[box type=’note’ fontsize=’16’] 02 అక్టోబరు 2020న గాంధీ జయంతి సందర్భంగా ఈ కవితని అందిస్తున్నారు గుండాన జోగారావు. [/box]
[dropcap]ఎ[/dropcap]న్నికల ముందు
సంక్షేమ పథకాల పేరిట
వేలకోట్ల తాయిలాలతో
ప్రజల్ని ప్రభావితం చేస్తూ
భరోసా… ఆసరా అంటూ
రుణమాఫీల ప్రకటనలతో
జనాలకు బద్దకపు ముద్దపప్పుతో
భోజనం పెట్టి సేదతీర్చే
నేతల ప్రలోభాల్ని గమనించి
మీరు సిగ్గుపడటం సహజమే…
పవిత్ర అసెంబ్లీ హాలులో
బూతుపురాణం పఠిస్తోన్న
నవనేతల వీరంగం చూసి
గోడపై పటంగా దర్శనమిచ్చే మీరు
సిగ్గుతో టపటపా కొట్టుకుంటూ
ఊడిపడి పారిపోవడానికి
చేసే ప్రయత్నం ఊహించినదే…
అహింసకు మారుపేరైన మీరు
ఖద్దరు వస్త్రధారులు
అధికారం లోకి రాగానే
“అడ్డంగా నడిరోడ్డులో నరికేస్తా”
అని రంకెలతో విజృంభిస్తూ
దాడులకు పాల్పడుతుంటే
మీరు తల దించుకోవడం…
మీ కళ్ళద్దాలు కన్నీళ్ళతో
మబ్బై మసకగా మారి
బాధగా మౌనంగా రోదించడం
మాకు స్పష్టంగా కనిపిస్తోంది…
బాపూ…
ఈ దేశానికి
ఉంటుందా ఉజ్జ్వల రేపు?!