[dropcap]దే[/dropcap]శంలో నేటి సామాజిక స్థితిగతులపై తన ఆలోచనలను ‘వారెవ్వా’ అంటూ కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు ఐతా చంద్రయ్య.
మాతృభాషన విద్యా బోధన
మహత్కరమౌ కార్యము గద!
ప్రాథమిక జ్ఞానమ్ము మాతృ
భాషలలోనే పట్టుబడును.
పసి(డి)ప్రాయం నందు తల్లి
భాషతోనే తనివి దీరును.
అన్య భాష మాధ్యమమ్మున
బోధ నతలాకుతల మౌను.
శ్రీమంతుల పిల్ల లెట్లాగ
చదివినా నష్టమ్ము లేదు.
***
పులిని చూసి నక్క వాతలు
పెట్టుకున్న లాభమేమి?
పేద పిల్లలు ఇతర బాషల
మాధ్యమెళ్ళిన ఫలితమేది?
ఆంగ్ల మాధ్యమ మందు పిల్లలు
ఆగమైపోతారు గద మరి.
ఎంత చదివిన ఒంటబట్టదు
మాట తెలుగు చదువు ఇంగ్లీష్.
రెంట చెడిన రేవడిగా
మిగిలిపోదురు చాలా మంది.
***
విదేశాల ఉద్యోగానికై
ఇంగ్లీషు కావాలన్నరు.
కళాశాలన విద్యలైతె
ఇంగ్లీషున సాగెను గదా!
అదే భాషా జ్ఞానమ్ముతో
విదేశాలకు పంపవచ్చు.
వెనకబడిన వారలెవ్వరూ
విదేశాలకు ఎంపికవరు.
మాతృభాషలో చదవకుంటే
భవిష్యత్తు శూన్యమే గద!