[dropcap]స[/dropcap]చ్చినోడింట్ల పిండి వంట
సచ్చేటోడింట్ల ఖాలీ ఊట
లోకం పోకడ చూడరా సాయిలు
మానవత్వం గేడికి పోయిందో
జర్రంతా పట్కరా సాయిలు
ఎండ యీపు ఎర్రగజేస్తుండే
రైతన్న ఎర్ర టమాటాలేస్తే
తక్కెడ గల్తీ జేసి సేటు నోరు గొట్టిండు
టమాటాలు మంచిగా లెవ్వని
సేటమ్మా గిన్నెడు పప్పు మోరీల పోసింది
కష్టం ఇలువ తెల్వని పట్నపోల్లకు
సుఖం మస్తు
చెమటనే తిని బతికే మాబోటోల్లకు
కష్టం దోస్తు
లోకం పోకడ చూడరా సాయిలు
మానవత్వం గేడికి పోయిందో
జర్రంతా పట్కరా సాయిలు
ఆడపిల్ల పుడ్తే లచ్చిమొచ్చిందని
దొంగ నవ్వులు నవ్వుతారు
తాగనీకి కతలు చెపుతారు
పొద్దేక్కే దాకా పండుకొని
పొద్దుమీకి తెలివొచ్చి
పిల్ల పుట్టిందని
పెల్లాన్ని కొడతారు
లోకం పోకడ చూడరా సాయిలు
మానవత్వం గేడికి పోయిందో
జర్రంతా పట్కరా సాయిలు
ఉస్కూలు పోవాలంటే పైసలు కట్టలే
ఉన్నోడికి వంద ఉస్కూళ్ళు
కానీ పిల్లలకి సదువు మీద సద్ద సున్నా
లేనోడికి సదువంటే పానం
కానీ పైసలకు పెద్ద గండి కాదన్నా
లోకం పోకడ చూడరా సాయిలు
మానవత్వం గేడికి పోయిందో
జర్రంతా పట్కరా సాయిలు!