ప్రజా విజయమే లాంగ్ మార్చ్

0
3

[box type=’note’ fontsize=’16’] “ఉద్యమాన్ని నాయకుడు నడిపించడం కాదు, ఉద్యమమే నాయకుడిని తయారు చేసుకుంటుందని తెలిపిన నవల” అంటూ ‘లాంగ్ మార్చ్‘ నవలని సమీక్షిస్తున్నారు కె. స్వరాజ్యం. [/box]

[dropcap]’న[/dropcap]వనవోన్మశాలి నవల’ అనేది అక్షర సత్యం అనడంలో సందేహం లేదు.

బాణుని కాదంబరి నుండి నేటి వరకు నవల ప్రక్రియలో ఎన్నో మార్పులు వచ్చినా నవలకు గల ఆదరణ, ప్రాధాన్యత తగ్గలేదు. చరిత్రను కనులకు కట్టినట్టుగా చూపించేది జీవితాన్ని సమగ్రంగా విశ్లేషించేది నవల. నాడు గొప్ప స్ఫూర్తితో భారత దేశ స్వాతంత్రోద్యమం ఎందరో రచయితలను రచనలను పుట్టించినట్టే నేడు తెలంగాణోద్యమం కూడా ఎందరో రచయితల రచనలకు ఊపిరినిచ్చింది. అస్తిత్వం కోసం ఆత్మ గౌరవం కోసం సమన్యాయం కోసం ఏండ్ల కేండ్లుగా రగిలిన తెలంగాణ ఉద్యమం తొలిదశ కంటే మలిదశోద్యమం ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసింది. అంత కంటే ఎక్కువగా ఉద్రిక్తం చేసింది. ఉద్యమంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటిలో ఎక్కువగా జనాన్ని ఉత్తేజితపరిచిన సంఘటన టాంక్‌బండ్‌పై జరిగిన ‘మిలియన్ మార్చ్’. ఇది మలి దశ ఉద్యమానికి కొత్త జీవం పోసింది. ఈ నేపథ్యంలో రాసిన నవల పెద్దింటి అశోక్ కుమార్ ‘లాంగ్ మార్చ్’.

ఈ నవలలోని కథా వస్తువు మన కళ్ళముందు జరిగిన చారిత్రక సంఘటనలనుండే పుట్టుకొచ్చింది.   అశోక్ కుమార్ అనుభవాల నుండి రూపుదిద్దుకున్న నవల ‘లాంగ్ మార్చ్’ లో ఉద్యమం అనేది ఒకరి స్వార్థం కోసం జరపబడిన ఉద్యమం కాదు, ఎవరినో బలవంతంగా ఉద్యమంలో పాల్గొనేలా  చేసింది కాదు. మిలియన్ మార్చ్ కేవలం ఒక సంఘటనే కాదు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. ప్రజలందరూ ఒక్కటై విముక్తి కోసం చేసిన పోరాటంలో  అశోక్ కుమార్ స్వీయ అనుభవ రూపమే ‘లాంగ్ మార్చ్’. అందుకే నవలంతా కూడ జీవన మనస్తత్వాలు ఆవిష్కరించబడ్డాయి. ఉద్యమానికి చదువుతోగాని, డబ్బుతో, రాజకీయంతోగాని అవసరం లేదు కేవలం పోరాట స్ఫూర్తి ఉంటే చాలని నిరూపించినాడు రాయమల్లు. ఈయన కనిపించని తెలంగాణ యోధుడు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో పునర్జీవం పోసుకున్నది తెలంగాణ సంస్కృతి.  పండుగలు, భాష, యాస, బోనాలు, ఆషాడమాసంలో అమ్మవారికి పెట్టే నైవేద్యం v  తెలంగాణోద్యమంలో  ప్రత్యేక స్థానం లభించాయి. వీటన్నింటిని ‘లాంగ్ మార్చ్’ నవలలో కనులకు కట్టినట్టు చూపించారు రచయిత. ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో దర్శనమిచ్చే నవల ‘లాంగ్ మార్చ్’.

సహాయ నిరాకరణ జరగకుండా ఉండడానికి రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలనుకున్న రాజకీయ నాయకుల కుట్రను తిప్పికొట్టిన ఘనుడు రాయమల్లు. జే.ఏ.సి. నాయకులు కూడ చేయలేని పనిని బుద్ధికుశలతతో అడ్డుకున్నాడు రాయమల్లు. రచ్చబండ అడ్డుకోవడానికి దశరథం మొదలయిన నాయకుల ఆలోచనలనే ప్రశ్నించిన ధైర్యశాలి. రచ్చబండ అడ్డుకోవడంతో అతని ‘ఉపాయం’ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఎంత కష్టమైన అడ్డంకయినా వ్యూహం సరైనదయితే ఎదుర్కోవచ్చు. తనను పిలువకుండానే శిబిరంలో దీక్షకు కూర్చుంటానని దశరథంతో చెప్పడంతో రాయమల్లు తన రాష్ట్ర భక్తి చాటుకున్నాడు.

రాయమల్లు వంతు వచ్చేవరకు 30 రోజులు పడుతుందన్నదశరథం మాటలతో తెలంగాణ కోసం ప్రజలు పడే ఆరాటం తెలుస్తుంది. పందయి పదేండ్లు గాదురా నందయి నాలుగేండ్లు బతుకుతే చాలన్న రాయమల్లు మాటల్లో పరాయి పాలనలో హీనంగా బతుకడం కన్న ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం చనిపోయినా పర్వాలేదనే తత్త్వం తెలుస్తుంది, నాటి ప్రజల అసహనం  తెలుస్తుంది.

గొల్లపల్లి రాస్తారోకోకి వెళ్లడానికి దున్నపోతుకు మంజీర అయిందని భార్యతో చెప్పడంతో రాయమల్లు తెలంగాణ కోసం భార్యకు కూడ అబద్ధం చెప్పగల సగటు వ్యక్తిగా దర్శనమిస్తాడు. గొల్లపల్లి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న పోలీసులకు భయపడి దశరథం వంటి పెద్ద నాయకులే రోడ్డుపైకి రాలేక దాక్కుంటారు. కాని రాయమల్లు గింత దూరమొచ్చి పోలీసులకు భయపడితే ఎట్లానని ధైర్యం చేసి ఎండ్ల బండిని రోడ్డు మీదికి తెచ్చి మధ్యలో ఆపి తాను దిగిపోతాడు అంతే వాహానాలు ఎక్కడికక్కడే నిలిచిపోతాయి. క్షణంలో జనమంతా వచ్చారు, దుకాణాలు బంద్ చేశారు. కష్టం లేకుండానే ఉద్యమకారులకు బంద్ జరిగిపోయింది.

రాయమల్లుకు పట్నంలో ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దొరికిన సాధనం టి.వి. ఛానలు మార్చి మార్చి చూసేవాడు . ఒక ఛానల్‌లో జయప్రకాశ్ నారాయణ పై ఎమ్మేల్యే ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ మల్లేశం దాడి అని న్యూస్ చూసి రాయమల్లు ఉద్వేగంలో “నువ్వు అవినీతి మీద కొట్లాడులేవు గదా సారూ మరి తెలంగాణకు జరిగే అవినీతి కనవడుతలేదా? మంచి పని చేసినవురా మల్లేశా ఇట్ల తంతెనే బుద్ధి వత్తది” అనుకోవడంలో తెలంగాణ మలి దశోద్యమంలో నాయకులు ఎలా ప్రవర్తించారో తెలుస్తుంది. నీతి నీతి అని ఉపన్యాసాలిచ్చేవారు కూడ తెలంగాణ కోసం ఎలాంటి మద్దతిచ్చారో తెలుస్తుంది. సమస్త బాధలకు తారకమంత్రమయింది ‘తెలంగాణ’ మంత్రం. తెలంగాణల పాట వింటే చాలు పిల్లవానిలో సైతం రక్తం ఉరకలు వేసిందంటే దాని విశిష్టత అర్థమవుతుంది.

అధికారం ఉంటే తప్పును ఒప్పు చేయవచ్చు ఒప్పును తప్పు చేయవచ్చని సర్పంచ్ పన్నిన కుట్ర, దానికి రాయమల్లు బలికావడం ఒకఉదాహరణ. ఉద్యమాన్ని స్వార్థం కోసం వాడుకున్న వాళ్లు కూడ ఉన్నారని తెలుస్తుంది. తెలంగాణోద్యమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించారు. శ్రీనివాస్ బడిపిల్లల్లో కూడ తెలంగాణ గొప్పతనం తెలిపివారిని మేల్కనేలా చేసి వారిని ఆయుధంగా మార్చి పెన్షన్ల కోసం వెళ్లిన ముసలోళ్లను ఇంటికి వచ్చేలా చేశాడంటే ఉద్యమం ఎలాంటి ప్రభావం చూపిందో తెలుస్తుంది. ‘లాంగ్ మార్చ్’ నవల తెలంగాణోద్యమంలో ప్రతి ఒక్కరు ఒకశక్తిలా ఉద్యమించిన విషయం తెలుపుతుంది. ఉద్యమ నేపథ్యంలో పోలీసుల ఆగడాలు నిరంకుశత్వం తెలిపింది. చదువుకునే విద్యార్థులు కూడ తమవంతు పాత్ర పోషించారు.

అసలు ప్రాంతీయ భేదం రాజకీయ నాయకులకే కాని తమకు కాదని తెలిపిన నవల. బండ్లు కాలినప్పుడు మేస్త్రీ చేత ప్రాంతం వేరైనా మేమంతా ఒక్కటేనని చెప్పించారు రచయిత. తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర కూడ కీలకమైంది. జరిగిన ప్రతి సంఘటన ఎప్పటికప్పుడు ప్రజలకు అందచేసింది. కొన్ని సార్లు నిజాన్ని, మరి కొన్నిసార్లు నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్న విషయం తేటతెల్లమయింది. పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమంలో పాల్గొన్న విషయం నవల తెలుపుతుంది.

తెలంగాణ విద్యార్థుల ఆత్మబలిదానం మరిచిపోని సంఘటన నవలలో తిరుపతి బావమరిది పురుగుల మందు తాగడం, ఊర్లో గాజుల రాజేశం కొడుకు తెలంగాణ రావడం లేదని పత్తి మందు తాగడం, తెలంగాణ కోసం ప్రజలు చావడానికి సిద్ధపడ్డ సంఘటనలు కళ్లకు కట్టినట్టు చూపించాయి.

తెలంగాణ బంద్ జరగకుండా పోలీసులు దశరథం మొదలయిన నాయకులను అరెస్టు చేసారు. అప్పుడు రాయమల్లు తన తెలివితో వచ్చిరాని చదువుతో “మేం నలభై ఎనిమిది గంటలు బంద్ పాటిస్తున్నాం, మీరు మాకంటే అధ్వానమా? మనుషులయితే బంద్ పాటించండి” అంటూ దున్నపోతుల కొమ్ముల, వీపుపైన అతికించి ప్రజల రక్తం మరిగించి తమంతటా తాముగా బంద్ పాటించేలా చేసిన అపరచాణక్యుడు రాయమల్లు.

‘తరువ తరువ పుట్టు తరువున అవలంబు , తరువ తరువ పుట్టు వీధిని అనలంబు,  ఘృతంబు తలప తలప పుట్టు తనువున తత్త్వంబు’ అన్నటు ఆలోచన చేసిన కొలది మనసున గొప్ప స్థితి ఏర్పడింది. రాయమల్లుకు అనుమాండ్ల మొక్కు చెల్లించడానికి తెలుగుదేశం నాయకుడు వస్తున్నాడని దశరథం ద్వారా తెలియగానే ఏదైనా చేసి అడ్డుకోవాలనుకుంటాడు.

తను పొలంలో పెట్టే దిష్టిబమ్మలు తయారు చేసి ‘నేనే మీ ఊరు వస్తున్నా నన్నేం చేస్తరు మీతోనేమయితద’నే ప్లకార్డులు మెడలో వేసి ఊర్లో అక్కడక్కడ పెట్టి జనంలో కొత్త చైతన్యం కల్గించిన మరో సామ్యవాది రాయమల్లు. చేయని తప్పుకు స్టేషన్ వెళ్లి తన్నులు తిన్న తర్వాత కూడ తెలంగాణ కోసం ప్రాకులాడడం, తను తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమనే నిరూపించుకున్న నిజాయితీపరుడు.

మిలియన్ మార్చ్ జరగడానికి అనుమతి కోసం లచ్చిరెడ్డి లాంటి నాయకులు హోం మినిష్టర్‌ను కలవడం,  ఆమె తానేమి చేయలేనని చెప్పడంతో తెలంగాణ మంత్రుల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది.

మనం చేసేది యుద్ధం కాదు పోరాటం, పోరాటంలో గెలుపు తప్ప ఓటమి ఉండదు అన్న దశరథం మాటలతో ఆలస్యమైన సరే తెలంగాణ వస్తుందనే సూచన తెలుపుతుంది. ఉద్యోగుల సహాయ నిరాకరణతో పాలన స్థంబించింది. విద్యుత్, రెవెన్యూ, ఆర్టీవో, ఆర్టీసి, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి ఆదాయం రాకపోవడంతో కోట్ల నష్టం వస్తుంది. ఇరవై ఐదు ఉద్యోగ సంఘాలు, నాలుగు లక్షల మంది ఉద్యోగులు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఖజానా ఖాళీ అయింది. పాలకులకు వెన్నులో చలి పుడుతుంది అన్న దశరథం మాటల్లో తెలంగాణ కోసం చేసే పోరాటం ప్రభుత్వాన్ని ఎలా హడలెత్తిస్తుందో తెలుస్తుంది

తొలి దశ ఉద్యమం ఆగిపోయిన తర్వాత కూడ ఓపికతో మనం మలిదశ ఉద్యమంలో విజయం సాధించవచ్చని నిరూపించింది నవల. తెలంగాణోద్యమంలో ప్రతి నిరసన కూడ ఉద్యమం బలపడుడానికే.  ఎట్లయితే భూమిని ఇరువాలు, ముమ్మారు దున్నిన మెత్తపడకపోతే ముడి గొర్రు రాప్పుతామో అలాగే ఉద్యమంలో కూడ ఒకేసారి విజయం రాదు, పోరాటం చేత్తనే ఉండాలే అప్పుడే విజయం.

తాహిర్ స్క్వేర్‌ను మరిపించే రీతిలో పది లక్షల మందితో టాంక్‌బండ్ మీద వాక్ నిర్వహించాలనేది రాష్ట్ర నాయకుల ఆలోచన. పార్లమెంటు ప్రజాస్వామ్యం ప్రజల ఆకాంక్షను నెరవేర్చనప్పుడు ప్రజలే రాజధానిని నిర్బంధం చేసి తమ డిమాండును నెరవేర్చుకుంటారు. అది ఖాట్మండు కావచ్చు, కైరో కావచ్చు, తియానుమెన్ కావచ్చు-ఇది చరిత్ర చెప్పిన సత్యం. అదే మిలియన్ మార్చ్ జరగడానికి ప్రేరణ .

ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఎవరినైనా ఎదురించగలరని నిరూపించిన సంఘటన మిలియన్ మార్చ్. చరిత్రలో మరుపురాని సంఘటన మిలియన్ మార్చ్ ఉద్యమాన్ని నాయకుడు నడిపించడం కాదు, ఉద్యమమే నాయకుడిని తయారు చేసుకుంటుందని తెలిపిన నవల. తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వారు, జరిగిన చరిత్రకు ప్రత్యక్ష్య సాక్షులు మాత్రమేకాదు, భవిష్యత్తు తరాలు సైతం తప్పనిసరిగా చదవాల్సిన నవల ఇది. స్వయం పాలన కోసం , తమ భవిష్యత్తు కోసం జరిపిన అపూర్వపోరాటం గురించి చదివి తెలుసుకుని గర్వంతో ఉప్పొంగిపోతూ, తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించే ప్రేరణనిచ్చే అద్భుతమయిన నవల.

***

లాంగ్ మార్చ్ (నవల)
రచన: పెద్దింటి అశోక్ కుమార్,
పేజీలు: 144
వెల: ₹ 150
ప్రచురణ, ప్రతులకు: అన్వీక్షికి పబ్లిషర్స్, హైదరాబాద్.
ఫోన్: 097059 72222

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here