సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
ఎస్.ఎస్. వాసన్ గారి 72 సంవత్సరాల అద్భుతం ‘చంద్రలేఖ’ – అరుదైన చిత్రాలు, అచ్చెరువు గొలిపే వాస్తవాలు:
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సుమారు సంవత్సరానికి ‘చంద్రలేఖ’ మొదటిసారిగా విడుదలైంది. జెమినీ స్టూడియోస్, వాసన్ గారి ఈ సినిమా ఎన్నటికీ ఒక కళాఖండమే. 9 ఏప్రిల్ 1948న విడుదలయిన ఈ తమిళ వినోదాత్మక చిత్రం – విస్తృతంగా మార్కెట్ చేయబడింది. తమ సినిమాలను ప్రదర్శించేందుకు దక్షిణాది దర్శకనిర్మాతలను బొంబాయికి, ఉత్తర భారతదేశానికి వెళ్ళేలా చేసింది. సినిమా నిర్మాణం 1943లో మొదలై ఐదేళ్ళకి పూర్తయ్యింది. తొలుత టిజి రాఘవాచారిని దర్శకుడిగా ఎంచుకున్నా, వాసన్ గారే పూనుకుని సినిమా పూర్తి చేశారు. యంకె రాధ, టి.ఆర్. రాజకుమారి, రంజన్, సుందరీబాయి నటించిన ఈ సినిమా కథ అంతకుముందు ఎవరూ విననిది. విస్తారమైన సామ్రాజ్యం, గొడవలు పడే అన్నదమ్ములు కాబోయే రాకుమారులు, వారిద్దరూ ప్రేమించిన ఓ అందమైన, గ్రామీణ యువతి – తర్వాత ఏం జరగబోతోందో ఊహించవచ్చు, అయితే ఈ కథని మలుపులు తిప్పుతూ తెరమీద ప్రదర్శించిన విధానం అనూహ్యం. 72 సంవత్సరాల తర్వాత కూడా అది అపూర్వం. ఆనాటి కాలానికి ఈ సినిమా అత్యంత వ్యయం చేసిన చిత్రంగా పేరు పొందింది. సినిమా చూస్తే అంత వ్యయం ఎందుకయిందో అర్థమవుతుంది. పేర్లలో వందకు పైగా జెమినీ అబ్బాయిలు, ఐదు వందలకి పైగా జెమినీ అమ్మాయిలు నటించినట్టు వేశారు, వీళ్ళని నెలవారీ జీతాలతో నియమించుకున్నారని అంటారు. ఈ సినిమాకి అప్పట్లో 30 లక్షలు ఖర్చయ్యాయని వినికిడి. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించేందుకు 500 ప్రింట్లు కూడా సిద్ధం చేశారట. అయితే సినిమా విజయవంతమైనప్పటికీ, సినిమా నిర్మాణానికయిన ఖర్చులను రాబట్టుకోలేకపోయింది. ఈ సినిమా హిందీ వెర్షన్ రూపొందించాలనుకుని వాసన్ తమ నటీనటులతో కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేశారు. హిందీ వెర్షన్ 24 డిసెంబరు 1948న విడుదలయింది. హిందీ వెర్షన్‌కి మాటలు పండిట్ ఇంద్ర, ఆఘా జైనీ కాశ్మీరీ వ్రాయగా, గీత రచన బాధ్యత పండిట్ ఇంద్ర, భరత్ వ్యాస్ నిర్వహించారు. ఈ సినిమాకి స్వరాలు ఎస్. రాజేశ్వరరావు అందించారు. స్త్రీ స్వరం సోలో పాటలన్నీ పాడడానికి ఆయన ఉమాదేవి అనే గాయనిని ఎంచుకున్నారు. ఆవిడ తరువాత ‘టున్ టున్’గా పేరుపొంది ప్రఖ్యాత కమేడియన్ అయ్యారు. ఈ సినిమాకి నేపథ్య సంగీతం ఎండి పార్థసారథి అందించారు. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కథానాయిక చంద్ర (టి.ఆర్. రాజకుమారి). తన అభినయంతో, ఆటపాటలతో ఆమె ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో సర్కస్, జిప్సీ క్యాంపులు, అనవసరమైన చోట పాటలు వంటి వికర్షణలున్నాయి. మానవుల వినోదం కోసం సింహాలను, ఏనుగులను ఉపయోగించిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అయితే ఆ కాలంలోని ప్రేక్షకులకు వాటిని వెండితెరపై చూడడం గొప్ప అనుభూతి కలిగించి ఉంటుంది.
అయితే సినిమాలోని ఉత్తమమైన సన్నివేశాలన్నీ క్లైమాక్స్‌లోనే ఉన్నాయి. అటువంటి సన్నివేశాలను అంతకు మునుపెన్నడూ వెండితెరపై చూసింది లేదు. ముఖ్యంగా డ్రమ్ డాన్స్! ఈ సన్నివేశానికి అవసరమైన ధనాన్ని మొత్తం తమిళ పరిశ్రమ భరించిందని అంటారు. ఈ సినిమాపై 1948లో విడుదల చేసిన ఒక చిరుపుస్తకంలో దీని నిర్మాణానికి, వ్యయానికి, చిత్రీకరణకి సంబంధించిన ఎన్నో వాస్తవాలను పొందుపొరిచారు. అప్పట్లో ఈ పుస్తకాన్ని సినిమా ప్రచారానికి ఉపయోగించుకున్నారు.
- పని గంటల విషయంలోనే, ‘చంద్రలేఖ’ నమ్మశక్యం కాని విధంగా 2,259,770 పని గంటలు తీసుకోగా, ఇందులో 129,600 పని గంటలు కథ రూపకల్పనకే వినియోగించారు.
- ప్రశ్నించలేని విశ్వసనీయత కోసం అన్ని సెట్టింగులను టేకు లేదా రోస్‌వుడ్‌తో రూపొందించారు. ఒక సెట్, ముఖ్యంగా పాలస్‌లో శశాంకుడి గది రూపకల్పనకే 75,000 రూపాయలు వ్యయమయ్యాయి. ఒక్క సూపర్ బంగ్లా కయ్యే ఖర్చు ఒక హాల్‌కి పెట్టారు. పలు రకాల సెట్లకు 38 ఎకరాల స్థలం అవసరమైంది. వీటిల్లో చాలా సెట్లు 400 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తు ఉండేవి.
- ఇప్పటికీ లక్షలాది మందిని ఉర్రూతలూగించే డ్రమ్ డాన్స్ ఆనాటి పాశ్చాత్య బాలే నిపుణులని సైతం ఆకట్టుకుంది. ఈ డ్రమ్ డాన్స్‌కి రెండు సంవత్సరాల రిహార్సల్స్, వంద రోజుల షూటింగ్ చేశారు. మబ్బులు పట్టిన ఆకాశపు లో-యాంగిల్ షాట్ల కోసం డ్రమ్స్ ఎత్తు నేల నుండి 40 అడుగులకు ఉండేలా చూశారు
- ఈ సినిమా కోసం రెండు సర్కస్ కంపెనీలను (ది కమలా సర్కస్, పరశురామ్ లయన్ సర్కస్) వారి పూర్తి జంతు, వస్తు సామాగ్రి తో సహా నెల రోజుల పాటు స్టూడియో ప్రాంగణంలో కొలువు చేశారు. నాలుగు కెమెరాల ముందు ప్రసిద్ధ నటీనటులు నటిస్తుంటే వేలాదిమంది ప్రేక్షకులు వారిని ప్రోత్సాహిస్తూ చప్పట్లు చరిచారు.
- ఆర్ట్ డైరక్టర్ శ్రీ శేఖర్ ఈ సినిమా కోసం వేలాది కాస్ట్యూమ్‌ల స్కెచ్‌లు గీశారు. ఆమోదం పొందిన స్కెచ్‌లను దుస్తులుగా మలిచేందుకు వార్డ్‌రోబ్ డిపార్ట్‌మెంటులోని 70 మంది దర్జీలకు అందజేశారు.
- చంద్రలేఖ – సాంప్రదాయకమైన చీరల నుండి అత్యాధునికమైన సర్కస్ డ్రెస్ వరకు – మొత్తం 19 సార్లు దుస్తులు మార్చింది.
- సరైన లొకేషన్లను గుర్తించడానికి, కారు ద్వారా, రైలు మార్గం ద్వారా సినీ బృందం ప్రయాణించిన దూరం దాదాపు 40,000 మైళ్ళు. రెండు కొండల మధ్య చెట్ల నడుమ ఉపయోగించని రెండు మైళ్ళ మార్గంలో అరమైలు దూరం ఉన్న కారవాన్ సాగేందుకు సినీ బృందానికి అందుబాటులోకి తెచ్చేందుకు జెమినీ పనివాళ్ళు దాన్ని మరమ్మత్తు చేశారు.
***
***
ఈ సినిమాలోని కొన్ని పాటలు యూట్యూబ్‌లో చూడవచ్చు: