[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]
ఆమెలో… ఆమెనై..!
[dropcap]స్వ[/dropcap]చ్ఛంద పదవీ విరమణ చేసి ఆస్ట్రేలియా వలస వచ్చేసాక తెలుగుతనం కోసం తపిస్తూ తరుచూ ఒంటరిగా ఫీల్ అవుతుండేదానిని. ఒంటరితనం అంటే తోడు లేకపోవటం అనుకునే నాకు అప్పుడే ఒంటరితనానికి అసలు కారణం తెలిసింది. ఎఫ్‌ఎంలో తెలుగు పాటలు లేకపోవటం, చెవులకు తెలుగు మాటలు వినిపించక పోవటం, కళ్ళకు తెలుగుతనం కనిపించకపోవటం, లైబ్రరీలో తెలుగు పుస్తకం దొరకకపోవటం, ఈ నేల, ఈ గాలి అన్నీ తెలుగు లేమితో బాధపడటమే నా డిప్రెషన్‌కు, నాలో ఒంటరి భావనకు కొంత కారణం. అలాంటి ఒంటరితనంలో ఒక రోజున ఒక రెస్టారెంట్‌కు వెళ్ళి ఏకాంతంగా ఓ మూల కూర్చున్నాను.
ఒంటరితనానికి ఏకాంతానికి మధ్య అంతరాన్ని బేరీజు వేసుకుంటూ ఒక్కర్తినీ జూస్ సిప్ చేస్తూ చుట్టూ పరిసరాలు గమనిస్తున్న నా దృష్టి ఎదురుగా వున్న కోజీ కార్నర్‌లో క్లోజ్‌గా వున్న ఇద్దరమ్మాయిల మీద పడింది. ఇద్దరూ లిప్ టు లిప్ కిస్ ఇచ్చుకుంటున్నారు. రెస్టారెంట్ మొత్తం ఎక్కువ జంటలు అటు లెస్బియన్సో లేదా ఇటు గేసో వున్నారు. ఈ ప్రాంతంలో అమ్మాయి అబ్బాయిల జంటలు తక్కువ. కలికాలపు స్వలింగ సంపర్కాలు ఎక్కువ. చిత్రంగా ఆ క్షణం నాకు హై స్కూల్ రోజుల్లోని నా ప్రాణ స్నేహితురాలు క్వీనీ గుర్తొచ్చింది. క్వీనీతో పాటు ఎక్కడో చదివిన ఒక ఆంగ్ల కోట్ కూడా గుర్తొచ్చింది.
“Friendship marks a life even more deeply than love. Love risks degenerating into obsession, friendship is never anything but sharing.”
నా బ్లాక్ బ్యూటీ తలపులతో మనసు గతంలోకి పరుగులు తీసింది.
తెల్ల తోలు కోసం వెర్రిగా ఎగబడతాం కాని కాంతివిహీనంగా వున్న చర్మం తెలుపైనా వ్యర్ధమే. పాలిష్ చేసిన మెషీన్ కట్ నగలా తళతళలాడే క్వీనీ మొహం చామనఛాయలో కూడా మెరిసిపోతుండేది. హై స్కూల్లో ఆరో క్లాసులో చేరిన మొదటి రోజే తన మృదుభాషణం, సహజత్వం, సౌశీల్యం నన్నాకట్టుకున్నాయి. క్వీనీ పొందికగా, కాసింత బెరుగ్గా, బితుకు బితుకుమంటూ భానుప్రియ కళ్ళలాంటి కళ్ళను టపటపలాడిస్తూ, తుమ్మెద రెక్కల్లాంటి కన్రెప్పలను అల్లల్లాడిస్తూ కళైన మోముతో కాంతులీనుతుండేది.
అందం వేరు. ఆకర్షణ వేరు. అందం అందరినీ ఆకర్షించక పోవచ్చేమో గాని ఆకర్షణ ఏ ఒక్కరి దృష్టిని తప్పించుకోలేదు. అందం, ఆకర్షణ రెండూ ఒకరినే వరిస్తే అది అద్భుతం. క్వీనీ నా కళ్ళకు ఒక అద్భుతం. తనో మిడిల్ క్లాస్ క్రిష్టియన్ అమ్మాయి. ప్రతి శనివారం స్పోర్ట్స్ రోజున శ్వేత వస్త్రాల్లో నా కళ్ళకు శాంతిదూతలా ప్రశాంతంగా ప్రసన్నంగా కనిపించేది. తనతో స్నేహం అపురూపంగా అనిపించేది.
అప్పట్లో హిందీలో “Guddi” అనే సినిమా రిలీజయ్యింది. అచ్చు ఆ సినిమాలో జయ బాధురిలా క్వీనీ ముచ్చటగా ముద్దొస్తుండేది. నేను తనపై చూపే ప్రేమాభిమానాలకు పదింతలుగా తనూ నన్నెంతగానో ఆరాధించేది. పాలంత స్వచ్చమైన స్నేహం మా మధ్య. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. తను నా విషయంలో పొసెసివ్‌గా ఫీలయ్యేది. నేను తనను చాలా ప్రొటెక్టివ్‌గా చూసుకునేదానిని.
క్వీనీ చదువులో ఏవరేజ్. నేను క్లాసు ఫస్టు, స్కూలు ఫస్టు, మెరిట్ స్కాలర్‌షిప్ హోల్డర్ని. అవతలి వ్యక్తిపైనున్న అపారమైన ప్రేమ మనలో సహనాన్ని పెంచుతుంది. తనకు చాలా సహనంతో అనునయంగా పాఠాలు అర్ధమయ్యేట్టుగా వివరించి నేర్పేదానిని. సహనంతో కూడిన నా టీచింగ్ స్కిల్స్‌కి అప్పుడే పునాది పడింది. నా నోట్సు తనకు ఇస్తుండే దానిని. కంబైన్డ్ స్టడీస్ కోసం క్వీనీ మా ఇంటికొస్తుండేది. అమ్మతో తనకిష్టమైన వంటలు చేయించేదాన్ని. వెళ్ళిపోయేప్పుడు రిక్షా ఎక్కించి, చార్జీలు ఇచ్చి, రిక్షావాడికి వంద జాగ్రత్తలు చెప్పి పంపేదాన్ని. ఎంతో ఓవర్ ప్రొటెక్టివ్‌గా ప్రవర్తించేదాన్ని. తను పొట్టిగా ముద్దుగా పసిపాపలా వుంటే తనకన్నా ఓ అడుగు బారుగా వుండే నేను నన్నొక హీరోలా ఫీలయేదాన్ని.
ఒక స్త్రీ మరో స్త్రీ పట్ల ఆకర్షితమవటానికి ఇప్పటి రోజుల్లో వేరే పేర్లు వున్నాయి. అయితే అప్పటికి ‘లెస్బియన్’ అనే పదమొకటి వుందని కూడా తెలియని రోజుల్లో చేసిన సక్రమ స్నేహం అది. చెబితే నమ్మరు కాని ఏ అక్రమ ఆలోచనలూ లేకుండానే పెద్దయ్యాక ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో వుందామనుకునేవాళ్ళం.
బక్కపలుచగా చిన్నగా వుండే తను ఎప్పుడూ ఓపిక లేనట్టుగా తన బరువంతా నాపై వేసేసి నా మీదకు ఒరిగిపోయి నాలోకి ఒదిగినట్టు వుండేది. అలాంటప్పుడు తల్లికి బిడ్డపై కలిగే మమకారం, అక్కకు చెల్లెలిపై ఉప్పొంగే అనురాగం నాలో వెల్లివిరిసేవి. ఇద్దరి వయసు ఒకటే అయినా తను పసిది, తన బాధ్యత నాది అనే ఫీల్ కలిగేది నాకు. అదొక అవినాభావ స్నేహబంధం. తన స్పర్శ, తన నుండి వచ్చే క్యూటిక్యుర పౌడరు వాసన చాలా ఇష్టంగా వుండేవి.
ఐదేళ్లు సాగిన ఆ స్నేహబంధం టెన్త్ క్లాసుకి వచ్చేసరికి మరింత పటిష్టమయ్యింది. అయినా పెద్దల చాటు పిల్లలం. పెద్దవాళ్ళమవ్వటమే కాకుండా పెద్దమనుషులం కూడా అయ్యాము. శరీరంలో వచ్చిన మార్పులతో పాటు పెద్దలు చెక్కిన అడుగుజాడల్లో నడుస్తూ భావోద్వేగాలు తగ్గించుకుని పరిణితి చెందాము. ఆ క్రమంలో మా జీవన గమ్యాలు మారి మా దారులు వేరయ్యాయి. మేము నా కాలేజీకి దగ్గరగా ఇల్లు మారాము. ఇళ్ళ స్థానాలు మారి మా మధ్య దూరాలు పెరిగాయి. ఉద్యోగార్ధమై జీవనోపాథికి తనేదో ITI కోర్సు లో చేరింది. నేను ఇంటరు, డిగ్రీ, పిజి, ఆర్మీ. మా మధ్య కలయికలు తగ్గాయి. క్రమంగా బిజీ బ్రతుకులో పూర్తిగా ఎడమై పోయాము.
స్నేహాన్ని కొనసాగించే స్వేచ్చలో అబ్బాయిలెప్పుడూ స్వతంత్రులే. అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడికయినా వెళ్ళి స్నేహితులను కలిసే వెసులుబాటు జన్మతః వాళ్ళకుంటుంది. ఈ ఒక్క విషయంలో మాత్రమే నేను అబ్బాయిగా పుట్టనందుకు చింతించేది.
క్వీనీ సమాచారం ఏమీ తెలియకపోయినా దాదాపు మూడు దశాబ్దాలు దాటినా ఈ రోజుకీ క్వీనీ తలపు నా మదిలో ఆనందాన్ని, పెదవులపై చిరునవ్వును అరవిచ్చుకొనేలా చేస్తుంది. ఓ పురుషుడికి తన ప్రియురాలి తీపి స్మృతిలా అప్పటి ఆ ఆకర్షణ, ఆ స్నేహ మాధుర్యం ఇప్పటికీ నా జ్ఞాపకాల్లో ఫ్రెష్ గానే వుంది. ఎక్కడయినా క్యూటిక్యుర పరిమళం ముక్కుకి తగిలితే మనసులో క్వీనీ మెదులుతుంది.
అప్పటి ఆ స్నేహంలో పరిపక్వత లేకపోవచ్చేమో గాని స్వచ్ఛత వుండేది. ఆడా మగా తారతమ్యం లేకుండా ప్రతి మనిషికి వయోవృద్ధ భేదం లేకుండా భార్యా, భర్తా, తల్లి, బిడ్డలతో పాటుగా కనీసం ఒక స్వచ్చమయిన స్నేహబంధం వుండాలని నేను బలంగా నమ్ముతాను. ఎటువంటి భేషజాలు లేకుండా, ఏ విషయమైనా నిర్మొహమాటంగా నిస్సంకోచంగా చర్చించుకునే చనువు గల ఒక స్నేహం ప్రతి ఒక్కరికి వుండాలి. అప్పుడే కదా ఆ జీవితం పరిపూర్ణమయ్యేది.
నా ఆలోచనాస్రవంతికి ఆనకట్ట వేస్తూ బేరర్ పిలిచిన పిలుపుతో నాస్టాలజీ నుండి ప్రస్తుతంలోకి వచ్చాను…
(మళ్ళీ కలుద్దాం)