[box type=’note’ fontsize=’16’] “పెళ్లి ఏ విధంగా చేసుకున్నా వధూవరులు ఆధిక్య భావనలను పక్కనపెట్టి, పరస్పరం అర్థంచేసుకొని, సదవగాహనతో, ప్రేమతో, నమ్మకంతో పదికాలాల పాటు తమ బంధాన్ని పదిలపరచుకున్నప్పుడే పెళ్లికి సార్ధకత” అంటున్నారు జె. శ్యామల. [/box]
[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం వేళ కాకి చేత కబురైనా చేయకుండానే కాదు, కాదు, ఫోనైనా చేయకుండానే వచ్చింది నా ప్రియనేస్తం కల్యాణి. సర్‌ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయలేదట. ఎలాగూ కరోనా కాబట్టి నేను ఇంటికే అంకితమై ఉంటానన్న గొప్ప నమ్మకంతో వచ్చిందట. కొద్ది సేపు ముచ్చట్లు, స్నాక్స్ ఆరగింపు, టీ సేవనం అయిన తర్వాత “ఇంకో పావుగంట ఉంటాను. ఇప్పుడు మనం వెరైటీ పాటల ఆట ఆడుకుందాం” అంది ఉత్సాహంగా.
“ఏమిటో అది వివరింపుడీ” నాటకీయంగా అన్నాను.
“ఒక సబ్జెక్ట్ మీదే పాటలు పాడాలి. సరదాగా మనం పెళ్లి సబ్జెక్ట్ తీసుకుందాం. పెళ్లి గురించిన పాటలే పాడాలి” అంది.
ఇంకేముంది పోటాపోటీగా పాడేశాం. “ఇప్పుడు కాచుకో. నేను ఓ పాటపాడుతా. దానికి సరిగ్గా వ్యతిరేకమైన పాట నువ్వు పాడాలి. ఇదే లాస్ట్. నా టైమయిపోయింది” అంది.
“సరే కానీ” అని నేననగానే
‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరూ, భర్తగ మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ,..‘ పాడేసింది.
“ఓ.కే.” అని ‘పెళ్లి చేసి చూడు’ చిత్రంలో పింగళిగారు రాయగా, ఘంటసాల మాష్టారు పాడిన పాట అందుకున్నాను. అది..
‘ఓ భావి భారత భాగ్యవిధాతలారా, యువతీ యువకులారా
స్వానుభవమున చాటు నా సందేశమిదే..
వారెవా.. తాదిన్న, తకదిన్న, తాంగిటకతక, తరికిటకతోమ్
పెళ్లి చేసుకుని, ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరి సుఖము చూడాలోయ్… మీరెల్లరు హాయిగా ఉండాలోయ్.‘
“భలే ఉందోయ్, ఎంతైనా అప్పటి పాటలే పాటలు. వస్తా” అంటూ హడావుడిగా బ్యాగందుకుని ముందుకు నడిచింది.
“థ్యాంక్యూ మా యిల్లు పాటలతో పావనం చేసినందుకు” అన్నాను నవ్వుతూ.
“ఇటీజ్ మై ప్లెజర్, బై” అంటూ వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయింది. కల్యాణి అయితే వెళ్లిపోయింది కానీ నా మనో సంద్రాన్ని పెళ్లి తలపుల తరంగాలు వీడనంటున్నాయి. పెళ్ళిళ్లు ఇప్పుడయితే ప్రేమవివాహం, పెద్దలు కుదిర్చిన వివాహం, గుళ్ళో పెళ్లి, రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి, ఆర్య సమాజ్‍లో పెళ్లి ఇలా రకాలు చెప్పుకుంటున్నాం. కానీ మన పురాణాల ప్రకారం అష్టవిధ వివాహాలు ఉన్నాయి. అవి బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రజాపత్య, గాంధర్వ, అసుర, రాక్షస, పైశాచ రకాలు. బ్రహ్మ వివాహమంటే తల్లిదండ్రులు వేదాలు తెలుసుకొని, మంచి వ్యక్తిత్వం గల వరుడికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేయడం. దైవ వివాహం కొద్ది తేడా, వేదవిహిత కర్మలను ఆచరించే వ్యక్తికి కుమార్తెనిచ్చి వివాహం చేయడం. ఆర్ష వివాహం అంటే వరుడి తరఫువారి నుంచి కన్యాశుల్కం పుచ్చుకుని కుమార్తెనిచ్చి వివాహం జరపడం. ప్రజాపత్య వివాహం అంటే ఆడపిల్లకు బాల్యదశలో ఉండగానే వివాహం చేయడం. గాంధర్వ వివాహం అందరికీ తెలిసిందే. యువతీ యువకులు ఇష్టపడి, పెద్దలతో నిమిత్తం లేకుండా పంచభూతాలే సాక్షులుగా చేసుకునే వివాహం. శకుంతల, దుష్యంతుల వివాహం ఇందుకు చక్కని ఉదాహరణ. అసుర వివాహం కూడా అదొక వ్యాపార ఒప్పందంగా సంపదే కీలకంగా జరిగేది. రాక్షస అంటే తన వీరత్వంతో అవతలి వారిని ఓడించి, చంపి, హింసించి, కన్యను సొంతం చేసుకోవడం. పైశాచ వివాహంలో మోసంచేసి కన్యను దొంగిలించి సొంతం చేసుకోవడం. ప్రస్తుత కాలంలో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వివాహం చేసుకోవడం రాక్షస వివాహంగానే పరిగణించవచ్చు. అలాగే మోసం చేసి పెళ్లి చేసుకోవడం పైశాచికం కిందకే వస్తుంది. ప్రేమ వివాహాలను గాంధర్వ వివాహాలుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ వివాహాలలో మళ్లీ పెద్దల అంగీకారంతో చేసుకునేవీ ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు, తెలుగునాట ‘సీతారాముల కల్యాణం చూతము రారండీ’ పాట మార్మోగుతూ ఉంటుంది. ‘సీతారాముల కల్యాణం’ చిత్రానికి సముద్రాల సీనియర్ రాయగా, పి.సుశీల బృందం సుమధురంగా పాడిన ఈ పాట నాటికీ, నేటికీ కూడా తాజాగానే ఉంది, ఇక ముందు ఉంటుంది కూడా. ఈ పాటలో వధూవరుల సింగారం, పెళ్లితంతు కూడా చక్కగా చిత్రించారు. అది ఇలా..
‘సీతారాముల కల్యాణం చూతమురారండి… శ్రీ సీతారాముల..
సిరి కల్యాణపు బొట్టును పెట్టి, బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి, నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆఁ ఆఁ.. పెళ్లికూతురై వెలసిన సీతా…
సంపగి నూనెను కురులను దువ్వి, కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి, నామము తీర్చి
చెంపగవాకి చుక్కను పెట్టి.. ఆఁ ఆఁ.. చెంపగవాకి చుక్కను పెట్టి
పెళ్లికొడుకై వెలసిన రాముని కల్యాణం చూతమురారండి…
జానకి దోసిట కెంపుల ప్రోవై.. రాముని దోసిట నీలపు రాశై…
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆఁ… ఇరవుల మెరిసిన
సీతారాముల కల్యాణము చూతము రారండీ‘ ….
గతంలో పై పాటకు జతగా మరో పాట తరచు వినిపించేది.. అది..
‘బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
కల్యాణ శోభ కనగానే కనులార తనివి తీరేనే ఓఁ..
అందాల హంసనడక ఈ అమ్మాయి పెళ్లి నడక
ఓయమ్మ సిగ్గు పడకే వేచి ఉన్నాడు పెళ్లికొడుకే
నూరేళ్ల పంట పండేనే గారాల సిరులు చెరిగేనే ఓ బంగారు…‘
‘రక్త సంబంధం’ చిత్రానికి అనిశెట్టి సుబ్బారావుగారు అందించిన ఈ పాట ఆలపించింది పి.సుశీల బృందమే..
గతంలో పిల్లలు ఆడే ఆటల్లో బొమ్మల పెళ్లి ఒకటి. అన్నట్లు పాత ‘శ్రీమంతుడు’ చిత్రానికి సినారెగారు రాసిన పాట గుర్తుకొస్తోంది. అది..
‘చిట్టిపొట్టి బొమ్మలు.. చిన్నారి బొమ్మలు,
బుల్లిబుల్లి రాధకు, ముద్దు ముద్దు రాజుకు
పెళ్లండీ పెళ్లి ముచ్చటైన పెళ్లి.. బహు ముచ్చటైన పెళ్లి..‘
పెళ్లి అనగానే ఆడపెళ్లివారు, మగపెళ్లివారు రెండు బృందాలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వియ్యాలవారికి మర్యాదలు చేయలేక ఆడపెళ్లివారు నానా హైరానా పడుతుంటారు. ఎంతచేసినా మగపెళ్లివారు ఏం మర్యాదలివి అని సాధించడమూ కద్దు.
‘పెళ్లిరోజు’ చిత్రంలో పి.బి.శ్రీనివాస్, జమున పాడిన ఓ గీతం ఇలా…
‘పెళ్లివారమండీ.. ఆడ పెళ్లివారమండీ, మా బాధ వినేదెవరండీ
ఓ పెళ్లివారమండీ.. మగ పెళ్లివారమండీ, మా పాట్లు వినేదెవరండీ
ఓఁ ఉడికీ ఉడకని వడ్డనలు.. చాలీచాలని కట్నాలు.. అహ చాలీ చాలని కటనాలు..
ఘుమఘుమలాడే పన్నీరు, అత్తరు వాసనలేవండీ.. ఏవండీ..‘ అంటూ సాగుతుంది.
పెళ్లంటే పందిరి ఉండి తీరుతుంది కదా. ఆ పందిరిని ఆధారం చేసుకుని అల్లిన పాటలు అన్నీ ఇన్నీ కావు…
‘పందిట్లో పెళ్లవుతున్నాది, కనువిందవుతున్నాది’ అనే జిక్కి పాట ఎంతో పాపులర్. అలాగే ఆత్మీయులు చిత్రంలో శ్రీశ్రీ కలం అందించిన, ఘంటసాల, సుశీల యుగళం..
‘కళ్లలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే‘ …
‘నుదుటకల్యాణ తిలకముతో, పసుపు పారాణి పదములతో
పెదవిపై మెదిలే నగవులతో, వధువు నను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన‘.. అని అతడంటే, ఆమె
‘సన్నాయి చల్లగా మ్రోగి.. పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిజేరి, మెడలోన తాళి కడుతుంటే జీవితాన.. పూలవాన…‘ అంటుంది.
పెళ్లి గరించి యువతీ యువకులకు కలలు, ఊహలు సహజం. ఆ ఊహలే, కలలే ఎన్నో చిత్రగీతాలయ్యాయి. ‘మంచి మనసులు’ సినిమాకు ఆత్రేయగారు రాసిన ఓ చక్కని పాట…
‘నన్ను వదలి నీవు పోలేవులే, అదీ నిజములే..
పూవులేక తావి నిలువలేదులే..‘ అని అతడంటే
‘తావిలేని పూవు విలువలేనిదే. ఇదీ నిజములే.. నేను లేని నీవు లేనే లేవులే. లేవులే‘.. అంటూ
‘సిగ్గు తెరలలో కనులు దించుకుని, తలను వంచుకుని
బుగ్గమీద పెళ్లిబొట్టు ముద్దులాడ..
రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే.. ఓఁఓఁఓఁఓఁ..‘ అని పరవశంగా పాడతాడు.
ఇక ‘రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ చిత్రంలో
‘ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్లంటా అప్సరలే పేరంటాళ్లు.. దేవతలే పురోహితులంటా..
దీవెనలు ఇస్తారంటా.. తళుకు బెళుకు నక్షత్రాలు..
తలంబ్రాలు తెస్తాయంటా .. మెరుపుతీగ తోరణాలు మెరిసి మురిసి
పోయేనంటా మరపురాని వేడుకలంటా.. ఆకాశ..॥
పిల్లగాలి మేళగాళ్లు.. పెళ్లి పాట పాడేరంటా..
రాజహంస జంటచేరీ రత్నహారతిచ్చేరంటా, రాసకేళి జరిపేరంటా..‘
దాశరథి గారు అంతా ప్రకృతిమయంగా చిత్రించిన ఈ పాట అజరామరంగా నిలిచే వుంటుంది. సుశీలగారి స్వర సుధ పాటకు ప్రాణం పోసింది.
అసలు పెళ్లంటే ఏమిటి అనే ప్రశ్నకు నిర్వచనంగా ఆత్రేయ ‘త్రిశూలం’ చిత్రానికి ఓ చక్కని పాట రాశారు. అది.. ‘పెళ్లంటే..’ అని అతడు ప్రశ్నిస్తే..
“పెళ్లంటే పందిళ్లు సందళ్లు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు‘
‘కన్యాశుల్కం’ నాటకంలో అగ్నిహోత్రావధాన్లు చిన్నకూతురు సుబ్బికి వృద్ధుడైన లుబ్ధావధానులుతో పెళ్లి తప్పించడానికి కరటక శాస్త్రులు తన శిష్యుడికి ఆడవేషం వేసి, లుబ్ధావధాన్లుతో పెళ్లి జరిగేలా చేస్తాడు. ఆ తర్వాత కథ రకరకాల మలుపులు తిరిగి రక్తి కడుతుంది. ఎన్నో సినిమాలలో వధూవరుల తారుమార్ల సన్నివేశాలుండటం తెలిసిందే. అన్నిటికన్నా అందరినీ అలరించేది ‘మాయాబజార్’లో లక్ష్మణకుమారుడికి, మాయా శశిరేఖతో జరిగే వివాహం. ఆ మాయాశశిరేఖ పాడే పాట నేటికీ ఎంతో హిట్.. అది..
‘అహఁ నా పెళ్లి అంట.. ఓహెూ నా పెళ్లి అంట…
అహఁ నా పెళ్లంట.. ఓహెూ నా పెళ్లంట
నీకు నాకు చెల్లంట.. లోకమెల్ల గోలంట.. టాంటాంటాం…
వీరాధివీరులంట ధరణీ కుబేరులంట.. బోరుబోరుమంటు
మా పెళ్లివారు వచ్చెరంట… హబ్బిబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ..హహహహహ..
బాలాకుమారినంట, చాలా సుకుమారినంట
పెళ్లికొడుకు నన్నుచూసి మురిసి మూర్ఛపోవునంట
అయ్యయ్యయ్యయ్యయ్యొ హహహహ
తాళికట్ట వచ్చునంట ఛీ తాళికట్టవచ్చునంట
తగని సిగ్గు నాకంట తాళికట్ట‘ అంటూ మళ్ళీ ఘటోత్కచుడి కంఠం రావడం పాట భలే పసందుగా ఉంటుంది. పింగళి నాగేంద్రరావు గారందించిన పాట ఇది.
పెళ్లి తంతులో వధువు జడను అక్క లేదా వదిన ఎత్తిపట్టుకుంటే వరుడు ఆమె మెడలో మూడుముళ్లు వేసే ముచ్చటైన దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘గోదావరి’ చిత్రానికి అల్లిన అందమైన పాట..
‘నీల గగనా, ఘనవిచలన ధరణిజా శ్రీరమణ.. రామచక్కని సీతకి
అరచేత గోరింట.. ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట..
ఉడుత వీపున వేలువిడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
ఎత్తగలడా సీత జడను తాళికట్టే వేళలో.. రామచక్కని సీతకి..‘
వేటూరి ఎంత చమత్కారంగా రాశారో.. ఎంత వీరుడైన రాముడైనా తాళికట్టే సమయాన సీత జడను ఎత్తడం అసాధ్యమట. ఎంతచక్కటి ఊహ. ఈ పాటకు గాయత్రి గళం ప్రత్యేక సొగసులద్దింది.
తల్లిదండ్రులు తమ పిల్లల వివాహం తమ ఆధ్వర్యంలో జరగాలని, చూసి ఆనందించాలని కోరుకోవడం సహజం. అయితే అలనాడు యశోద, కృష్ణయ్య పెళ్లి ఒక్కటైనా చూడలేదట. అందుకే తర్వాత కాలంలో వకుళమాతగా అవతరించి శ్రీనివాసుడికి, పద్మావతితో వివాహం జరిపించి మురిసిందంటారు.
అన్నమయ్య కూడా ఈ పెళ్లి వేడుకను చక్కగా ఓ కీర్తనలో పొందుపరిచారు. అది..
‘పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత, పడమరలి నవ్వీనె పెండ్లికూతురు’ పద్మావతి అమ్మవారిని పెళ్లికూతురుగా ఆయన వర్ణించిన తీరు అద్భుతం.
‘మాంగల్యం తంతునా నేన మమజీవన హేతునా, కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం’ మంగళ సూత్రధారణ సమయంలో చదివే మంత్రానికి విశిష్టమైన అర్థం, ఈ మంగళప్రదమైన సూత్రం నా జీవితానికి మూలమవుతుంది. దీన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు నూరేళ్లు జీవించాలి.
ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి, నాతి చరామి, నాతిచరామి.. (ధర్మార్థ కామ మోక్షాలన్నిటా నేనెప్పుడూ నా ధర్మపత్నిని వీడి ప్రవర్తించను) అంటూ అందరి ముందు వరుడు వాగ్దానం చేస్తాడు. అయితే వాటి అర్థాన్ని మనసు కెక్కించుకుని, తమ వాగ్దానాన్ని జీవితాంతం నిలబెట్టుకునే వారెందరన్నదే పెద్ద ప్రశ్న. ఈ మంత్రం గురించే ‘కల్యాణ మండపం’ చిత్రంలో ఓ చక్కటి పాట ఉంది. అది..
‘చుక్కలు పాడే శుభమంత్రం, దిక్కులు నిండే దివ్యమంత్రం
ఎక్కడనో ఎపుడో ఎవరో పలికిన వేదమంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో నా చెవిలో ఊదిన మంత్రం.. మధు మంత్రం..
రెక్కలపై ఆ గువ్వల జంట, రేకులలో ఆ పువ్వుల జంట
సాగుతునే, ఊగుతునే మధుర మధురముగ చదువుకునే
ఆనందమంత్రం..
కనులు ఒకపరి మూసుకుని, నీవన్నది మరిమరి తలచుకుని
ఒక్కతినే నేనొక్కతినే అదేపనిగా సదా మనసులో ఆలపించే ప్రియ మంత్రం
కోవెల దైవం పిలిచేదాక, ఆవలి ఒడ్డున నిలిచేదాకా నాలోనే.. లోలోనే
నాతి చరామి.. నాతిచరామి. అది నా ప్రాణమంత్రం…‘
‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అని ఆంగ్లేయులంటారు. మనవాళ్లు ‘కల్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, ఊళ్లో పెళ్లయితే కుక్కలకు హడావుడి, సుబ్బి పెళ్లి వెంకి చావుకొచ్చింది, వివాహాయ విద్య నాశాయ’ వంటి సామెతలెన్నోచెప్పారు. పూర్వం ఐదురోజుల పెళ్లిళ్లు (వరుడు చిత్రంలో ఈ ఐదురోజుల పెళ్లి సందడిని చిత్రించారు) జరిగేవట. కాలక్రమంలో మూడు రోజులు, ఆపైన ఒక రోజుకు మారిపోయాయి. అయితే ఇప్పటికీ ఉత్తరదేశంవారు పెళ్లి వేడుకలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. మొదటిరోజు గణేశ పూజ, రెండవ రోజు మెహందీ పేరిట చేతులకు, కాళ్లకు గోరింటాకు డిజైన్ల అలంకరణ, ఆ సాయంత్రం సంగీత్ పేరిట సరదాగా డోలక్ కార్యక్రమంలో, రెండు కుటుంబాల పరస్పర పరిచయాలు, విందు, ఆనంద నృత్యాలు, మూడోరోజు ప్రధానమైన పెళ్లితంతు, అందరికీ విందు భోజనాలు.
పెళ్లిళ్లలో భావోద్వేగాలెన్నో. తమ కంటిపాప అత్తింటికి వెళ్లిపోతుందన్న భావన తల్లిదండ్రులకు ఒకింత బాధను కలిగిసస్తుంది. ఇంతకాలంలో పెళ్లిళ్లలో అప్పగింతల కార్యక్రమం వధువు, ఆమె తల్లిదండ్రులనే కాదు, బంధువర్గాన్నంతా కదిలించేది. ఇప్పుడు అది కొంచెం తగ్గిందనే చెప్పాలి. బహుశా వీడియోకాల్స్ సౌకర్యం ఉండటం వల్ల కావచ్చు. ‘బంగారు గాజులు’ చిత్రంలో అన్నయ్య చెల్లెలు పెళ్లి సందర్భంలో తన మనసును పాటగా చేసి
‘చెల్లాయి పెళ్లికూతురాయెను, పాలవెల్లులే నాలో పొంగిపోయెను,
నాచెల్లి మందారవల్లి, అది ననుగన్న బంగారు తల్లి..‘ అని మురిసిపోతూనే, ఆ తరువాత…
‘చిన్నారి చెల్లికి పెళ్లయితే, నా పొన్నారి బావతో వెళుతుంటే, ఈ అన్నయ్య కన్నీరు ఆగేనా, అది పన్నీటి వాగై సాగేనా..‘ అని బాధపడతాడు.
కాలం మారిపోయి కొందరు ‘లివింగ్ టుగెదర్’ పేరిట కల్యాణం లేని కాపురాలు కొన్ని సాగిస్తున్నా పెళ్లి సంప్రదాయం చెక్కుచెదరకుండా ఉంది. స్తోమత లేదంటూనే చాలామంది ఒక్క రోజు పెళ్లినే చాలా ఆర్భాటంగా చేస్తున్నారు. వెరైటీ శుభలేఖలు, పెద్ద పెద్ద మ్యారేజ్ హాల్స్ బుకింగ్లు, వేదిక అలంకరణలు, జిగేలుమనే లైట్లు, వెల్‌కమ్ డ్రింక్లు, స్నాక్స్, లెక్కలేనన్ని పదార్థాలతో విందు, టిఫిన్లు, ఛాట్లు, ఫ్రూట్లు వగైరా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌లు, బ్యాండ్ మేళాలు. కళ్లు చెదిరే వస్త్రధారణలు, వీడియో, డ్రోన్ల హడావుడి, రిటర్న్ గిఫ్టు ఇలా అపరిమిత ఖర్చు. గతంలో వరకట్న దురాచారం వల్ల పెళ్లి సామాన్యులకు భారమవుతోందని వాపోయేవారు. ఇప్పుడు ఆ మాట అంతగా వినిపించటం లేదు. అంటే దానర్థం వరకట్నం పూర్తిగా పోయిందని కాదు, కొందరు హుష్ గప్‌చిప్‌గా పుచ్చుకుంటూనే ఉన్నారు. మిగతావారు కట్నం అనకపోయినా పెళ్లి గ్రాండ్‌గా చేయాలి, లాంఛనాలు జరపాలి అంటూ ఖర్చును పెంచేస్తారు. ఆడపెళ్లివాళ్లు కూడా నలుగురిలో గ్రాండ్ ఇమేజ్ ఉండాలనే కోరుకుంటున్నారు. మరి ఇష్టపడ్డప్పుడు కష్టం ఎందుకనిపిస్తుంది. ఇవన్నీఒక ఎత్తయితే ప్రపంచవ్యాప్తంగా ఈ పెళ్లి వేడుకలు చిత్రాతి చిత్రాలు. విమానంలో ప్రయాణిస్తూ, ఆకాశంలో పెళ్లి చేసుకునేవారు కొందరు, హాట్ ఎయిర్ బెలూన్ బాస్కెట్లలో పురోహితుడితో సహా ఎక్కి గాల్లోనే పెళ్లాడేవారు ఇంకొందరు, సముద్రజలాల అట్టడుగున పెళ్లి చేసుకునేవారు మరి కొందరు. ఇక ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి తిష్టవేసి, పెళ్లి ఆశల మీద నీళ్లు చల్లేసింది. ఎంతో ఘనంగా, ముచ్చటగా బంధు, మిత్ర, సపరివార సమక్షంలో తమ అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లి జరపాలనుకున్న వారికి నిరుత్సాహమే మిగిలింది. యాభైమందిని మించి పిలిచే వీలు లేదు. పిలిచినవారు రావటం సందేహమే. మాస్క్‌లతో, శానిటైజర్లతో, అనుమానంతో, భయంతో పెళ్లంటే ఎవరికయినా ఏం ఉత్సాహం ఉంటుంది? ఇప్పట్లో కరోనా కట్టడికాని పరిస్థితులలో పెళ్లిళ్లను వాయిదావేయడం కుదిరే పనికాదు. ఏమైనా అన్నిటికన్నా ముందు క్షేమానికే ప్రాధాన్యమివ్వక తప్పదు. ఈ నేపథ్యంలో కొన్ని సంప్రదాయాలను, సరదాలను మానుకోవటం మంచిది. ‘పెళ్లి పెద్దలు చేసేదయినా, గుళ్లో పెళ్లయినా, ఆర్యసమాజ్‌లో పెళ్లయినా, రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లయినా ఏదయినా పెళ్లి పెళ్లే. పెళ్లి ఏ విధంగా చేసుకున్నా వధూవరులు ఆధిక్య భావనలను పక్కనపెట్టి, పరస్పరం అర్థంచేసుకొని, సదవగాహనతో, ప్రేమతో, నమ్మకంతో పదికాలాల పాటు తమ బంధాన్ని పదిలపరచుకున్నప్పుడే పెళ్లికి సార్ధకత’ అనుకుంటుండగా పిల్లలు టీవీ ఆన్ చేసినట్లున్నారు, సౌండ్‌కు ఉలిక్కిపడ్డాను.
మనసులోని తలపుల గది తలుపులు మూసుకుంటుండగా టీవీ స్క్రీన్ మీద ‘పెళ్లి పుస్తకం’ టైటిల్ తళుక్కుమంది.