[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 20” వ్యాసంలో ఆలూరు కోన లోని ‘శ్రీ రంగనాథస్వామి దేవస్ధానం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
ఆలూరు కోన
[dropcap]తా[/dropcap]డిపత్రిలో బస్ దిగంగానే ఆటో మాట్లాడుకున్నాం అక్కడికి 10 కి.మీ. ల దూరంలో వున్న ఆలూరు కోనకి.
“కోన” అంటే చుట్టూ అందమైన కొండ చరియల మధ్య వున్న లోయ ప్రాంతం. ఆనంతపురము ఆంధ్ర దేశములో అతి తక్కువ వర్ష పాతము కురిసే జిల్లా, అయినప్పటికి ఈ ప్రాంతములో ఎప్పుడూ నీటి కొరత అనే పరిస్థితి రాలేదు. దీనికి ముఖ్య కారణము కోన లోని జలపాతాలే అని ఛెప్పవఛ్ఛును. ఈ జలపాతం కోనలో ఎత్తైన ఒక ప్రదేశములో ఉన్న ఒక ఊట. ఊట అనగా భూమి నుండి ఉబికి వచ్చే నీరు. ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా వుంటుంది.
ఈ ఆలూరు కోనలో రంగనాథస్వామి ఆలయం సుప్రసిధ్ధం. ఇక్కడికి వెళ్ళటానికి తాడిపత్రినుంచి రెండు మార్గాలున్నాయి.. తాడిపత్రి – సజ్జలదిన్నె – ఆలూరు గ్రామాల మీదుగా ఒకటి, తాడిపత్రి – సజ్జలదిన్నె – ఓబులేశుకోన – పెన్న సిమెంట్స్ మీదుగా ఇంకొకటి.
ఇక్కడ రంగనాథస్వామి ఆలయం ఒక చిన్న కొండమీద వుంటుంది. 54 మెట్లెక్కాలి గుడికి చేరాలంటే. ఇదివరకు ఇక్కడికి వెళ్ళడానికి సరైన మార్గము వుండేది కాదు. ప్రస్తుతం దేవాలయం ముందువరకు చక్కని రహదారి ఉంది.
శ్రీ రంగనాథస్వామి దేవాలయం
చారిత్రక ఆధారాలను బట్టి ఈ దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్యం, సంగమ వంశస్థుల (1335-1486) ఏలుబడిలో ఉన్న కాలంలో తాడిపత్రి ప్రాంతానికి అనగా పెన్నబడి సీమకు (ఇదివరకు పేరు) మండలాధీశునిగా ఉన్న ఎర్రమరాజు (1422-23) నిర్మించారు. ఈ కోనలో చిన్న జలపాతము ఉంది. నీటిబుగ్గతో ప్రవహించే జలధారలు ఉన్నాయి. ఎంతటి కరువులోనైనా ఇవి గలగల పారుతూ ఉండేవి. ఆలూరు కోన కొండపై భాగములో పెన్న సిమెంట్స్ కర్మాగారం నిర్మించిన తర్వాత కర్మాగారంలో బోర్లు వేసి నీరు ఎక్కువగా వాడడం ప్రారంభించటంతో క్రమంగా జలధారలు తగ్గుముఖం పట్టాయి.
ఆలయంలో స్వామి శ్రీ భూ, నీలా సమేతంగా విరాజిల్లుతుంటారు. స్వామి విగ్రహం నల్ల రాతితో తయారయింది.
స్ధల పురాణం
ఇక్కడ రంగనాథస్వామి విగ్రహాన్ని త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ కోనలో పూర్వం విశ్వామిత్రుడు యజ్ఞం చేశారుట. అప్పుడు తాటకి, మారీచుడు అనే రాక్షసులు ఆ యజ్ఞాన్ని విధ్వంసం చేస్తూ వుండేవారుట. వారి గోల భరించలేక విశ్వామిత్రుడు దశరధుని దగ్గరకెళ్ళి రామ లక్ష్మణులని తీసుకువచ్చాడని రామాయణ కథలు విన్న, చదివిన ప్రతి ఒక్కరికి తెలుసుకదా. ఆ రామ లక్ష్మణులకి సకల విద్యలు నేర్పి అనేక అస్త్రాలు ప్రసాదిస్తాడు. వారు గురుదేవుని ఆనతితో తాటకిని చంపి వేస్తారు.
ఈ కథలో విశ్వామిత్రుడు యజ్ఞం చేసిన ప్రదేశం ఈ ఆలూరు కోన అనీ, తాటకి శరీరం పడ్డది తాడిపత్రిలో అనీ చెబుతారు. అందుకే తాడిపత్రి పేరు తాటిపర్తి, అలా అలా తాడిపత్రిగా మారింది అంటారు. శ్రీరాముడు, స్త్రీ హత్యా దోషం పోగొట్టుకోవటానికి ఒక శివలింగాన్ని స్ధాపించి పూజ చేశాడని, అది తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి అని చెబుతారు. అలాగ ఈ కోనలో పుట్టుశిలగా, కనిపించిన రంగనాథస్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీ రంగనాథస్వామిని ఇలవేల్పుగా ఆరాధించే భక్తులు చాలామంది వున్నారు. ముంబయి, మహారాష్ట్ర ప్రాంతాలలో కూడా ఈ స్వామికి చాలామంది భక్తులు వున్నారు.
స్వామి దర్శనానంతరం ఆలయానికి బయటనుంచి కుడివైపుకి వెళ్తే, కొంచెం దూరంలో ఎడమవైపు ఆంజనేయస్వామి ఆలయం చిన్నదే కనబడుతుంది. ఇది కూడా చాలా పురాతనాలయం. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ పుష్కరిణి, పైనుంచి జలజలపడే జలపాతం, చుట్టూ చెట్లు చాలా అందమైన ప్రదేశం. భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించి, పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటారు.
చైత్ర శుధ్ధ పౌర్ణమి ఇక్కడ ఆలూరు పున్నమిగా పేరుపొందింది. ఆ సమయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు.
అక్కడనుండి బయల్దేరి అదే ఆటోలో (విజ్జె) వజ్రగిరి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాము. ఇది తిమ్మాపురం గ్రామంలో, యాడికి మండలంలో వున్నది.