[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
అభారతీయం 6
[dropcap]1[/dropcap]947 ఆగస్టు 15న భారతదేశంలో ఇండియన్ల మంత్రిమండలి కొలువుదీరింది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిత్వంలో క్యాబినెట్ ప్రమాణస్వీకారం చేసింది. అప్పటికి రెండు దేశాల సైనిక దళాల అధిపతులుగా ఆంగ్లేయులే ఉన్నారు. గవర్నర్ జనరల్‌గా మౌంట్‌బాటన్ ఉన్నాడు. స్వాతంత్య్రం వచ్చి రెండు నెలలైనా కాకుండానే పాకిస్తాన్ భారత్‌పై యుద్ధం మొదలుపెట్టింది. దాదాపు ఏడాదిపాటు ఈ యుద్ధం కొనసాగింది. భారత సైనిక దళాల అధిపతిగా జనరల్ లాఖ్‌హార్ట్ ఉన్నారు. దేశ విభజన అనంతర పరిణామాలతో పాపం.. ఆయనకు మొదటిరోజు నుంచే ఊపిరి సలపనంత పని మొదలైంది. పెద్ద ఎత్తున హింసాకాండను నిలువరించడం తలకు మించిన భారంగా పరిణమించింది. జనరల్ సర్ డగ్లస్ గ్రేసీ పాకిస్తాన్ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉన్నారు. ప్రతిరోజూ ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి వస్తున్న శరణార్థుల గురించి పరస్పరం సమాచారం అందించుకోవడం.. నియంత్రణ చర్యలను చేపట్టడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఇంతగా తీరికలేనంత పనిలో కూడా జనరల్ లాఖ్‌హార్ట్ దేశానికి సంబంధించిన రక్షణ ప్రణాళికను సమగ్రంగా రూపొందించారు. ఓ ఫైన్ మార్నింగ్ ప్రధానమంత్రి గారి అప్పాయింట్‌మెంట్ తీసుకొని మరీ వెళ్లి చూపించారు. రక్షణ విధానానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. పండిట్‌జీ దాన్ని పూర్తిగా పరిశీలించనైనా లేదు. లాఖ్‌హార్ట్ వైపు ఓ లుక్ వేసేసి.. ఆ కాగితాలను టేబుల్‌పై నిర్లక్ష్యంగా విసిరేశారు. ‘ఇదంతా చెత్త.. చెత్తే.. మనకు ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళిక అవసరం లేదు. అయినా మనమీద ఎవరు యుద్ధానికి వస్తారు? మనం చాలా మంచివాళ్లం.. మనది అహింసా సిద్ధాంతం. మనమీద ఎవరూ యుద్ధానికి రారులే.. మన దేశ రక్షణ అవసరాలు తీర్చడానికి ఇప్పుడున్న పోలీసులు సరిపోతారు లే.. నీ ప్రణాళికను చెత్తబుట్టలో పారేయి.. అని అన్నారు.
“Shortly after independence, General Lockhart as the army chief took a strategic plan to the prime minister, asking for a government directive on the defence policy. He came back to Jick’s office shell-shocked. When asked what happened, he replied. The PM took one look at my paper and blew his top. ‘Rubbish! Total rubbish! he shouted. “We don’t need a defence plan. Our policy is ahimsa (non-violence). We foresee no military threats. Scrap the army! The police are good enough to meet our security needs” the Daily Times quotes the book as saying.
పాపం లాఖ్‌హార్ట్ మొహం చిన్నబుచ్చుకొని వెళ్లిపోయారు. పాపం లాఖ్‌హార్ట్‌కు ఏం తెలుసు.. నెహ్రూజీ అప్పటికే నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్నారని? పటిష్ఠంగా సైనిక వ్యవస్థను రూపొందిస్తున్నట్టు ప్రపంచానికి తెలిస్తే నోబెల్ రాకుండా పోతుందేమోనని నెహ్రూ ఆందోళన చెందినట్టున్నారు. దీనికి తోడు మౌంట్‌బాటన్ అనేవాడు శకునిలా పక్కనే కాచుకొని ఉన్నాడు. నెహ్రూ చేత ఒక్క పనీ చేయనివ్వలేదు. ప్రతి పనికీ అడ్డుపడుతూనే ఉన్నాడు. అప్పటికే విభజన చిచ్చు కార్చిచ్చులా మారింది. బ్రిటిష్‌వాడు సృష్టించిన మారణహోమానికి లక్షల మంది సమిధలవుతున్నారు. అది ఆరిపోకుండా మౌంట్‌బాటన్ అన్ని జాగ్రత్తలూ తీసుకొన్నాడు. మన ప్రధాని మాత్రం షేక్ అబ్దుల్లా దోస్తానాలో.. మౌంట్‌బాటన్ మాయలో పడి కొట్టుకుపోయాడు. (అప్పుడు పీఎంవోలో ఫిడేల్ ఉన్నదో లేదో తెలియదు).
1947 అక్టోబర్ 25న జనరల్ గ్రేసీ ఒక సమాచారాన్ని జనరల్ లాఖ్‌హార్ట్‌కు చేరవేశారు. దాదాపు ఐదువేలమంది గిరిజనులు (పష్తూన్‌లు) ముజఫరాబాద్, దోమెల్‌పై దాడులు చేస్తున్నారని.. వీరితోపాటు పాకిస్తాన్ సైనిక మూకలూ కలిసిపోయి దాడులకు తెగబడ్డాయి. లాఖ్‌హార్ట్ తనకు సమాచారం అందగానే తన బాస్ మౌంట్‌బాటన్‌కు చేరవేశాడు. కశ్మీర్ ప్రజలను కాపాడటానికి భారత్‌లో ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని పంపించాలని నెహ్రూ అనుకొన్నప్పటికీ మౌంట్‌బాటన్ అడ్డుకొన్నాడు. మీకు స్వాతంత్య్రం ఇచ్చాం కదా.. మీ సైనికులే చూసుకోవాలి.. మాకేం సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. పైగా రాజాహరిసింగ్ విలీన పత్రంపై సంతకం చేస్తే కానీ మన సైన్యాన్ని పంపవద్దని మెలికపెట్టాడు. అక్టోబర్ 26న హరిసింగ్ విలీన పత్రంపై సంతకం చేశాడు. 27న భారతసైన్యం కశ్మీర్ భూభాగంలోకి అడుగుపెట్టింది. కానీ నవంబర్ ఒకటిన మౌంట్‌బాటన్ జిన్నాతో రహస్యంగా సమావేశమయ్యాడు. భారత్‌లో కశ్మీర్ కలవాలంటే ప్లెబిసైట్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో పడేయాలన్న నిర్ణయం అక్కడే జరిగింది. ఈ విషయం నెహ్రూకు పట్టలేదు. బ్రిటిష్‌వాళ్లు, అమెరికావాళ్లు తనకు ఎక్కడలేని గౌరవమర్యాదలిస్తుండటంతో వాటికే ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఐరాసలో కూడా తనకు అంతే గౌరవం దక్కుతుందని భావించాడు. కానీ, ఆసియాలో, ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ చైనాల మధ్య ఒక వ్యూహాత్మక స్థావరంగా మార్చుకోవడానికి కశ్మీర్.. బ్రిటన్‌కు, దాని మిత్రపక్షం అమెరికాకు అవసరమైంది. దానికోసం మౌంట్‌బాటన్ వేసిన ఉచ్చులో నెహ్రూ పూర్తిగా చిక్కుకుపోయాడు. మూడింట ఒక వంతు కశ్మీర్‌ను పాకిస్తాన్ ఆక్రమించుకొన్న తరువాత మౌంట్‌బాటన్‌గారి మార్గదర్శనంలో నెహ్రూ ఐక్యరాజ్యసమితికి కశ్మీర్ వ్యవహారాన్ని తీసుకెళ్లి వాస్తవాధీనరేఖ అంటూ ఓ గీత గీసి.. ఎప్పటికీ ఆరిపోని రావణకాష్టానికి స్వయంగా నిప్పంటించారు. మౌంట్‌బాటన్‌లాంటి వాడిని ఏడాదిపాటు పక్కన పెట్టుకొని.. కశ్మీర్‌పై ఒక నిర్మాణాత్మక నిర్ణయం తీసుకోకుండా, శాశ్వత పరిష్కారం చూపకుండా.. శాశ్వత సమస్యగా మార్చారు. ఇదీ మన మొదటి ప్రభుత్వపు దార్శనికత. ఆయన మన ఆధునిక భారత నిర్మాత!
కొన్నాళ్ల తర్వాత ప్రధాని నెహ్రూను జనరల్ లాఖ్‌హార్ట్ కలుసుకున్నప్పుడు కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇద్దరి మధ్యా తీవ్రంగా వాగ్యుద్ధం జరిగింది. చివరకు నెహ్రూ ఆవేశంగా మీరు పాకిస్తాన్ పట్ల సానుభూతితో ఉన్నారా? అని ప్రశ్నించారు. లాఖ్‌హార్ట్ వెంటనే జవాబిస్తూ ‘మిస్టర్ ప్రైం మినిస్టర్, మీరు నన్ను ఆ ప్రశ్న వేసినట్టయితే, నేను మీ సైనిక దళాలకు కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉండటంలో అర్థంలేదు. కొద్ది రోజుల్లో బ్రిటిష్ అధికారులను, వారి కుటుంబాలను స్వదేశానికి తీసుకొనిపోవడానికి ఒక ఓడ బొంబాయిలో సిద్ధంగా ఉన్నదని నాకు తెలుసు. ఆ బోటులో నేను కూడా ఉంటాను’ అని అన్నారు. తర్వాత కొన్నాళ్లకు జనరల్ లాఖ్‌హార్ట్ తన పదవికి రాజీనామా చేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటే ఏమిటి?
ఇండోపాక్ యుద్ధం ఎట్లా జరిగింది? పరిణామాలు ఏమిటి అన్నవాటిపై చాలామంది మేధావులు చాలా చాలానే చర్చించారు. దాని గురించి చర్చిచడం చర్వితచరణమే అవుతుంది. కానీ నేడు మనం పిలుచుకొనే ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించి, లేదా పాకిస్తాన్ చెప్పుకొనే ఆజాద్ కశ్మీర్ గురించి ఒక సందేహం పీడిస్తున్నది. గత డెబ్భై అయిదేండ్లుగా నెహ్రూ దగ్గరి నుంచి మన ప్రభుత్వాలు పదే పదే ‘కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం’ అని అంటున్న మాటల్లో నిజమెంత? దీనిపైన అన్వేషించినప్పుడు పలు అంశాలు బయటపడ్డాయి. 1947-48 యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఆక్రమించింది జమ్ము కశ్మీర్ ప్రావిన్సులోని గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతం. ముజఫరాబాద్, మీర్‌పూర్, పూంఛ్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను పాకిస్తాన్ ఆక్రమించింది. వీటినే మనం పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ప్రజలు 99 శాతం మంది కాశ్మీరీలు కారు. ప్రస్తుతం భారత్ ఆధీనంలోని కశ్మీర్ లోయలోని సంప్రదాయ కశ్మీరీల సంస్కృతికి వీరి సంస్కృతి పూర్తి భిన్నంగా ఉంటుంది. మీర్‌పూర్, కోట్లి, భీంభర్ వంటి ప్రాంతాల్లో ప్రజల సంస్కృతి పాత జమ్ము ప్రాంతపు సంస్కృతితో సమ్మిళితమై ఉంటుంది. ఇక్కడ ఉండే జనాభాలో కశ్మీరీలు లేనే లేరు. ఆక్రమిత కశ్మీర్‌లోని పది జిల్లాల్లో గుజ్జర్లు ప్రధానమైన సమాజం. వీరు మొత్తంగా వ్యవసాయం వృత్తిగా స్థిరపడ్డవారు. పూంఛ్, సుధానోటి, బాగ్, కోట్లి ప్రాంతాల్లో సుధాన్‌లు ఎక్కువగా ఉంటారు. వీరిని సర్దార్లు, సదోజీలు అని కూడా పిలుస్తారు. వీళ్ల మూలాలు పష్తూన్లలో ఉన్నాయి. రాజ్‌పుత్‌తో వీరికి అనుబంధం ఎక్కువ. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రాజకీయ నాయకులు ఎక్కువగా వీరే. మీర్‌పూర్, భీంభర్, కోట్లి ప్రాంతాల్లో జాట్లు ఎక్కువగా ఉన్నారు. మీర్‌పూర్‌లో అత్యధిక జనాభా జాట్లదే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల్లో విస్తరించిన ప్రధాన సమాజం రాజ్‌పుత్‌లది. బాగ్, ముజఫరాబాద్‌లలో మొఘల్‌లు ఎక్కువగా ఉన్నారు. బాగ్, పూంఛ్, ముజఫరాబాద్, హట్టియాన్ బాలా తదితర ప్రాంతాల్లో ఆవాన్‌లు ఉన్నారు. వీళ్లు పాక్ లోని పంజాబ్‌లోనూ విస్తరించి ఉన్నారు. ఇవే జిల్లాల్లో విస్తరించిన మరో సమాజం అబ్బాసీ. అబ్బాసీలు ఈ మూడు జిల్లాలో చెప్పుకోదగినంత సంఖ్యలోనే ఉన్నారు. చివరగా నీలం వ్యాలీ, లీపా వ్యాలీలో మాత్రమే అసలైన సంప్రదాయ కశ్మీరీలు ఉన్నారు.వీళ్ల సంస్కృతి, వస్త్రధారణ ఉత్తర పంజాబ్ (పొతొహార్), పష్తూన్లను పోలి ఉంటుంది. మహిళలు సల్వార్ కమీజ్‌లు ఎక్కువగా ధరిస్తారు. బుర్ఖాలు వేసుకోరు. నిండుగా తలమీది నుంచి శాలువా కప్పుకుంటారు.
ఇక్కడి ప్రజలు మాట్లాడే భాషలు కూడా వేర్వేరుగా కనిపిస్తాయి. గుజారీ, పహారిపోత్వారీ, షినా, పష్తూ, హింకో, పంజాబీ, మేవాటీ తదితర భాషలే ఎక్కువగా మాట్లాడతారు. వీటిలో పష్తూ మినహా మిగతావన్నీ కూడా ఇండోఆర్యన్ భాషా సమాజానికి సంబంధించినవే. రాజస్థానీ, పంజాబ్ భాషలతో మమేకమైనవే. పష్తూ ఇరాన్‌నుంచి వచ్చింది. నీలం వ్యాలీలో మాత్రమే కశ్మీరీ భాషను మాట్లాడే కశ్మీరీలు ఉన్నారు. అసలు సిసలైన కశ్మీరీ భాషను మాట్లాడే కశ్మీరీ ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం ప్రస్తుతం భారతదేశ ఆధీనంలో ఉన్న కశ్మీర్ లోయ మాత్రమే. అలాంటప్పుడు పాకిస్తాన్ ఆక్రమించింది దేనిని? అసలు కశ్మీరీ భాషతోకానీ, సంస్కృతితో కానీ, వేషధారణలతో కానీ ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేని జమ్ము, పంజాబ్, రాజస్థానీ, పష్తూన్ తదితర ప్రాంత సంబంధమైన సమాజాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలను. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని ‘పాక్ ఆక్రమిత జమ్ము’ అనో.. మరొకటో పిలువాలి. ఇంతకాలం భారత రాజకీయ నాయకులన్నట్టు.. అంటున్నట్టు కశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగానే ఉన్నది. ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకోవాలి. భారతసేనలు పాకిస్తాను మూకలను వేటాడుతూ ఒక ప్రాంతానికి చేరగానే అక్కడినుంచి ముందుకు వెళ్ళకూడదని ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే, ఆ ప్రాంతం దాటితే, షేక్ అబ్దుల్లా మాట చెల్లదు. ఎందుకంటే వారు కాశ్మీరీయులతో అంతగా సఖ్యతలేనివారు. దాంతో, భారత్ ఆ భాగాన్నికూడా గెలుచుకుని కశ్మీర్ లో కలిపితే తనకు మెజారిటీ రావటం కష్టమని గ్రహించిన షేక్ అబ్దుల్లా ఇక్కడే ఆగమని నెహ్రూకు సూచించటంతో భారతసేనలు ముందుకు వెళ్ళగలిగీ వెళ్ళలేదని అంటారు. సేనలు ఆగిన ప్రాంతం తరువాతనుంచే పాక్ ఆక్రమిత కశ్మీర్ భాగం ప్రారంభమవుతుంది.
చైనా విషయంలోనూ అంతే
పోనీ పాకిస్తాన్‌తో మొదటి యుద్ధం తరువాతైనా మేలుకున్నారా అంటే అదీ లేదు. అటుపక్క చైనాతో రాసుకుపూసుకు తిరిగారు. పంచశీల అన్నారు.. సోషలిజం అన్నారు. తన చైనా అనుకూల పాలసీకి.. చైనా కమ్యూనిస్టులు చాలా సంబురపడి.. ఇంతోటి అహింసా సిద్ధాంతానికి కట్టుబడి.. మనమీద అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపిస్తారని పండిట్‌జీ భావించారు. కానీ 1962లో ఈశాన్య భారతంపై చైనా యుద్ధానికి తెగబడిన తర్వాత కానీ, నెహ్రూగారికి తత్త్వం బోధపడలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? ఒక సమగ్రమైన సైనిక విధానం లేదు. జవానులకు సరైన సాధన సంపత్తి సమకూర్చలేదు. ఆయుధాల సమీకరణ అంతగా జరుగలేదు. అసలు వారికి ఒక దిశానిర్దేశమే జరుగలేదు. చివరకు ఓటమి భారాన్ని మోయాల్సి వచ్చింది. అటు పాకిస్తాన్ దగ్గర ఒక వాస్తవాధీన రేఖ.. ఇటు చైనా దగ్గర మరో వాస్తవాధీన రేఖ.. చాక్‌పీస్‌లు పెట్టి ఈ రేఖలు గీయడంతోనే నెహ్రూ గారి కాలం గడిచిపోయింది.
అస్సాం విషయంలో నెహ్రూ వ్యవహరించిన తీరుపై యుద్ధం జరిగిన అరవై ఏండ్ల తరువాత కూడా ఇప్పటికీ చర్చ జరుగుతున్నది. యుద్ధం ఏకపక్షంగా చైనా ఆధీనంలోకి వెళ్లిన తర్వాత 1962, నవంబర్ 20 న ఆకాశవాణి లో పండిట్‌జీ ప్రసంగించారు. ‘నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీలో చైనా సైన్యం భారీ ఎత్తున దూసుకువస్తున్నది. వాలాంగ్, సేలా, బాండిలా ప్రాంతాలనుంచి మన సైన్యం వెనక్కి తగ్గింది. అయితే చొరబాటుదారును తిప్పికొట్టేంతవరకు మన సైన్యం నిద్రపోదు. నేను మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఇప్పుడు అస్సాంలోని మన దేశ ప్రజల కోసం మా హృదయం గాఢంగా స్పందిస్తున్నది.’
“Huge Chinese armies have been marching in the northern part of NEFA We have had reverses at Walong, Se La and today Bomdila, a small town in NEFA, has also fallen shall not rest till the invader goes out of India or is pushed out. Want to make that clear to all of you, and, especially our countrymen in Assam, to whom our heart goes out at this moment”
నెహ్రూ చేసిన ఈ రేడియో ప్రసంగంతో అస్సాం దాదాపుగా చైనాకు వశపరిచినట్టు తేటతెల్లమైంది. ఆనాటి ఆ యుద్ధానికి.. అప్పటి నెహ్రూ ఆకాశవాణి ప్రసంగానికి ప్రత్యక్షసాక్షిగా ఉన్న ఒక కాంగ్రెస్ నేత అతుల్ సైకియా నెహ్రూ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ‘నెహ్రూ అస్సాంకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. అసలు బ్రహ్మపుత్ర లోయ ప్రాంతాన్ని నాటి భారత ప్రభుత్వం పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు’ అని అభిప్రాయం. ఏమైతేనేం ఇతర దేశాల పరోక్ష జోక్యంతో భారత చైనా యుద్ధానికి అప్పటికి తెరబడింది. మరో వాస్తవాధీన రేఖ వచ్చిపడింది.
ఎంత విచిత్రం! ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా ఆవిర్భవించిన దేశానికి సైనిక వ్యవస్థను పటిష్ఠంగా నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఆ దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి గుర్తించకపోవడమేమిటి? అసలు అవసరం లేదని అనడమేమిటి? ఒక దేశానికి ప్రధానమంత్రి అయినవాడు.. ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి విధాన నిర్ణయాలు తీసుకోవడమేమిటి? మనదేశానికి అంత ఈజీగా స్వాతంత్య్రం రాలేదన్న విషయం నెహ్రూకు తెలియంది కాదు. బ్రిటిష్ వాడి అతి తెలివి తేటలూ తెలియనివి కావు. ఒక భయంకరమైన ఊచకోతకు నాంది పలుకుతూ జరిగిన విభజన నేపథ్యంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రధానమంత్రి, ఆయన మంత్రిగణం.. పరాయివాడి సలహాలను వింటూ.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమేమిటి? రామాయణంలో రాముడు భరతుడితో ఒక మాట అంటాడు. అయోధ్య అంటే యుద్ధానికి శక్యం కానిదని. శత్రుపక్షంలోని 18 విభాగాల్లో, స్వపక్షంలోని 15 విభాగాల్లో గూఢచారులను నియమించుకోవడం రాజుకు అత్యవసరమని చెప్తాడు. అంటే పటిష్ఠంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని అర్థం. అంతేకాదు. స్వపక్షంలో పక్కనే ఉంటూ, అంతరంగికంగా సలహాలిస్తూనే రాజుకు ద్రోహం తలపెట్టేవాడిని క్షణమైనా ఉపేక్షించకుండా సంహరించాలని కూడా విస్పష్టంగా చెప్పాడు. మౌంట్‌బాటన్ అనేవాడు సరిగా అలాంటివాడే. అంతరంగికంగా ఉంటూ వెన్నుపోటు పొడుస్తుంటే.. నెహ్రూ చేసిందేమీలేదు. నిస్సహాయంగా చూస్తూ ఉండటం తప్ప. రాముడు చెప్పినట్టు యుద్ధానికి శక్యం కాని రీతిలో భారత దేశాన్ని సన్నద్ధం చేయాల్సిన నెహ్రూ తాను అధికారంలో ఉన్న పదిహేడు సంవత్సరాల్లో పొరుగుదేశాల నుంచి రెండు యుద్ధాలను ఎదుర్కొని.. మన భూభాగాలను వారికి వినమ్రంగా సమర్పించుకొని తరువాతి తరాలకు తీరని తలనొప్పులు తెచ్చిపెట్టాడు.