[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. నిశ్చలమైన నీళ్ళు
[dropcap]నే[/dropcap]ను శేషయ్యగారింటికి వెళ్ళేసరికి ఆయనకి బాగా తెలిసిన కుటుంబరావు, అతని భార్య, కొడుకు వివేక్ దుఃఖంలో మునిగిపోయి, తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
“…. (ఏడుపు) నేను 10 ఏళ్ళుగా ఆ కంపెనీలో హెచ్.ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. నాతో కొత్త కంప్యూటర్ల కోసం సంతకం పెట్టించుకున్న దొంగ వెధవ నాకే తెలియకుండా ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడు. (ఏడుపు).. లక్షలు ఖర్చుపెట్టి కంప్యూటర్లు కొన్నట్లు బిల్లులు, చెల్లింపులు అన్నీ అయిపోయాయి. నాకు ఇప్పుడు తెలిసింది – కంప్యూటర్ల అవసరం లేకుండానే ఆ సీనియర్ మేనేజర్ గాడిద నన్ను ముంచేసి వెళ్ళిపోయాడు…(ఏడుపు).. తాతగారూ, మునిగిపోయాను. నేను జైలుకి పోవటం ఖాయం…(ఏడుపు)..”
ఇలా చెబుతూ వివేక్ భయంతో వణికిపోతున్నాడు.
శేషయ్య అతని చెయ్యి పట్టి, నాడి చూశారు.
“బాగా జ్వరం వచ్చినట్లుందే” అన్నారు. ఇక అతని తల్లి ఏడ్చేస్తోంది. కుటుంబరావు “ఏడ్వకండి” అంటున్నాడు కాని, అతని ముఖంలో దిగులు కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
“అసలెలా జరిగింది?” శేషయ్య అడిగారు.
“..దసరా శలవల ముందు రోజు సాయంత్రం నన్ను పిలిచాడు. ఎండి అరుస్తున్నాడు – 10-12 సెక్షన్లలో కంప్యూటర్లు, కీ బోర్డులు పనిచేయకపోతే నిద్రపోతున్నావా అంటున్నాడు. ‘నువ్వు ఈ రిక్విజిషన్ మీద సంతకం పెట్టు’ .. అన్నాడు. ‘నేను వెరిఫై చేసి, సంతకం చేస్తాను సర్’ అన్నాను. వాడు ఒప్పుకోలేదు. ‘అన్నీ నేను చేసేశానయ్యా. పండగ అయ్యేసరికి కంప్యూటర్లు వచ్చేయాలంటున్నాడు ఎండి. పెట్టు, పెట్టూ’ అంటే, ఇంటికెళ్ళిపోయే తొందరలో నేను అనుమానించలేదు… పండగ అయ్యాక వాడు శలవులో వెళ్ళాడన్నారు. ఇప్పుడు చూస్తే… (ఏడుపు)…”
“చెక్కులు ఎవరు సంతకం పెడతారు ?”
“జిఎం – ఫైనాన్స్…”
“వెళ్ళిపోయిన సీనియర్ సర్వీసు ఎంత?”
“(ఏడుస్తూనే) వాడు వేరే కంపెనీ నుంచి వచ్చి, రెండేళ్ళయింది… ఇప్పుడు వాడు ఆచూకీ లేకుండా పోయాడు. …”
వివేక్ వణికిపోతున్నాడు.
శేషయ్య వివేక్‌ని లోపల గదిలోకి తీసుకెళ్ళారు. అరగంట తరువాత బయటకొచ్చారు. వివేక్ కొంచెం తేరుకున్నాడు. శేషయ్య అభయం ఇచ్చాక, వాళ్ళు వెళ్ళిపోయారు.
నేను, శేషయ్య రామకృష్ణ మఠానికి వెళ్ళాం.
ఓ రెండు వారాల తరువాత, నేను శేషయ్య గారి ఇంటికి వెళ్ళేసరికి, కుటుంబరావూ, అతని భార్య ఆనందం పట్టలేక అంటున్నారు: “ఆ రోజు మీరు కల్పించుకోకపోతే, వాడు ఆత్మహత్య చేసుకుంటాడని భయపడిపోయాం..”
వాళ్ళు వెళ్ళాక వివేక్ విషయంలో నా సందేహాలన్నీ కుమ్మరించాను. శేషయ్య నవ్వారు.
“వివేక్‌కి చెప్పాను. మనం ఏమీ చేయలేకపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. దానికి సిద్ధపడు… అది జరగదు. కాని ఆ ఫలితానికి సిద్ధపడితే, అంతకన్నా మెరుగైన ఏ ఫలితమైనా నీకు ఆనందం కలిగిస్తుంది. రెండోది, అతి కటువైన ఆ ఫలితానికి సిద్ధపడితే, భయం పోయి, మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసే సరైన పరిష్కారాన్ని ఆలోచించగలుగుతుంది. నిశ్చలమైన నీళ్ళల్లో నీ ముఖ ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది. ఆదుర్దా, ఆందోళన, భయం, బెంగ – ఇవి మనసుని సరైన దిశగా ఆలోచించనివ్వవు…! అలా, అతన్ని మానసికంగా సిద్ధం చేశాక, అతని చేత, కంపనీ చైర్మన్ దాకా అందరికీ ఫిర్యాదు రాయించాను. దాంతో, ఆ ఫైనాన్స్ జిఎం, వెళ్ళిపోయిన గాడిద కుమ్మక్కై ఉత్తుత్తి కంప్యూటర్ల పేరుతో దోచేశారని విచారణలో తేలింది. విచారణ అయ్యేదాకా మనవాడిని సస్పెండ్ చేసి, ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తేశారు…”
“అప్పుడు ఉద్యోగం పోయి, జైల్లో పడతాననుకున్నాడు కదా!”
“అందుకే ఇప్పుడు ఇంత ఆనందం.”
2. మనకి శేషయ్యెందుకు?
ఆ అయిదు నక్షత్రాల స్టార్ హోటల్లో కొత్త దంపతులకోసం ఇచ్చే సూట్ అది.
కొత్తగా జీవితం పంచుకోబోతున్న పారిజాతం, డాక్టర్ ప్రదీప్‌ల మొదటి సమాగమం కోసం అందంగా అలంకరించిన ఆ సూటులో…!
పారిజాతానిది మగ స్నేహితులు లేకుండా పెరిగిన నేపథ్యం. ప్రదీప్‌కి ఆడ స్నేహితుల వాసనలు పెరిగే లోపలే అమ్మా, నాన్నలు పెళ్ళి చేసేసిన పరిస్థితి.
సోఫాలో కూర్చున్న పారిజాతం పక్కనే ప్రదీప్ వచ్చి కూర్చున్నాడు. పెళ్ళికి ముందు ఎన్ని సార్లు మాట్లాడుకున్నా, పారిజాతంలో మొదటి రాత్రి తాలూకు సిగ్గు, సంకోచం, భయం అడ్డుపడుతూనే వున్నాయి.
ప్రదీప్ ఆమె చేతివేళ్ళు నిమురుతూ, ఆమె ముఖం మీద ముంగురులు సరిచేస్తూన్నాడు. పారిజాతం కొంచెం అవతలకి జరిగింది.
“అవునూ, నీ నుదుటిమీద కుడివైపున ఈ గాటు ఏమిటి? అందంగానే వుందనుకో. కాని,ఇది పుట్టుకతో వచ్చిన బాపతు మాత్రంకాదు. కదా!”
పారిజాతం ఆ గాటుని వేలితో తడుముకొంది. గతం గుర్తుకొచ్చింది. కిసుక్కున నవ్వింది.
“చెప్పు, చెప్పు” అంటూ ప్రదీప్ మెల్లగా దగ్గరికి జరుగుతున్నాడు.
“మా చెల్లి పావనికి నాకు మధ్య ఎప్పుడూ గొడవలవుతూ వుండేవి. మేం హైస్కూల్ స్థాయికి వచ్చేసరికి ఇవి ఎక్కువయ్యాయి…”
“పాపం, మీ చెల్లి చాలా అమాయకురాలు గదా!”
పారిజాతంలో బిడియం కొంచెం తగ్గింది.
“ఎలా అనుకున్నారు? అది మహా పట్టుదల కలది… నాకు ఏది కావాలని నేను నాన్నని అడిగితే, అది కూడా అదే కావాలని పేచీ. నాకు పుస్తకాలు ఇష్టం. దానికి చాకొలేట్లు బాగా ఇష్టం. కాని, నాకు ఏం కొంటే, దానికీ అదే కావాలని ఏడ్చేది……”
“ఓహ్, అలాగా..” ప్రదీప్ ఆమె చేతి వేళ్ళు పట్టుకొని నిమురుతున్నాడు.
“మధ్యతరగతి కుటుంబం కదా! నేను వాడుకున్న ఓణీలు వాడుకోమని అమ్మ అంటే, దానికి కోపం. నేను వాడుకున్న పుస్తకాలు – అంటే మా ఇద్దరికీ వయసు తేడా తక్కువ కదా! నా పుస్తకాలు వద్దని గొడవ. ప్రతిసారీ కొత్తవే కావాలని పేచీ…”
ప్రదీప్ ఇంకాస్త దగ్గరికి జరిగాడు. ఆమె భుజం మీద సన్నగా ‘ఉఫ్’ అంటూ ఊదుతున్నాడు.
“ఓ సారి నేను అడిగానని నాన్న నన్ను ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ సినిమాకి తీసుకెళ్ళారు. చెల్లికి ఇంగ్లీష్ సినిమాలు ఇష్టం లేదు. కాని నన్ను తీసుకెళ్ళారని గొడవ గొడవ చేసింది…”
ప్రదీప్ ఆమె భుజం మీదనుంచి చేయి వేస్తున్నాడు.
“అప్పుడే నాన్నకి విజయవాడ నుంచి హైదరాబాదుకి బదిలీ అయింది. మేం కొత్త ఇంట్లో అద్దెకి దిగిన పది పదిహేను రోజుల్లోనే మా ఇద్దరికీ పెద్ద గొడవ అయిపోయింది. నాన్న ఆఫీసుకి వెళ్ళిపోయారు. అమ్మ వంటింట్లో వుంది. పావని కోపంతో నా మీదకి పౌడర్ డబ్బా విసిరింది…” అంటూ గాటుని తడుముకుంటోంది పారిజాతం.
ప్రదీప్ క్రమంగా “ఉఫ్…ఉఫ్”ల్ని ఆ మెడమీద చుంబనాలుగా మారుస్తున్నాడు.
పారిజాతం తమకానికి గురవుతూ, కథ చెప్పటం మర్చిపోతోంది.
“ఆ, అప్పుడు ..” ప్రదీప్ ప్రశ్నలు ఆపలేదు.
“అప్పుడే, మా పక్కింట్లో వుండే శేషయ్య తాతగారు పావని కేకలు విని .. మా ఇంట్లోకి వచ్చారు…”
ప్రదీప్ ఇంకాస్త చొరవ తీసుకునే ప్రయత్నంలో వున్నాడు.
“వచ్చి… వచ్చి …” పారిజాతం మాటలు మింగేస్తోంది.
“అప్పుడేమైంది?”
“మా గొడవలన్నీ ..తెలుసుకొని ఆ రాత్రి మా అమ్మా,నాన్నలకి ..ఒక ఒక .. మంత్రం చెప్పారు…”
ప్రదీప్ ఆమెని లేపి, మంచం దగ్గరికి తీసుకెళ్తున్నాడు.
“ఏమిటా మంత్రం?”
“సహోదరుల మధ్య ఇలాంటి స్పర్థలు సహజం…. ఇద్దరిలో, ‘ఎవరికి ఏది కావాలన్నా, రెండో వాళ్ళు సిఫార్సు చేస్తేనే ఇస్తాను, చేస్తాను’ అని చెప్పండి. …
ఆ ఇద్దరూ అలా ఒకరిమీద ఒకరు ఆధారపడిపోతారు. అలా పెరుగుతూ పెరుగుతూ తెలియకుండానే ఒకళ్ళపట్ల ఒకరు అభిమానం పెంచుకుంటారు. అంటే, పరస్పర శ్రేయోభిలాషులవుతారు….. అలా ఆ తాతగారు నాకూ మా చెల్లికీ తెలియకుండా మా అమ్మకీ, నాన్నకీ చెప్పారన్నమాట… చాలా చెప్పారుట…”
“ఆ తరువాత …?”
“ఊహు.. .మా మధ్య గొడవల్లేవు.. లేవు”
ఇద్దరూ గాఢ పరిష్వంగనంలోకి వెళ్తుంటే, పారిజాతం చెవిలో ప్రదీప్ అంటున్నాడు.
“మనిద్దరి మధ్యా గొడవలు వస్తే మాత్రం,శేషయ్య గారిని పిలవను.”
“మరి ఏం చేస్తా …”
“ఇది చేస్తాను” అంటూ లైట్ ఆర్పేశాడు!!!