[box type=’note’ fontsize=’16’] మన దేశంలో అక్టోబరు 10 2020 నాడు జాతీయ తపాలదినోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా ఈ వ్యాసాన్ని అందిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]
అక్టోబరు, 10, జాతీయ తపాల దినోత్సవము. ఈ సందర్భముగా తపాల శాఖ గురించి కొన్ని విషయాలను ముచ్చటించుకుందాము. పూర్వము పోస్ట్ మ్యాన్ రాక కోసము ఎదురు చూసే వాళ్ళు ఎక్కువగా ఉండేవారు. పోస్ట్ మ్యాన్ చాలా మందికి సన్నిహితుడు, కాని మారుతున్న రోజులలో తపాల శాఖ తన ఉనికిని కాపాడుకోవటానికి చాలా కష్టపడవలసివస్తుంది. పెరిగిపోతున్న సెల్ ఫోన్ వాడకము, కొరియర్ సంస్థల పోటి తపాల శాఖకు సవాలుగా మారినాయి. ప్రస్తుత యువతకు పోస్ట్ కార్డు, ఇన్లాండ్ లెటర్, ఎన్వలప్ వంటివి చూడటము లేదా వాడటము పూర్తిగా మరచిపోతున్నారు. డబ్బు ఎమ్. ఓ. ద్వారా పంపడము, అవసరమైన కాగితాలను రిజిష్టర్డ్ పోస్ట్‌లో పంపటము అలవాటు పోయింది. కార్డు అనేది మ్యూజియంలో ప్రదర్శన వస్తువు అయే ప్రమాదము ఉన్నది. మొదట్లో క్షేమ సమాచారాలను తెలియజేయటానికి చౌక అయిన సాధనము కార్డు ముక్కే. మొదట ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ అనే డిపార్టుమెంట్ ఉండేది, అది కాస్తా తపాల శాఖ వరకే పరిమితము అయింది (టెలిగ్రాము వ్యవస్థ ఎత్తేశారు కాబట్టి).
మనదేశములో మొదటిసారిగా 1764లో ఈస్ట్ ఇండియా కంపనీ వారు పోస్ట్ ఆఫీస్‌ను ప్రారంభించారు. దినదిన ప్రవర్ధమానము చెందుతూ నేటి భారత దేశములో పోస్ట్ ఆఫీసుల సంఖ్య 1,54,866 కు చేరింది. ప్రపంచములో ఏ దేశములో ఇన్ని పోస్ట్ ఆఫీసులు లేవు. ఉద్యోగులు: 433,417 మంది. 1854లో సింద్ డాక్ అనే సంస్థ వారు తొలి స్టాంపును ముద్రించారు.
అనేక మంది రాజకీయ నాయకుల లేదా వివిధ రంగాల ప్రముఖుల చిత్రాలతో స్టాంపులను ముద్రించారు. ప్రస్తుతము ఎవరి ఫోటో వారు పోస్టల్ స్టాంప్స్‌పై ముద్రించే అవకాశము తపాలా శాఖ వారు కలుగజేస్తున్నారు. ప్రపంచములో సుమారు 110 దేశాలు మన గాంధీజీని తమ స్టాంపులపై ముద్రించుకున్నాయి. ప్రపంచములో మొదటిసారిగా ఎయిర్ మెయిల్ పంపిన ఘనత మనమే దక్కించుకున్నాము. భూమిమీద ఎత్తైన అంటే 15,500 అడుగుల ఎత్తులో పోస్ట్ ఆఫీస్ హిమాచల్ ప్రదేశ్ లోని హిక్కిమ్ గ్రామములో ఉన్నది. అంతే కాకుండా 1983లో మంచు ఖండమైన అంటార్కిటికాలో మన తపాలా కేంద్రాన్ని నెలకొల్పారు.
తపాల శాఖకు చెందిన విశేషాలను చూడాలంటే న్యూఢిల్లీ లోని డాక్ భవన్‌లో గల ‘ది నేషనల్ ఫిలటెలికల్ మ్యూజియమ్’ చూడాలి. అందులో ఎన్నో రకాల దేశ స్టాంపులు, పాత రోజుల్లో వాడిన పోస్ట్ బాక్సులు, ఇతర విశేషాలు ఎన్నో వుంటాయి. ఇప్పటికి కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు వారు చేసే ఉత్తర ప్రత్యుత్తరాలను పోస్టల్ శాఖ ద్వారానే జరుపుతారు. కొరియర్ సర్వీసులను అనుమతించరు. పోస్టల్ శాఖ కూడా కాలానుగుణముగా ఆధునీకరణ ద్వారా తన ఉనికిని కాపాడుకుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు కాకుండా డబ్బు లావాదేవీలు అంటే బ్యాంకింగ్ పనులను, లాజిస్టిక్స్ పనులను కూడా చేస్తుంది.