[dropcap]వి[/dropcap]ష వాయువు కన్నా పెను ప్రమాదకారియై
శ్వాసించేందుకు కూడా వెనుకాడే పరిస్థితై
మహా నాయకుల మని విర్ర వీగిన వారు చతికిల బడుతున్నారు
వారి పరి పాలనా దక్షతా- సమర్ధతలు ఒక ప్రశ్నార్హకమై!
బెంబేలెత్తి ఏక పక్ష నిర్ణయంగా హఠాత్ గృహ నిర్బంధాలు
మూత బడ్డ పరిశ్రమలు – ఆగిపోయిన ఆర్థిక వ్యవస్ఠ
కోల్పోయిన ఉద్యోగాలు లెక్కకు మిక్కిలి – కూలిపోయిన జీవికలు కొల్లలు
రేగే ఆకలి జ్వాలలకు దహించి పోయిన అభాగ్యులెందరో
భక్తులారా ఈ కరోనా నుండి మిమ్మల్ని కాపాడటం మా తరమా అని
వైరస్ వెరపుతో మూయబడి వెల వెల బోతున్న కోవెలలు
ప్రేక్షకులు లేక చిన్న బోయిన చిత్ర, కళా-క్రీడాంగణలు
యిజాల నిజాలను నడి వీధిలో నగ్నంగా నిలబెట్టి
శతాబ్దాల దారిద్య్రం ముసుగు తీసేసావ్ కదా కరోనా
సర్వ శుభ కార్యాలకు నిషేధ ఉత్తర్వులు – కలవర పడుతున్న కాబోయే జంటలు
ఏ నాడైనా నూకలు చెల్లి పోవచ్చు అని తెలిసినా
అధికారుల అలక్ష్యం – అవధులు దాటిన అవినీతి
ప్రజలు శవాల గుట్టలుగా మారితే మాకేం – మా వాటా మేం రాబట్టుకుంటామనే
గుంట నక్కలను చూస్తే, కరోనా నే కాస్త కరుణామయేమో అనిపిస్తుంది
ప్రభుత్వాసుపత్రులు కిక్కిరిసి పోయి ప్రజలు అవస్థల పాలయి
కార్పోరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యంతో బ్రతికి బయటపడ్డా
బిల్లు చూసి గుండాగి పోతున్నారు
మనమే కాదు మన ఇరుగు పొరుగు కూడా క్షేమంగా ఉండాలనే
వాంఛనీయ – ఙ్ఞానోదయమైంది హఠాత్తుగా అందరికీ