[dropcap]కొ[/dropcap]న్ని సమయాలు
దుఃఖాన్ని వర్షిస్తూనే ఉంటాయి
మౌనం,
పొగమంచులా
మనసు చుట్టూ కప్పుకునే ఉంటుంది
బాధ,
గుండెలోంచి గొంతులోకి
అటునుంచి కళ్ళలోకి
ఆపై మళ్ళీ గుండెలోకి
అలా అలా అంతులేని
చక్కర్లు కొడుతూనే ఉంటుంది
బేలతనం,
బింకాన్ని చాటుచేసుకుని
ముఖంలో తొంగిచూస్తుంటుంది
జ్ఞాపకాలు,
పాతవేవో కొత్తవేవో తెలియకుండా
ఒకటి తరువాత మరొకటి వచ్చి
పరికించి పలుకరించి వెళుతుంటాయి
విషాదం,
అందేంత దూరంలో కూచుని
విచిత్రంగా విసుగ్గా గమనిస్తూ ఉంటుంది
విరక్తి,
మెల్లమెల్లగా దగ్గరకు వచ్చి
అంతా తాత్కాలికమే అని చెబుతూ
అనునయింపుల జ్ఞానబోధ చేస్తూంటుంది
ఒంటరితనం,
అన్నింటిపై అజమాయిషీ చేస్తూ
సమూహంలో కూడా
ఏకాంతాన్ని ఏర్పాటు చేస్తూ
వర్షిస్తున్న దుఃఖంలో తడిసిపొమ్మంటుంది
ఇది నిజం
అవును ఇదే నిజం
కాలం
కదిలినట్లు కనిపించనంతకాలం
ఆ కాలం
ముందుకు కదిలిందా
కదిలినట్లు అనిపించడం మొదలైందా
ముందు కొంతా, ఆ తర్వాత అంతా
అంతా అంతా మామూలే