[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 38వ భాగం. [/box]
[dropcap]ప[/dropcap]ది నిమిషాలు జీపునుండే ప్రసాద్, మోహన్, ఆ బూడిదను, కాలిపోయిన వస్తువులను చూశారు. ఎవరూ వాటి గురించి ఒక మాట కూడా అనలేదు.
ప్రసాదుని మ్యూజియమ్ దగ్గిర విడిచి పెట్టి వాళ్లు ముగ్గురూ హిల్ కాలనీ వెళ్లిపోయారు.
రమారమి పది గంటలకు ఛీఫ్ ఇంజనీరు ఆఫీసుకు జీపు చేరుకుంది. కొద్ది సేపటిలో ఉద్యోగులు రావడం మొదలు పెట్టారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు రాలేదు. అతను మాచర్ల వెళ్లాడు. సాయంకాలానికి తిరిగి వస్తాడు. సాధారణంగా పొరుగువాళ్లకి ఇంటి తాళం ఇచ్చి వెళ్తాడు.
జీపును సుబ్రహ్మణ్యేశ్వరరావు ఇంటికి నడిపించారు. తాళం పొరుగు వాళ్లనుండి తీసుకొని తలుపు తీశారు.
అది రెండు పడక గదుల యూనిట్. అన్ని హంగులూ ఉన్నది.
కొండలు ఒక పడక గదిలోకి బాగా కనిపిస్తాయి. నల్లమలై శ్రేణి – ఎత్తైన కొండలు – పల్లపు ప్రదేశాలు – రమణీయంగా కనిపిస్తున్నాయి. ఆ గదిలో, కిటికీ దగ్గర, నులక మంచం ఒకటుంది. దానిపై జంబుకానా పరచి ఉంది. జావా పక్క దులిపి, తలగడ సరిచేస్తే మోహన్ దానిమీద నీరసంగా పడుక్కున్నాడు.
జావా వంటింట్లో బొగ్గుల కుంపటి ముట్టించింది. వంట సామాన్లు, వంటకు కావలసిన పప్పులు మొదలైన సరంజామా ఉంది. కాఫీ తయారు చేసి కప్పుతో మోహన్‌కి ఇచ్చింది. మెగ్యా కాఫీ తాగాక బజారుకు పోయి కూరలు, పెరుగు కొని తెచ్చాడు.
కాఫీ తాగి పడుక్కున్న వాడు, ఒంటి గంటకు నిద్రలేచాడు మోహన్. దండెం మీద నున్న తువాలు చుట్టుకొని స్నానం చేశాడు. తిరిగి తాను విడిచిన బట్టలే తొడుక్కున్నాడు.
జావాకు వంట బాగా నేర్పింది శశికళ. చాలా బాగా జావా వండింది. గదిలో టేబిలు మీద, ఆకులో వడ్డించింది. పప్పు, కూర, సాంబారు, పెరుగు చేసింది. నిన్నటి నుండి తిండిలేని మోహన్, మితి తప్పకుండా భోజనం చేశాడు. తరువాత జావా, మెగ్యా భోజనాలు చేశారు. ఆ దంపతులిద్దరూ రెప్పపాటు లేకుండా మోహన్‌ని, గడచిన రాత్రంతా చూసుకున్నారు. ఇప్పుడు అతను కొంచెం దారిలో పడిన తరువాత ఇద్దరూ వీథి వరండాలో పడుక్కున్నారు.
మోహన్‌కి నిద్ర రాలేదు.
అతను ఆలోచిస్తున్నాడు.
గడచిన దినం బహుళ అష్టమి.
వైశాఖ బహుళ చతుర్దశి నాడు సెలీనా తనకు కనిపించి, విజయపురి అంతా చూపించి ఇక్ష్వాకు రాజుల చరిత్ర చెప్పింది. నిన్నటి తిథి ఆషాఢ బహుళ అష్టమి. రమారమి ఎనిమిది వారాలు గడిచాయి. శశికళ వెళ్లిపోయి ఈ కాలమంతా తాను యాంత్రికంగానే పనిచేస్తున్నాడు. ఆమె గురించి ఆలోచించడానికి కూడా తీరుబాటు లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆమెను ఎలా మరచిపోకుండా ఉండగలడు?
సాయంకాలం ఆరు గంటలకి సుబ్రహ్మణ్యేశ్వరరావు మాచర్ల నుండి ఇంటికి వచ్చాడు.
వీధి వరండాలో మెగ్యా కూర్చున్నాడు. లోపల జావా, పాత్రలు తోముతున్నది. తన పడక గదిలో మోహన్ పడుక్కున్నాడు.
సుబ్రహ్మణ్యేశ్వరరావుని చూడగనే మోహన్ మంచం మీద లేచి, కూర్చున్నాడు. ఉబ్బిన అతని కళ్ళను, లోతుకు పోయిన దవడలను, పెరిగిన గడ్డాన్ని చూసి రావు చాలా ఆశ్చర్యపోయాడు. మోహన్‌కు దగ్గిరగా కుర్చీ లాక్కొని అతను అడిగాడు.
“ఏమి జరిగింది? ఏదో గొప్ప ఘోరం జరిగినట్లు కనిపిస్తున్నది. ఆఫీసులో పని హెచ్చవడం చేత రమారమి నేను లోయకు రాలేకపోయాను. శశికళ ఢిల్లీ వెళ్లిపోయారని, మీరొక్కరే పనిచేస్తున్నారని స్కాలరు కృష్ణమూర్తి గారు ఆ మధ్య చెప్పారు. నాకేమీ అర్థం అవడం లేదు. దయచేసి విశదంగా చెప్పండి!”
ఇంతలో మెగ్యా గది లోపలికి వచ్చాడు.
జావా కాఫీ తయారు చేసి తెచ్చింది. ఇద్దరూ కాఫీలు తాగిన తరువాత మోహన్ చెప్పడం మొదలు పెట్టాడు.
“రెండు నెలల కింద శశికళకు నాపై అనుమానం వచ్చింది. నను తవ్వకాలలో శ్రద్ధ చూపించడం లేదని, ఆమె వంక ఆకర్షితుడనవుతున్నానని ఆమెకు సందేహం కలిగింది. బహుశా అది నిజమే కావచ్చు. తాను అక్కడుంటే తవ్వకాల వెనుకబడిపోతాయని, తాను నా దృష్టినుంచి తొలగిపోవాలని ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది. ఒక రోజు ఉదయం ఆమె హైదరాబాదు, అక్కడ నుంచి తండ్రిగారు దగ్గరికి ఢిల్లీ వెళ్లిపోయింది.”
“మీతో చెప్పకుండా వెళ్లిపోయారా?”
“నాతో చెప్పలేదు – కాగితం కూడా వ్రాసి పెట్టలేదు.”
“వెళ్లిపోయి రెండు నెలలయింది. ఒక్క ఉత్తరమేనా వ్రాశారా?”
“లేదు”
“మీరేనా ఆమెకు వ్రాశారా?”
“లేదు – నాకు అసలు తీరుబాటే లేదు – ఆమె చిరునామా సరిగా నాకు తెలియదు”.
“ఆమె నాన్నగారు చతుర్వేదో, త్రివేదో, అతను ఇనస్పెక్టరు జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. అతని కేరాఫ్‌తో ఉత్తరం వ్రాయవలసింది.”
“ఏ పని చేయడానికి అసలు నాకు తీరుబాటు లేదు. కొత్త స్థలంలో తవ్వకాలు చాల జోరుగా సాగాయి. మరి కొందరు పనివాళ్లను అదనంగా పెట్టాను. ఆచార్య నాగార్జునుడు తన జీవితంలో చివరి సంవత్సరాలు గడిపిన పారావతి నివాసం బయట పడింది. భవనమంతా కూలిపోయింది. మందులు నూరుకునే రాతి కల్వాలు, శస్త్ర చికిత్సలు చేసే పరికరాలు లభించాయి. చాల శ్రమపడవలసి వచ్చింది. ఏడు వారాలు పైగా పట్టింది. దొరికిన వస్తువుల పట్టిక తయారు చేశాను. వాటికి ఫోటోలు తీయించాను. భవనం యొక్క ప్లాను తయారు చేశాను. అరవై పేజీల రిపోర్టు చాలా విపులంగా వర్ణిస్తూ తయారు చేశాను. రిపోర్టు, దొరికిన వస్తువులు మన ప్రసాద్ గారికిచ్చాను. ప్రభుత్వం ఆదేశించిన విధంగా ఆ పని చేశాను.”
“మీరు ఒంటరిగా ఇంత శ్రమ పడ్డారు. పైగా ఎండలు చాల తీవ్రంగా ఉన్నాయి” పక్కనే నేలమీద మెగ్యా జావాలు కూర్చున్నారు.
మోహన్ మెగ్యా ముఖంలోకి చూశాడు.
శిథిలాలలో శిల్పం లభించిన సంగతి ప్రసాద్‌తో మోహన్ చెప్పలేదు. సుబ్రహ్మణ్యేశ్వరరావుతో కూడా ఆ సంగతి చెప్పాలా వద్దా అని క్షణం ఆలోచించాడు. దాని గురించి చెప్తే ముందు రాత్రి, సెలీనాతో పొందిన అనుభవం గురించి కూడా చెప్పాలి. శశికళకు కూడా ఈ విషయం చెప్పలేదు. శిల్పం గురించి కొద్ది మంది పనివాళ్లకు, మెగ్యాకు మాత్రమే తెలుసు. శిల్పం వివరాలు కూడా వాళ్లకు తెలియవు. ప్రస్తుతానికి ఎవరికీ చెప్పకుండా ఉండడమే మంచిది.
“నిన్న మధ్యాహ్నం అష్టభుజస్వామి ఆలయం దగ్గర పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లను కలియడానికి ఒంటిగంటప్పుడు వెళ్లాను. వాళ్లు లేరు. మాచర్ల వెళ్లిపోయారు. తిరుగుదలలో ప్రసాద్‌ని కలియాలని మ్యూజియంకు వచ్చాను. ఆయన ఛూలధమ్మగిరి బంగళాకు వెళ్లిపోయారు. రమారమి మూడవుతుంటే టెంట్లవేపు నడిచాను. సగం దారిలో నాకు వెనుక టెంటు నుంచి పొగ కనిపించింది. చూస్తుండగానే మంటలు పైకి లేచాయి. పరుగెత్తాను. ముందు టెంటు కూడా అంటుకుంది. నేను టెంట్లను సమీపించే సరికి అవి అగ్నిగోళాలయాయి. వాటికి దగ్గరలో కిం కర్తవ్యతా మూడుడనై నిలబడ్డాను. భోజనం లేదు – ఎండదెబ్బ తిన్నాను. పైగా మంటలకు సమీపంలో నిల్చున్నాను. లంబాడీ తండా వాళ్లందరూ వచ్చి కృష్ణనుంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పడం మొదలు పెట్టారు. కొద్ది సేపటిలో కళ్లు బైర్లు కమ్మి తెలివితప్పి టెంట్ల ముందు పడిపోయాను. నన్ను మెగ్యా దూరంగా ఈడ్చుకు పోయాడు. మరో నలుగురు నన్ను లంబాడీ తండాకు మోసుకుపోయారు. అప్పటి నుంచి జావా, మెగ్యా నాకు ఉపచారాలు చేశారు. నా శరీరం చాల వేడెక్కింది. వాళ్లు ప్రతి పదిహేను నిమిషాలకు నుదుటి మీద తడిగుడ్డ మార్చారు. ప్రతి అరగంటకు శరీరం తడి గుడ్డతో తుడిచారు. ఉబ్బిపోయిన నా కళ్లలో చనుబాలు వేశారు. ఈ విధంగా అర్ధరాత్రి వరకు ఉపచారాలు చేశారు. ఆవు పాలు కాచి యిచ్చారు. తండాలోని వాళ్లందరు ఆవులసల చుట్టూ కూర్చొని, నాకు తెలివి వచ్చేవరకు తిళ్లు కూడా తినకుండా కూర్చున్నారు. నాకు తెలివి వచ్చిన తరువాత, నాకు దండాలు పెట్టి ఇళ్లకు వెళ్లారు. జావా మెగ్యాలు రాత్రంతా నా మంచం దగ్గిర నన్ను కనిపెట్టుకుని కూర్చున్నారు. వీళ్లు నాకు పునర్జన్మ ప్రసాదించారు. వడదెబ్బతో చనిపోవలసిన నన్ను, ఆలస్యం చెయ్యకుండా, సరియైన పద్ధతిలో ఉపచారాలు చేసి మృత్యువు నుండి కాపాడారు. వీళ్ల ఋణం ఎన్ని జన్మలకు కూడా నేను తీర్చుకోలేను” మోహన్ కళ్లు చెమ్మగిల్లాయి.
సుబ్రహ్మణ్యేశ్వరరావు జావా మెగ్యాల వేపు చూశాడు.
“లంబాడీలు చాల నమ్మకమైన వాళ్లు. ఒళ్లు దాచుకోకుండా శ్రమపడతారు. ప్రాణం పెడతారు. వీరి సహాయమే లేకపోతే విజయపురి ఇంత తొందరగా బయట పడేదిగాదు” అన్నాడు రావు.
“నేను ఉదయం లేచిన తరువాత, మెగ్యా వెళ్లి ప్రసాద్‌ని జీపులో తెచ్చి చూపించి, నన్ను మీ యింటికి తెచ్చాడు. మీరు లేరు – మీ యింటి తాళం పొరుగు వాళ్లనుండి తెచ్చి మేము ప్రవేశించాం. చాల స్వతంత్రంగా వ్యవహరించాము”.
“అయ్యా మోహన్ గారు! మీరు నాకు అన్నగారు – అన్ని విధాల నాకు ప్రాణ స్నేహితులు. ఆదర్శప్రాయులైన విద్యానిధులు. ఈ ఇల్లు మీదిగా భావించండి. మీ ఆరోగ్యం కుదుటబడి….”
మోహన్ నవ్వాడు.
“అన్నీ బాగున్నాయి! కట్టు బట్టలతో నేను మిగిలి పోయాను. మీ తువ్వాలుతో తుడుచుకున్నాను. మీ మడత పంచ ఇస్తే రాత్రికి కట్టుకుంటాను. రేపు మీరు ఒకరోజు సెలవు పెట్టి హైదరాబాదు వెళ్లండి. మా ఇల్లు విశ్వవిద్యాలయానికి సమీపంలో విద్యానగర్‌లో ఉంది. మా అమ్మనడిగి నా బట్టలు తీసుకురండి.”
“ఆవిడ ఒక్కరే ఉంటున్నారా?”
“లేదు – మా చెల్లెలు, ఆమె భర్త ఆమెకు తోడుగా ఉన్నారు. మా బావగారు ఇంగ్లీషు లెక్చరరుగా పనిచేస్తున్నారు. వాళ్లకో మూడేళ్ల కుర్రాడు. తవ్వకాలు గురించి వచ్చేముందు, వాళ్లను మా అమ్మగారికి తోడుగా ఉండమని తెచ్చి పెట్టుకున్నాను.”
సుబ్రహ్మణ్యేశ్వరరావు పెట్టె నుంచి మడత పంచ, మడత తువాలు తీసి మోహన్‌కి ఇచ్చాడు. తరువాత అతను స్నానం చేసి వచ్చాడు. నలుగురికి జావా వంట చేసింది. భోజనాలు అయిన తరువాత రావు, మోహన్ తిరిగి కూర్చున్నారు.
(సశేషం)