‘నైటింగేల్ ఆఫ్ రవీంద్ర సంగీత్’… కనిక బందోపాధ్యాయ

0
3

[box type=’note’ fontsize=’16’] ది 12-10-2020న ‘నైటింగేల్ ఆఫ్ రవీంద్ర సంగీత్’ అని ప్రఖ్యాతి గాంచిన ‘కనిక బందోపాధ్యాయ’ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]భా[/dropcap]రతదేశం విభిన్న జాతులకు, భాషలకు, మతాలకు నిలయమయినట్లే… వివిధ సంగీత సాంప్రదాయాలకూ నెలవు. వాటిలో కర్నాటక, హిందూస్థానీ సంగీతాలకు గల స్థానం అజరామరం. అలాగే గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రయోగాల ఫలితంగా ఆవిర్భవించిన ‘రవీంద్ర సంగీత్’కి గల స్థానం కూడా విశ్వవ్యాపితం. రవీంద్ర సంగీత్‌తో ప్రాచుర్యం పొంది, శ్రోతలను పరవశింపజేసిన ‘నైటింగేల్ ఆఫ్ రవీంద్ర సంగీత్’ స్వర్గీయ కనిక బందోపాధ్యాయ.

కనిక నాటి బెంగాల్ లోని బంకురా జిల్లా సోనాముఖిలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు అనిలాదేవి, సత్యచరణ్ ముఖోపాధ్యాయలు. 1924 అక్టోబరు 12వ తేదీన జన్మించిన కనికకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అనిమా. ప్రముఖ కవి ‘బీరేంద్ర చంద్ర బందోపాధ్యాయ’ను వివాహమాడారు.

ఈమె దినేంద్రనాథ్ ఠాగూర్, శైలజా రంజన్ మజుందార్, శాంతి దేవ ఘోష్, ఇందిరా చౌధురాణి వంటి విద్వాంసుల వద్ద సంగీతాన్ని అభ్యసించారు.

‘విశ్వభారతి’ విశ్వవిద్యాలయంలోని ‘సంగీతభవన్’లో సంగీతాభ్యాసం చేశారామె. స్వయంగా గురుదేవుని శిష్యరికం పొందిన అదృష్టం ఆమెది. ఠాగూర్ సృజించిన గీతాలు ‘రవీంద్ర సంగీత్’గా పేరు పొందాయి. ఈ సంగీత్‍లో కనికను నిష్ణాతురాలిగా చేశారాయన. ఆమె పేరును కూడా ‘అనిమ’ను ‘కనిక’గా మార్చారు.

కనిక గురుదేవుని శిష్యరికంలో నాట్య ప్రదర్శనలు, నాటికలలో పాల్గొన్నారు. విశ్వభారతి సంగీతభవన్ శిష్యురాలిగానే కాదు, ఉపాధ్యాయినిగా, శాఖాధిపతిగా, ప్రిన్సిపాల్‍గా విధులను నిర్వహించి రికార్డు సృష్టించారు. పదవీ విరమణ తర్వాత కూడా సేవలను అందించి విశ్వభారతి విశ్వవిద్యాలయం ఋణం తీర్చుకున్నారు.

రవీంద్ర సంగీత్‍తోనే సరిపెట్టుకోలేదామె. దేశీయ సాంప్రదాయాలను కూడా సాధన చేశారు. కాజీ నజ్రుల్ ఇస్లాం పాటలను కూడా ఆలపించారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో కచేరీలు చేశారు. అమెరికా, ఐరోపా దేశాలలో కూడా కచేరీలు నిర్వహించి రవీంద్ర సంగీత్‌కి విశ్వవ్యాపితంగా పేరు తెచ్చారు. ‘ఇండో – బంగ్లాదేశ్ సాంస్కృతిక సంస్థ’ ద్వారా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈమె పర్యవేక్షణ, నేతృత్వంలో గురుదేవుని నృత్య రూపాకాలకు ప్రాచుర్యం లభించింది. ఈ రూపకాలు దేశవిదేశాలలో ప్రదర్శించబడడం విశేషం.

సుమారు మూడు దశాబ్దాల పాటు రేడియో ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆమె అందిందిన 300 గ్రామఫోన్ రికార్డులు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి.

ఆమె ‘ఎల్మర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ స్టడీస్‌’తో కలిసి పనిచేశారు.

సంగీత రంగంలోనే కాదు, సంఘ సేవకురాలిగానూ పనిచేశారు. అనేక సామాజిక, సమాజాభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె శిష్యులు అన్ని రంగాలలోను సహకారాన్ని అందించారు.

1986 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో, విశ్వభారతి విశ్వవిద్యాలయం ‘దేశికోత్తమ’ బిరుదుతోనూ సత్కరించాయి.

2000 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఊపిరితిత్తుల వ్యాధితో మరణించారు.

‘నైటింగేల్ ఆఫ్ రవీంద్ర సంగీత్’గా పేరు పొందిన కనిక బందోపాధ్యాయ జ్ఞాపకార్థం 2002వ సంవత్సరం అక్టోబరు 12వ తేదీన ఒక స్టాంపును విడుదల చేసి ఆమె పట్ల గౌరవాన్ని ప్రకటించింది భారత ప్రభుత్వ తపాల శాఖ.

ఆమె జయంతి సందర్భంగా నివాళిని అర్పించి రవీంద్ర సంగీత్‌ని, కనిక బందోపాధ్యాయని గౌరవించుకోవడం మన విధి.

Image Courtesy – internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here