సత్యాన్వేషణ-11

0
3

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]అ[/dropcap]క్కడ్నుంచి, అంటే, కొల్హాపురం నుంచి ,   నేను షిర్డీ వెళ్లాలని ముందే నిశ్చయించుకున్నాను. షిర్డీ వెళ్లాలంటే కొల్హాపురం మీదుగా బస్సు ఉన్నందున, అప్పటికప్పుడు ఒక రాత్రి కొల్హాపురంలో ఉండాలని, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాలక్ష్మిని దర్శించాలని నిశ్చయించుకున్నాను.

“లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం।
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం।
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం।
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం॥”

అక్కల్కోట నుంచి బస్సులు లేవు కొల్హాపురానికి. షోలాపూరు వెళ్ళి ఎక్కవలసివుంది. ధనుంజయ పూజారి ఒక కారు మాట్లాడారు నా కోసము,  ఆ కారులో షోలాపురు వరకూ వెళ్ళమని. మరుసటి ఉదయము ఆ కారు. ముందురోజ ఎంత ప్రయత్నించినా నాకు కొల్హాపూరులో బస కుదుర్చుకునేందుకు చేత కాలేదు. ఫోనులో కుదరలేదు. నా వద్ద ఇంటరునెట్ లేదు. మావారికి కొల్హాపూరులో గుడికి ఎదురుగా ఏదైనా సత్రం చూడమంటే ఆయన నాకు నక్షత్రాల హోటలు బుక్ చేశారు.

నేను షోలాపూరు వరకూ కారులో వచ్చి, అక్కడ కోల్హాపురము బస్సు ఎక్కాను. నేను దాదాపు మధ్యహ్నం బస్సు ఎక్కితే మునిమాపువేళ ఎనిమిదికి కొల్హాపురము చేరాను.

అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఆ పురము చేరగానే నా హృదయము పులకరించినది.

‘నీవు అగోచరము – కానీ సాక్షీభూతము
నీవు జ్ఞానమే కాదు జ్ఞాతవు
నిన్ను మే మెరగము – కాని నీకు మేము తెలుసు
నీవు సూక్ష్మమైన వాటిలో సూక్ష్మము
పరమాణువులో అణువు
అన్నీ హృదయాలపై నీ పాద పద్మాల గుర్తులు వుంటాయి
పంచభూతాలలో నీవు
పంచేద్రియాలలో నీవు
సూర్య చంద్ర నక్షత్రాదులలో నీవు
సకల సజీవ- నిర్జీవ రాశులలో నీవూ!
సకలము నియంత్రించే సర్వ శాస్వి నీవు
నీవు నిరాకారివి, కానీ సర్వసాకారివి
నీవే అనంతము – నీవు పరమాద్భుతము
సర్యం ఐక్యమవునదీ నీలోనే-
సర్వం పుట్టేదీ నీ నుంచే –
ప్రళయము – ప్రపంచము నీ కంటి రెప్పల కాలము-
నీవు కారణము
నీవు సత్యం
నీవు శోకం – శోకనాశనం
నీవు మాయా – మాయాభేదివి
నీవు ఆనందం – సత్‌చిత్
నీవు పరా – అపరా
నీవు శక్తి – శివా
నీవు విష్ణువు- వైష్ణవీ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయికవు-
నీవే బ్రహ్మం….!
నిను శరణు వేడితిని!!’

***

కొల్హాపురము ఎన్నో విధాలుగా ప్రశస్తమై బహు పురాతనమైన నగరము. దాని చరిత్ర దాదాపు 5000 సంవత్సరముల పూర్వము నుంచి కనబడుతుంది. ఈ నగరము వివిధ సంప్రదాయాలతో సంబంధము కలిగివున్నది.

అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. దత్తసాంప్రదాయములో ముఖ్యమైన క్షేత్రాలలో ఒకటి.

ఈ నగరానికి కరవీరపురమని కూడా పూర్వపు పేరు వుంది. పూర్వము కరివీరుడనే రాక్షసుడు ఆ నగరాన్ని పరిపాలించేవాడు. అతని పేరు మీద ఆ నగరము నిర్మించుకున్నాడు. తరువాత దేవతలను గెలవటానికి తపస్సుకు వెడుతూ కొడుకును నగరము చూసుకోమని, తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆ సమయములో కొలహా అన్న రాక్షసుడు ఆ నగరాన్ని ఆక్రమిస్తాడు. కరివీరుడు తపస్సు ముగించి, వరముతో నగరానికి వచ్చి, కొడుకు మరణించటము మరో రాక్షసుడు పాలించటము సహించలేక ఆ రాక్షసుని తరిమి మరల ఆ నగరము స్వాధీనము చేసుకుంటాడు. కోల్హుడు, దేవిని ప్రార్థించి ఆ నగరానికి తన పేరు నిలిచేలా చేసుకుంటాడు. అలా కరివీరము, కొల్హాపురమైనది.

అమ్మవారు సతీదేవి అవతారములో దక్షయజ్ఞ వాటికలో తన యోగశరీరాన్నీ యోగాగ్ని రగిల్చి భస్మము చేసుకుంటుంది. ఆమె భౌతిక కాయమును భుజాన ధరించి శివుడు తిరుగుతుంటే మహావిష్ణువు తన సుదర్శనముతో ఆ శరీరమును తునకలు చేస్తాడు. దేవి శరీరము చెల్లాచెదురుగా పడింది. ఆమె శరీరము పడిన ప్రదేశాలని దేవీ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అమ్మవారి ఎడమకన్ను పడిన చోటు ఈ కొల్హాపురమన్న నగరమైనది. ఇక్కడ అమ్మవారిని మహాలక్ష్మిగా కొలుస్తారు. అలా శాక్తేయులకు, అమ్మభక్తులకు తప్పక దర్శించ వలసిన క్షేత్రం ఇది. దత్తస్వామి ఇక్కడ అమ్మవారి వద్దకు మధ్యాహ్నము  వేళలో భిక్షకు వస్తాడని పురాణములు చెబుతాయి. అందుకనే ఇది దత్తభక్తులకు ముఖ్యమైన క్షేత్రం. మనము సాయి హరతులలో పాడుతాము కూడా ప్రతి దినము

“శ్రుతిసారా, అనసూయాత్రికుమారా మహారాజే ఈబా
కాశీస్నాన జప ప్రతిదివసీ కొల్హాపుర భిక్షేసీ నిర్మల నది తుంగా
జలప్రాసీ, నిద్రామాహురదేశీ ఐసా యే యీబా”
.

దాని భావమిదే. ఇదే మనకు దత్తపురాణములో కనపడుతుంది. ఇది చత్రపతి శివాజీ తదనంతరము ఆయన కుమారుల చేత పరిపాలించబడింది. తరువాత బ్రిటీష్ వారి చేతిలోనికి వెళ్ళింది.

మరాఠీలు అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు. ఈ దేవాలయము ‘హేమాడ్‌పంతి’ ( దేవగిరికి చెందిన స్సేనా యాదవుల ప్రధానమంత్రి  హేమాడ్‌పంతి , రూపొందించి న మందిర నిర్మాణ శైలిని హేమాడ్‌పంతి  నిర్మాణ శైలి అంటారు) నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా విశాలమైన మండపం ఉంటుంది. గర్బగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమద మహాలక్ష్మి విగ్రహం నిలుచొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. దేవాలయము మూడు శిఖరాలతో కట్టబడింది.

7 వ శతాబ్దంలో చాళుక్య వంశ రాజైన కర్దనదేవుడు  దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని చెబుతారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్‌కి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఆ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది.

ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతో మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ ఫలం, ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటాయి. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని, యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ప్రాంగణములో దత్తస్వామి ఆలయము కూడా వుంది. పురాతనమైన అశ్వత్థ వృక్షము రాజసముగా ఆ ప్రాంగణములో విరాజిల్లుతూ కనపడుతుంది.

“సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్॥”

నేను నా హోటలుకు చేరి గబగబా స్నానము చేసి ధూళిదర్శనానికి వెళ్ళాను. దేవాలయపు విశాల ప్రాంగణములోని పెద్ద దేవాలయము నన్ను ఆనందాశ్చర్యములో ముంచినది.. నేను దర్శనపు వరుసలో నిలిచి పరిసరాలూ పరిశీలిస్తూ, నా మంత్రము మననము చేసుకుంటూ తిరుగుతుంటే, అక్కడ అత్యంత అద్భుతమైన సేవ ఉదయపు అభిషేకమని చెప్పారు. నేను దర్శనము చేసుకు బయటకు వచ్చి అభిషేకమునకు టిక్కెటు కొనబోతే ఆ కౌంటర్లో వ్యక్తి

“ఎంత మంది వచ్చారు?” అని అడిగాడు.

“నేను ఒక్కతినే” అంటే, “మీతో పురుషులు లేరా?” అన్నాడతను.

“లేరు” చెప్పాను. నాకు కొంత ఆశ్చర్యము మనసులో కొంత విసుగు కలిగింది. ‘ఈ పురుషుల గోల ఏంటీ?’ అని.

అప్పడతను చెప్పాడు “పురుషులు లేకపోతే కేవలము స్త్రీలను అభిషేకమునకు రానియ్య”మని చెప్పారు.

‘ఇదెక్కడి అన్యాయము? అమ్మవారి అభిషేకానికి స్త్రీలు పనికిరారా?’ నాకు మనసులో పరమ దుఃఖం కలిగింది. అది కంటిలో కనిపించినదేమో ఒక ప్రక్కగా నిలబడి వున్న అర్చకస్వాములు కలగచేసుకొని, “పర్వాలేదులే టికెటు ఇవ్వు. సంకల్పము చెప్పిద్దాము” అన్నాడు నా ముఖములో దుఃఖం పసిగట్టినట్లుగా.

అలా నేను ఉదయపు అభిషేకానికి టికెటు తీసుకొని దేవాలయము బయటకు వచ్చాను. అక్కడ రాశులుగా కమలాలు, మొగలిపువ్వులు, మల్లెలు, మందారాలు కంటికి ఇంపుగా బుట్టలలో పెట్టి అమ్ముతున్నారు.

ఆ పువ్వులు, ఆ వాతావరణము నన్ను నా చిన్నతనానికి తీసుకుపోయాయి. చిన్నప్పటి నుంచి నాన్న మమ్ములను దేవాలయాలకు త్రిప్పేవారు. ఈ అంగడుల హడావిడి మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు తెగ సంబరపడుతూ చూసేవారము. మొగలిపువ్వులతో అమ్మ పూలజడ కుట్టేది. మొగలిపూలు వాడినా వాటి సువాసన వాడేది కాదు. వాటిని బట్టల పెట్టెలో పెట్టేవారు. మొగలిపూల సువాసన అమ్మ మధురమైన ప్రేమను, నాన్న హడావిడిని మళ్ళీ గుర్తుచేస్తూ వుంటే ఆ పరిసరాలలో తిరుగుతూ గడిపాను. ఆ పూలను కొన్ని కొని వుంచుకున్నా. అత్తరు సువాసనలలా మనసును పట్టి వదలవు. జ్ఞాపకాలను తట్టిలేపే గుణము సువాసనలకు వున్నంతగా మరి దేనికీ లేదేమో.

గర్బగుడిలో పూజకు వెళ్ళాలంటే భారతీయ వస్త్రధారణ వుండాలి. నేను నా బట్టల మీద శ్రద్ధ వదిలేసినందుకు అప్పటికప్పుడు ఒక చుడీదారు కొన్నాను. ఆ రాత్రి సుమబాలలను చూస్తూ విశ్రమించాను.

మరురోజు నాలుగింటికల్లా నే దేవాలయములో వున్నాను. నాకు ఎవరిని అడగాలో తెలియటములేదు. ముందు దర్శనము చేసుకొని వచ్చి తిరిగి ఎగ్జిటు దగ్గర వున్న అతనిని అడుగుతూ నా దగ్గరి రసీదు చూపాను. అతను నన్ను అమ్మవారి ముందర వున్న మంటపములో కూర్చోమని పంపాడు. అప్పటికే మంటపము నిండిపొయింది, అభిషేకపు భక్తులతో. అమ్మవారు మహాలక్ష్మి అయినా పూజా పద్ధతిలో వైష్ణవము లేదు. వారు లలితాసహస్రము చదువుతున్నారు.

నేను అభిషేకము చెయ్యటానికి పనికిరానని వెనకగా కూర్చోపెట్టి జంటలను ముందర కూర్చుండబెట్టారు. కొన్నిసనాతన భారతీయ పద్ధతులు భలే కష్టపెడతాయి స్త్రీలను. ఒక అర్చకుడు నాకు, అక్కడ వున్న స్త్రీలకు కొద్దిగా కుంకుమ, కాగితము ఇచ్చి పూజ చేసుకోమని చెప్పినాడు. నాకు పరమఖేదము కలిగింది, నన్ను పూజలో కూర్చోనివ్వలేదని. అమ్మవారికి నా మనస్సులో ఈ విషయము పదేపదే వినిపిస్తూ, నేను మనసులో లలిత చదువుకుంటూ కుంకుమపూజ చేస్తుంటే ముందటి రోజు కనిపించిన అర్చక స్వామి వచ్చాడు.

నన్ను పిలిచి ప్రక్కన వున్న మరో చిన్న మంటపములో కూర్చోబెట్టి సంకల్పము చెప్పించాడు. నా టికెటుతో లడ్డూ ప్రసాదమిస్తారని, తప్పక తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు.

నేను నా ఉదయపు విష్ణ సహస్రము పారాయణము కానిచ్చి, ప్రాంగణములో వున్న దత్త మందిరములో కూర్చొని జపం చేసుకున్నాను. తొమ్మిదికి వెళ్ళి లడ్డూ ప్రసాదము తీసుకుంటుంటే వారు మధ్యాహ్నపు ప్రసాదభోజనము చెయ్యమని పిలిచారు. దేవాలయములో అమ్మవారికి ఇచ్చిన చీరలు మనము కొనుక్కోవచ్చని, నాకు నచ్చిన చీర తీసుకోమని చెప్పారు. నాకు పరమ సంతోషము కలిగింది. అమ్మవారి గర్భాలయానికి ప్రక్కన వున్నచిన్న గదివంటి దానిలోకి తీసుకుపోయారు నన్ను. నేను ఒక గులాబీ రంగు చీర తీసుకున్నా.

తిరిగి దత్త మందిరములో కూర్చొని గురుచరిత్ర పారాయణము చేశాను. వారు భోజనమునకు రమ్మన్న  సమయానికి వెళ్ళి పప్పు అన్నము మహాప్రసాదమును తిని బయటకు వచ్చాను. ఉదయపు దేవాలయములో నన్ను అభిషేకానికి తిరస్కరించినప్పుడు మనసులో కలిగిన ఖేదము నుంచి కొంత వూరట కలిగింది. దేవాలయము లోపలి వైపు కూడా అంగళ్ళు వున్నాయి. వాటిని చూస్తూ కాసేపు తిరిగి కరవీరపుర చరిత్ర పుస్తకము కొన్నాను.

రూముకు వెళ్ళి గంట తరువాత మళ్ళీ దేవాలయానికి వచ్చి కూర్చున్నాను. వూర్లో రాజప్రసాదము అత్యంత అందముగా వుంటుందని, కొల్హాపురములో చూడవలసినవి వున్నాయని తిరిగిరావటానికి, బండి సమకూర్చగలమని నన్ను హోటల్లో వారు తెగ ఊదరకొట్టారు. నాకు దేవాలయములో జపము మీద తప్ప మరో ఆలోచనా కోరికా రానందున, తిరిగి దేవాలయానికి వచ్చాను. అమ్మవారి మీద ఉదయపు అలక తీరింది.

“సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి।
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే॥
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని।
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే॥”
(మహాలక్ష్మి అష్టకము)

‘నన్ను అభిషేకము చెయ్యనియ్యకపోయినా, ఆ తల్లి నన్ను పిలిచి, సేదతీర్చి, నా కడుపు నింపి, వడి నిండుగా ప్రసాదముగా చీర, పవిత్ర కుంకుమ ఇచ్చినది’. నా హృదయము తల్లి మీద భక్తితో నిండింది. ‘అమ్మా నాకు సద్గురువును ప్రసాదించు’ అని అమ్మను ప్రార్థించి,  కృతజతగా అమ్మవారి కోసము కొంత జపము చెయ్యాలని అనుకున్నాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here