[dropcap]”మీ[/dropcap]రు నైట్ డ్యూటీ చేయక తప్పదు. రాత్రి 8 గంటల కల్లా వచ్చేయండి. డాక్టర్ గారూ!”
ఫోన్లో ఆర్.ఎం.ఓ గొంతు మర్యాదపూర్వకంగానే ఉన్నా ఆజ్ఞాపన లానే ఉంది.
“అంటే… అంటే… ” కొంచెం నసిగాడు డాక్టర్ శాంతి సాగర్ ఎండి.
“నా వయసు కొంచెం 60 ఏళ్లు దాటి ఉండటంవల్ల ఉద్యోగంలో చేరేటప్పుడే రిస్కు ఎక్కువ అని నైట్ డ్యూటీలు, ఇంటెన్సివ్ కేర్ డ్యూటీలు వేయడం లేదని మాటిచ్చారు కదా జగన్నాథ్ గారూ… అందుకని….”
డాక్టర్ జగన్నాథ్ వివేక్ హాస్పిటల్ ఆర్.ఎంఓ. అతని గొంతులో విసుగూ కోపం కూడా ధ్వనించాయి ఇప్పుడు.
“అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కదా సార్. ఇద్దరు డ్యూటీ డాక్టర్లు జలుబు, దగ్గు, జ్వరం రిపోర్ట్ చేశారు. ఏముంటుంది, వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇక మీరూ జూనియర్ డాక్టర్ గుణశేఖర్ ఇద్దరే మిగిలారు. అతని సాయం తీసుకోండి. కేసులు చాలా ఉన్నాయి తప్పదు.”
“ఓకే!” అన్నాడు నీరసంగా శాంతి సాగర్.
“జయంతీ!” పిలిచాడు భార్యని. “ఈరోజు నైట్ డ్యూటీ. ఐసీయూలో ఎవరూ లేరు అట. తొందరగా వెళ్తాను 7:30 కల్లా భోజనం రెడీ చెయ్!”
ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా భయం. “అమ్మో వద్దండీ!”
“తప్పదు జయంతీ!”
“అమ్మాయి కూడా ఫోన్ చేసింది నాన్నని డ్యూటీలు చేయవద్దని డబ్బు అవసరమైతే నేను పంపిస్తా అంది.”
ఒక్కగానొక్క కూతురు అమెరికాలో ఉంది. ఇక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. రోజుకు న్యూయార్క్ లోనే రెండు వేల మందికి పైగా చనిపోతున్నారని వార్తలు. నాన్నకి వయసు రీత్యా వైరస్ జబ్బు తట్టుకోవడం కష్టం.
లాక్‌డౌన్ మొదలైన నుంచే క్లినిక్ బందు చేశాడు. ఆదాయం లేదు. ఇంట్లో తన మీద ఆధారపడిన వయోవృద్ధురాలైన తల్లి కాక మానసిక వికలాంగుడైన పదహారేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నెలసరి ఖర్చులే 60 70 వేలు దాటుతాయి సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాడు. రిటైర్డ్ అయినాక వచ్చే పెన్షన్ సరిపోక ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు.
ఎక్కడో చైనాలో వూహాన్ నగరంలో పుట్టి ఏదో జలుబులాంటి వైరస్ అనుకున్నది భయంకరంగా వ్యాపించి ఇప్పుడు భారతదేశంలో ఈ చిన్న పట్టణానికి కూడా వచ్చేసింది మూడు నెలల్లోనే. హఠాత్తుగా జ్వరం, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ పడిపోవటం, చనిపోవడం… ఒకరినుంచి ఒకరికి అతి వేగంగా ఉమ్మి కణాలు అంటే డ్రాప్‌లెట్స్ లేక ఏరోసోల్ ద్వారా వేగంగా వ్యాపించే మహమ్మారి. ఊపిరితిత్తులలోనే కాక రక్తాన్ని కూడా గడ్డకట్టించి ఆక్సిజన్ లేకుండా చేసి నిమిషాల మీద మనిషిని హతమార్చే ఆర్.ఎన్.ఎ వైరస్… ప్రపంచాన్నంతా గడగడ వణికిస్తున్న పాండమిక్.
అందరి జీవితాలనీ మార్చేసింది. ముఖాలకు ముసుగులు వేసింది. చేతులకి తొడుగులు తొడిగింది. ఇళ్లల్లో బందీలుగా కూర్చోబెట్టింది.
ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులను, షుగర్ పేషెంట్లనీ మరింత క్రూరంగా హతమారుస్తూ ఉంది.
నువ్వు బయటకు వస్తే నేను నీతో లోపలికి వస్తా. నువ్వు లోపల ఉంటే నేను బయట ఉంటా. ఎవరో జానపద గాయకుడు పాడిన పాటలో లాగా మనిషిని బయటకు వస్తే అంటుకుని హతమారుస్తుంది. లోపలే ఉంటే ఆ వ్యక్తికి ఆదాయం లేక జీవనాధారం లేకుండా చేసి చంపుతుంది. ఎలాగైనా ఇబ్బందే.
నెల తిరిగేసరికి లక్ష రూపాయలు కావాలి. కుటుంబ బాధ్యతలు తీరాలంటే అంత డబ్బు అవసరం. ఎంత డాక్టర్ అయినా ఇంట్లో పెద్దలకీ జబ్బుతో ఉన్న కొడుకుకీ మందుల ఖర్చులు ఏసీ టీవీ ఎలక్ట్రిక్ బిల్లులు కట్టక తప్పదు. క్లినిక్ అద్దె కట్టక తప్పదు.
కానీ ఆదాయం నాలుగు నెలలుగా లేదు రోగులు రావడం లేదు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిర్మానుష్యమైన పగళ్ళూ రాత్రుళ్లు. జంతువులు మాత్రమే తిరిగే రహదారులు.
కూతురు డబ్బు పంపిస్తానని అంటున్నా, ఆత్మాభిమానం అడ్డొస్తుంది. దేహీ అని ఎవరినీ ఇంతవరకూ అడగలేదు..కూతురయినా అడగడు.
పైగా తనకి ఈ వైరస్ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసు. డిసెంబర్ నుంచి వూహాన్‌లో అది బయట పడిన అప్పటినుంచి వివిధ మెడికల్ జర్నల్‌లలో వార్తలలో వ్యాసాలలో అది ఎలా పెరిగి పెరిగి వర్ధమానం అవుతోందో, ఏ మందులు వాడుతున్నారో గమనిస్తూనే ఉన్నాడు. అజిత్రోమైసిన్ ,డాక్సిసైక్లిన్ ,ఐవర్మేక్టిన్ క్లోరోక్విన్ , రేండేస్వీర్ , డేక్సామితాసోన్ , ఏంటీకోయాగ్యులంట్స్, ఇలా రోజుకొక మందు పనిచేస్తుందని వైద్యశాస్త్రంలో కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి. అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఇంటర్నెట్లో వార్తలలో మెడికల్ జర్నలల్లో కొత్త కొత్తగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఏదీ సరిగ్గా పని చేయడం లేదు. ఆ మహమ్మారి తగ్గలేదు. ఇంకా ప్రపంచంలోని దేశాలన్నింటికీ విస్తరించింది, వేల మంది ప్రాణాలను బలిగొంటోంది. దానికి విచక్షణ లేదు, ధనిక దేశాల్లో పేద దేశాల్లో కూడా వైద్య పురోగతితో సంబంధం లేకుండా వ్యాపిస్తూనే ఉంది.
శాంతి సాగర్‌కి తన మీద తనకి నమ్మకం ఉంది.
నేను క్వాలిఫైడ్ ఫిజీషియన్‌ని. దేనికైనా చికిత్స చేయగలను. ఎంతైనా జాగ్రత్తలు తీసుకోగలను. ఎందుకు భయపడాలి? అనుకుంటాడు. క్రమంగా కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులు కూడా రంగంలోకి దిగాయి వాటికి కరోనా చికిత్సకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పేపర్లలో వార్తలు చూసి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆరు లక్షల దాకా జీతం ఇస్తారట, ఐదు నెలలు పని చేస్తే చాలు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవచ్చు. ఈ లోపల వ్యాక్సిన్ వచ్చేస్తుంది.
ఇంటర్వ్యూ.
“డాక్టర్! మీ వయస్సుచాలా ఎక్కువ. రిస్కు తీసుకోవద్దు.”
“నేను ఎండి లో గోల్డ్ మెడలిస్టుని. చాలా అనుభవం ఉంది.”
“ఏదైనా మిమ్మల్ని ఐసీయూలో వెయ్యలేం. ఓపీ చూడండి. జనరల్ కేసులే చూడండి. వైరస్ కేసులు కూడా తక్కువ చూడండి. ఒక లక్షా 50 వేల జీతం వరకు ఇవ్వగలం అంతే.”
“ఎండి డిగ్రీ ఉన్న వారికి ఆరు లక్షల జీతం వరకు ఇస్తాము అని పేపర్లో రాశారు కదా. మాకు చాలా రిస్కు కూడా ఉంది కదా?”
ఇంటర్వ్యూ చేసే ఆర్.ఎమ్.ఓ నవ్వాడు.
“పేపర్లు ప్రస్తుతం అభూతకల్పనలు రాస్తున్నాయి డాక్టర్ సాబ్. జోకులు వేస్తున్నారా? మీకు అంత జీతం ఇవ్వటం సాధ్యం కాదు. పైగా మీరు ఐసియూ వార్డులో పని చేయరు.”
“నేను… నేను వెళ్ళగలను!”
“అవసరం వచ్చినప్పుడు చూద్దాం! అప్పుడే డ్యూటీకి, పి.పి.ఈ. కిట్లు కాక రోజుకి మూడు వేలు అదనంగా ఇస్తాం.”
ఆలోచనలో పడ్డాడు అమ్మాయి అమెరికా నుంచి ఫోన్ చేసి అసలు బయటికే వెళ్ళద్దు అంటోంది. భార్య ఏమీ చెప్పకపోయినా ఆమె కళ్ళల్లో భయం. మీ వల్ల మా అందరికీ రిస్క్ కదా…
అతని అహం దెబ్బతింది. అంటే నాకోసం కాదన్నమాట. వాళ్లకి నా వల్ల జబ్బు వస్తుందని భయమా?
తన అనుభవంలో ఎన్నో చూశాడు.
క్షయ టెటనస్ అనగా ధనుర్వాతం, కలరా అనగా అతిసారం, ఈ మధ్య వచ్చిన ఎయిడ్స్ స్వైన్ ఫ్లూ డెంగ్యూ మొదలైన ఎన్నో అపాయకరమైన వ్యాధులన్నీ ఎదుర్కొని చికిత్స చేశాడు. కొంతమందికి ఊపిరితిత్తులలోకి ట్యూబ్ వేయటం వెంటిలేటర్ మీద చికిత్స చేయటం కూడా చేసిన అనుభవం ఉంది. రిటైర్ అయినాక ఇప్పుడు తన శరీరం కొంత నెమ్మదించింది కానీ…
“నెలకి రెండు లక్షలు ఇవ్వండి!” అని బేరం ఆడాడు. చివరికి లక్షా 80 వేలకు వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ “అవసరం వస్తే ఐసీయూలో డ్యూటీ చేయాలి” అని షరతు. “హాస్పిటల్ లోనే ఉండిపోండి. అది బెటర్. ఇంటికి వెళ్లకుండా ఇక్కడే భోజనం అదీ ఏర్పాటు చేస్తాం.” అన్నారు.
మనం భయపడాల్సింది భయానికే అన్న విన్‌స్టన్ చర్చిల్ మాటలు గుర్తుకు వచ్చాయి. సరే అన్నాడు
ఇప్పటిదాకా ఒక నెల రోజులు బాగానే గడిచాయి. ఐసీయూకి వెళ్లకుండా అవుట్ పేషెంట్ లోనే జాగ్రత్తగా మాస్కులు గ్లౌవ్స్ లు తొడుక్కుని పనిచేసి ఇంటికి వెళ్తున్నాడు. వెళ్లి బట్టలు మార్చుకుని స్నానం చేసి వేరే గదిలో ఉంటున్నాడు. అక్కడే భోజనం నిద్ర.
ఇక ఇప్పుడు తప్పదు. టైం వచ్చింది.
ఒక బ్యాగ్‌లో బట్టలన్నీ సర్దుకున్నాడు.
“వారం రోజుల దాకా ఇంటికి రాను. నేను ఐసీయూలో కరోనా డ్యూటీ లో ఉండాలి. ఫోన్ చేస్తూ ఉంటాను. డ్యూటీ లో ఉండి ఇంటికి వస్తే మీకు చాలా రిస్కు.”
భార్య కళ్ళలో చాలా భయం. కన్నీళ్లు.
“జాగ్రత్తగా వెళ్ళిరండి!”
ఆ రోజు రాత్రి 8 గంటలకి డాక్టర్ శాంతి సాగర్ నైట్ డ్యూటీలో ప్రవేశించాడు. అతనితో బాటు జూనియర్ డాక్టర్ గుణశేఖర్ కూడా ప్రవేశించాడు.
కనిపించని శత్రువుతో యుద్ధం ప్రారంభమైంది.
***
ఇంటెన్సివ్ కేర్ ముందున్న డ్రెస్సింగ్ రూమ్‌లో హ్యాండ్ వాష్ చేసుకుని పి.పి.ఈ కిట్ ధరించి సిద్ధం కావటానికి అరగంట పడుతుంది. తల మీద హెడ్ కవర్, చేతులకు గ్లౌజ్ నుంచి పూర్తిగా ఒళ్లంతా సూట్లో దిగిపోయి చివరికి బూట్లకు కూడా మళ్లీ తొడుగులు ధరించి మాస్కులు రెండు, కళ్ళకి గాగుల్స్, ఆ పైన ఫేస్ షీల్డ్. అంగారక గ్రహం మీద దిగిన ఆస్ట్రోనాట్స్ లాగా తయారయ్యారు. లోపలికి వెళ్తే మళ్లీ పొద్దున ఏడు గంటల దాకా బయటకు రాలేరు. వయసొచ్చిన శాంతి సాగర్‌కి కొంచెం టాయిలెట్ వెళ్ళటం ఇబ్బంది. అందుకనే నీళ్లు తాగడం లేదు. డిన్నర్ కూడా లైట్ గా చేశాడు.
నలుగురే పేషెంట్లు ఉన్నారు. వారి పరిస్థితి స్థిరంగానే ఉంది. పిపిఇ కిట్ థరించిన ఒక నర్స్ అందరికీ ఇంజెక్షన్లు ఇచ్చి టెంపరేచర్ చూస్తోంది. పిలిస్తే ఒక వార్డు బాయ్ వస్తాడు. అందరికీ ఆక్సిజన్ ప్రమాణాలు చూస్తూ లేబరేటరీ రిపోర్టులు తనిఖీ చేస్తూ ఎవరికి సీరియస్ అవుతుందో నోట్ చేసుకుంటూ పని చేస్తుంటే తెల్లవారింది. 4:30.ఎ ఎమ్.
“సార్! మీరు వెళ్లిపోండి శాంతి సాగర్ గారు! నేను చూసుకుంటాను. అంతా స్టేబుల్ గానే ఉంది.” అన్నాడు గుణశేఖర్. నర్స్ గూడా అతని వంక జాలిగా చూసింది.
“ఆ బెడ్ నెంబర్ త్రీ లో ఉన్న డయాబెటిక్ పేషెంట్‌కు, ఐఎల్ సిక్స్, డీ డైమర్ ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త. హఠాత్తుగా ఆయాసం రావచ్చు!” అని బయటికి నడిచాడు శాంతి సాగర్.
నిజంగానే అతనికి బాత్రూంకి పోవలసి ఉంది. వయసు వల్ల ఏదో ఒక ఇబ్బంది. ఇకనుంచి డైపర్స్ పెట్టుకోవాల్సి ఉందేమో అనుకున్నాడు.
క్రమంగా రోజులు గడిచిపోతున్నాయి. డాక్టర్ గుణశేఖర్ ఎంబిబిఎస్ డాక్టర్ శాంతి సాగర్ ఎండి ఇద్దరు రోజు నైట్ డ్యూటీ చేస్తున్నారు. యువకుడైన గుణశేఖర్, పెద్ద వాడైన శాంతి సాగర్ అంటే కొంచెం భక్తిగా ప్రేమగా ఉండేవాడు. గురువులా గౌరవించేవాడు.
“సార్! మీరు కూర్చోండి! నేను రౌండ్లు చేస్తాను. మీరు కేస్ షీట్లు రాయండి. చాలు. ఒకసారి ఈ డ్రెస్ వేసుకుంటే మళ్ళి పొద్దున్న దాకా తీయలేం! మీకు కష్టం!” అనేవాడు. తెల్లవారుతూనే “సార్! మీరు వెళ్లిపోండి” అని బయటకు పంపేవాడు.
తనకు వచ్చిన విజ్ఞానమంతా గుణశేఖర్‌కి చెప్పేవాడు శాంతి సాగర్. అయితే రోజురోజుకీ పరిస్థితులు మారిపోతున్నాయి. కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఆ చిన్న ఊర్లో ఉన్న రెండు పెద్ద హాస్పిటలల్లో అది ఒకటి కాబట్టి అన్నీ సీరియస్ కేసులే వస్తున్నాయి. మరీ సీరియస్‌గా ఉన్నవి హైదరాబాద్ పంపిస్తున్నారు. అందరికీ ఆక్సిజన్ పెడుతున్నారు, వైరల్ మందులు ఇస్తున్నారు. ఒక ఇద్దరికి వెంటిలేటర్ దాకా వెళ్ళింది.
కానీ ఒక రాత్రి మాత్రం చాలా అనుకోని విధంగా…
రెండో బెడ్ లో ఉన్న ముసలి స్త్రీకి కోవిడ్ వైరస్ జబ్బు కాక మూత్రపిండాల వ్యాధి షుగర్ వ్యాధి వల్ల వచ్చిన కీటోసిస్ అనే వ్యాధి ముదిరింది. దానివల్ల వాంతులు అవుతున్నాయి. తెల్లవార్లూ ఆమెకి ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇచ్చి సెలైన్ బాటిల్స్ ను ఎక్కిస్తున్నారు. ఆమె తన ఊపిరితిత్తుల్లోని endotracheal ట్యూబ్ బలవంతంగా పీకేసుకుంది. కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది.
దగ్గరికి పరిగెత్తాడు శాంతి సాగర్.
“మీరు వద్దు సార్” అని గుణశేఖర్ హెచ్చరిస్తూనే ఉన్నాడు.
అయినా వెళ్ళాడు. ఆ పేషెంట్ భళ్ళున వాంతి చేసుకుంది. అదే సమయంలో ఆ హడావిడికి గుణశేఖర్ ముఖం మీద వున్న ఫేస్ షీల్డ్ ఊడిపోయింది. వాంతులతో అతని ముఖం అంతా తడిసిపోయింది. జీర్ణ రసాలు పైత్య రసాలు ఆకుపచ్చగా పచ్చగా అతని ముఖం కళ్ళూ, ముక్కు మీద పడ్డాయి అదే సమయంలో నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చింది. శాంతి సాగర్ మీద కూడా కొన్ని వాంతి లోని ద్రవాలు పడిపోయాయి.
“మీరు వెళ్ళి అర్జెంటుగా కడుక్కోండి, సార్!” అరిచింది నర్స్.
ఓ ! నో! నో! ఆమెకి కార్డియాక్ అరెస్ట్ వస్తోంది.
డిఫిబ్రిలేటర్‌తో షాక్ ఇచ్చారు. సోడాబైకార్బ్ ఇంజెక్షన్, ఎడ్రినలిన్ ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. కార్డియక్ మసాజ్ చేశారు. శాంతిసాగర్ ఆమెని రక్షించడానికి పనిచేస్తూనే వుండిపోయాడు. అతని వెనకే గుణశేఖర్.
పొద్దున్నే ఏడు గంటల పదినిమిషాలకి ఆ మహిళారోగికి గుండె ఆగిపోయింది. కేస్ షీట్ లో వివరాలు రాసి ఇద్దరు నీరసంగా బయటికి డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చారు.
ఒక్క సారి నిస్సత్తువ వారిని ఆవహించింది. కిట్లు తీసి విసిరేశారు. ముఖం, చేతులు, ఒళ్ళంతా ఏంటీసెప్టిక్ సోప్‌తో కడిగి కడిగి పక్కన వున్న షవర్ రూం లో తలస్నానం చేసి చేసి…
ఇక సంఘటనలు వేగంగా జరిగి పోయాయి.
మామూలు బట్టలతో బయటకు వచ్చి ఆర్ఎమ్ఓ కి డెత్ రిపోర్ట్ ఇచ్చి పేషెంట్ బంథువులకి మరణవార్త ప్రకటించడం, వారి రోదనలు. కోవిడ్ పేషెంట్ మృతి ఒక భయంకర విషాదం. మృతశరీరానికి స్పెషల్ పాకింగ్, వేరుగా వుంచడం,వేరే స్మశానవాటికలో అంత్యక్రియలు…
అప్పుడు కానీ వారిద్దరికీ వాస్తవ ప్రపంచం తెలియలేదు.
“ఇద్దరం ఘోరంగా వైరస్ లోడ్‌తో ఇన్ఫెక్ట్ అయ్యాము.”
“ఎక్స్ పోజ్డ్!!! ఇక ఇక్కడే వుండాలి వారంరోజుల దాకా…”అన్నాడు గుణశేఖర్ భయం భయం గా…
***
20 రోజులు గడిచాయి
దేశమంతా ఇంకా లాక్‌డౌన్ లోనే ఉంది. ఎన్నో రకాల సమస్యలు హృదయవిదారకమైనవి. ఆయాసం రావటం ఆక్సిజన్ లేక మరణాలు సంభవించడం. ఉపాధి లేని వలస కూలీలు వారి విషాద గాథలు. వారి పెట్టెలు సంచులు పిల్లల్ని నెత్తిన పెట్టుకుని వేల మైళ్ళు స్వస్థలాలకు కాలినడకనే పోతున్న దృశ్యాలు. మానవత్వం నశించి ఒక వర్గం మీద మరొక వర్గానికి వైరస్ వ్యాప్తి చేస్తున్నారు అని కలిగిన అనుమానాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం.
ఆఖరికి న్యూస్ పేపర్ల మీద, ఇంట్లో పని మనిషి మీద, కరెన్సీ నోట్ల మీద, తలుపు గడియల మీద లిఫ్ట్ బటన్‌ల మీద కూడా అనుమానం.
జబ్బు వచ్చిన వారిని ఇతరులు పక్కన ఇళ్ళవారూ వెలివేసిన వారిగా చూడటం. చనిపోయిన కరోనా వ్యాధిగ్రస్తుల వారికి అంతిమ సంస్కారం చేయడానికి కూడా ఎవరూ రాకపోవడం, వారిని స్మశానాల దగ్గర అడ్డుకోవడం మరింత భయంకరమైనది. తరుచుగా జరుగుతోంది. ఎవరైతే వ్యాధిని ముందునుంచి ఎదుర్కొన్నారో ఆ డాక్టర్లే వైరస్ ధాటికి బలైపోవడం, డాక్టర్లలో, నర్సులలో ఆస్పత్రిలో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులలో అందరిలో వ్యాధి ఎక్కువ అవడం మరణాలు సంభవించడం… ఇది ఒక కొత్త సూక్ష్మజీవి. మనిషి తన వైద్య విజ్ఞానంతో నిరోధించలేకపోయిన అంటువ్యాధి.
టీకాలు, మందులు లేని కొత్త వ్యాధి. ఇద్దరికీ తెలుసు, తమకి ఆ వ్యాధి రాక తప్పదు అని.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ ఆఖరిరోజు ఆ రోగి వాంతి తమ మీద పడిందని, వైరస్ తమ శరీరంలో ప్రవేశించిందని బాగా తెలుసు.
ఇంట్లో వాళ్లకి చెప్పలేదు. హాస్పిటల్‌లో కట్టడిలో ఉండిపోయారు.
ఫోన్ చేసి త్వరలో వచ్చేస్తామని చెప్పటం, వీడియో కాల్స్‌లో శాంతి సాగర్, గుణశేఖర్ తమ తమ కుటుంబాలతో మాట్లాడటం. లోపల భయాన్ని దాచుకుని పైకి నవ్వటం…
అంతే! ఎన్ని మందులు వాడినా ఆరో రోజుకి దగ్గు జ్వరం ఆయాసం మొదలయ్యాయి.
ఆక్సిజన్ మాస్క్, ఇంజక్షన్లు, నిర్మానుష్యమైన ఐసీయూలో ఇంత వరకు తామే చికిత్స అందించిన రోగుల పడకల పక్కనే వారు కూడా రోగులుగా మారిన దృశ్యం. కరోనా ఐసోలేషన్ వార్డులోకి ఎవరూ రారు. వచ్చినవారు కూడా ముసుగులలో లోనే వస్తారు. ఆ తర్వాత ఆ రావడం కూడా లేదు. చాలామంది సెలవులు పెట్టి వెళ్లిపోయారు. ఒక నిర్మానుష్య ప్రపంచంలో పరిచయం లేని ముసుగు మనుషుల పరీక్షల మధ్య కాలం గడపాలి . ఇంటికి ఫోన్ చేస్తూనే ఉన్నారు
మానిటర్‌లో బీప్ బీప్ శబ్దాలు… పడిపోతున్న ఆక్సిజన్ ప్రమాణాలూ తప్ప అంతా నిశ్శబ్దం. యుద్ధంలో శత్రువుతో ఓడిపోతున్న శరీరాలు…
***
అర్ధరాత్రి ఒక ఏంబులెన్స్ లైట్లు కూడా ఆర్పుకుని ఆ చిన్న ఊర్లో దూరంగా ఎక్కడో ఉన్న స్మశానానికి ఉన్న నల్లటి వెనుక గేటు దగ్గర ఆగి ఉంది.
డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పూర్తిగా పిపీయీ కిట్ ధరించి గుర్తు పట్టలేకుండా ఉన్నాడు. ఏంబులెన్స్‌లో ఉన్న ప్యాకేజీలో శవం కరోనా వ్యాధి మృతుడిది!
ఆ వైరస్ వ్యాధితో చనిపోయిన మృతుడిని పగలు తీసుకువస్తే దగ్గర ఇళ్లల్లో ఉన్న జనం కర్రలు రాళ్లతో ఏంబులెన్స్ మీద దాడి చేశారు.
“చనిపోయిన అతను ఒక డాక్టర్ బాబూ! పాపం వైద్యం చేస్తూ చనిపోయాడు. దయతలచండి!” అని వేడుకున్నా వినలేదు.
“మాకూ ఆ రోగం వ్యాపిస్తుంది. శవం ఇక్కడ పాతిపెట్టడానికి వీలు లేదు!” జనం ఒప్పు కోలేదు.
తిరిగి తీసుకు వెళ్ళి మరొక దూరంగా ఉన్న స్మశానం దగ్గరికి వచ్చాడు. మధ్యాహ్నం ఇద్దరు వార్డ్ బాయ్‌లూ, ఇద్దరు మున్సిపల్ వర్కర్స్ సహాయంగా వచ్చారు. ఎక్కువ డబ్బులు ఇచ్చినా సరే రావడానికి సుముఖంగా లేరు. వారిని అతికష్టం మీద పద్దెనిమిది వేలు రూపాయలు ఇస్తాను అని తీసుకువచ్చాడు. ఆ జనాన్ని చూసి ఆ గొడవ కర్రలు రాళ్లు విసరడం చూసి ఇక మా వల్ల కాదు అన్నారు.
పూర్తిగా డ్రెస్ లో ఉన్న డ్రైవర్ గుర్తు పట్టలేకుండా ఉన్నాడు. ఏంబులెన్స్ లోనికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి జడి వాన కురుస్తూంది. చనిపోయిన డాక్టర్ ఇంట్లో అతని కుటుంబం అంతా అతని ఫోటో దగ్గర దీపం వెలిగించి ఏడుస్తున్నారు. ఏది ఏమైనా మరణం మాత్రం నిజం. శరీరానికి అంతిమ సంస్కారం అతని ధర్మం ప్రకారం ఖననం చేయవలసిన అవసరం మాత్రం నిజం.
“ఇది నా విధి. కర్తవ్యం. అతనికి సగౌరవంగా అంతిమ సంస్కారం జరగాలి.” ఆ రాత్రి గోడ వెనుక నీడల్లో నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. భయం భయంగా ఒక పాస్టర్ చేతిలో చిన్న ఎర్ర పేజీల పుస్తకం పట్టుకుని నిలబడ్డాడు. అందరూ గబగబా ప్యాకింగ్ చేయబడి, కేవలం ముఖం మాత్రమే కనిపిస్తున్న శరీరాన్ని నాలుగువైపులా పట్టి మోసుకుని లోపలికి చీకట్లో వెళ్ళిపోయారు. సమాధుల మధ్య ఇంకా దూరంగా ఎవరూ చూడలేని చోట చక చకా ఆరడుగుల లోతు గొయ్య తవ్వసాగారు. వయోవృద్ధుడైన డాక్టర్ శాంతి సాగర్ కూడా పారతో తవ్వి మట్టి తీయడంలో సాయం చేయ సాగాడు.
వాన పడుతూనే ఉంది. తడిసిపోతూనే ఉన్నారు. గబగబా తలాకాస్త మట్టి సమాధిలో వేశారు. పాస్టర్ మెల్లని గొంతుతో ప్రార్థన చేయసాగాడు.
“పరలోకమందున్న నా ప్రభువా నేను మంచి యుద్ధములు చేసితిని.నా ధర్మమును నిర్వర్తించితిని.
నన్ను మన్నించి నీ నివాసమునకు తీసుకొని పొమ్ము!”
వాన మరింత కుంభవృష్టి లోకి మారింది.
“ఆమెన్…” ప్రార్థన ముగిసింది.
60 ఏళ్లు పైబడిన శాంతి సాగర్ దుస్తుల నుంచి నీరు కారుతుండగా బయటికి నడిచాడు.
ఇది కాకతాళీయం మాత్రమే. నిజానికి తాను ఆ బ్యాగ్ లో ఉండాల్సింది! బతకడం తన అదృష్టం మాత్రమే. యువకుడైనా మరణించటం గుణశేఖర్ దురదృష్టం. ఎవరికి ఇవ్వాల్సిన నోట్లకట్టలు వారికి చేరాయి. ఏంబులెన్స్ కదిలింది. తనతో కలిసి పని చేసిన యువ డాక్టర్ కోసం డ్రైవర్‌లు లేక ఎవరూ రాక పోతే తానే ఏంబులెన్స్ నడుపుకుంటూ వచ్చాడు శాంతి సాగర్. అతి గోప్యత కోసం కదులుతూనే అతివేగంగా ఆ వీధి లోంచి హెడ్ లైట్స్ లేకుండా బయటపడ్డాడు. ఎక్కడ ఏ వీధిలో జనం అడ్డుపడి కొడతారో అన్న భయంతో…
అనేక వ్యాధులు చికిత్స చేసిన యోధుడు అతను. వయసు రీత్యా తనకే కరోనా జబ్బు ముందు అంటుకుంటుందని మరణం తప్పదనీ భావించాడు. కానీ విధి మరోలా చేసింది.
టెస్ట్ రిజల్ట్ వచ్చిన రోజు డాక్టర్‌లు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. గుణశేఖర్ పాజిటివ్. శాంతి సాగర్ నెగటివ్. మరోసారి చేసినా అంతే రిజల్ట్ వచ్చింది.
“మై బ్రదర్! నేను నీతోనే ఉంటాను చివరిదాకా.” చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు శాంతి సాగర్.
నిర్మానుష్యమైన హాస్పిటల్‌లో ఎవ్వరూ లేని అర్ధరాత్రులు. కేవలం ఒక నర్స్ వార్డు బాయ్ సాయంతో చికిత్స చేశాడు. మిగిలిన పేషెంట్లు హాస్పిటల్‌కి వస్తున్నా తాను పాజిటివ్ అని చెప్పి ఐసోలేషన్ వార్డులోనే ఒకపక్క ఉండిపోయాడు. గుణశేఖర్‌కు ఉబ్బసం ఉంది. స్థూలకాయం ఉంది. అందుకే త్వరగా వైరస్ వ్యాప్తి వచ్చింది. కానీ చిన్న వయసు అతనికి. తనకి వయసు ఉంది కానీ ఆరోగ్యం సరిగానే ఉంది. బహుశా ఇతని సేవ కోసమే తాను బతికి ఉన్నాడేమో.
ఆంబులెన్స్ హాస్పిటల్ దగ్గర ఆగింది. విజేత డాక్టర్ శాంతి సాగర్ తన ధర్మం నెరవేర్చిన తృప్తితో డ్యూటీ రూమ్ వైపు నడిచాడు. మరొక ఐదు రోజులలో తన కట్టడి (ఐసొలేషన్,) ముగుస్తుంది.
ఫోన్ చేశాడు మొబైల్ నుంచి ఇంటికి.
“జయంతీ! సక్సెస్. గుణశేఖర్‌కి సగౌరవంగా నేనే స్వయంగా వీడ్కోలు చెప్పాను. నాలుగు రోజుల్లో వచ్చేస్తాను. కరోనా డ్యూటీ కూడా ముగిసింది. ఇక చెయ్యను.”
ఆమె గొంతులో కన్నీళ్లు పూడిపోయి స్వరం గద్గదికం గా వస్తోంది.
“ఏమండీ! త్వరగా వచ్చేయండి! ఇక డ్యూటీ వద్దు! మీరే విజేతలు! ఇప్పటికైనా ఇంటికి రండి! ఎలాగైనా బ్రతకగలం. డబ్బులు ఎందుకు.”
శాంతి సాగర్ అన్నాడు “తప్పు జయంతీ! ఈ యుద్ధంలో ఎవరూ విజేతలు కాదు ఎవరూ పరాజితులు కాదు. ఇదొక దుర్భరమైన కొత్త పరిస్థితి. అంతే. అందరం యోధులమే. ఇదంతా అంతుతెలియని మహమ్మారి సృష్టించిన విచిత్రం అయిన పరిస్థితి. నేను విజేతని కాదు. నా విధి నిర్వహించాను. అంతే.”
“అవును! నిజంగా నాకు కూడా గర్వంగా ఉంది మిమ్మల్ని చూసి!”
వర్షం ఇప్పుడు ఆగింది.
త్వరలో మబ్బులు తొలగి స్వచ్ఛమైన భానూదయం అవుతుంది.