఇతర సమస్యలు అంటే గ్లూకోమా, మాక్యులర్ డిజెనెరేషన్ శుక్లాలు, డయాబిటిక్ రెటినోపతి వంటి సమస్యలు వస్తాయి. అందుచేత ధూమపానానికి దూరముగా ఉండండి.
  9. చలవ కళ్ళద్దాలను ధరించకపోవటము: సాధారణముగా బయట ఎండలో తిరిగేటప్పుడు కళ్ళకు రక్షణగా చలువ కళ్ళద్దాలను వాడుతుంటాము. సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలనుండి కంటికి రక్షణగా ఈ సన్ గ్లాసెస్ పనికి వస్తాయి. ఈ అల్ట్రా వయొలెట్ కిరణాలు నేరుగా కంటికి తాకితే అనేక రకాల కంటి జబ్బులు వచ్చే అవకాశము ఉంది. వాటిలో కనురెప్పల క్యాన్సర్, శుక్లాలు, మరియు కార్నియా మీద పింక్ కలర్ పెరుగుదల వంటి జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంది. డాక్టర్లు ఎండాకాలం మాత్రమే కాకుండా ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ సన్ గ్లాసెస్ ధరించటం కంటికి మంచిది అని చెపుతున్నారు. ఇక్కడ సన్ గ్లాసెస్ వాడమన్నారు కదా అని రోడ్డు పక్కనే అమ్మే చవకైన సన్ గ్లాసెస్ వాడటం ఇంకా హానికరం. కాబట్టి వాడేటప్పుడు నాణ్యమైన సన్ గ్లాసెస్ వాడండి.
  10. కంటిలో అమర్చే కాంటాక్ట్ లెన్సెస్‌ను సక్రమముగా వాడకపోవటం: కంటిలో అమర్చే ఈ కాంటాక్ట్ లెన్సెస్‌ను పూర్తి పరిశుభ్రముగా కంటి డాక్టర్ పర్యవేక్షణంలో వాడాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ లెన్సెస్‌ను తీసి నిద్రపోవాలి. కళ్ళునలపటము, నీటిని ఉపయోగించటం వంటి పనులు కంటి ఉపరితల భాగాన్ని పాడుచేస్తాయి. నయముకాని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాంటాక్ట్ లెన్సెస్‌ను అతిగా వాడటము లేదా మెడికల్‌గా అప్రూవ్ కాబడని లెన్సెస్ వాడటం మంచిది కాదు.
  11. రాత్రి పడుకోబోయే ముందు కంటికి ఉపయోగించిన మేకప్ తీసివేయకపోవటం: రాత్రి పడుకోబోయే ముందు కంటికి సంబంధించిన మేకప్ ఉంటే తీసేసి పడుకోవాలి. ఆ మేకప్ అలాగే ఉంటే దానిలోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. అదీగాక వాటిమీద దుమ్ము ధూళి చేరి ఇన్ఫెక్షన్స్‌కు అవకాశము ఉంది. కాబట్టి పడుకోబోయే ముందు అటువంటి మేకప్‌ను శుభ్రముగా నీటితో కడిగి పరిశుభ్రమైన గుడ్డతో తుడిచివేయాలి. కంటి మేకప్‌కు వాడే మస్కారా, కృత్రిమమైన కను రెప్పలు, ఐ లైనర్ లాంటివి కూడా ఐ ఇంఫెక్షన్‌లకు కారణము అవ్వచ్చు. కాబట్టి పాడుకోబోయే ముందు కంటికి ఉపయోగించిన మేకప్ తొలగించటం చాలా అవసరము.
  12. మేకప్ తీసేయటానికి వాడే రిమూవర్‌ను కంటికి దగ్గర లేదా కంటి మీద ఉపయోగించటం: ముఖానికి మేకప్ చేసుకున్నాక ఆ మేకప్‌ను తీసేయటానికి రిమూవర్లను వాడతారు. వీటిని కంటి మీద, కంటికి దగ్గరగా వాడటం కంటికి మంచిది కాదు. ఈ రిమూవర్ కంటి లోకి అసలు పోకూడదు. వీటిలోని బెంజాల్ కోనీయం క్లోరైడ్ అనే క్లీనింగ్ ఏజెంట్ ఉంటుంది ఇది కంటి ఉపరితల భాగమును పాడుచేస్తుంది. కాబట్టి వాడే మేకప్ రిమూవర్ కంటి హాని చేయనిదో కాదో తెలుసుకొని వాడాలి.
  13. విమాన ప్రయాణాలు: విమానాలలో దూరప్రయాణాలు చేసేటప్పుడు ఐ మాస్క్ వాడాలి ఎందుకంటే విమానంలో రీసైకిల్ చేయబడిన గాలి ఉంటుంది. ఇది పొడిగాను సూక్ష్మజీవులతోను ఉండే అవకాశము ఉంది. జాగ్రత్తగా ఉండకపోతే ఐ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశము ఉంది.
  14. బయట పనులు చేసేటప్పుడు కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవటము: సాధారణముగా తోటపని లాంటి బయటపనులు చేసేటప్పుడు కళ్ళకు గాగుల్స్ ధరించాలి. అవి కంటికి రక్షణగా ఉపయోగపడతాయి. అలాగే ఇంట్లో పనులు అంటే బూజు దులిపేటప్పుడు కూడా ఈ గాగుల్స్ ధరించాలి, లేకపోతే దుమ్ము ధూళి కళ్ళలో పడి కళ్ళకు హాని చేస్తాయి. అలాగే చీకట్లో నడిచేటప్పుడు కూడ చేతిలో ఏమైనా వస్తువులు ఉంటే జాగ్రత్త పడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here