[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]
మై కజిన్ రేచెల్ – ఢాప్నీ దు మౌరియర్
[dropcap]కొ[/dropcap]న్ని పుస్తకాలలో కథ కన్నా రచయితలు ఆ కథ చెప్పే తీరు మనలను అబ్బురపరుస్తుంది. ఒకే రకమైన కథావస్తువే కావచ్చు కాని దాన్ని చెప్పే వారి శైలి ఆ కథ పట్ల అంతులేని ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కైమ్ థ్రిల్లర్ నవలలు చదవడం నా కిష్టం. ఎందరో విదేశీ రచయితల నవలలు ఈ జెనర్‌లో వచ్చినవి చదివాను. కాని నేను అభిమానించే రచయిత్రి ఢాప్ని దు మౌరిఎర్. ఈవిడ రచనా శైలి, ఈవిడ రాసిన పుస్తకాలను చదవడం ఒక గొప్ప అనుభవం. “రెబెకా” అనే వీరి నవల ఈ శైలికి గొప్ప ఉదాహరణ. అసలు ముఖ్య పాత్ర నవలంతా కనిపించకపోయినా ఆమె ప్రతి అక్షరంలో ఉన్న భావన మనలను నవలలో సాంతం నడిపించుకుపోతుంది. “మాయా బజార్” సినిమాలో పాండవుల ప్రస్తక్తి లేకుండా పాండవ కథ నడిపించి బీ.ఎన్. రెడ్డి గారు చేసిన ప్రయోగం తెలుగు వారికి అనుభవమే కదా. ఆలాగే నడుస్తుంది రెబెకా నవల. ఆ పాత్ర ఎక్కడా కనిపించదు. కాని ప్రతి చోట మనం ఆమెను చూస్తాం, ఆమె ఉనికి అనుభవిస్తాం. అలాంటి భావనే కలిగించే నవల “మై కజిన్ రేచెల్”. ఒక నవల ముగింపు మనకు తృప్తినివ్వాలి. ఆ నవలలోని ప్రశ్నలన్నిటికీ అది జవాబు కావాలి. కాని ముగింపే ఒక ప్రశ్న అయితే అది ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఇంకా కొంగ్రొత్త ప్రశ్నలు రేపితే? ఒక 500 పేజీలు రహస్యాన్ని చేధించి చూడాలనే ప్రయత్నంలో చదివి ముగింపుతో ఇంకా ఎన్నో రహస్యాలు ముందుకు వస్తే ఒక పాఠకుడు అనుభవించే వేదన గమ్మత్తుగా ఉంటుంది. ఈ నవల అటువంటి వేదనను మిగులుస్తుంది. అలా అని ఆ ముగింపుని మనం విమర్శించలేం కూడా. రచయిత్రి కథా నైపుణ్యానికి అచ్చెరువు చెందుతాం. బేసిక్ ఇన్‌స్టింక్ట్ లాంటి సినిమాలు ఇలాంటి ముగింపు కారణంగానే మేధావులను సైతం ఆకట్టుకోగలిగాయి, వాటిలో ఎంత అడల్ట్ కంటెంట్ ఉన్నా. ఒక రీడరును పుస్తకం చదివిన తరువాత ఒక అద్భుతమైన అనుభూతికి లోను చేయించగలిగే శక్తి ఉన్న పుస్తకాలనే థ్రిల్లర్స్ అని అనగలం. ఈ పుస్తకంలో రచయిత్రి కొన్నిసార్లు మన భావోధ్వేగాలతో ఆడుకుంటుంది. అన్నీ అర్థం అయినట్లు మనకు విషయం పూర్తిగా అవగాహన కొచ్చినట్లు భ్రమింపజేసి తరువాత మనం నిర్ధారణకు వచ్చినవి నిజాలు కావని మరో మార్గంలో కథను తీసుకువెళుతుంది. అప్పుడు చదివే పాఠకులు ఒక చాలెంజ్ అనుభవిస్తారు. దాన్ని ఆస్వాదిస్తారు. తమ మేధస్సుతో రహస్యాన్ని శోధించాలని ప్రయత్నిస్తారు. తమ సృజనాత్మకతకు పదును పెట్టుకుంటారు. చివరకు రచయిత్రీ ఇచ్చే షాక్‌కి అబ్బురపడి పడిపోతారు. ఓటమిని అంగీకరిస్తారు. అయితే ఈ ఓటమిలో ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది. అది అనుభవించాలంటే ఈ నవలను చదివి తీరాలి.
“మై కజిన్ రేచెల్” నవల 1951లో రాసారు రచయిత్రి. ఇది రెండు సార్లు హాలీవుడ్‌లో సినిమాగా తీయబడిన నవల. కాని నిజం చెప్పలంటే పుస్తకం ఇచ్చే అనుభవంతో సినిమా సాటి రాదు. కథలోకి వస్తే ఆంబ్రోస్ ఆష్లే అనే ఒక భూస్వామి తన కజిన్ ఫిలిప్‌ను చిన్నప్పటి నుండి పెంచుతాడు. ఫిలిప్ తల్లి తండ్రులను కోల్పోయి ఆష్లే వద్దకు చేరతాడు. ఆ పిల్లాడి పై ఆంబ్రోస్ ఆష్లేకు అంతులేని ఆపేక్ష. కాని ఆష్లే ఆరోగ్యం సరిగ్గా ఉండని కారణంగా గాలి మార్పు అత్యవసరమై ఫిలిప్‌ని తన ఎస్టేట్‌లో ఉంచి తాను ఇటలీ వెళ్తాడు. అక్కడ రేచల్ అనే ఒక స్త్రీ పరిచయం అవుతుంది. రేచెల్ తండ్రి ఇంగ్లండ్ దేశస్తుడు. ఆష్లే కుటుంబంతో దూరపు బంధుత్వం కూడా ఉంటుంది. ఈ పరిచయం ప్రేమగా మారిన తరువాత ఆంబ్రోస్ ఫిలిప్‌కి ఆమె గురించి రాస్తాడు. అక్కడే తాను రేచెల్‌ను వివాహం చెసుకున్నానని చెబుతాడు. ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్నామని, దాని తరువాత భార్యతో ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని చెప్తాడు. మెల్లిగా ఉత్తరాలు రావడం తగ్గుతుంది. హఠాత్తుగా ఫిలిప్‌కి ఒక ఉత్తరం వస్తుంది ఆంబ్రోస్ నుంచి. తనపై విషప్రయోగం జరుగుతుందని తనకు అనుమానంగా ఉందని తాను ప్రమాదంలో ఉన్నానని ఆ ఉత్తరంలో అతను రాస్తాడు. ఫిలిప్ ఆత్రుతగా ఇటలి వెళతాడు. కాని ఆ ఇంటికి వెళ్ళేసరికే ఆంబ్రోస్ చనిపోయి అతన్ని ఖననం చేయడం కూడా జరిగిపోతుంది. రేచెల్ ఆంబ్రోస్ వస్తువులను తీసుకుని ఎక్కడికో వెళ్ళిందని నౌకర్లు చెప్తారు.
కోపంతో దుఖంతో ఫిలిప్ ఇంటికి తిరిగి వస్తాడు. అతను వచ్చిన మరుసటి రోజు రేచెల్ వెతుక్కుంటూ ఆంబ్రోస్ వస్తువులతో ఆ ఇంటికే చేరుతుంది. అంబ్రోస్ చావుకు ఆమె కారణం అని అమెపై విపరీతమైన ద్వేషం ఏర్పడుతుంది ఫిలిప్‌కి. ఫిలిప్‌కి అన్ని విషయాలలో సలహాలిచ్చే ఒక పెద్ద లాయర్ అతని ఇంటి సమీపంలోనే ఉంటాడు. అతని కూతురు లూసి ఫిలిప్‌ను ప్రేమిస్తుంది. ఆ లాయర్ వీరి ఆర్థిక విషయాలను చూసుకుంటూ ఉంటాడు. అతను ఫిలిప్‌ని కొంచెం ఓపిక పట్టమని కోపాన్ని చూపించడం మంచిది కాదని సలహా ఇస్తాడు. రేచెల్ ఆంబ్రోస్ వస్తువులన్నీటినీ ఇంటికి చేర్చి అతని మరణ వార్తను స్వయంగా కుటుంబానికి ఇవ్వడానికి వచ్చానని చెబుతుంది. ఫిలిప్ ఇటలీ వచ్చిన సంగతి తనకు తెలీదని చెబుతుంది. భర్త చనిపోయిన ఒక విధవరాలిగా ఆమె విపరీతమైన బాధను అనుభవించడం ఫిలిప్ ఇంటి నౌకర్లు కూడా చూస్తారు. భర్త పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆమె కనిపిస్తుంది. ఆమెను మొదట ఇష్టపడని ఫిలిప్ ఆమెను అభిమానించడం మొదలెడతాడు. ఆమె స్వభావంలో ఎంతో ప్రేమ వినయం కనిపిస్తూ ఉంటాయి. ఫిలిప్ రెచెల్‌ని అభిమానించడం మొదలెడతాడు ఆ ఇంటి పై ఆమెకున్న హక్కును గౌరవిస్తూ ఆమెను తమతో ఉండిపొమ్మని అడుగుతాడు. రేచెల్ ఒప్పుకుంటుంది కూడా. ఆ ఇంటి పై ఆ ఆస్తిపై ఆమెకున్న హక్కును గౌరవించడం తన బాధ్యతగా అనుకుని ఆమె అభిమానం దెబ్బతినకుండా అమె ఖర్చులకు ఒక అతి పెద్ద మొత్తం ప్రతి ఏడు వచ్చేలా జాగ్రత్త పడతాడు. రేచేల్ తనతో తన భర్త ఆంబ్రోస్ వస్తువులు తీసుకొస్తుంది. అతని బట్టలను పని వారికి పంచుతారు. అయితే ఒక పనివానికి వెళ్ళిన కోటులో అడుగున కుట్టి దాచబడిన ఒక ఉత్తరం కనిపిస్తుంది. అది చాలా రహస్యమైన ఉత్తరమని అర్థం చేసుకుని ఆ పనివాడు చదువురాని వాడు కాబట్టి ఆ ఉత్తరాన్ని ఫిలిప్‌కు అందిస్తాడు. అది ఆంబ్రోస్ రాసి పెట్టుకున్న ఉత్తరం. అందులో తన భార్య తనపై విషప్రయోగం చేస్తుందని ఆమె తాను అనుకున్నంత మంచి వ్యక్తి కాదని ఫిలిప్‌కి ఆంబ్రోస్ రాసి ఉంచుతాడు. అయితే అది పోస్ట్ చేసే పరిస్థితులలో లేని కారణంగా కోటు లోపల కుట్టి దాచిపెడతాడు. ఆ ఉత్తరం ఫిలిప్‌ని కదిలిస్తుంది. కాని రేచెల్ ప్రేమ ముందు అతను ఓడిపోతాడు. అతనే కాదు ఇంటి పనివారు, లాయర్, అతని కూతురు, ఎస్టేట్‌లో పని చేసే వారందరూ రేచెల్‌ని అభిమానించడం మొదలెడతారు. అధ్బుతమైన స్త్రీ అని ఆమె అందరి మన్ననలు పొందుతూ ఉంటుంది. ఫిలిప్ కూడా ఆమెను విపరీతంగా ప్రేమించడం మొదలెడతాడు. ఉత్తరం విషయం పైకి చెప్పకూండా ఇకపై రేచెల్‌ను గమనించాలని అనుకుంటాడు. ఆమె సౌకర్యాల కోసం ఎన్నో ప్రణాళికలు వేస్తాడు. ఆ ఉత్తరంలో ఆంబ్రోస్ తాను ప్రేమ మత్తులో తన ఆస్తి మొత్తం రేచెల్‌కు అందేలా ఒక విల్లు రాసానని అయితే ఆఖరి నిముషంలో దాన్ని సంతకం చేయకుండా ఉంచేసానని రాస్తాడు. లాయర్‌కు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆ విల్లు పై సంతకం కోసమే రేచెల్ ఆ ఇంటికి వచ్చిందా అని అనుమానిస్తాడు. కాని ఆస్తి విషయంలో సొంత నిర్ణయం తీసుకోవడానికి ఫిలిప్‌కి అధికారం ఉండదు. అతని ఇరవై అయిదో పుట్టినరోజు దాకా ఆస్తిపై అతను ఏ నిర్ణయం తీసుకోలేడని ముందే ఆష్లే ఒక వీలునామా రాసి పెడతాడు. రేచెల్ పై పీకల్లోతు ప్రేమలో ఉన్నఫిలిప్ లాయర్ చెప్పే జాగ్రత్తలన్నీ కొట్టిపడేసి, రేచల్ దగ్గర ఆ విల్లు తీసుకుని తన ఇరవై అయిదవ పుట్టినరోజున మొత్తం ఆస్తి ఆమె పేర మారుస్తాడు. రేచేల్ పై విపరీతమైన ప్రేమ, భక్తి అతనిలో పేరుకుని పోతాయి. అతను తన గురించి కూడా ఆలోచించలేని అశక్తుడవుతాడు. తనకు అధికారం వచ్చిన కొన్ని క్షణాలలోనే రేచెల్‌కు ఆస్తి మొత్తం అందేలా వీలునామా మారుస్తాడు. అది మంచి పని కాదని చెప్పిన తన ఇంటి లాయర్‌ను పట్టించుకోడు. అవమానిస్తాడు కూడా. అతన్ని ప్ర్రేమిస్తున్న ఆ లాయర్ కూతురు కూడా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది.
రేచెల్‌కు ఆస్తి, ఎస్టేట్ కాక కుటుంబ వారసత్వ సంపదగా వచ్చే కోట్ల విలువ గల నగలు కూడా సొంతమవుతాయి. ఆమె ఎంతో డబ్బు ఇటలీకు చేరవేస్తుందని అర్థం అవుతుంది. ఆమెను కలవడానికి ఆమె లాయర్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంతాడు. ఫిలిప్ రేచెల్‌కు ఇటలీలో కొన్ని కుటుంబ బాధ్యతలు అప్పులు ఉన్నాయని. ఆమె తన అప్పులు తీర్చుకుంటుందని, అది అనుమానించవలసిన విషయం కాదని ఆమెను సమర్థిస్తాడు. ఆమె పట్ల ఎంతలా ఆకర్షితుడవుతాడంటే ఆమెను వివాహం చేసుకుంటాననే ప్రస్తావన కూడా తీసుకువస్తాడు. కాని ఇంతలో ఫిలిప్‌కు ఎవరికీ అంతుపట్టని జబ్బు చేస్తుంది. చాలా బలహీనపడిపోతాడు. ఆ జ్వరం మత్తులో ఉన్నప్పుడే ఒక రోజు రేచెల్ గదిలో విషపూరిత గింజలను చూస్తాడు. ఆంబ్రోస్ ఇలాంటి జ్వరంతోనే బాధపడి చనిపోయాడని, తనపై విషప్రయోగం జరుగుతుందని అతను అనుమానపడి ఫిలిప్‌కు రాసిన ఉత్తరం అన్నీ అతనికి అప్పుడు గుర్తుకు వస్తాయి. లాయర్ కూతురు లూసీకి తన భయాన్ని చెప్పి ఆమెతో ఆ గింజలను మరోసారి వెతికిస్తాడు. కాని ఇప్పుడు రేచెల్ అలమారలో అవి కనిపించవు. ఆమె లాయర్ ఆమెకు రాసిన ఉత్తరం కనిపిస్తుంది. అందులో రేచెల్ నగలన్నీ సురక్షితంగా బేంక్‌కు చేరాయని సమాచారం ఉంటుంది. ఎక్కడ నుండి ఫిలిప్ నగలు తీసాడో అదే బాంకుకు నగలను చేరుస్తుంది రేచెల్. ఫిలిప్ ఆరోగ్యం పట్ల రేచెల్ బాధ పడుతుందని ఆమెకు ఫిలిప్‌పై అంతులేని ప్రేమ ఉందని లాయర్ ప్రస్తావిస్తాడు. కాని అప్పటికే రేచెల్ తనను చంపే ప్రయత్నంలో ఉందని నిర్ధారించుకుని ఆమెను ఫిలిప్ ఒక ప్రమాదకరమైన చోటుకు పంపిస్తాడు. అక్కడ ఆమెకు ప్రమాదం జరుగుతుందని అతనికి తెలుసు. రేచెల్ తనను చంపబోతుందనడానికి ఆధారాలు ఏం దొరకక ఆమె తనను విపరీతంగా ప్రేమిస్తుందని చెప్పే ఉత్తరాలను చూసి భయంతో ఫిలిప్ ఆమెను కాపాడుకోవడానికి ఆమె వెనుక వెళతాడు. కాని రేచెల్ లోయలోకి పడి మరణిస్తుంది.
రేచెల్ మరణంతో నవల ముగుస్తుంది.కాని ఇంతకు రేచెల్ మంచిదా, చెడ్డదా? ఆమె భర్తను చంపిందా? ఫిలిప్‌ని కూడా హతమార్చాలనుకుందా? ఆమె ప్రేమ నిజమైనదా, నటనా? ఈ ప్రశ్నలకు జవాబులు ఫిలిప్‌కి దొరకవు మనకీ ఉండవు. ఏదైనా నిజం కావచ్చు. కాని మనకు తెలీదు. తెలుసుకోవడానికి రేచెల్ బ్రతికిలేదు. ఆష్లే మరణం విషప్రయోగం వల్ల జరిగిందా లేదా రేచెల్ చెప్పినట్లు జ్వరంలో అతని మతి చలించి విపరీతమైన మానసిక ఆందోళనతో లేనివి ఊహించుకున్నడా అన్న దాని పై మనకు స్పష్టత ఉండదు. చివరి దాకా రేచెల్ వ్యక్తిత్వం ఒక మిస్టరీ… అలాగే మిగిలిపోతుంది. కాని ఈ నవల చదవడం మాత్రం ఒక గొప్ప అనుభూతి. ముగింపుని ఎన్నో రకాలుగా ఊహిస్తాం. కాని రచయిత్రీ ఇచ్చే ముగింపు మనలను ఆశ్చర్యపరుస్తుంది. మనం ఊహించనిది. నవలను మరో సారి తిరగేస్తే రేచెల్ హంతకురాలా, లేక పరిస్థితుల కారణంగా బలయిన ఒక అబలా అన్నది అర్థం కాదు. ఆమెను దుర్మార్గురాలు అనడానికి ఎన్ని కారణాలు కనిపిస్తాయో, ఆమె అమాయకురాలు అని చెప్పడానికి అన్నే కారణాలు మనకు నవలలో కనిపిస్తాయి. ఈ నవల మొత్తంలో ఎక్కడా రచయిత్రి తన పట్టు కోల్పోరు. పాఠకులు ఆమెను పట్టుకోలేరు. నవల ముగుంపుతో ఆమెదే పై చేయి అవుతుంది. అందువలనే నవల అందరికీ నచ్చుతుంది. ఆమ్బిగ్విటి రచన స్థాయిని పెంచుతుంది కొన్ని సందర్బాలలో. అది మనం ఈ నవలలో గమనించవచ్చు.