[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 40వ భాగం. [/box]
మోహన్ చారిత్రక నవల-1.1
[dropcap]మ[/dropcap]హా సాగరంలో అలలు ఆకాశాన్నంటుతున్నాయి.
జంఝామారుతం తీవ్రంగా వీస్తోంది.
వర్షం కుండలతో వంపినట్లు పడుతోంది.
నౌకను ఉత్తుంగ తరంగాలు చేతులు మార్చుకుంటున్నాయి.
ఆ నౌక పేరు రాజహంస. సువర్ణ భూమి నుండి పదిహేను దినాల క్రింద బయలు దేరింది. ఆంధ్రా పథం వేపు ప్రయాణం చేస్తున్నది. అనుకూల పవనాల ప్రభావం వలన మరొక పదిహేను దినాలలో గమ్యం చేరుకోగలదని మహానావికుడు మొన్ననే చెప్పాడు.
అతడీ విధంగా చెప్పిన మరునాటి ఉదయమే వాతావరణంలో మార్పు కనిపించింది. నిన్నటి ఉదయం మహా సాగరం ప్రశాంతంగా ఉంది. తరంగాలు నామమాత్రానికే కదులుతున్నాయి. గాలి ఎటువేపు నుంచీ వీచడం మాని వేసింది. ఆకాశం పరమ నిర్మలంగా ఉంది. అందుచేతనే ఉదయం నుండి మహా నావికుడు తన చుక్కానిని విడిచి పెట్టలేదు.
ఆకాశం వంక అతను చూస్తునే ఉన్నాడు.
పైకెత్తిన తెరచాపలను తోయడానికి గాలిలేదు, స్తంభించి పోయింది.
నౌకలోని ప్రయాణికులు చాల ఉల్లాసంగా ఉన్నారు. కుదుపు తక్కువగా ఉండి, వాళ్లు భూమి మీదనే ఉన్నట్లు అనిపించింది. సువర్ణ భూమిలో చంపాపతీ నగరం విడిచిన తరువాత ఇరావతీ నదీ ముఖం నౌక చేరుకోడానికి అయిదు రోజులు పట్టింది. సముద్రం వేపు నది ప్రవహిస్తూ ఉండడం చేత నౌక తొందరగా ప్రయాణం చేసింది. సముద్రంలోకి ప్రవేశించిన తరువాత అనుకూల పవనాలు వీచాయి. రాజ హంస మదమరాళగమనయై మరొక పది రోజులు రమ్యంగా ముందుకు సాగింది.
కాని, పరిస్థితి అంతా నిన్న మధ్యాహ్నంతో పూర్తిగా మారిపోయింది.
ఆకాశం మీద తెల్లటి ఉన్నివలె మబ్బు పింజలు తోచాయి. గాలి వాటం మరొక వంకకు మారిపోయింది. తెరచాపలు సరిచేసి నావికులు శ్రమించారు. మహా నావికుడు చుక్కానిని నేర్పుగా తిప్పుతూ నౌకను నడిపించాడు.
సాయంకాలమయే సరికి ఆకాశం మేఘావృతమయింది. దొంతులు దొంతులుగా నల్లటి మేఘాలు నభో మండలాన్ని కప్పివేశాయి. గాలి వేగం క్షణక్షణానికి హెచ్చింది. తెర చాపలు గాలితో నిండి నౌకను వేగంగా నడుపుతున్నాయి. నిబిడమైన మేఘ పంక్తులు సంధ్యా సమయంలో కారు చీకట్లను పిలుచుకొని వచ్చాయి.
అప్పుడు ఆకాశవీథిలో మెరుపు కన్నెలు నాట్యం చేసి ఉరుములు గర్జనలు విశ్వాంతరాళాన్ని నింపివేశాయి.
వర్షం మొదలయింది.
గాలితో ఆ వర్షం చేయికలిపి వీరవిహారం చేసింది.
అశినిపాతాలు నిరవధికంగా వర్షించాయి.
దశదిశలు మహాశబ్దంతో ప్రతిధ్వనించాయి.
మహోదధి తరంగాలు తాళవృక్ష ప్రమాణంగా లేచాయి.
ఉప మహానావికుడిని తన స్థానంలో ఉంచి మహానావికుడు నౌకలోని ప్రయాణికులను హెచ్చరించడానికి పోయాడు.
ఆ నౌక మధ్యమందిర, ముఖం వైపొక తెరచాపకొయ్య, వెనుకవైపొక తెరచాప కొయ్య దానికున్నాయి. జంఝూ మారుతానికి తెరచాపలు నౌకను ఒకపక్కకు వంచుతూ ఉంటే నావికులు మహా శ్రమతో వాటిని దింపివేశారు.
మహా నావికుని పేరు ధర్మ మిత్రుడు. ధాన్య కటకం అతని మాతామహుల నివాస స్థలం. అతడు ఘంటశాలకు చెందినవాడు. తండ్రి తాతల నుండి నౌకలకు మహా నౌకలకు ఆధిపత్యం వహించి, సకల సముద్రాలలో వాటికి కర్ణధారులుగా వ్యవహరించడం వారి కుటుంబానికి కులవృత్తిగా శోభించింది.
ధర్మ మిత్రుడు ప్రయాణికులను కలుసుకున్నాడు. ఒక ఘడియ వరకు వారితో మాట్లాడి, చర్చించి, ఒక నిర్ణయం తీసుకోడానికి తిరిగి తన స్థానం చేరుకున్నాడు.
సూర్యుడు ఎప్పుడస్తమించాడో తెలియదు. పగలు మూడవయామం నుండి మేఘాలు పూర్తిగా ఆకాశాన్ని కప్పివేయడం చేత రాత్రి చాల ముందుగానే ప్రవేశించింది.
మహానావికుని ముందు ఘటికా యంత్రముంది. సూర్యాస్తమయమయి నాలుగు ఘడియలైనట్లు అది సూచిస్తున్నది. అర్ధరాత్రికింకా పదకొండు ఘడియలు మిగిలి ఉన్నాయి. ఆ సరికి అతడొక నిర్ణయానికి వచ్చి నౌకలోని ప్రయాణికుల అభీష్టాన్ని నెరవేర్చాలి.
అది అభీష్టం కాదు, వారి ఆజ్ఞ. కాబట్టి అతడు వేరే నిర్ణయం తీసుకోడమనే ప్రశ్నలేనే లేదు. మహానావికుని తలమీద పెద్ద బాధ్యత ఉంది.
ప్రయాణికుల ఆజ్ఞనతడు పాటిస్తే మరొకరికిచ్చిన వాగ్దానం భంగం చేయవలసి వస్తుంది.
అటు మహా సముద్రం ఇటు అంతకన్న కల్లోలితమైన అతని మనస్సు. వీటితో అతడు సమాధానపడలేక పోతున్నాడు. స్థిరంగా అతడు కూర్చున్నాడు.
ఘంటశాల విడువడానికి పూర్వం నుండి జరిగిన సంగతులు ఒకటి ఒకటి అతను మననం చేసుకున్నాడు.
శరత్పూర్ణిమ వెళ్లిన అయిదో రోజున ఒక బ్రాహ్మణుడు ధర్మమిత్రుడి దగ్గరికి వచ్చాడు. అతడు సువర్ణ భూమి నుండి వచ్చానన్నాడు. అతని పేరు శివశర్మ. ఇరావతీ నదికి దక్షిణతటాన చంపావతీ నగరముంది. మహా మండలేశ్వరుడు చంద్రకీర్తి దాని పాలకుడు. అతనికి అయిదుగురు రాణులు వారందరూ ఒకే నెలలో గర్భం ధరించారు. ఆ విధంగానే ఒకే మాసంలో వారు ప్రసవిస్తారని భిషక్కులు తెలియజేశారు. చంద్రకీర్తి వైదిక ధర్మప్రియుడు. తన సంతానానికి జాతకర్మ నామ కరణాదులు జరిపించడానికి తన జన్మ స్థలమైన వేంగీ పురం నుండి నూరుమంది బ్రాహ్మణులను తీసుకొని రావలసిందని శివశర్మను పంపించాడు. సువర్ణ ద్వీపంనుండి వచ్చిన వర్తకుల నౌకలో అతడు ఘంటశాల చేరుకున్నాడు.
సువర్ణ ద్వీపంలో బంగారానికి కొదవలేదు. చందన వృక్షాలతో అడవులు నిండి ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలకది పుట్టినిల్లు. అక్కడ లభించే అగరు లోకవిఖ్యాతి పొందింది. ఇటువంటి వార్తలెన్నో ఆంధ్రాపథంలో వ్యాప్తిలో ఉన్నాయి.
విజయపురి నుండి శ్రేష్ఠి ప్రముఖుడు కుమార నంది రెండుసార్లు ధర్మమిత్రుని నౌకను సువర్ణ ద్వీపానికి వినియోగించుకున్నాడు. ఆ విధంగా అతనికి ఇరావతీ నది, సువర్ణ ద్వీపం సుపరిచితాలే.
చంద్రకీర్తి నూరుగురు బ్రాహ్మణులను చంపాపతికి తీసుకుపోడానికి, తిరిగి వారిని ఆంధ్రపథం చేర్చడానికి కోరిన ధనం కాంచన రూపంలో ఇస్తానన్నాడు. చంపాపతిలో నౌక ఉన్నన్ని నాళ్లు మహానావికునికి, అతని సహనావికులకు భోజన, వాస, విహారాదులకు అన్ని ఏర్పాటులు చేస్తానన్నాడు. రాను వేయి సువర్ణాలు, పోను వేయి సువర్ణాలు –
మరో ఆరురోజులలోనే ప్రయాణానికి సుముహూర్తమున్నది. నౌకను సజ్జీకరించవలసిందని ధర్మమిత్రుడిని శివశర్మ కోరాడు.
సువర్ణ ద్వీపం పోవలసిన నూరుమంది బ్రాహ్మణులలో వేద పండితులు, సాహిత్య వేత్తలు, జ్యోతిషశాస్త్రజ్ఞులు, ధనుర్విద్యా పారగులు మొదలైన వాళ్లున్నారు. వాళ్లు శ్రోత్రియులు. సముద్రయానం బ్రాహ్మణులకు నిషిద్ధమని వాళ్లు సువర్ణ ద్వీపానికి జలమార్గం మీద పోవడానికి మొదట ఇష్టపడలేదు.
భూమార్గం మీద పోవడానికి చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రయాణకాలం మరోరెండునెలలు అధికంగా ఉంటుంది. గమ్యం చేరుసరికి నూరుమందిలో పదిమంది కూడా బ్రతికే అదృష్టం లేదు. ఈ విషయాలన్నీ శివశర్మ వారికి నచ్చజెప్పాడు.
ఆశ చాల బలమైనది. ఒకసారి సువర్ణ ద్వీపం వెళ్వివస్తే, ఆ ఆర్జనతో సుఖంగా జీవితమంతా గడపవచ్చునని వాళ్లందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. ప్రతి తప్పు పనికి ఏదో ప్రాయశ్చిత్తముంది. బ్రహ్మ హత్య పాతకానికి కూడా విరుగుళ్లున్నాయి.
సముద్రయానం చేసి వచ్చిన తరువాత సాటి బ్రాహ్మణులు వెలివేస్తారని భయపడనక్కరలేదు. సక్రమంగా ప్రాయశ్చిత్తం జరిపించి దివ్యమైన సమారాధన చేసి, భోళ్లకు విరివిగా దక్షిణలిస్తే అన్ని పాపాలు పోతాయని, ఏ వెలి అడ్డురాదని వాళ్లు ఒక అభిప్రాయానికి వచ్చారు. శివశర్మ ఈ విషయాలన్నీ ధర్మమిత్రుడితో చెప్పి, నౌకను సిద్ధం చేయమన్నాడు. బ్రాహ్మణులు తన నౌకలో ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి. అందుచేత ధర్మ మిత్రుడు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాటులు చేయవలసి వచ్చింది.
పాచకులు విధిగా బ్రాహ్మణులై ఉండాలి. పగలు అల్పాహారం రాత్రి ఫలహారం పళ్లు, వ్యంజనాలు, వెండి బిందెలలో కృష్ణానదీ జలాలు – ఇవన్నీ తక్కువ కాలంలో సమకూర్చడానికి ధర్మమిత్రుడికి చాల శ్రమ అయింది.
అనుకూల పవనాలు వీచడం చేత నౌక నెలదినాలు ప్రయాణించిన తరువాత ఇరావతీ నదీ ముఖం చేరుకుంది. అక్కడ నుండి చంపావతి వరకు ప్రవాహానికి ఎదురుగా ప్రయాణం చేయవలసి వచ్చింది. అందుచేత గమ్యం చేరుకోడానికి మరొక పది దినాలయింది.
నౌక ఇరావతీ నదీ ముఖం చేరుకోగానే శివశర్మ వేగులవారి ద్వారా చంద్రకీర్తి ప్రభువుకు, కార్యం సానుకూలంగా చేసుకొని వచ్చినట్లు కబురు పంపించాడు.
చంపావతి రేవులో బ్రాహ్మణులు నౌకనుండి దిగి, క్షేమంగా ప్రయాణం చేసినందుకు తిరిగి భూమిమీద పాదాలు మోపుతున్నందుకు పృథివీ వందనం చేశారు.
చంద్రకీర్తి తన మంత్రులతో వచ్చి బ్రాహ్మణులకు ఘనమైన స్వాగతం పలికాడు.
నౌక ఇరావతీ నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కుడివేపునున్న చెక్కలు బండరాళ్లకు కొట్టుకొని దెబ్బతిన్నాయి. చంపావతిలో నౌకా నిర్మాణ కేంద్రమంటూ లేదు. సువర్ణ దీపంలో ఉన్న వండ్రంగులు బల్లలు కోసి దెబ్బలు తిన్నవాటిని మార్చారు. తరువాత ఓడకు రంగు వేశారు. ఈ పనులన్నీ జరుగుతున్నప్పుడు మహానావికుడు చంపావతిలో లేడు. తన బంధువులతో కొంతకాలం గడపడానికతడు యవద్వీపం పోయాడు.
నౌక చంపావతి చేరుకునే సరికి రాణులు ప్రసవించలేదు. మూడు నెలల తరువాత అయిదుగురు ఒకే వారంలోనే పురుడయారు. ముగ్గురు మగబిడ్డలు, ఇద్దరు ఆడపిల్లలు వారికి జన్మించారు. జాతకర్మ నామకరణాదులు అయి బ్రామ్మణులు స్వదేశానికి బయలే దేరడానికి మరొక నెల పట్టింది.
ధర్మ మిత్రుడు యవద్వీపం నుండి రాణులు ప్రసవించకముందే సువర్ణ ద్వీపం తిరిగి వచ్చాడు.
శరత్కాలంలో ఆంధ్రాపథం విడిచిన నౌక, తిరిగి వసంత కాలంలో స్వదేశానికి బయలుదేరింది. నౌక చంపావతి విడిచి పెట్టే టప్పుడు బ్రాహ్మణులు శాంతి మంత్రాలు చదివారు. వరుణుడిని, మరుత్తులను, ఆదిత్యులను, వాయువును, అగ్నిని, చంద్రుడిని ఇతర దేవతలను స్తుతించారు. తిరుగు ప్రయాణం కూడా నిరాటంకంగా నెరవేరుతుందని వాళు విశ్వసించారు.
చంపావతి నుండి ఇరావతీ నదీ ముఖం వరకు నౌక త్వరితగతిని ప్రయాణం చేసింది. పవనాలు, ప్రవాహం అనుకూలించాయి. బ్రాహ్మణులు చాల ఉల్లాసంగా ఉన్నారు. వేంగీ విషయంలోని వేదపండితులవడం చేత చంద్రకీర్తి వారిని ఘనంగా సత్కరించాడు. వాళ్లు ఆశించిన దానికి రెండు రెట్లు సువర్ణాలిచ్చాడు. వాళ్లు చంపావతిలో ఉన్న అన్ని దినాలలోను దివ్యమైన భోగాలను సమకూర్చాడు.
సువర్ణ ద్వీపంలోని స్త్రీలు చాల చక్కని వాళ్లు. పృథునితంబులు – హేమ కుచకుంభలు విపుల జఘనలు – మృదుభాషిణులు – హేమంత రాత్రులలో నిద్రరాక వెచ్చటి కంబళ్లు కప్పుకున్న వేదజడులు వారి ఆలోచనలలో వివృతవక్షలైన ఆ సుందరులనే నిలుపుకున్నారు.
ఆ హితాగ్నుల సపర్యలకు లాగి విడిచిన అనంగుని పూవు బాణాలవంటి రంబో రువులనే చంద్రకీర్తి నియమించాడు. ఆ బ్రాహ్మణులు మరొక్క నెల చంపావతిలో ఉంటే ఆ చంద్ర వదనలను పెళ్లాడి సువర్ణ ద్వీపంలో స్థిరంగా ఉండిపోయేవాళ్లే.
మతులు తప్పి, అంగనల కొంగులను పట్టి తిరుగుతున్న భూమిధరలను ధర్మమిత్రుడు హెచ్చరించాడు. వారి గృహిణులను జ్ఞాపకానికి తెచ్చి, శ్రోత్రియుల మనస్సులను శ్రోత్రప్రియమైన హిత భాషణలతో ప్రక్షాళించాడు. వాళ్లందరూ, రాణులు ప్రసవించిన దగ్గరనుంచీ ఇళ్లవేపు మనసులు తిప్పుకున్నారు. అశ్రద్ధ చేసిన నిత్యకర్మలను అనుష్ఠించడం మొదలు పెట్టారు.
ఆదిత్య వాసరం సూర్యోదయానంతరం పండ్రెండు ఘడియలకు నౌక రేవును విడిచి పెట్టడానికి ముహూర్తం నిశ్చయమయింది. బ్రాహ్మణులు సుముహూర్తానికి నాలుగు ఘడియలముందు, నౌకలోకి ప్రవేశించి, సముద్ర యానం భద్రంగా జరగడం కోసం శాంతి మంత్రాలు, వరుణాది దేవతలు స్తుతులు చేశారు. మహామండలేశ్వరుడు చంద్రకీర్తి వాళ్లను స్వయంగా వాహనాలమీద నౌకకు తీసుకొని వచ్చాడు. వాళ్లు సువర్ణ భూమినుండి కొని పోతున్న బంగారం, సుగంధ ద్రవ్యాలు, గంధపు చెక్కలు, అగరు వేరు వేరు పెట్టెలలో భద్రపరుచుకున్నారు. తమకు నౌకలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులలో తమ ఆసనాల క్రింద పెట్టెలను పెట్టుకున్నారు.
నౌక మరొక ఘడియలో చంపావతి విడిచి పెడుతుంది. ఆ సమయంలో చంద్రకీర్తి మహా ప్రభువు మహా నావికుడికి కబురు పంపి, అతను వచ్చిన తరువాత అన్నాడు.
“మహా నావికా! మాదొక అభ్యర్థన. మీ నౌకలో మా స్నేహితులొకరు మీతో ప్రయాణం చేస్తారు. అతను, మేము తక్షశిలలో సహాధ్యాయులం. అతనిని ఆంధ్రాపథంలో ఏ రేవులోనైనా విడువవచ్చు.”
అపుడు మహానావికుడు అభ్యంతరం తెలిపాడు.
“ప్రభువా! మీ ఆజ్ఞను పాటించడానికి నాకు అవకాశం లేదు. ఈ నౌక నూరుమంది బ్రాహ్మణులకు ప్రత్యేకించబడింది. వారి ప్రయాణానికి మాత్రమే ఏర్పాటులు చేయబడ్డాయి. మరొక్క అతిథిని స్వీకరించడం వారి అనుమతి మీదనే ఆధారపడి ఉంటుంది. వారితో ఈ సంగతి ప్రస్తావించకుండా నేను మీకు మాట ఇవ్వలేను.”
చంద్రకీర్తి ప్రభువు నవ్వాడు.
(సశేషం)