అంతఃకరణ శుద్ధితో…

5
3

[dropcap]‘చీ[/dropcap]ర్స్…’

ఎనిమిదిమంది ముక్తకంఠంతో అన్నారు.. ఉద్వేగంతో తోణికిసలాడుతున్నగొంతులు సంయుక్తంగా వొకింత మంద్రంగా పలికాయి. అదొక ప్రముఖ బార్ అండ్ రెస్టారెంటు.. దీపాలు గుసగుస లాడుకుoటున్నట్లు వెలుగు మసకమసగ్గా ఉండి కష్టమర్ల.. అదే.. తాగుబోతుల ఉత్సాహాన్ని మరింత ప్రోత్సహిస్తోంది..

అందరూ చీర్స్ అన్నాక ఎక్సట్రాగా మరోసారి చీర్స్ అన్నాడు ప్రభు..

ప్రభుకు జాతీయ సాహిత్య అకాడెమీ అవార్డు ప్రకటించారు. ప్రభు ఆనoదంతో పులకిoచిపోతున్నాడు.. పట్టలేనంత సంతోషంతో సంబరపడిపోతున్నాడు.. ఆ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో.. చేసుకుంటున్న సెలబ్రేషన్ల సరదా సరిపోతుందో లేదో.. అన్నంత పులకింతగా.. ఉబ్బితబ్బిబై ఊగిపొతున్నాడు.. అందుకే తన రచనలు చదివి ఎప్పుడూ పొగుడుతూ ఉండే ఆరుగురు మిత్రుల్లాంటి సహారచయితలు, కవులకు ఇవ్వాళ మందు పార్టీ ఏర్పాటు చేశాడు.

ప్రభు అనబడే ప్రభాకరరావు తెలుగులో ప్రముఖ రచయిత.. ఆయన రాసే కథలు, నవలలు అన్ని ప్రముఖ పత్రికల్లో వస్తుంటాయి.. కావడానికి ఆయన ఎల్.ఐ.సి.లో ఉద్యోగి.. ఏదో ఉబుసుపోకకు ఉద్యోగానికి వెళతాడు.. పూర్తి కాలం సాహిత్యసేవనం అనే బృహత్తర కార్యక్రమంలోనే ఉంటాడు. అతనికి బయట రచయితగా మంచి ‘గుర్తింపు’ ఉంది.. అన్ని రంగాలలో ప్రముఖులకున్న గుర్తిoపులాగే ఈకాలం రచయితలకున్న గుర్తింపు కూడా ఎక్కువగా “పబ్లిసిటీ గుర్తింపు”.. ఇది సాహిత్యం చదివే పాఠకుల వల్ల రాలేదు..

పాఠకులు ఇప్పుడు వేరు వేరై పోయారు.. సాహిత్యం చదివేవారు వేరు. పత్రికలూ, డైలీ పేపర్లలో హెడ్ లైన్స్ చూసేవారు వేరు.. అంటే వీళ్ళు చదవరు.. పేజీలు తిప్పితిప్పి హెడ్ లైన్స్ చూసి ప్రక్కన పడేస్తారు.. అప్పుడు రచయిత పేరు, కథ లేదా నవల పేరు కాస్త గుర్తుంటాయి.. ఈ రచయితలు తరచుగా సభల్లో పాల్గొంటారు.. అవి మళ్ళీ పేపర్‌లలో, టి.వి.లలో న్యూస్‌గా తెలుస్తాయి.. ఓహో ఈయన రచయిత కాబోలు అనుకుంటారు.. అలా అలా ఆయన పేరు రచయితగా మెల్ల మెల్లగా సాధారణ ప్రజల్లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది.. ఆయన ఏదైనా మీటింగుల్లో లేదా టివి చర్చలో కాస్త ఆకర్షణీయంగా మాట్లాడితే నలుగురి దృష్టిలో పడతారు.. ఆయా చర్చల్లో ఆయనను ప్రముఖ రచయితగా చెబుతూ పిలుస్తూ ఉంటారు.. రచయితను అని పరిచయం చేసుకోవడం వల్ల.. రచయితగా విజిటింగ్ కార్డు రెడీగా పెట్టుకుని అందరికీ ఇవ్వడంవల్ల ఆయన రచయితగా గుర్తింపు పొందుతాడు. ఇలా విశ్లేషిస్తే ప్రభు కూడా అవుననే అంటాడు.

“కాలం మారిపోయింది సార్.. చదివేవాళ్ళ కన్నా విని గుర్తిoచేవాళ్ళే ఎక్కువ.. ఉదాహరణకి బాలమురళీకృష్ణ గారి పేరు అందరికీ తెలుసు. కాని ఆయన పాడిన శాస్త్రీయ సంగీతం ఎందరు విన్నారు. ఎందరికి ఆయన ప్రతిభ తెలుసు”.. నిజంగానే మంచి రచనలు చేసినా గుర్తింపు రాకపోతే ఇలా పబ్లిసిటి గుర్తింపుకోసం పాకులాడవచ్చు. ఈ ప్రముఖ రచయితల రచనలు చదివితే మతిపోతుంది.. అసలు ఆ కవితలు, కథలు, నవలలు పరమ చౌకబారుగా, సినిమా ధోరణిలో లేదా జర్నలిస్ట్ భాషలో వార్తాకధనాల్లా ఉంటాయి గాని సాహితీ గుబాళింపు, విశ్లేషణతో ఆలోచనా ధోరణిని ప్రభావితం చేయగల రచనలు కావవి..

“కొడవటిగంటి కుటుంబరావుగారు ఎవన్నారో విన్నారా.. వో కధ చదివాక మీలో తప్పకుండా ఏదైనా మార్పు జరగాలి. అప్పుడే అది ఉత్తమ రచన అని..” అంటే ప్రభు నవ్వేసి “కొడవటిగంటి కుటుంబరావు అంటే అంత పొడుగు పేరా అంటారిప్పుడు.. జస్ట్.. కో.కు. అంటే చాలు అనే కాలం సార్ ఇది” అని నవ్వేస్తాడు.

“అదే శ్రీశ్రీ గారు శ్రీరంగం శ్రీనివాసరావు అని కాకుండా శ్రీశ్రీ అని పెట్టుకున్నారు..అందుకే ఆయన ఈతరం కవి కూడా” అని శ్రీశ్రీని కోట్ చేస్తూ చమత్కారంగా సమర్థించుకుoటాడు..

అలాంటి ప్రభుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే సామాన్యమా.. గొప్పవిషయమే..

హోటల్ బయట నిలబడి మరీ అందరిని రిసీవ్ చేసుకున్నాడు ప్రభు. అంతా హుషారుగా లోనికొచ్చి కుర్చీల్లో రిలాక్స్ అయ్యేసరికి సుభాని వచ్చి “నమస్కారం సార్” అన్నాడు. ప్రభు డ్రమటిగ్గా చూసి “యస్.. మైడియర్ బోయ్.. మన స్పెషల్ సర్వర్ సుభాని కూడా వచ్చేసాడు.. వీడు నా ఫేవరేట్ సర్వర్.. ఇక ఈ నైట్ అంతా మనకే సర్వ్ చేస్తాడు. నేనంటే అంత ఇది వీడికి” మురిపెంగా అన్నాడు ప్రభు.

సుభాని అందరికి విష్ చేశాడు.. “నేను ప్రభుగారి అభిమానినండి” అన్నాడు.. అందరూ చప్పట్లు.. టేబుల్ మీద గుండెలమీద కొట్టుకుని అనందం వ్యక్తపరిచారు. “వీళ్ళందరూ నా ఫాన్సేరా సుభానీ” అన్నాడు ప్రభు. మళ్ళీ అందరూ అంగీకరిస్తూ చప్పట్లు వగైరా వగైరా..

ఆ శబ్దాల మధ్య అన్నాడు సుభాని “సార్.. ఫాన్స్ అనకండి సర్.. అభిమానులు అనండి”.. అందరూ వొక్క క్షణం ఆగిపోయి భళ్ళున నవ్వారు.. “వీడు తెలుగు భాషాభిమాని..” అన్నాడు ప్రభు.. “అవును సార్.. నాకు తెలుగంటే చాలా ప్రేమ.. నేనెక్కడైనా తెలుగే మాట్లాడతాను.. అందరిని మాట్లాడమని బ్రతిమలాడతాను.”

“గ్రేట్.. ఓ ముస్లిం కుర్రాడు తెలుగు మాట్లాడటం.. తెలుగు ప్రమోట్ చేయడం..గ్రేట్ ” ఎవరో అన్నారు..

“ముస్లిం అయితేనేo.. నా మాతృభాష తెలుగేకదా.. ఉర్దూ మతం వల్ల వచ్చిన భాష.. ఇక్కడ ఆంద్రలో ముస్లింలు మాట్లాడేది తెలుగే.. నేను తెలుగే మాట్లాడతాను.. ‘తల్లిని మించింది తల్లి భాష.. తల్లి భాషపై ఉంచండి కాస్త ధ్యాస’ అన్నారు ఆరుద్ర.. మీరు కవులే కదా.. మీ మాతృభాషను ప్రోత్సహించాల్సిన భాద్యత మీమీద ఉంది కదా సర్..” ఆరుద్రను కోట్ చేస్తూ సాగిన అతని చక్కటి వాక్ప్రవాహంతో మహాకవులంతా క్షణకాలం ముగ్ధులయ్యారు. మరో క్షణకాలంలో వర్తమానంలో కొచ్చారు. “కoగ్రాచ్యులేషన్స్ ప్రభు.. నిజంగా మీ శిష్యుడు అదరగొట్టేశాడు” అన్నాడు వీరేశ్వర్. ఎక్కడో ఇలా అసందర్భ ప్రలాపంలా కనిపించే వారిని అలాగే మెరమెచ్చులతో అభినందించి వదిలేయడంలో పరిణితి చెoదిన కవి ప్రముఖులు వాళ్ళు..

“ఆ.. ఇవ్వాళ ఎవరి బ్రాండ్ వాళ్ళు తీసుకోవచ్చు.. ఈ శుభ సందర్భంగా అందరిని ఆహ్లాదపరచడమే హోస్టుగా నా కర్తవ్యo” అన్నాడు ప్రభు. వెంటనే అంతా తమ తమ అభీస్టాల మేరకు ఆర్డర్ ఇచ్చారు..

అందరూ మొదటి పెగ్గుతోనే చాలా ఓవర్ హుషారు ప్రదర్శిస్తున్నారు.. కుర్చీలలో శరీరం అంతా కదిపి కదిపి నవ్వుతున్నారు.. తమ తమ ఆనందాన్ని తట్టుకోలేనట్లుగా ఉన్నాయి భావ ప్రకటనలు.. ఇక మాటలు సరే సరి.. ఇది అత్యద్భుతం అన్నాడొక కవి… ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానన్నడొక రచయిత.. అసలు నేను ప్రభు గారి రచనలను చదివే రచయితనయ్యా నన్నడో అభ్యుదయ కవి..అసలు శ్రీశ్రీ తర్వాత ప్రభునే అసలు సిసలు విప్లవ కవి అని మరో విప్లవాభిమాని వాక్రుచ్చాడు. సాయిబాబు అనే వో ఔత్సాహితుడు ఈ పార్టీలో పాల్గొన్నాడు. “సై” అంటూ ప్రభు పిలుచుకునే ప్రియశిష్యుడు సాయిబాబు.. ఆయన రోజూ ప్రభు ప్రభు అనే నిద్ర లేస్తాడు.. రోజంతా ప్రభు నామస్మరణే.. ప్రతి సాయంత్రం ప్రభు గారితో చీర్స్ చెబుతూ ప్రతి రాత్రి ప్రభుసేవలో తరిస్తాడు.. సాధారణంగా ప్రభు ఎప్పుడూ సైతో మాత్రమే మందు కొడతాడు.

“గురూగారికి ఎదురులేదండీ. ఆయనకు ఆస్కార్ ఇవ్వాలండి..” అన్నాడు సాయిబాబు పులకిoతగా. చేతిలో గ్లాసు రెండోసారి నిండింది.. వొకరిద్దరు కిసుక్కున నవ్వారు.. నవ్వుతున్న ప్రభు సీరియస్‌గా చూశాడు.. నవ్విన కవికుమారులు సడన్‌గా సీరియస్ అయిపోయారు.. ఆయన నవ్వినవారి పట్ల సీరియస్ ప్రకటించినా శిష్యుడి అభిప్రాయం పట్ల ముచ్చటపడ్డారు.. చిరునవ్వుతో వో ప్రకటన చేశారు. “ఆస్కార్ ఎవరికి ఇస్తారో మనవాడికి తెలవక కాదు.. ఆ స్థాయిలో నాకు అవార్డు ఇవ్వాలని కవిహృదయం”. అప్పుడు అందరూ నవ్వులతో హోరెత్తించారు. ఈ హడావిడిలో మరో రౌండ్ ఆర్డర్ ఇవ్వడం.. బాటిల్స్ రావడం జరిగిపోయాయి. “ఊ.. మీ ఇష్టం.. ఇవ్వాళ అందరూ ఫుల్లుగా ఆనందంలో వోలలాడాలి” అన్నాడు.. అలాగలాగే అంటూ అంతా మందు లోకి దూకారు వోలలాడటానికి…

అంతా ఎనిమిది మంది.. ప్రభుతోపాటు నిలయ విద్వాంసుడు సై ఉరఫ్ సాయిబాబు.. సంగీతశ్రీ (ఈయన కవిత్వంలోనే సంగీతం ఉంటుంది కాబట్టి ఈ కలంపేరు పెట్టుకున్నాడుట), రంగరాజు, సోము(అసలు పేరు సోమ సుందర్రావ్), ఈశ్వరీబాబు (తన పేరుతో భార్య పేరు చేర్చి రాసే కవి), వీరేశ్వర్, కుటుంబరావు పాల్గొన్నారు.. వీళ్ళందరినీ ప్రభు పరిశీలించి మరి పేరుపేరునా ఆహ్వానించాడు. నిజానికి వీరంతా ప్రభుభక్తి పరాయణులు.. ప్రభు రచన ఏది ప్రింట్ అయినా వీళ్ళందరికి ఫోన్ చేసి చెప్తాడు.. వీళ్ళంతా వెనువెంటనే స్పందిస్తారు. ప్రభు రచనలో ఉన్న చమత్కృతి, శైలి, కధా కథనం…అన్నీఅహో ఓహో అనేలా ఉన్నాయని పొగుడుతారు. ఈ ఆరుగురి రచనలు ప్రింట్ అయ్యేది ఎప్పుడో అప్పుడప్పుడు.. కాబట్టి ప్రభుకు జాతీయ అవార్డు రావడం.. ఆయనే పార్టికి పిలవడంతో అంతా పులకింతలో ఉన్నారు.

వాస్తవంగా చెప్పుకోవాలంటే వీళ్ళల్లో రంగరాజు వొక్కడే కాస్త చదివించేలా.. ఆలోచింపజేసేలా రాయగల రచయిత. మిగతా వారంతా మిడిమిడి అజ్ఞానులే.. అడపాదడపా ప్రింట్ అవుతూ ఉంటాయి.. రాసినదంతా చెత్త సరుకే.. ఊకను దంచేవారే కాని ఊహను పెంచేవారు కాదు.. కేవలం రచయిత అనిపించుకోవడమే ఘనతగా భావించేవారే..

మూడో రౌండ్ దాటుతోంది.. కొందరికి మాట తడబడుతోంది.. కొందరికి చొంగ కారడం తెలియడంలేదు.. కొందరు కుర్చీల్లో జారిపోతున్నారు.. కాస్త స్టడీగా ఉన్నది సై మాత్రమే.. అతనికి అలవాటే.. గురువు ప్రభుగారు మూడు దాటితే పరిస్థితి చెయ్యిదాటుతుంది.. అప్పుడు ఇంటికి చేర్చేది సైయ్యే.. తాగితే ఆయన మనిషి కాదని తెలుసు.. కాని ఇవ్వాళ హద్దుమీరిన ఆనందంతో వీళ్ళతో ఏం గొడవ పడతాడోనని తనలో తాను మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరేసుకున్నాడు.. ..

పొగడ్తలు.. విశ్లేషణలు ములగచెట్టు ఎక్కిoచడాలు.. అలా అలా… సిప్ సిప్‌కీ… పెరుగుతున్నాయి..

“అసలు మీ లేడీ కారక్టర్లు.. అబ్బ.. తినేస్తారు గురూ.. నేనూ ట్రై చేశాగాని మీలాగా..ప్చ్..అబ్బే..మీలా రాయలేక పోతున్నా” అన్నాడు కుటుంబరావు.. ఆనందంగా నవ్వాడు ప్రభు.. అవునవును అన్నారు మరో ఇద్దరు.. మిగిలిన వారు మాట్లడలేనట్లు తన్మయత్వంతో తలలూపారు.. “నిజానికి.. నాకు..” జీడిపప్పు నోట్లో వేసుకుని “లేడి బోత్రల్‌కి.. మధురవాణి..ఇన్స్..(ఇన్స్పిరేషన్).. అబ్బ.. ఆడు.. ఆడే.. గురజాడ.. ఏం రాసాడ్రా.. అట్టా రాయడం ..ప్చ్.. నా వల్ల..” చెప్పలేక తల అడ్డంగా ఊపాడు..

“గుర్జాడ.. వోల్దండీ.. ఆయన అప్పుడేప్పుడో.. గ్రేట్.. మీరిప్పుడు గ్రేట్..”

“అవును”..

“అవునవును..”

“మీరే.. నువ్వే.. గ్రేట్..”

“ఇదేగా కేంద్రం గుర్తించింది”

“ఎవ్వడైనా.. ఏ నా కొడుకైనా..ఇవ్వా..ల్సిందే.. నువ్వు రాసింది.. నా కొడక ఏం రాశావ్రా ప్రభు” ఇంకొకడు మరీ క్లోజ్‌గా మందు కలిపిన హృదయంతో వాక్రుచ్చాడు..

ఆనందించాల్సిన ప్రభు బావురుమని ఏడ్చాడు.. అంతా స్టన్నైపోయారు.. ఎవరో మాట్లాడబోయారు.. వారించాడు సై.. గురువుగారిని కంటిన్యూ చెయ్యనిచ్చాడు.

“నాకో ఫాన్ ఉంది.. అదే మా సుభానీగాడి భాషలో అభిమాని” అంతా ఊపిరి పీల్చుకున్నారు..

అందరిలో కొంటెతనం ప్రవేశించింది. అంతా రొమాంటిక్‌గా నవ్వి.. మూలిగి.. కులికి.. ముందుకు వంగి వీర ఆసక్తిని ప్రదర్శించి “చెప్పండి చెప్పండి” అన్నారు.. వొక్క సై తప్ప..

ప్రభు మరింత హుషారుగా ముందుకు జరిగాడు.. నాటకీయంగా ముఖం రోతగాపెట్టాడు.. గ్లాసు ఖాళీ చేసాడు..

“ఫాన్ అంటదిగాని ముసిలి ముండ.. రాసిన ప్రతిదీ.. ప్రతి కథ.. ప్రతి నవల.. అన్నీ.. నేను రాసిందంతా కాపీ అoటదిరా.. తప్పంటదిరా” బావురుమని ఏడ్చాడు..

ఈ సీన్ అందరికి కొత్త.. అంతా లోలోన ఆనందించారు.. పైకి మాత్రం కంగారుపడ్డారు.. పడనివాళ్ళు సై, సుభానీ మాత్రమే.. వాళ్లకు ఇది అనుభవమే.. గురువుగారు మూడో పెగ్గు తర్వాత ఏడవటం.. మాటలు తడబడటం… తాగింది కక్కుకోవడం.. నాలుగో పెగ్గు తర్వాత పడిపోవడం.. సై ఇoటికి చేర్చడం నిత్యకృత్యం.

ప్రభు ఏడుపు ఆపడంలేదు.. సై సుభానీని చూపులతో హెచ్చరించాడు.. “నేను రెడీనే సార్” అన్నాడు తను చేతిలోని బౌల్ చూపిస్తూ.. వాంతి రాగానే సై నోరు పట్టుకుంటాడు.. సుభానీ నోటి దగ్గర పెద్ద బౌల్ పెడతాడు..

“నేను వొరిజినల్.. కాదంటదిరా ఆ ముసిల్ది.. కాపీ గాడ్ని.. అంటది గురూ.. నేను..నేను కాపీ గాడ్నా?” మళ్ళీ భోరుమన్నాడు..

ఇంకో కవి మనసు విప్పాడు.. తన కష్టం చెప్పుకున్నాడు. “మావిడ అంతే.. నా కవితలు చెత్త.. బేవ్.. వాంతి వొకటే తక్కువ అంటది” అన్నాడు. మరో కవి నవ్వి భుజం తట్టాడు. “అవునవును.. ఇలాంటివి రైటర్స్‌కు సహజవే.. ఇష్టం లేకపోతే చదవటం మానెయ్యాలి”.

ఈ స్టేట్మెంట్ అందరికి నచ్చింది..

కానీ ప్రభు మళ్ళీ బావురుమన్నాడు. “ఆ ముసిల్ది.. మా ఆవిడ్ని కూడా చెడగొడతoదoడి.. నా వైఫ్.. నా ముద్దుల పెళ్ళాం.. నా ఫాన్ అని నా చుట్టూ తిరిగితే పెళ్ళి చేసుకున్నా.. అలాంటిదాన్ని మార్చేసిందండి” పెద్దగా అరచినట్లుగా ఏడ్చాడు..

అంతే.. భళ్ళున కక్కుకున్నాడు.. ముగ్గురి బట్టలపై కక్కాడు.. అంతా దుర్గంధం.. పార్టీ బృందం అందరిమీదా అంతో ఇoతో.. అంతా లేచి పోయారు.. సై, సుభానీ తమకు అలవాటైనట్లు ప్రభును పట్టుకున్నారు.. అందరూ తుడుచుకున్నారు. బట్టలు కొంచం కడుక్కున్నారు.. ప్రభు వాగుతూనే ఉన్నాడు. బూతులు.. వినలేని ఊహిoచలేని తిట్లు..

సుభానీ అన్నాడు.. “బయల్దేరండి సాయిబాబుగారు.. మా వోనర్ వస్తే ..బాగుండదు..” అందరూ అదే అన్నారు. అంతా కలసి వెళ్ళి ప్రభును ఇంటిదగ్గర దిoపి రావాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.. సై వొద్దన్నాడు.. ఎవ్వరూ వొప్పుకోలేదు.. ఈ స్థితిలో ఇలా వదలివెళ్ళడం శిష్యులుగా తమకు న్యాయం కాదని చెప్పి రెండు వోలా టాక్సీలను పిలిపించి ప్రభును మోసి కార్లో వేశారు.

కూకటపల్లి హౌసింగ్ కాలని తర్వాత నాలుగైదు గల్లీలు తిరిగాక సై దారిచూపించగా ప్రభు ఇoటికి చేరాయి వాహనాలు.. ప్రభు అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు.. వినలేని బూతులు తిడుతున్నాడు.. ఫాంటు జిప్పు తీస్తున్నాడు.. ఊక బస్తాలా మెత్తగా జారిపోతున్నాడు.. ఎక్కడికొచ్చామో తెలియదాయనకి.. ఇoటి తాళం కోసం ప్రభు మొలతాడు పట్టుకు వెదికాడు సై.. “అదేంటి?” అన్నాడొక కవి.. “గురువుగారు ఇoటి తాళం అక్కడే కట్టుకుంటారు” ఎలాంటి భావ ప్రకటన లేని జవాబు అది.. ఇప్పటికే గురువుగారి మందు విన్యాసాలు అందరూ చూశారు.. ఇక ఇoటి విషయాలు దాచి ఏమి ప్రయోజనం..

“ఇదేంటి.. నువ్వు తాళం వెదుకుతున్నావ్.. అసలు ఇల్లు తాళం వేసిలేదుగా” అరచినట్లు అన్నాడు మరొకడు.. అంతా రెండడుగులువేసి ఇంటివైపు చూశారు. తలుపులు బార్లా తీసి ఉన్నాయి… ఇల్లు లోపలoతా వెన్నెల తెచ్చి కుమ్మరించినట్లు దేదీప్యమానంగా వెలిగిపోతోంది. బయట చీకట్లో ఉన్నవారికి ఆ వెలుగు ఏదో పండగొచ్చినట్లు.. అక్కడేదో దేవత వెలిసినట్లు.. అదేదో గొప్ప సంఘటన జరిగినట్లు సంబరంలా తోస్తోంది..

అది చూసి అరిచాడు సై.. “అమ్మో అమ్మో.. మేడం వెళ్లిపోయారనుకుంటా.. సార్”

ఈశ్వరీబాబు గుమ్మం దగ్గరకెళ్ళి అనుమానంగా చూస్తూ అన్నాడు “తాళం విరగ్గొట్టినట్లుందే..”

అందరికి మందు దిగిపోయినట్లు చెమటలు పట్టాయి. “ఇంట్లో ఎవరెవరు ఉంటారు?.. మేడం..అదే ప్రభు గారి భార్య.. పిల్లలూ?”

“పిల్లలేరు.. భార్య ఇంట్లోనే ఉంటారు.. అసలు తాళం ఎలా తీశారు.. ఎవరు తీశారో”.. అంటూ “సార్.. ఇoటి తాళాలు తీసి ఉన్నాయి” గట్టిగా ప్రభుకు అర్థం అయ్యేలా అన్నాడు సై..

డోర్ వైపు వేగంగా వెళ్ళబోతూ “దాన్ని ఖండ ఖండాలుగా.. పీస్ పీస్‌గా కోస్తా. దానెమ్మా..లం..” దబ్బున పడ్డాడు ప్రభు.. అప్పటికే నోట్లో చొంగ.. ముక్కులో చీమిడి.. కళ్ళల్లో నీరు.. ఫాంటులో మూత్రం చేసుకున్నట్లు తడిసిపోయిన బట్టలు.. వాసనతో పరమ వికారంగా ఉన్నాడు ప్రముఖ కవి ప్రభు.

“సరిగా చెప్పు సాయిబాబు.. ఇక్కడ వాతావరణం అస్సలు అర్థం కావడంలేదు..” వీరేశ్వర్ అందరి అభిప్రాయాన్ని ప్రకటించాడు.

“గురూగారు భార్యను ఇంట్లోఉంచి బయట తాళంపెట్టి బయటికొస్తారు. తాళం మొలతాడుకు కట్టుకుంటారు.. ఇప్పుడు ఇల్లంతా తాళాలు తీసి లైట్లు వేసి ఉన్నాయి.. మేడం లోపల లేదు” కొంచం లోగొంతుకతో చెప్పాడు.. అందరికి అర్థమైనదనే అనుకున్నాడు.. నిజమే.. అందరికి అర్థమైంది..

అప్పుడు వెలిగింది ప్రక్కింటి వసారాలో లైటు.. నలుగురు వచ్చి స్టడీగా నిలబడ్డారు.. ఓ పెద్దావిడ.. కొడుకు కోడలు కావచ్చు మరొకరు మనవడు కావచ్చు.. నలుగురు.. నిలబడి నిశ్శబ్దంగా చూస్తున్నారు.. గొప్ప విజయం సాధించిన ఉన్నతత్వం వారి నిశ్చబ్దంలో కనిస్తోంది.. హిమవన్నగంపై జెండా ఎగరేసి వచ్చిన వీరుల్లా, విజయ గర్వంతో తిరిగొచ్చిన సైనికుల్లా.. అంతరిక్షం నుండి దిగిన వ్యోమగాముల్లా ఉన్నారు.

కవిబృoదం వారినే చూస్తున్నారు.

ఆ పెద్దావిడ, ప్రభు చెప్పిన ముసిల్ది కావచ్చు, అన్నది, “ఎవడ్రా.. ఏడి.. సై..సాయిబాబా.. వాడ్ని.. ఆ మూర్ఖ శిఖామణిని లోన పడేసి పొండి.. లోపలికి తీసుకెళ్ళడానికి.. వొళ్ళు కడిగి ఆ వాంతి బట్టలు విప్పి ఉతకడానికి ఆమె లేదు.. ఆమె దారి ఆమె చూసుకుంది.. ఇంత కాలానికి ఓ మంచి నిర్ణయం తీసుకుంది” జరిగింది చెప్పింది.

“మేమే తాళాలు బద్దలు కొట్టాం” అన్నాడా యువకుడు.. “మీరంతా ఎవరూ?..దొరవారి ఫ్రెండ్సా.. అంటే మీరూ కవులేనా.. మీ ఇంటి దగ్గరా రోజూ ఇదే తంతా..?” ఆమె మాటలు ఈటెల్లా తగులుతున్నాయి.. ఎవ్వరూ కాదని అనలేకపోయారు..

“నలుగురికి చెప్పేవాడికి త్రికరణ శుద్ధి… ముఖ్యంగా అంతఃకరణ శుద్ధి ఉండాలి.. నువ్వు ముందు మనసా వాచా నమ్మాలి.. నమ్మింది నువ్వు ఆచరించాలి.. అప్పుడే నలుగురికీ చెప్పాలి.. అంతఃకరణ శుద్ధి లేనప్పుడు రాయడం కాదు.. కవిగా బ్రతకడమే వేస్టు.. పదండి” అంటూ కదిలిoదా పెద్దామే.. వెంటే మిగిలినవారూ.. నిశ్శబ్దంగా ప్రభు శరీరాన్ని లోపలి చేర్చారు కవులు.. వాళ్ళ బుర్రలు మాత్రం నిశ్శబ్దంగా లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here