[box type=’note’ fontsize=’16’] ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఎడారి విస్తరణ గురించి, ఆయా దేశాలు చేపడుతున్న నివారణ చర్యల గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]
[dropcap]ఎ[/dropcap]డారులు విస్తరిస్తూ పోతున్నాయని ఎంతోకాలంగా శాస్త్రజ్ఞులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఆసియాలో మూడవ వంతు, భారతదేశంలో రమారమి 50% భూభాగంలో ఎడారి లక్షణాలు కనిపిస్తున్నాయన్న శాస్త్రజ్ఞుల హెచ్చరికలు ఈనాటివి కాదు. ఆఫ్రికాలో 50% భూభాగం పరిస్థితీ అదే విధంగా ఉండగా, లాటిన్ అమెరికాకూ ముప్పు పొంచి ఉన్నదని వారి అధ్యయనాలు తేల్చి చెప్పాయి. పరిస్థితి అలాగే కొనసాగితే బంజర్లు, వ్యవసాయ భూములు సైతం ఎడారులుగా మారిపోయే ప్రమాదం కొట్టివేయలేనిది.
“350 మిలియన్లకు మించిన ప్రజలు పర్యావరణ బాధితులు. ప్రకృతితో మన అనుబంధాన్ని పునరుద్ధరించుకొని, భద్రతతో కూడిన భవిష్యత్తు ఏర్పాటుకై సన్నద్ధం కావలసిన సమయమిది.” ప్రఖ్యాత పర్యావరణవేత్త రష్మి మయూర్ ఆవేదనతో అన్న మాటలివి. గత శతాబ్ది చివరిలో ‘ఎడారి విస్తరణ’ను అరికట్టే చర్యలకు సంబంధించి ‘పారిస్’లో జరిగిన మూడు రోజుల సదస్సు (అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సదస్సులలో 5వది)కు హాజరయినప్పుడు జనాభా నియంత్రణ, భూమి సమర్థ వినియోగం, అడవుల పరిరక్షణ వంటి అంశాలతో బాటు ఆఫ్రికాతో బాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘ఎడారి విస్తరణ’ను పరిస్థితిని ‘ఎజెండా’లో చేర్చాలని ఆయన సూచించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ సలహాదారు హోదాలో ఆయన దాదాపు 84 దేశాల్లో పర్యటించి పర్యావరణ స్థితిగతులను మదింపు చేసి ఒక అవగాహనకు వచ్చిన వ్యక్తి. అయితే ఆయన జీవిత కాలంలో చేసి కృషి, సూచనలు – ప్రజలలో, అరుదుగానైనా కొన్ని ప్రభుత్వాలలో సైతం స్ఫూర్తిని నింపాయి. ఆ స్ఫూర్తి ఫలాలను చూసి ఆనందించడానికి ఆయన లేకపోవడం మాత్రం దురదృష్టం.
మనిషి తలచుకొంటే సాధ్యం కానిది ఏముంది?
1920 నుండి 2013 నాటికి ‘సహారా’ ఎడారి ఉత్తరం నుండి దక్షిణం వైపునకు రమారమి 10% విస్తరించినట్లు శాస్త్రజ్ఞుల అధ్యయనాలు తేల్చి చెప్పాయి. సహారా ఎడారికి దక్షిణం వైపున సూడాన్ సవన్నాల వరకు ఉన్న ప్రాంతాన్ని ‘సహెల్’ అంటారు. మాలే, ఛాద్ వంటి ప్రాంతాలాన్నీ నిరుపేదలు నివసించే ప్రాంతాలు. ఎడారి ఈ ప్రాంతాలకు విస్తరిస్తే భూసారం దెబ్బతిని పంటలు పండక కరువు కాటకాలు విజృంభిస్తాయి. రాగల విపత్కర పరిస్థితులను నివారించడానికి జరుపుతున్న కృషిలో భాగంగా –
ఎడారి విస్తరణను నిలువరించడానికై 4,750 మైళ్ళ విస్తీర్ణంలో ‘హరిత కుడ్యం’ నిర్మాణ కార్యక్రమం మొదలైంది. 2007 నుండి ఇక్కడ కోట్ల సంఖ్యలొ మొక్కలు నాటారు. ఈ మహా యజ్ఞానికి ‘ఆఫ్రికన్ యూనియన్’ నుండి నిధులు అందుతున్నాయి. బుర్కినా ఫాసోలో 1 కోటి 7 లక్షల మొక్కలు నాటారు. ఇది సుమారు 31,000 ఎకరాలకు సమానం. నైజీరియా అప్రమత్తమైన కారణంగా ఒక కోటి ఇరవై లక్షల ఎకరాలను రక్షించుకోగలిగింది. సెనెగల్, ఇథియోపియా ఇదే బాట పట్టాయి. భూసారం క్షీణించినా తట్టుకొని మనుగడ సాగించగల 50 రకాల మొక్కలను నాటడం, విత్తనాలను నాటడం జరిగింది.
పై చర్యలన్నిటితో స్థానికులకు ఉపాధి లభించింది. అనతికాలంలోనే వర్షపాతమూ పెరిగింది. స్థానికులకు అదనంగా సాగునేలా లభించింది. సునాయాసంగా కూరగాయల వంటి వాటిని వారు సాగు చేసుకోగలుగుతున్నారు. పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం నుంచి తూర్పున ఎర్ర సముద్రం వరకు లక్షింపబడిన ఈ ‘హరిత కుడ్యం’ ప్రాజెక్టు 2030 నాటికి పూర్తి కావాలన్నది ఆశయం. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపు 24 కోట్ల 70 లక్షల ఎకరాలు వ్యవసాయ యోగ్యంగా మారి అందుబాటులోకి వస్తాయి. మనిషి తలచుకొంటే సాధ్యం కానిది ఏముంది?