విద్యా తపస్విని శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ

4
2

[box type=’note’ fontsize=’16’] మనిషి అందరిలా పుట్టి మట్టిలో కలిసిపోకుండా విశిష్టమైన పనులు చేసి ప్రత్యేక స్థానం పొందాలి అనుకున్న అసాధారణ మహిళ శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ జీవితగాథ ‘చదువు తీర్చిన జీవితం’ని సమీక్షిస్తున్నారు అల్లూరి గౌరీలక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]ది ఒక అసామాన్య మహిళ అయిన శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారు చెప్పిన స్వీయకథ. మన అమ్మో, పిన్నమ్మో, పెద్దక్కో మనల్ని పక్కన కూర్చోబెట్టుకుని ‘నీ జీవిత చరిత్ర వినాలనుంది చెప్పవా?’ అని మనం అడిగినప్పుడు ప్రేమగా చెప్పినట్టుగా ఎంతో నిరాడంబరంగా, నిజాయితీగా ఉందీ పుస్తకం.

సాధారణంగా మనం మహనీయుల జీవిత చరిత్రలు అంటే ఏ గాంధీ గారిదో, నెహ్రు గారిదో లేదా జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన మహామహుల జీవిత గాథలో చదివినప్పుడు ఎంతో అబ్బురపడి, ఆనందపడతాం. ఆ తర్వాత ‘వాళ్లంతా కారణ జన్ములు, ఆ పట్టుదల, కార్యదీక్ష మనవల్ల ఎక్కడవుతుంది లెద్దూ?’ అని ఓ నమస్కారం పెట్టి వదిలేస్తాం.

మనలాంటి కుటుంబ, సామాజిక, ప్రాంత నేపధ్యంలోంచి వచ్చిన ఈమె జీవిత కథ మనల్ని మమేకం చేస్తుంది. పదిమంది అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మద్య పెరిగిన స్నేహశీలి ఈమె. ఆ కుటుంబమే ఈమెకు ఒద్దికను, ఓర్పును,సామరస్యాన్ని నేర్పి ఉండచ్చు. స్వాతంత్ర్య సమరం నడుస్తున్న కాలంలో తండ్రి ఖద్దరు ధరిస్తూ తల్లి రాట్నం ఒడుకుతూ ఉండగా ఇంజనీరింగ్ చదివే అన్నగారు అద్భుతమైన సాహిత్య పఠనం చేస్తుండగా ఉదయించిన శేషమ్మ గారు జన్మతః సంస్కారవంతురాలు. ఊహ తెలిసిన దగ్గరనుండీ ఈమె తపస్సు చదువే. అందుకే అపార సరస్వతీ మాత కటాక్షం పొందిన స్త్రీరత్నం కాగలిగారు శేషమ్మ గారు.

ఆడపిల్లలను అపురూపంగా పెంచుకునే ఇంట పుట్టిన శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారు తన జీవితాన్ని చదువు ఎలా తీర్చిదిద్దిందో చెప్పుకుంటూ వచ్చారు. ఆమె మనలాగే పల్లెటూరి నేపథ్యంలో ఆడపిల్లకి చదువు అత్యవసరం అని కాక ఏదో చదివింది చాల్లే (అప్పట్లో ఆమె చదివిన పీ.యూ.సీ. పెద్ద చదువే) అనుకునే భావజాలం ఉన్న కుటుంబంలోని స్త్రీయే. అయితే ఆమె పట్టుదల,నిరంతర సాధన ఆమెను మరిన్ని చదువుల సరస్వతిగా, దీప ధారిగా నిలబెట్టాయి.

సాధారణంగా ఎంతో మంది గృహిణులు ‘మేం చిన్నప్పుడు ఎంతో బాగా చదివే వాళ్ళం. కానీ మమ్మల్ని ఇంట్లో పెద్ద వాళ్ళు చదివించకుండా పెళ్లిళ్లు చేసేసారు. సంసారం, పిల్లలు అంటూ ఈ సాగరంలో మునిగాం. ఇంకేం సాధిస్తాం?’ అనేసి నిర్లిప్తంగా ఊరుకుంటూ ఉంటారు. అదిగో…అటువంటి వాళ్లనే ఈ పుస్తకం వెన్ను చరిచి వెంటాడుతుంది. ‘నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు దిద్దుకోవడానికి నువ్వేమైనా ప్రత్యేక కృషి చేసావా? చెప్పు చూద్దాం!’ అని నిలదీస్తుంది.

ఈమె చిన్నతనం నుండే సూక్షగ్రహి. పన్నెండేళ్ళకే సొంతంగా వ్యాసం రాయగల సహజమైన నేర్పున్న విద్యార్థి. మంచి ధారణ, దీక్ష, కృషి, పట్టుదల ఈమె అస్త్రాలు. అందుకే జీవన సమరంలో సవ్యసాచిలా విజయం సాధించగలిగారు.

ఇక ఆటలు, పాటలు, పుస్తక పఠనం ఆమెను చక్కని వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఈమెకు పీ.యు.సి. చదువుతుండగా పదిహేనవ ఏట వివాహం జరిగింది. బ్యాంకు ఉద్యోగి అయిన భర్తను డిపార్ట్‌మెంట్ పరీక్ష రాయమని ప్రోత్సహించి, ఆయనకు చక్కగా నోట్స్ రాసిపెట్టారట ఈమె. ఆయన పరీక్ష పాసై ఇంక్రిమెంట్ తెచ్చుకుని నీకు బహుమతి ఏం కావాలి? అని అడిగితే హిందూ పేపర్ తెప్పించమని అడిగిన చదువులమ్మ మన శేషమ్మగారు. అదీ విద్య పట్ల ఆవిడ కమిట్మెంట్. ఇప్పటికీ ఆనాటి సంఘటనలని, విద్యార్థిగా తాను చదివిన, టీచర్‌గా తాను చెప్పిన పాఠాలను అలవోకగా చెప్పగలిగారంటే ఆమె జ్ఞాపకశక్తి వెనక ఆమె ఏకాగ్రత, అర్ధం అవుతుంది.

అమ్మంటే అమాయకంగా ప్రేమ తప్ప లోకం తెలీని అమ్మకాదు. టీచర్ లాంటి అమ్మ శేషమ్మ గారు. అందుకే ఈమె పిల్లలు కూడా ఉత్తమ విద్యార్థులై తమ తమ జీవితాల్లో విజేతలయ్యారు. స్వయం శక్తితో, నిరంతర శ్రమతో తన జీవితాన్ని సరస్వతీమయం చేసుకుని కుటుంబాన్ని సంపద్వంతం చేసిన పరిపూర్ణ మహిళ. ఉపాధ్యాయురాలిగా విద్యను గరపుతూ అనేక కుటుంబాలకు కులదీపకులైన విద్యార్థులను తయారు చేసారీమె.

పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత BA డిగ్రీ చదువుకునే అవకాశం దొరికిందట. ఏవో ముఖ్యమైన ప్రశ్న- జవాబులు చదివి డిగ్రీ తెచ్చుకోవడం కాదు. అది ఎంతో మంది చేసే పనే. డిగ్రీలో ఒథెల్లో డ్రామా ఉంటే దానివరకే కాకుండా షేక్స్పియర్ ట్రాజెడీలపై వచ్చిన క్రిటికల్ ఎనాలిసిస్ వంటి ఉపన్యాసాలతో సహా చదివారు. డిగ్రీ పాస్ అయితే చాలనుకోకుండా పాఠమనే కొమ్మ పట్టుకుని వృక్ష మూలాల్లోకి అంటే సబ్జెక్టు లోతుల్లోకి వెళ్లి మొత్తం గ్రహించే జిజ్ఞాస కలిగిన అరుదైన స్త్రీ మూర్తి ఈమె.

ఇంగ్లీష్‌లో గాంధీ గారి ఆత్మకథతో పాటు అనేక ఇంగ్లీష్ పుస్తకాలూ, విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం చదువుతూ ఎంతో జ్ఞానం సంపాదించారు. మౌనం పాటిస్తూ, నిరాడంబరంగా ఉంటూ ఆమె తనకంటూ ఒక విశిష్ట వ్యక్తిత్వం ఏర్పరచుకున్నారు. భర్త బ్యాంకు మేనేజర్ కావడంతో ప్రతి మూడేళ్లకు ఒక కొత్త ప్రదేశం చేరి అక్కడ కుదురుకోవడం, పిల్లలను కొత్త స్కూల్‌లో చేర్పించి ఆ స్కూల్‌కి వాళ్ళను అలవాటు చెయ్యడం ఎంతో శ్రమతో కూడిన పనులు. అవన్నీ అవలీలగా చేసారీమె. జీవితాన్ని ప్రతి మలుపులోనూ ప్లాన్ చేసుకోవడం దీని వెనక రహస్యం

నలభై ఏళ్ల వయసులో చక్కగా బీ.యిడి. కోర్స్ పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా సోషల్, ఇంగ్లీష్ చెబుతూ కొత్త కెరీర్ ప్రారంభించారు. ఒక స్కూల్ టీచర్‌గా ఈమె విద్యార్థుల కన్నాఎక్కువ కష్టపడి సబ్జెక్టుపై పట్టూ, అవగాహనా తెచ్చుకున్నారు. మనసున్న మంచి టీచర్‌గా, ప్రతిభ కలిగిన టీచర్‌గా పేరు తెచ్చుకోవడం మాటలు కాదు. ఎందులో ప్రవేశించినా కూలంకషంగా జ్ఞానం సంపాదించడమే ఈమె పరమ లక్ష్యం. కృషి ఉంటే మనుషులు ఏమవుతారో మనకి తెలుసు కదా! తనకి అప్పటికే ఎదిగిన సంసారం ఉన్నప్పటికీ తొలి జీతం తల్లికి పంపిన బంగారు కూతురు ఈమె.

తెలివైన పిల్లలు డాక్టర్లు కావాలి అని తరగతి గదిలో ఎందరో విద్యార్థుల్ని ఉత్తేజితపరిచారు. ఈమెకు మహనీయుల జీవిత చరిత్రలు, మరియు ఆత్మకథలపై ఎంతో గౌరవం, మక్కువ. కారణం మనిషి అందరిలా పుట్టి మట్టిలో కలిసిపోకుండా విశిష్టమైన పనులు చేసి ప్రత్యేక స్థానం పొందాలి అనుకోవడం. దానినే ఆమె ఆచరించి తనను తాను ఉన్నత శిఖరం పై నిలబెట్టుకున్నారు.

ఆటువంటి తల్లికి తగిన పిల్లలువారి సంతానం. పెద్దమ్మాయి శైలజ తన క్లాస్‌లోని సబ్జెక్టుల్లో ఫస్ట్ రావడమే కాకుండా,క్విజ్,వ్యాస వక్తృత్వ పోటీల్లోనూ ఆపై అంతర్ పాఠశాలల పోటీల్లో కూడా పాల్గొని బహుమతులు తెచ్చుకుని డాక్టర్ చదివి అసోసియేట్ ప్రొఫెసర్ కూడా అయ్యారు. రెండో అమ్మాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో చరిత్ర లో ఎం.ఏ.,ఎం.ఫిల్. చేస్తే మూడో అమ్మాయి ప్రభుత్వ విద్యాసంస్థలో ప్రిన్సిపాల్ గా ఉన్నారు. వీరి కుమారుడు ఎం.టెక్. చేసి అమెరికాలో ఎం.బి.ఏ. చేసారు. సరస్వతీ మాత బిడ్డలుగా తల్లిని గర్వంగా తల ఎత్తుకునేలా నిలబెట్టిన వీరి పిల్లలు నలుగురూ బంగారు కొండలే. వెనక తల్లి కృషితో బాటు వీరి పిల్లల కష్టం,పరిశ్రమ కూడా ఎన్నదగినవే.

శేషమ్మ గారు పిల్లల్ని పెంచడం అనేది ఒక అందమైన అనుభూతిగా దానినొక ప్రధాన విధిగా చేస్తూనే వంటకాల నుంచి ఇంటిలోని సామానులు సర్దుకోవడం వరకూ అన్నిటా సిస్టమాటిక్‌గా ఉన్నారు. Orderliness is a way of life అని నమ్మారామె. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడమే కాకుండా ఆదాయవ్యయాల్ని కూడా ఒక ప్రణాళిక వేసి దాని ప్రకారం సంసారాన్ని నడిపారు. టీచర్‌గా ఉద్యోగం చేస్తూ, ఇంటిని పనులు చూసుకుంటూ ఒక కుట్టు మిషన్ కొని కుట్టేపని కూడా పెట్టుకున్నారు. శ్రమ జీవనానికి కేర్ అఫ్ అడ్రస్‌గా ఈమె నిబద్దత మనకు అచ్చెరువు కలిగిస్తుంది. భర్త బ్యాంకు మేనేజర్‌గా ప్రతి మూడు సంవత్సరాలకు బదిలీలపై ఊర్లు మారినప్పుడు ఆ పిల్లల్ని కొత్త స్కూల్స్‌లో వేసి వారిని లైన్ లో పెట్టడం ఎంతో శ్రమ తో కూడిన పని. దానిని అవలీలగా చేసారీమె. సంతానం గర్వపడే అమ్మ ఈమె.

తాను పెళ్లయిన తర్వాత కూడా చదువుకుని నలుగురు పిల్లల్ని పెంచుకుంటూ బి.ఎడ్. చేసి ఉత్తమ ఉపాధ్యాయినిగా వందల మంది పిల్లలకు చదువు నేర్పుతూ, వారిని మంచి పౌరులుగా తీర్చి దిద్దుతూ, తన పిల్లలని కూడా ఉన్నత చదువులు చదువుకునేలా వారిని మలిచారు మేడమ్. వీటన్నిటా ఆవిడ చేసిన టైం మానేజ్మెంట్ గొప్పది. ఒక స్త్రీగా, ఒక బ్యాంకు మేనేజర్ గారి భార్యగా, తల్లిగా, టీచర్‌గా బహువిధాలుగా తన జన్మను సార్థకం చేసుకున్న శేషమ్మ గారి జీవిత కథ విశేషమైనది.

విద్య పట్ల ఈమె అంకిత భావన, కర్తవ్య దీక్ష ప్రతి ఒక్కరికీ ఆచరణీయం,ఆదర్శనీయం. అందుకే ఈ పుస్తకం అందరికీ పఠనీయం.ఎంతో సరళంగా, వినయంగా తనను తాను ఆవిష్కరించుకున్న శేషమ్మ గారికి గౌరవ వందనాలు తెలపాలనిపిస్తుంది పుస్తకం చదివాకా. “మనిషిలో దాగున్న మంచినీ, విజ్ఞానాన్నీ బైటికి లాగడమే” అంటూవిద్య గురించి గాంధీ గారు చెప్పిన చక్కని మాటను ఈమె ఆచరించారు. అలాగే జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడైన వ్యక్తి అబ్రహం లింకన్‌ని స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పారు.

జీవిత భాగస్వామిని కోల్పోయినా తట్టుకుని నిత్య విద్యార్థిగా ఇంకా నేర్చుకుంటూ,మనవలను చదివిస్తూ, వీలయినంత తోటివారికి సహాయం చేస్తూ, ఏకాంత తపస్సులోఉంటూ మిత భాషిగా, ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతున్నారీమె. మిత భాషిగా, తన మార్గం అక్షరీకరించి అందులో ఒక సందేశం, సూచనా, ఆత్మవిశ్వాసం కలిగించే వివేచనలతో రాయడం ఆమె మానవ ప్రేమను సూచిస్తుంది. కేవలం పాఠ్య పుస్తకాలే కాకుండా వార్తా పత్రికలూ, సినిమాలూ, సాహిత్యం కూడా మనకి ఎన్నో నేర్పిస్తాయన్న నిజం చెప్పారీమె.

జీవిత చరమాంకంలో కూడా అదే క్రమశిక్షణ పాటిస్తూ, పిల్లల కుటుంబాల జోక్యం విషయంలో కూడా పెద్దల పరిధులని కూడా చెపుతూ ఆమె చెప్పిన సూచనలు ఎందరికో ఆచరణీయం. చిన్నవాళ్లు మనం చెప్పింది చెయ్యరు మనం చేసేది చూసి అదే చేస్తారు అన్నట్టుగా ఈమె మనందరికీ తానేమి చేసారో చెప్పి స్ఫూర్తి కలిగిస్తారు.

“నేను పొందిన అవమానాలను, ఎదుర్కొన్న విమర్శలను విశేషంగా నేను ప్రస్తావించకపోవడానికి కారణం ఏమిటంటే వాటిని నేను పట్టించుకోకుండా ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసాను.వాటిని చెప్పి సానుభూతి పొందాలని నాకు లేదు. వాటిని అధిగమించి, శ్రమించి జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాను” అనడమే ఈ ఆత్మకథలోని సారాంశం లేదా సౌందర్యం. అదే పాఠకులందరికీ పనికొచ్చే విలువైన ఆత్మీయ సందేశం. ఎక్కడో మనకి తెలియని వారి జీవితం కన్నా మనతోటి మహిళామణి జీవన గమనం మనకి మరింత ఆసక్తినీ, ఉత్తేజాన్నీకల్గిస్తుంది. స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ ఎంతో ఉపయుక్తమైన పుస్తకం ఇది.

***

చదువు తీర్చిన జీవితం (ఒక సామాన్య మహిళ ఆత్మ కథ)
శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ
పుటలు: 149
వెల: ₹ 120/-.
ప్రతులకు:
స్మృతి పబ్లికేషన్స్,
డి. కె. శైలజ,
1-9-23, శ్రీరామ్ నగర్,
కాకినాడ 533 003
ఫోన్: 9885401882

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here