ట్విన్ సిటీస్ సింగర్స్-15: ‘ఎవరి పాటకి వారే న్యాయ నిర్ణేత కావాలి..!’ – సుజాత పట్టస్వామి

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ట్విన్ సిటీస్ సింగర్స్’ శీర్షికన – “అలనాటి రాణి నించి ఈ నాటి శ్రేయ ఘోషల్ పాటల వరకు – తెలుగు హిందీ పాటలను అవలీలగా పాడగలను..” అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న సుజాత పట్టస్వామి గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. ఇంటర్వ్యూలో ఇది మొదటి భాగం. [/box]

***

[dropcap]’గా[/dropcap]యని సుజాత పట్టస్వామి గారు ఏ పాట పాడినా బాగా పాడతారు’ అని పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న గాయనీ మణి ఈమె!

అయితే ఈ విలువైన ప్రశంసలను పొందడం వెనక తానెంతో కష్టపడి కృషి చేసానంటారు. నిజమే. ప్రముఖ గురువుల సంగీతం నేర్చుకుని, సినీ సంగీత శిక్షణా కేంద్రాలలో చేరి, సర్టిఫికేట్ కోర్సులు చేసారు. ఖాళీ సమయాలలో ఇంట్లోనే కూర్చుని కరఓకే ప్రాక్టీస్ చేసేవారు. అందుకు సంబంధించిన సెటప్ కోసం ఓ గదిని కేటాయించుకున్నారు. అదే తన ‘రికార్డింగ్ స్టూడియో..’ అంటారు ఛలోక్తిగా!

ఒక అడుగు ఆలస్యంగా పాటల ప్రయాణం మొదలైనా.. ఇప్పటి దాకా వెయ్యి పైన సినీ విభావరీలలో చురుకుగా పాల్గొన్నారు. ‘సుజారమణ అకాడెమీ’ని నెలకొల్పి, ఇటు సాంస్కృతిక కార్యక్రమాలతో బాటు అటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ‘అలనాటి రాణి నించి ఈ నాటి శ్రేయ ఘోషల్ పాటల వరకు – తెలుగు హిందీ పాటలను అవలీలగా పాడగలను..’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న ట్విన్ సిటీస్ ప్రముఖ గాయనీమణి – శ్రీమతి సుజాత పట్టస్వామి గారితో సంచిక జరిపిన ఇంటర్వ్యూ.. చదవండి!

***

♣ హలోండీ సుజాత గారు. నమస్తే.

* హలో దమయంతి గారూ నమస్తే.. ఎలా వున్నారు?

♣ బావున్నా.. మీరెలా వున్నారు ప్రోగ్రామ్స్‌తో ఎప్పుడూ బిజీగా వుండే మీరు ఈ కరోనాలో సమయాన్ని ఎలా గడుపుతున్నారు?

* మరింత బిజీగా వుంటున్నా అంటే నమ్ముతారా? (నవ్వులు). క్షణం తీరిక లేకుండా నా పాటల ప్రపంచంలో మునిగి తేలుతున్నా.. మరిన్ని గాన మాధుర్యాలను గ్రోలుతున్నా.. అడపా దడపా ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే వున్నాను. (హాయిగా నవ్వేస్తూ..)

♣ అందుకే ఈ గాయనిని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చా..

* ముందుగా కృతజ్ఞతలు మీకు, సంచికకి! మీ మొదటి ప్రశ్నకి ముందే నన్ను నేను పరిచయం చేసుకుంటాను.

నా పేరు – సుజాత పట్టస్వామి. పుట్టిందీ పెరిగిందీ, విద్యాభ్యాసం అంతా గుంటూరు లోనే. మా నాన్న గారు డా. వై. సూర్యనారాయణ గారు చాలా పేరున్న డాక్టర్ మా వూళ్ళో! మా అమ్మ గారు శ్రీమతి సీతా మహలక్ష్మి గారు. మా పెదనాన్న గారు కూడా గొప్ప పేరు మోసిన డాక్టర్ విజయవాడలో. మా కుటుంబ నేపథ్యంలో అందరూ ఉన్నత విద్యావంతులే. నాకు మాత్రం – చదువుతో బాటు సంగీతం పట్ల కూడా మక్కువ ఏర్పడిపోయింది.

 ♣ అంటే, చిన్నతనం లోనే సంగీతం నేర్చుకున్నారా?

* లేదండి. అలాటి అవకాశం కలగలేదు. స్కూల్ తోనే బిజీగా వుండేదాన్ని. మాది పెద్ద కుటుంబం. నాన్న గారికి మేము 11 మంది సంతానం. అనుకోకుండా, విధి వక్రించడంతో.. మా నాన్నగారు హఠాత్తుగా మరణించడం, ఆ యేడాదిలోనే నాకు వివాహం చేయాలని కుటుంబ పెద్దలు నిర్ణయించడంతో నా వివాహం జరిగిపోయింది. పట్టుమని పదో క్లాసేమో అప్పుడు.

♣ మీరు వారించడం అలా ఏమీ జరగలేదా?

* లేదు. ఎందుకు వారించడం? అసలు వాదించడం, పెద్దలని ఎదిరించడం అంటే ఏమిటో తెలుసా మనకి ఆ రోజుల్లో చెప్పండి..(నవ్వులు) పెళ్ళంటే ఆనందమే కదా.  పైగా నాన్నగారికి కన్యా దాన ఫలం దక్కుతుందన్న ఆశ నమ్మకం నాకున్నాయి.

♣ పెళ్ళయ్యాక బాధ్యతలు పెరుగుతాయేమో కదా?

* నా అదృష్టం ఏమిటంటే.. పెళ్ళయ్యాక నా ఆక్టివిటీస్ అన్నీ పెరిగాయి. నేను ఎర్లీగా పెళ్ళి చేసుకోవడం వల్ల విద్యని కానీ సంగీతాన్ని కానీ ఎక్కడా, ఏదీ మిస్ కాలేదు అంటే అందుకు ప్రధాన కారకులు, స్ఫూర్తిప్రదాతలు మావారు అని గర్వంగా చెబుతుంటాను. ఇంకా చెప్పాలి అంటే, ఆయన ప్రోత్సాహం తోనే నేను డిగ్రీ పూర్తి చేసి, టైప్ షార్ట్ హాండ్ ఎగ్జామ్స్ కూడా రాసి పాసై, ఆ వెనకే ఉద్యోగంలోనూ చేరి, అలా పన్నెండేళ్ళు జాబ్ చేసాను.

♣ ఒహ్హో!

* (కృతజ్ఞతగా భర్త వైపు చూస్తూ) ఈ క్రెడిట్ అంతా మా వారిదేనండి..

♣ మరి సంగీతం మాటో?

* ఎక్కడ సంగీతం? సంసారమే సంగీతమైతేనూ..హ..హా. (నవ్వులు) ఇంటిపనులు, ఆఫీస్ పనులతో సతమతమౌతూ కూనిరాగాలు తీస్తున్న సమయంలో ఇంట్లోని పెద్ద వాళ్ళకి నా తోడు నిరంతరం అవసరమన్న సత్యం తెలుసుకున్నా. ఉద్యోగం మానేసాను. మా ఇంట్లో మా అత్తగారు, మావగారితో బాటు మా అమ్మగారు కూడా మాతోనే వుండే వారు. మాకు ఒక అబ్బాయి. ఇల్లెప్పుడూ ఇరువైపుల బంధు మిత్రుల సందర్శనలతో సందడిగా వుండేది. నాకూ క్షణం తీరిక దొరికేది కాదు. కాలంతో పెద్ద వాళ్లకి ఆరోగ్య సమస్యలుండేవి. నా వంతు ధర్మాన్ని నేను నిర్వర్తించాలి అనుకున్నాను. నిర్వర్తించాను. అప్పటికి నడి వయసు కొచ్చేసాను..

♣ మరి పాటల బాట లోకి ఎప్పుడొచ్చారు?

* అమ్మా, అత్తగారు.. కాలం చేసాక తెలీని దిగులు నన్ను ఆవరించింది. మా అత్తగారితో నాకు గొప్ప అటాచ్‌మెంట్ వుంది. అమ్మ లానే భావించేదాన్ని. చిన్నతనంలోనే వివాహం, ఆ వెంటే కాపురానికి రావడం, బాబు పుట్టడంతో అత్తగారిల్లే నాకు అమ్మ గారిల్లు అయింది. అత్తగారితో అనుబంధం ఎక్కువ.. నా దిగులు నించి నన్ను డైవర్ట్ చేయడం కోసం మా వారు సంగీతం బాట లోకి.. ఆ పాటల తోటలోకి అడుగు వేయించారు.

♣ మీ వారి పేరు చెప్పలేదు?..

* ఆయన పేరు చెప్పించేస్తున్నారు నాతో..(నవ్వుతూ) వారి పేరు – రమణా రావు గారు. ఆయన ఇ.ఎస్.ఐ. కార్పొరేషన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, వి.ఆర్.ఎస్. తీసుకున్నారు. ఆ తర్వాత బిజినెస్‌లో బిజీ అయ్యారు. మాకు ఒక అబ్బాయి విదేశాల్లో చదువుకుని, అక్కడే ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు.

♣ మీ సంగీత ప్రయాణం ఎలా అరంభమైంది? పాటతో మీకు పరిచయమెలా అయింది?

* నా చిన్నతనం నించీ కూడా పాటలంటే చాలా ఇష్టం. సంగీతానికి సమయాన్ని కేటాయించలేకపోయినా, లైఫ్ ఎంత బిజీ అయిపోయినా కూడా, నా ఊపిరిలా – పాట కూడా నాతో బాటు నాలో నిత్యమూ నివసిస్తూనే వుంది.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మా వారి ఉద్యోగ రీత్యా ట్రాన్స్‌ఫర్ అయి అనేక ప్రాంతాలు తిరిగాం.

ఒక వూరులో సెటిల్ అయి, హమ్మయ్య అని ఊపిరితీసుకుని, స్థిమిత పడి సంగీతంలో చేరి అలా సరళీ స్వరాలు అయినా పూర్తి చేసేదాన్నో కాదో.. వెంటనే మరో చోటుకి బదిలి మీద కదలాల్సి వచ్చేది. అక్కడా అదే కథ. కొత్త చోటుకి ట్రాన్స్‌ఫర్ అయాక ఎన్ని పనులుంటాయో కదా.. ముందుగా అబ్బాయి చదువుకి ప్రాముఖ్యత ఇస్తాం కదా.. స్కూల్, ట్యూషన్స్, ఫ్రెండ్స్‌ని సెట్ చేయడం ఒక వంతు ఐతే, నేను నా చుట్టూ వున్న వారిని కాసింత పరిచయం చేసుకుని, కొత్త పోగొట్టుకుని, ఇల్లు వాకిలి సర్దుకుని అప్పుడు నా సంగీతం టీచర్ కోసం వెదికేదాన్ని. దగ్గర్లో ఎవరైనా వున్నారా అని వాకబు చేస్తూ! అలా చేరాక, పాత సంగీత పాఠాలన్నీ మళ్ళీ కొత్తగా మొదలయ్యేవి. ఈ జాప్యంలో గీతాలు అబ్బేలోపు నాకు అన్ని సినిమా పాటలూ నోటికి వచ్చేస్తుండేవి.. హిందీ పాటలతో సహా చక చకా పాటలు పాడేస్తుండేదాన్ని! (నవ్వులు)

♣ హిందీ నేర్చుకున్నారా?

* అదీ మావారి పుణ్యమే. బదిలీల వల్ల – ఇటు ఆంధ్రాలో విజయనగరం నించి ఇటు హిందూపూర్ రాయలసీమతో బాటు.. అటు హిందీ రాష్ట్రాలలో కూడా వెళ్ళి, నివసించడం జరిగింది. అలా ఆయా భాషల పట్ల అవగాహనతో బాటు ప్రత్యేక అభిమానమూ పెరిగి పెరిగి, హిందీ పాటల మీద నాకు తెగ మక్కువ ఏర్పడిపోయింది.

♣ విభిన్న సంస్కృతీ సాంప్రదాయలను తెలుసుకునే అవకాశం కూడా కలిగి వుండొచ్చు కదూ?

* అవునండీ అదొక అడ్వాంటేజ్! అందుకే ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అయినా అది బదిలీగా కాకుండా, ఓ మూడేళ్ళు పాటు దీర్ఘ కాల టూరిజం అనుకునేదాన్ని (నవ్వులు). అలా ఆయా ప్రాంతాల లోని విశిష్టమైన ప్రదేశాలను, వింతలనీ దర్శించేవాళ్ళం. గుళ్ళూ గోపురాలు, వేసవి విడిది ప్రదేశాలు, నదీ ప్రాంతాలు, కొండలు, గుట్టలు, సముద్ర తీరాన సేద తీరడాలు.. చారిత్రాత్మక కట్టడాలు, పాలెసులు, భవనాలు, మ్యూజియంలను సందర్శించి ఆనందిస్తుండేదాన్ని. మా వారు దగ్గరుండి అన్నీ వివరించి చెప్పేవారు.

♣ ఏ యే ప్రాంతాలు చూసారు?

* కాశ్మీర్ నించి కన్యాకుమారి దాకా అన్న చందాన, అన్ని రాష్ట్రాలూ తిరిగాం. విదేశాలూ తిరిగుతాం. జర్మనీతో మొదలై ఫ్రాన్స్ ఇటలీ తూర్పు జర్మనీ, వెస్ట్ జెర్మనీ, బెల్జియం ఆ తర్వాత – యు.కె. ఆస్ట్రేలియా, మలేషియా, దుబాయి… ఇలా నా విదేశీ యానాలు సాగుతుంటాయి

♣ ఈ విస్తృత పర్యటనానుభవం – గాయనిగా మీకెంత వరకు ప్రయోజనాన్ని కలిగించిందంటారు?

* చాలా అని చెప్పాలి. ముఖ్యంగా హిందీ ప్రాంతాలలో నివసిస్తున్నప్పుడు.. ఆ యా రాష్ట్రాల వారు మాట్లాడే తీరులోని భేదాన్ని గమనించేదాన్ని. తెలుగులో కూడా ఈ స్లాంగ్‌ని మనం చూస్తుంటాం.. వివిధ జిల్లాలలో విభిన్న వాడుక పదాలు, ఉచ్చారణ వున్నట్టే.. హిందీలో కూడా అని అర్థమైంది. హిందీ స్పష్టమైన ఉచ్చారణ ఇదీ అని తెలుసుకున్నాను.

♣ బదిలీల వల్ల సంగీతం వెనకబడిందని అని భావిస్తారా?

* ఆ.. ఈ కారణం గానే నా సంగీతం మరి కాస్త వెనకబడిందనీ చెప్పాలి. అప్పట్లో ఆన్‌లైన్ క్లాసుల వసతి లేదు. అయినా పట్టు విడవలేదు. హైదరాబాద్ చేరాకా, నా సంగీత ప్రయాణం ఈసారి స్థిరంగా సాగింది.

♣ శిక్షణ తీసుకున్నారా?

* శిక్షణ తీసుకున్నానండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నెలకొన్న- శ్రీ శరశ్చంద్ర గారి ‘ఘంటసాల సంగీత కళాశాల’లో చేరి శిక్షణ పొంది, సర్టిఫికేట్ కోర్స్ చేసాను.

ఆనాటి కాన్వొకేషన్‌లో జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డా.సి.నారాయణ రెడ్డి మరియు పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎ ప్లస్ గ్రేడ్ ఆర్టిస్ట్‌గా సర్టిఫికెట్‌ని అందుకోవడం సంగీత యానంలో మరపురాని నా మొదటి మధురానుభవం.

♣ వేదిక మీదకి రావడానికి అలా సిధ్ధమైపోయారన్నమాట.. మీరు తొలి సారిగా ఎక్కడ పాడారు?

* అది – 2014 జనవరి 1.. ఆ రోజున మొట్టమొదటి సారిగా, వేదిక మీద సినిమా పాట పాడాను. అదీ ఎక్కడంటే.. మనమంతా పవిత్రమైన దేవాలయంలా, దైవంలా కొలుచుకునే ఆలయం..శ్రీ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో శ్రీ కళా సుబ్బారావ్ మినీ హాల్ లో పాడాను. ఈ స్వర్ణావకాశం ఎలా దొరికిందంటే – స్వర భారతి అధినేత్రి శ్రీమతి అమంత గారి వల్ల.

♣ నూతన గాయనీ గాయకులను తన సంస్థ ద్వారా వేదిక మీద పరిచయం చేయడం కోసం ఆమె ఎంతో తహ తహలాడే వ్యక్తి. నూతన గాయనీ గాయకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎందరో కళాకారులకు ఆమె ఓ ఆదర్శ మూర్తి.. అని చెప్పాలి.

* అవునండి. మీరు చెప్పింది అక్షరాలా నిజం.

♣ అమంత గారు నన్నూ చాలా ప్రోత్సహించారు. గాయనిగా నాకు అనేక అవకాశాలు కలిగించారు. వారి స్వర భారతిలో నేనూ చాలా సార్లు పాల్గొన్నాను. మీకెలా పరిచయం వారు?

* నన్ను శరశ్చంద్ర గారి కళాశాలలో చూసి, నా పాట విని నన్ను తన ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. అమంత గారు ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన తప్పకుండా ప్రోగ్రాం చేస్తారు.

♣ తొలి పాట ప్రదర్శన ఎలా సాగింది?

* ఆ నాటి కార్యక్రమంలో నేను తొలిగా పాడిన పాట యుగళ గీతం. ప్రముఖ సీనియర్ గాయకులు శ్రీ వై ఎస్ రామకృష్ణ గారితో కలిసి – దివినుండి భువికి..అనే అద్భుతమైన యుగళ గీతాన్ని ఆలపించాను. అదీ కూడా ఆర్కెస్ట్రా మీద పాడటం నాకిప్పటికీ ఆశ్చర్యంగా వుంటుంది.

♣ ఆర్కెస్ట్రా కొత్తేమో కదా?

 * అవును. నాకు ఆ రోజుల్లో కీ బోర్డ్ అంటే ఏమిటో కూడా తెలీదు. ఆ మాట కొస్తే, కరియోకే అంటే ఏమిటో కూడా తెలీదు. తెలీకుండానే పాట పాడి, పూర్తి చేసాను.

♣ టెన్షన్ పడ్డారా?

* అస్సలు లేదు.. భయమేయనే లేదు. బెరుకూ వేయలేదు. (నవ్వులు) పాట మీది మమకారమో, వల్లమాలిన వ్యామోహమో అదేమో తెలీదు పైపెచ్చు, ఈ పాటంటే చాలా ప్రీతి కావడం కూడా ఒక కారణం కావొచ్చు. నా సహ గాయకులు శ్రీ రామకృష్ణ గారితో బాటు అక్కడున్న ప్రముఖులందరూ మెచ్చుకున్నారు. అమంత గారు కూడా నవ్వి, మెచ్చుకుంటూ ‘ఇక మీరు వేదికలమీదకి వచ్చి పాడుతుండాలి..తప్పదు…’ అని వెన్ను తట్టి, ప్రోత్సహించారు.

♣ గొప్ప ఆనందమేస్తుంది కదూ?

* అవును. ఆనందంతో బాటు ఆలోకనమూ కలిగింది పాట పాడాక, అనిపించింది. ఇంకా బాగా పాడి వుండాల్సింది అని. అలా – సాధన ఒక తపనగా మొదలై, ఇదిగో ఇలా ఇంత వరకు నన్ను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇంకా, చాలా నేర్వాల్సి వుంది.. సాధన ఒక్కటే ఏ సింగర్ కైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది!

♣ మీ పాట ఒకప్పటి కంటేనూ ఇప్పుడు మెరుగులు దిద్దుకుంది అనే ప్రముఖుల ప్రశంస నేనూ విన్నాను..

* థాంక్సండి మీ ప్రోగ్రామ్స్‌లో కూడా పాడాను కదా..(ఆనందంతో నవ్వుతూ..)

♣ అవునండి. అలా మొదలైన మీ పాటల ప్రయాణం ఎలా సాగింది? మీ అనుభవాలు, అనుభూతులు పంచుకోగలరా?

* తప్పకుండా.. అలా మొదటి కార్యక్రమం మొదలైందో లేదో.. అనేక సాంస్కృతిక సంస్థల నించి ఆహ్వానాలు వచ్చాయి. తాము నిర్వహిస్తున్న విభావరిలలో పాల్గొనాలని.

దరిదాపు అన్నిట్లో పాల్గొనేదాన్ని. నా తీరికకి, ఆసక్తితో బాటు, నన్ను వెన్నంటి ప్రోత్సహించే వారికి కొదవలేదు. అబ్బాయి చదువు కోసం విదేశాల్లో వుండేవాడు.. అక్కణ్నించి మా అబ్బాయి ఎంకరేజ్మెంట్ మరో వైపు కరొకే ప్రాక్టీస్‌తో బాటు సంగీత సాధనతో కీర్తనలూ నేర్చుకున్నాను. ఇప్పుడు శృతి లయ తాళబధ్ధంగా పాడటంలో పూర్తి శిక్షణ దొరికింది. దాంతో ప్రోగ్రామ్స్‌లో పాడుతున్నప్పుడు, వివిధ ప్రసిద్ధ సాంస్కృతిక సంస్థల అధినేతలతో బాటు, ట్విన్ సిటీస్ లో పేరొందిన పాపులర్ గాయనీ గాయకులతో పరిచయాలు కలగడం, అవి సంగీత స్నేహాలుగా మారడం జరిగాయి. పాటలతో పెరిగే ఆత్మీయానుబంధాలు నిజంగా అపురూపమైన అనుబంధాలు.

♣ ఇప్పటి దాకా ఎన్ని కార్యక్రామాలలో పాల్గొన్నారు?

* దరిదాపు 110 పై మాటే.

♣ ఎన్ని పాటలు పాడి వుంటారు?

* లెక్క పెట్టలేదు కానీ, వందల కొద్దీ పాడాను.

♣ ఇంత తక్కువ కాల పరిధిలో ఇన్ని పాటలు పాడటం ఆశ్చర్యం కదూ?

* అవును. ఆనందంతో కూడిన ఆశ్చర్యం. (నవ్వులు)

♣ మీ ఈ పరుగు ఎప్పట్నించి పెరుగుతూ వచ్చింది?

* ఖచ్చితంగా చెప్పాలీ అంటే, 2015 నించీ ప్రోగ్రామ్స్ అనూహ్య రీతిలో పెరుగుతూ వచ్చాయి.

♣ మీ గాత్రాన్ని, గానాన్ని మెరుగు పరచుకోవడం ఎలా సాధ్యమైంది? రహస్యాన్ని చెబుతారా?

* (నవ్వి) రహస్యం అంటే, … సింగర్‌కి ఆత్మపరిశీలన అవసరం. మన పెర్ఫార్మన్స్ చూసి మన వాళ్లందరూ బావుందని ఆకాశానికెత్తేసినా, ఎవరికి వారు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఆ పరిశీలన వల్ల మనకు నిజమైన జడ్జ్‌మెంట్ దొరుకుతుంది. ఎవరి పాటకు వారే నిజమైన న్యాయనిర్ణేతలని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రశంసలు ఎంత కిక్ ఇస్తాయో, విమర్శలు అంత మంచి చేస్తాయి. విమర్శని స్వీకరించడం, ఎందుకు పాయింట్ ఔట్ చేసారు? అక్కడ ఏ పొరబాటు దొర్లింది, అది ఎలా కరెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని మరచిపోను. నాకు గొప్ప విమర్శకులు మా వారే. ప్రశంసకులు కూడా వారే. సున్నితంగా విమర్శించి, నాకర్ధమయ్యేలా వివరించడంలో ఆయనకి ఆయనే సాటి. అలానే పాట పాడి వచ్చేసాక, నా సహ గాయనీ గాయకులను, సీనియర్స్‌ని అడిగి తెలుసుకుంటా పాట ఎలా వుంది అని అడిగి.. ఇవన్నీ కూడా మనకు సులభంగా దొరికే గైడ్లైన్స్..నేనివి పాటిస్తాను. అనుసరిస్తాను.

♣ యుగళ గీతాలను ఎవరెవరితో కలిసి పాడారు?

* ఉద్దండులైన గాయకులతో పాడే అదృష్టం నాకు దక్కిందండి. శ్రీ మిత్ర, చంద్రతేజ గారు, బాలకామశ్వర్ర రావ్ గారు, అమలాపురం కన్నారావ్ గారు, వై.ఎస్ రామకృష్ణ గారు, వినోద్ బాబు గారు, సి.రమణ గారు.. మోహన్ కళ్ళేపల్లి గారు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఓ పెద్ద లిస్టే వుంది. ముఖ్యంగా చెన్నైలో వుంటున్న శ్రీ రాము గారితో కూడా కలిసి కూడా పాడాను. ఇలా ప్రామినెంట్ సింగర్స్ అందరితో కల్సి పాడే అవకాశాలు ఎన్నో సార్లు దక్కాయి. అంతా భగవంతుని ఆశీస్సులు.

♣ పాటల ఎంపికలో – ఫలానా పాటలే పాడాలనే నిబంధనలని పాటిస్తారా?

* అస్సలు అలాటివి లేవు. ఏ సింగర్‌కీ వుండకూడదని మిత్రుల అభిప్రాయం కూడా. గాయని అన్నాక అన్ని రకాల పాటలు పాడాల్సి వస్తుంది. శ్రీ మిత్రా గారితో కలిసి పాడిన ఎల్.ఆర్. ఈశ్వరి పాటలు – ఆకులు పోకలు ఇవ్వొద్దు,’ లే లే లే నా రాజ ‘ వంటి హుషారైన పాటలు పాడినప్పుడు.. కురిసిన చప్పట్ల వర్షం ఇంకా కురుస్తూనే వుంది.. మా జ్ఞాపకాలలో. మిత్రా గారు ఎంత మెచ్చుకున్నారో నా పెర్ఫామన్స్‌కి. అంత సీనియర్ గొప్ప గాయకుల ప్రశంసలకి చాలా ఆనందం కలిగింది.

♣ కష్టమనిపించిన పాట వుందా?

* కష్టతరమైన పాట అంటే హిమగిరి సొగసులు.. ప్రముఖ సీనియర్ గాయకులతో కలిసి చాలా సార్లు పాడాను. నా కో-సింగర్స్ అందరితోనూ నాకు మంచి రాపో వుందండి. ప్రోగ్రాం చేసేటప్పుడు.. మేమంతా ఒక కుటుంబంలా కలిసిపోతాం.

♣ పాటనెలా ప్రెజెంట్ చేయాలని చెబుతారు?

* నేనైతే, పాటని ఆస్వాదిస్తా.. ఆనందిస్తా. గుండెకు హత్తుకున్న పాట గొంతులో కొత్త జీవాన్ని పొసుకుంటుంది. జవ్వనిగా మారుతుంది. గానంలో జీవం నింపాలీ అంటే, సాహిత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. భావాన్ని మనసున ఇంకించుకోవాలి. అప్పుడు పాట.. జీవ నది అవుతుంది. వింటున్న వారి గుండెని తడిపి, మనసుని సంతోషంతో నింపేదే పాట అని నా అభిప్రాయం.

♣ మీకు సొంత అకాడెమీ వుంది కదూ?

* అవునండి. అదెలా జరిగిందంటే.. శ్రీ వై ఎస్ రామకృష్ణ గారి ప్రోత్సాహంతో ‘సుజా రమణ కల్చరల్ అకాడెమీ’ని స్థాపించడం జరిగింది. లయన్ విజయ కుమార్ గారు తెలుసు కదా!, ‘అపర దాన కర్ణ’ గా పేరుమోసారు.. ఆయన నా ప్రోగ్రామ్స్‌ని ఎంతో సంతోషంతో స్పాన్సర్ చేస్తుండేవారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించారు.

అప్పడు వారు నాకు అంద చేసిన మానసిక ధైర్యం స్థైర్యం ఎంత ఆనందాన్నిచ్చాయంటే..ఇప్పటికీ ప్రోగ్రామ్స్‌ని విడవకుండా, కంటిన్యూ చేసేంత అని చెప్పాలి. ఇందుకు ఆ ఇరువురికీ మన సంచిక ద్వారా – నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

♣ ఇప్పటి దాకా ఎన్ని ప్రోగ్రాంస్ చేసారు?

* ఇప్పటి దాకా నా సంస్థ తరఫున ఓ వంద ప్రోగ్రాంస్ చేసుంటాను.

♣ మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వుండటానికి కారణం ఏమై వుంటుందని భావిస్తారు?

* ఎందుకంటే – నా ప్రోగ్రామ్స్‌లో తప్పని సరిగా సీనియర్ గాయకులు వుంటారు. టాలెంటెడ్ సింగర్స్ కే ప్రాధాన్యత వుంటుంది. చంద్ర తేజ గారు, మిత్ర గారు, బాల కామేశ్వర రావ్ గారు.. ఇలాటి పెద్ద పెద్ద వాళ్ళని మెయిన్ సింగర్స్‌గా పెట్టి ప్రోగ్రామ్స్ చేస్తాను. అలాగే నూతన గాయనీ గాయకులకు తప్పని సరిగా అవకాశాన్ని కల్పిస్తుంటాను.

♣ సంస్థ పెట్టాక, మరి ఇతర సంస్థలలో కూడా పల్గొని పాడటం జరుగుతోందా?

* అహా, దాని దారి దానిదే.. (నవ్వులు) వంశీ రామ రాజు గారి సంస్థలో నన్ను వారి ఆస్థాన గాయనీ గాయకులలో ఒకరిగా చేసారు. (నవ్వులు.) ఇదొక అచీవ్మెంట్ అని చెప్పాలి.

♣ ఈ పాటల ప్రయాణంలో మరపు రాని సంఘటన ఏదైనా వుందా?

* వుందండి. నా సంస్థ తరఫున వంశీ రామరాజు గారిని సన్మానించుకోవడం ఓ అపురూపమైన సన్నివేశంగా అభివర్ణించాలి. ఆ తరం నాటి నటులు నాగయ్య గారి నించి ఈ నాటి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు – ఇటు సినీ రంగానికి సంబంధించిన వారినే కాక, ఎన్నో విభిన్న కళా రంగాల, పారిశ్రామిక, సేవా రంగాలకు చెందిన ప్రముఖుల నెందరినో సన్మానించి, దేశ విదేశాలలో అఖండ కీర్తిఖ్యాతులను ఆర్జించుకున్న ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సంస్థగా ప్రసిద్ధి పొందిన వంశీ సంస్థ అధినేత శ్రీ వంశీ రామరాజు గారి దంపతులని సత్కరించుకుని, సన్మానించుకునే అవకాశం నాకు కలగడం.. నేను జీవితంలో మరచిపోలేని సంఘటన. అదొక గొప్ప అదృష్టం అని భావిస్తున్నా. రామరాజు గారు అందరకీ సన్మానాలు చేస్తారు, కానీ వారిని సన్మానిస్తాం అంటే ఒప్పుకోరు. అలాటిది, మా అభ్యర్ధనని మన్నించి వారు అంగీకరించడం, వారి శ్రీమతి తెన్నేటి సుధ గారు కూడా మా అహ్వానాన్ని మన్నించడం గొప్ప విశేషం.

ఆనాటి విశేషం ఏమిటంటే – వారి సాంస్కృతిక సాహిత్య స్వర్ణోత్సవ శుభ దిన సందర్భం చంద్రునికో నూలు పోగులా.. ఆ కళా బ్రహ్మర్షిణిని సత్కరించుకోవడం.. మా సంస్థ చేసుకున్న అదృష్టం.

[box type=’note’ fontsize=’16’] ‘నాకు తీరని స్వప్నం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే చాల అనతి కాలంలోనే ప్రముఖులందరితోనూ కలిసి వేదిక మీద పాడాను. ప్రతి గాయనీమణి ఏ సింగర్‌తో ఐతే కలిసి పాడలేకపోయినందుకు నిరాశపడుతుంటారో.. అలాటి పెద్ద పెద్ద గాయకులందరితో కలిసి ఎన్నోసార్లు వేదికల మీద పాడాను. ప్రేక్షకుల మెప్పు పొందాను. ఈ తృప్తి చాలు.’ [/box]

(తరువాయి వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here