[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
సినీ ప్రముఖులు:
[dropcap]సి[/dropcap]నిమాలు చూడడం చిన్నతనంలో 1960-80 దశకాలలో బాగా అలవాటు. అయితే 2010-15 మధ్య కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబరుగా పని చేసి సినిమా భ్రమను పోగొట్టుకొన్నాను. అనుకోకుండా నేనూ, గొల్లపూడి మారుతీరావుతో కలిసి 1987లో గెస్ట్ ఆర్టిస్ట్‌గా ‘కాబోయే అల్లుడు’ సినిమాలో తొలి షాట్‌లో రెండే నిమిషాల వేషం వేశాను. చంద్రమోహన్, గొల్లపూడి, రావికొండలరావు సరసన వేషం. రేలంగి నరసింహారావు డైరక్టరు. రిటైరైన తర్వాత హైదరాబాదులో మోతీనగర్‍లో చేరాను. అక్కడ మా వీధిలోనే కొండలరావు నివాసం. తరచూ కలిసే వాళ్ళం. చంద్రమోహన్‌ను మా పిన్ని వర్ధంతికి కరవది (ఒంగోలు) పిలిచి సన్మానించాం.
‘ఆయన మీద పద్యమా!’ – అడిగిన ప్రిన్సిపాల్:
1964 డిసెంబరులో నెల్లురు వి.ఆర్. కళాశాలలో బి.ఎ. రెండో సంవత్సరం చదువుతున్నాను. ఏటా కళాశాల సాంస్కృతికోత్సవాలకు సినీనటులను అతిథులుగా పిలుస్తారు. ఆ సంవత్సరం బాలయ్య (ఇంజనీరు)ను పిలిచారు. తొలిసారిగా నేను ఒక పద్యం ఆయన మీద వ్రాసి, మా ప్రిన్సిపాల్ రేబాల సుబ్బారెడ్డిని వేదిక మీద చదవడానికి పర్మిషన్ అడిగాను. “ఆయన అంత పెద్ద నటుడా?” అంటూ చదవడానికి అనుమతించారు.
“ఆతత నాట్యకౌశల మహత్వముగల్గె తనంత, చిత్ర ని
ర్మాత సహాయమున కలిగె, మా అభిమానము నీకె కెల్గెడున్
నీ తల్లిదండ్రులెంతో మహనీయులు నిన్గన చిత్రసీమ ప్ర
ఖ్యాత కళావిలాసివగు దందరి కన్నును నాట్య చాతురిన్”
అనే పద్యం చదివాను. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. అదే నా అరంగేట్రం.
రెండో రోజు రాజసులోచన, ఆమె భర్త సి.యస్. రావు వచ్చారు. నేను ఎవరి మీదా వ్రాయలేదు సుమా!
‘రక్తకన్నీరు నటునితో’:
కావలిలో ఒక బహిరంగ సభలో రక్తకన్నీరు నాగభూషణం సరసన మాట్లాడాను. మదరాసులో విజయ స్టూడియోలో ఒక సినిమా షూటింగ్ కెళితే, జమున, నాగభూషణం ఆ సీన్‌లో నటించారు. షూటింగ్ విరామంలో జమున నాగభూషణం సహజ నటనను ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా 1980లో జమున కడప వచ్చినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేశాను. 1992లో పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రధాని పి.వి. నరసింహారావు కార్యక్రమం తర్వాత దూరంగా వున్న తన కారు దగ్గరకు పాదచారిగా వెళుతున్న ఆమెను మా ఆకాశవాణి కార్లో ఎక్కించుకొనడం గుర్తుంచుకోదగిన సంఘటన.
జోలె పట్టుకున్న ANR – NTR:
వరద బాధితుల సహాయ నిధికి చందాలు వసూలు చేయడానికి సినీ బృందం కడపకు 1980లలో వచ్చినపుడు అక్కినేని, ఎన్.టి.ఆర్. ప్రతాప్ హోటల్లో దిగారు. వారు ఇద్దరు జోలె పట్టుకుని నిల్చోగా నేను ఇద్దరినీ ఇంటర్వ్యూ చేశాను. మదరాసు తెలుగు అకాడమీకి గౌరవ ఉపాధ్యక్షుడిగా ఏటా అక్కినేనితో పాటు నేనూ సభలలో మదరాసు, విజయనగరంలలో పాల్గొన్నాను. “ఏం స్వామీ!” అని ఆప్యాయంగా పలకరించేవారు. నాగార్జున వివాహానికి హాజరయ్యాను.
రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదు కేంద్రం నుండి పలుమార్లు రికార్డు చేశాను. ఇద్దరు దిగ్గజాల పరిచయాలు ఆకాశవాణి ద్వారా కలిగాయి.
బావగారి కబుర్లు:
కడప ఆకాశవాణిలో రెండేళ్ళపాటు గొల్లపూడి మారుతీరావుతో నేనూ పనిచేశాను. అప్పటలో ఆయన సినిమాలకు కథ, మాటలు వ్రాసేవారు. అది 1981. కడపలోని ప్రభుత్వోద్యోగుల క్రీడా సాంస్కృతిక సంస్థ పక్షాన అనిసెట్టి వ్రాసిన ‘ఆడది’ నాటిక రంగస్థలంపై ప్రదర్శించాము. అందులో గొల్లపూడి యజమాని. నేను యింటి వంటవాడు. కాఫీ సరిగా పెట్టలేదని నా చెంప వాయించే సన్నివేశాన్ని ఆయన సహజంగా నటించడంతో, అప్పటి నుంచి నాటకాలేయడం మానేశాను. మేమిద్దరం రేడియోలో బావగారి కబుర్లు చెప్పాం. ఆయన తొలి సినిమా డైరక్టరు కోడి రామకృష్ణ మా నాటకం చూశారు. గొల్లపూడి, నేను ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తొలి రోజు చూశాం కడపలో. హరనాథ్ కడప సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
అనుకోని అతిథి:
ఒక సాయంకాలం నేను హైదరాబాద్ మణికొండలోని వారి నివాసంలో బ్రహ్మానందాన్ని కలిసి ఓ అరగంట సాహితీ కబుర్లు చెప్పుకొన్నాం. మాటల సందర్భంలో మా ఆవిడ శోభాదేవి అన్నమయ్య రచనలపై నాలుగు పుస్తకాలు వ్రాశారని చెప్పాను. మా ఇంటికి వచ్చి ఆ పుస్తకాలు తెచ్చుకొంటానని సరదాగా అన్నారు. వారం రోజుల తర్వాత ఉదయం 9 గంటలకి ఫోను చేసి ‘నేనివాళ 12 గంటలకు మీ ఇంటికి వచ్చి భోం చేసి పుస్తకాలు తెచ్చుకుంటా’నన్నారు. వచ్చారు. నాలుగు గంటలు కబుర్లు చెప్పి భోం చేసి వెళ్ళారు.
మా ఇంటి బెల్ కొట్టిన ‘అల్లు’:
1996లో ఓ ఆదివారం సాయంకాలం 4 గంటల ప్రాంతంలో నేను విజయవాడ ఆకాశవాణి క్వార్టర్స్‌లో (పున్నమ్మతోట) విశ్రాంతి తీసుకుంటున్నాను. ఎవరో బెల్ కొడితే, మా ఆవిడ తలుపు తీసి ఆనందంతో, ‘ఏమండీ!’ అంటూ కేకవేసింది. వెళ్ళి చూస్తే అల్లురామలింగయ్య. ఆయన, నేను ఆ సాయంకాలం సినీ రచయిత జాలాది నందిగామలో ఏర్పాటు చేసిన రామాలయ ఉత్సవాలకు వెళ్లాలి. జాలాది కారు పంపారు. అల్లు ముందుగా ఆకాశవాణికి వెళ్ళి నా కోసం వాకబు చేశారు. అనౌన్సర్ మల్లాది సూరిబాబు నాకు ఫోన్ చేయబోతే, వద్దరి ఇద్దరూ కలిసి మా యింటికి వచ్చారు. ఓ గంట సేపు కబుర్లు చెప్పుకొని, నందిగామ వెళ్ళి, వేలాదిమంది గుమిగూడిన సభలో మాట్లాడి తిరిగివచ్చాం. దారి పొడుగునా తన కూతుర్ని చిరంజీవికిచ్చిన సంఘటన చెబుతూ ఆనందింపజేశారు.
వడలు తినననిన జగ్గయ్య:
1996 డిసెంబరు 1న విజయవాడ కేంద్ర 48వ వార్షికోత్సవం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశాం. ముఖ్య అతిథిగా రేడియో వార్తలు 1948 ప్రాంతాలలో చదివిన కొంగర జగ్గయ్యను పిలిచాను. ముందు ఫోన్ చేసినప్పుడు రాలేనన్నారు. రెండో దఫా ‘వస్తా’నని వచ్చారు. ఆ మధ్యాహ్నం మా యింట భోం చేస్తున్నప్పుడు మా ఆవిడ మినప వడలు వడ్డించింది.
“వద్దమ్మా” అన్నారు.
“నూనె వస్తువులు తినరా?” అంది.
‘లేదమ్మా! మా అమ్మగారు చిన్నప్పటి నుంచీ నాకు మినప వడలు పెట్టేది కాదు. బుద్ధిమాంద్యం కలుగుతుందని చెప్పింది. అది మొదలు తినడం లేద’న్నారు. ఆ సాయంకాలం సభలో తన కంచు కంఠంతో ప్రేక్షకులకు తన ఢిల్లీ విశేషాలు వివరంగా చెప్పి ఆనందింపజేశారు.
విజయవాడలో 1995-97 మధ్యలో ఎందరో సినీ ప్రముఖులు స్టూడియోకి వచ్చేశారు. సినీ రచయిత డి.వి. నరసరాజు, జంధ్యాల, సాక్షి రంగారావు, కోట సోదరులు, పలు సమయాలలో ఇంటర్వ్యూలు రికార్డు చేశారు. జంధ్యాల ప్రోత్సాహంతో 1980లో మా ప్రసారశాఖలో పనిచేస్తున్న వీరభద్రరావు సినీ రంగ ప్రవేశం చేసి, సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధులయ్యారు. నా వీడ్కోలు సభలో జంధ్యాల నన్ను ప్రశంసిస్తూ మాట్లాడారు. రేడియోతో తన అనుబంధం పంచుకొన్నారు. కోట శంకరరావు రేడియో నాటకాల ద్వారా తాను సినిమాకు పరిచయం కావడాన్ని తరచూ చెబుతుంటారు.
నా సన్మాన సభలో గుమ్మడి:
2003లో నాగభైరవ కోటేశ్వరరావు హైదరాబాదు త్యాగరాయ గానసభలో నాగబైరవ కళాపీఠం అవార్డును నాకందించారు. ఆ సభలో డా. సి. నారాయణరెడ్డి, గుమ్మడి ప్రత్యేకాకర్షణ. మదరాసు ఆకాశవాణిలో నాటకాలలో పాల్గొన్న విషయాలను గుమ్మడి సభలో గుర్తు చేసుకొన్నారు.
చంద్రగిరి సమీపంలోని మోహన్‍బాబు ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవాలకు ఆర్థిక శాఖ మంత్రి కె. రోశయ్య ముఖ్య అతిథి (2006). కళాశాల ఆహ్వానం మేరకు నేను ఆ సభలో పాల్గొన్నాను. మోహన్‌బాబు ఎంతో గౌరవంతో తమ గురువుకు పాదపూజ చేశారు ఆ సభలో.
“ఆకాశవాణి కార్యక్రమాలు ఇవ్వండి!” అని 1983లో ధర్మవరపు సుబ్రమణ్యం మా మిత్రులు చలపతిరావు ద్వారా వచ్చి అడిగారు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరక్టరు. ఎన్నో కార్యక్రమాలు చేశాడు. తర్వాత దూరదర్శన్‌లో ‘పకపకలు’ చేశాడు. సినిమాకెళ్ళి తిరుగులేని హాస్యనటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. రాళ్ళపల్లి, గుండు హనుమంతరావు ప్రభృతులు రేడియో నాటకాలలో వేషాలు వేసినవారే. కడపకు చెందిన పద్మనాభం కడపలో ఇంటర్వ్యూ రికార్డింగ్ చేశారు.
గడుసరి అత్తగారు:
1996లో విజయవాడ కేంద్రానికి భానుమతిని ఆహ్వానించాను. బెట్టు చేయకుండా అంగీకరించారు. ఇంటర్వ్యూ చేయడానికి మిగతావారు సందేహిస్తుంటే, డైరక్టరుగా నేనే ప్రశ్నలు సంధించాను. తనదైన సహజ ధోరణిలో గంభీరంగా సమాధానాలు చెప్పారు. చివరి ప్రశ్న –
“మీకు గర్వం అంటారు…” అన్నాను. అందరు నిశ్చేష్టులయ్యారు.
ఆమె పగలబడి నవ్వారు. కళాకారులకు ఆత్మాభిమానం అలంకారం” అని ముక్తాయింపు ఇచ్చారు.
ఎందరో నటీమణులు:
సినీనటి రోజా విజయవాడ స్టూడియోకు 1996లో వచ్చినప్పుడు అందరూ ఫోటోలు దిగారు. ఆమె సహజ ధోరణిలో సమాధానాలు చెప్పారు. గొల్లపూడి మనవరాలి పెళ్ళిలో మదరాసులో షావుకారు జానకిని కలిశాను. తాను రేడియో నాటకాలలో పాల్గొన్న విషయాలు చెప్పి మురిసిపోయారు. మోతీనగర్ (హైదరాబాదు)లో జరిగిన ఒక సభలో వాణిశ్రీ పాల్గొన్నారు. ‘మాదీ నెల్లూరు!’ అని నేను పరిచయం చేసుకొంటే, ‘మాదీ ఏలూరు, మీదీ ఏలూరు!’ అని చమత్కరించారు. తిరుపతి దేవస్థానం పక్షాన తాళ్ళపాకలో జరిగిన అన్నమయ్య (2007) 600వ జయంతి ఉత్సవాలకు కాంచనను ఆహ్వానించాను. దగ్గరుండి తిరుమలలో దర్శనం చేయించాను. తాళ్ళపాక వేదికపై శోభన అద్భుత నృత్య ప్రదర్శన చేసింది.
వెంగమాంబ – విశ్వనాథ్:
యస్.వి. భక్తి ఛానెల్ కోసం వెంగమాంబ సీరియల్ తీశాం. అప్పుడు కె.విశ్వనాథ్ తిరుపతిలో మూడు రోజులు బస చేసి బాపూ, రమణలతో కలిసి చర్చించి కథా నిర్మాణానికి దోహదం చేశారు. రాఘవేంద్రరావు తాళ్ళపాకలో ప్రత్యేక ఆకర్షణ. ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ, నేను వ్రాసిన తెలుగు పత్రికల సాహిత్య సేవ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
అప్పు తీర్చిన అమితాబ్:
ఢిల్లీ దూరదర్శన్ మండీ హవుస్‍కు అమితాబ్ బచ్చన్ వచ్చిన రోజు ఆఫీసు అంతా కోలాహలం. సాయంత్రం ఆరు గంటలకు ఆయన వస్తాడని తెలిసి అంతా ఆఫీసు వదలలేదు. ABCL పక్షాన ఆయన సినిమాలు దూరదర్శన్‌లో ప్రదర్శించిన సినిమాల తాలూకు చెల్లించవలసిన బాకీ చాలా సంవత్సరాలు ఆయన తీర్చలేదు. దూరదర్శన్ గట్టి పట్టుబట్టింది. అమితాబ్ స్వయంగా దూరదర్శన్ డైరక్టర్ జనరల్ ఖురేషీని కలిశారు. మధ్యవర్తిత్వంగా తాను కట్టవలసిన బాకీని కొంత చెల్లించేటట్లు, మిగతా తాను ప్రభుత్వ ప్రకటనలు ఉచితంగా చేసేటట్లు ఒప్పందం కుదిరింది. ఢిల్లీ స్టూడియోలకు సినీ గాయకురాలు ఆశా భోస్లే, పూనం థిలాన్, పీనాజ్ మసాని, దలేర్ మెహ్ందీ వచ్చినప్పుడు స్వాగతం పలికాను. లతా మంగేష్కర్ తిరుమల నాద నీరాజన మండపాలలో జరిగిన కార్యక్రమాలలో అన్నమయ్య సంగీత కీర్తనల క్యాసెట్‌ను 2008లో విడుదల చేశారు. అనూరాధ పొడ్వాల్ నాద నీరాజనంలో ప్రత్యేక ఆకర్షణ.
సన్నిహితులైన సినీ గాయకులు:
ఆకాశవాణి, దూరదర్శన్‌లలో మూడు దశాబ్దులు (1975-2005) పని చేయడం వల్ల ఎందరో కళాకారులు పరిచితులయ్యారు. నెల్లూరి వాడే అయిన ‘బాలు’ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. 2004లో మా నాన్నగారి స్మారకంగా ఏటా యిచ్చే అనంత లక్ష్మీకాంత సాహితీ పురస్కారం ‘బాలు’కు నెల్లూరు టౌన్ హాల్‌లో స్వర్ణ కంకణ ప్రదానంతో అందించాము. గొల్లపూడి అతిథి.
తాళ్ళపాకలో జరిగిన అన్నమయ్య 600వ జయంతి ఉత్సవాలకు రమ్మని నేను స్వయంగా వెళ్ళి, కోటిని, వందేమాతరం లను ఆహ్వానించి వచ్చాను. వారు విచ్చేశారు. సుశీలమ్మ, జానకి పాల్గొన్నారు. వాసూరావు ప్రత్యేక కార్యక్రమం మహతిలో ప్రదర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా 1980లలో వ్యవహరించిన సినీ నిర్మాత బి. నాగిరెడ్డిని ఇంటర్వ్యూ చేస్తే ఎంతో భక్తి ప్రపత్తులతో సమాధానాలు చెప్పారు. యస్.వి.బి.సి. కార్యక్రమాల రూపకల్పనలో దొరస్వామి రాజు, పి.సి.రెడ్ది భాగస్వాములయ్యారు. మాధవపెద్ది సురేష్ ఆత్మీయులయ్యారు.
ఢిల్లీలో దూరదర్శన్ కార్యక్రమ నిర్మాణానికి రచయిత సి.యస్.రావుతో బాటు జె.వి.సోమయాజులు వచ్చారు. ఆ కమిటీకి నేనే ఛైర్మన్. వారికి 13 ఎపిసోడ్లు కళాపూర్ణోదయం నిర్మించే అవకాశం జాతీయ స్థాయిలో కలిగించాను.
సినీ రచయితల ఆదరం:
ప్రసిద్ధ సినీ రచయితలందరూ నన్ను ఆదరించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిని మదరాసులో కలిశాను. ఆయన కాగితం మీద ఇలా వ్రాసి చూపించారు.
“అందమైన కందపద్యం పద్మనాభరావు” అన్నారు నవ్వుతూ.
రేడియోలో పని చేసిన దాశరథి, శ్రీశ్రీ ఎన్నో కవి సమ్మేళనాలలో నా ఆధ్వర్యంలో కవితలు చదివారు. ఆరుద్ర, నారాయణ రెడ్డి, జాలాది, సాహితి, ఆదివిష్ణు, యం.వి.యస్. హరనాథరావు, అనంత శ్రీరామ్, ఆకెళ్ళ, వి.ఎ.కె. రంగారావు, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు భిన్న సందర్భాలలో ఆత్మీయులయ్యారు.
దర్శకులలో రాఘవేంద్రరావు, శ్రీనివాస రెడ్డి, దొరస్వామి రాజు, రామోజీరావు, యం.యస్. రెడ్ది (నిర్మాత) సుపరిచితులు. శ్రీకాంతశర్మ కుమారుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఆత్మీయుడు. సెన్సార్ బోర్డు మెంబరుగా ఐదేళ్ళు ఎందరో సినీ వ్యక్తులను సాధికారికంగా కలిసే అవకాశం లభించింది.