ప్రేమలోని ఔన్నత్యాన్ని ప్రదర్శించే గొప్ప ప్రేమలేఖల సంకలనం – ‘ఖతో కా సఫర్నామా’

2
3

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]‘ఖ[/dropcap]తో కా సఫర్నామా’ – ‘KHATON KA SAFARNAMA’ అనేది హిందీ పుస్తకం. పంజాబీ రచయిత్రీ అమృతా ప్రీతమ్ ఆమె సహచరుడు ఇమ్రోజ్ ఒకరికొకరు వ్రాసుకున్న ఉత్తరాల సంకలనం ఇది. అయితే ఉత్తరం అనేదే కనుమరుగవుతున్న ఈ కాలంలో ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభవం. ఇది తెలుగులో అనువాదం అయ్యినట్లు లేదు కాని ఉత్తరాల నేపథ్యంలో గొప్ప అనుభూతి మిగిల్చే పుస్తకంగా ఖచ్చితంగా దీన్ని చెప్పవచ్చు. అమృతా ప్రీతమ్ వివాహిత. ఇద్దరు బిడ్డల తల్లి, భర్తతో సరిపడక ఎన్నో అవస్థలు పడుతుంది. అదే సమయంలో సాహిర్ లుధియాన్వీతో ప్రేమ కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. సాహిర్ పట్ల ఆమె ప్రేమ గురించి ఈ రోజుకీ చర్చలున్నాయి. కాని సాహిర్ ఆమెను అదే స్థాయిలో ప్రేమించినా ఆమెతో బంధానికి అంగీకరించకపోవడం అమృత జీవితంలో తట్టుకోలేని దెబ్బ. తరువాత ఆమె జీవితంలో ఇమ్రోజ్ ప్రవేశిస్తాడు. అతనికి అమృత సాహిర్ల ప్రేమ గురించి పూర్తిగా తెలుసు. అమృత కన్నా ఏడు సంవత్సరాలు చిన్నవాడు కాని ఆమె అంటే పిచ్చ ప్రేమ. ఆమే తన జీవితం అనుకుని ఆమెతో ఉండిపోయాడు. వారు కలిసి 45 సంవత్సరాలు జీవించారు. అమృత 86 ఏళ్ల వయసులో ఇమ్రోజ్ చేతుల్లో చివరి శ్వాస విడిచింది. ఆ తరువాత కూడా ఆమె జ్ఞాపకాలతో ఆయన సాగించిన జీవితం ప్రేమకు నిదర్శనం. గొప్ప ప్రేమికులుగా సాహిత్యలోకం చెప్పుకునే ఈ మిత్రుల మధ్య సాగిన ఉత్తరాలను సేకరించి ఈ పుస్తకం తీసుకువచ్చారు ఉమా త్రిలోక్.

ప్రేమ పట్ల ఎవరి అభిప్రాయాలు వారివి. కాని ఈ జంట ఉత్తరాల్లోని సంభాషణలను చదివితే మనసులు కలవడం, ఎదురుచూడడం, ఒకరి కోసం ఒకరు బ్రతకడం, ప్రేమించుకోవడం, అని మనం రోజు ఉబుసుపోక మాట్లాడుకునే కొన్ని సినిమా పదాల అర్థం స్పష్టంగా తెలుస్తుంది. మనుషులు ఒకటిగా బ్రతకడం అంటే ఎలానో అర్థం అవుతుంది. ఒక ఉత్తరంలో ఇమ్రోజ్ అంటాడు “तुम मेरे जीने का खूबसूरत फरेब भी हो और खूबसूरत हकीकत भी” – “నువ్వు నా జీవితానికి అందమైన అబద్ధానివి అందమైన నిజానివి కూడా”.. ఎంత చక్కని భావన. అమృత ఒక చోట అంటుంది “जो रेत को पानी समझने की गलती नही करते, उनकी प्यास में ही कोई कमी होगी, उनके होंठों पर वह शिद्दत नहीं होगी I मुझे वह सयानापन नही चाहिए मुझे अपनी प्यास मुबारक I चाहे सारी उम्र वह मुझे रेगिस्तान में भटकाती रहे I” ఎడారిలో ఇసుకను నీరుగా భావించే తప్పు చేయనివారి దాహంలోనే ఏదో లోపం ఉంది. వారి పెదాలలోనే ఆ కోరిక లేదు. అలాంటి ఎరుక నాకు అక్కరలేదు. నాకు ఈ దాహం కావాలి. దానితో నేను జన్మంతా ఎడారిలో గడపవలసి వచ్చినా సరే.” ప్రేమ కోసం కాలిపోతున్నా సరే అలా వెతుక్కుంటూ జీవించడమే కావాలని ప్రేమ పట్ల కోరిక లేని జీవితం తనకు అక్కరలేదని అమృత ఇమ్రోజ్‌కు రాసుకున్న లేఖ సారాంశం ఇది. నేను నీ జీవితానికి ఒక దురదృష్టాన్ని అని అమృత చెప్పినప్పుడు… దురదృష్టం కోరకుండానే జీవితంలోకి వస్తుంది కాని నీవు రావు కదా నీవు దురదృష్టం ఎలా అవుతావు నీవు అదృష్టానివి అని ఇమ్రోజ్ సమాధానమిస్తాడు. “बद्नसीबी तो अपने आप ही बिन बुलाए आ जाती है, पर तुम तो आती ही नहीं हो, सो तुम बदनसीबी नही, जरूर मेरी खुशनसीबी हो”

“నువ్వు నా సమాజానివి, నేను నీ సమాజాన్ని ఇంత కన్నా మరో సమాజం మనకు లేదు” అని అదే విధంగా జీవించి చూపిన ఇమ్రోజ్ గొప్ప ప్రేమికుడు. “నీ ప్రశ్నలన్నీటికీ నన్ను జవాబుగా చేసుకో” అని తనను తానే ప్రేమికురాలికి అర్పించుకున్న గొప్ప మానవుడు. అమృత కూడా మరో ఉత్తరంలో “నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదన్న బాధలేదు నువ్వు అర్థం చేసుకున్నావన్న ఓదార్పు చాలు” అని రాస్తుంది. “జీవించడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి అవి నువ్వు లేకుండా ఎందుకు” అని ప్రశ్నిస్తుంది. “ప్రపంచంలో మిగతావారితో మాట్లాడితే మాటలు అయిపోతాయి. నీతో అలా సాగుతూనే ఉంటాయి” అని మరో చోట అంటుంది. “నువ్వు నాకు ఆగస్టు 15 లాంటి వాడివి నా మనసుకు అస్థిత్వానికి స్వాతంత్రాన్ని తీసుకు వచ్చిన వాడివి” అని మరో చోట రాసుకుంది. వీరి ఉత్తరాలలో ప్రేమ గాఢత ఎంత ఉందంటే అమృత ఒక చోట “ఇలాంటి ఉత్తరాల కోసం మరో జన్మ కూడా ఎదురు చూస్తూ గడిపేస్తాను” అంటుంది. ఇమ్రోజ్ మరో ఉత్తరంలో రాస్తాడు “నువ్వు నా మార్గానివి, నా గమ్యానివి, నిజంలా స్థిరంగా ఉండే రూపానివి, కల్పనలా విహరించే అందానివి” అని…

విదేశీ ప్రయాణాలు చేస్తూ ఆ అనుభవాలు అమృత ఇమ్రోజ్‌తో పంచుకునేది, అలాగే వృత్తి రీత్యా బొంబాయిలో ఉండవలసి వచ్చినప్పుడు అమృత ఢిల్లీలో ఉండి ఒకరితో ఒకరు ఈ ఉత్తరాల ద్వారా జీవించిన విధానం చూస్తే అక్షరాలలో ఇంత ప్రేమను పొందుపరచవచ్చా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత అందమైన లేఖలను చదివిన తరువాత మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది. కొన్ని భావాలు హిందీ భాషలో చాలా అందంగా వస్తాయి. అందుకే ఈ పుస్తకం నాకు అందమైన ప్రేమ కవిత్వపు వానలో తడిసిన అనుభూతిని కలిగించింది. తెలుగులో అనువాదం కాకపోయినట్లయితే హిందీ భాష తెలిసి ఉంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి.

ప్రేమ అంటే ఇప్పటి రోజుల్లో చాలా మంది ఎవరు తోచిన వివరణ వాళ్ళిచ్చుకుంటున్నారు. ప్రేమకి వాంఛలకు మధ్య ఉన్న సన్నని గీత చెదిరిపోయి చాలా రోజులు అయ్యింది. అనుభవాలకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళూ అనుభూతుల గురించి పట్టించుకోకుండా జీవితం గడిపేస్తున్నారు. తన కవిత్వం పిచ్చిలో అర్ధరాత్రి రాసుకుంటూ ఉన్న అమృత వద్దకు టీ తయారు చేసుకుని వచ్చి ఆమెకిచ్చి ఆమెతో పాటు మౌనంగా తనో కప్పు టీ ఆమె సాన్నిధ్యంలో తాగి మళ్ళీ ఎవరి సాహిత్య ప్రపంచంలోకి వారి వెళ్ళిపోవడం, కేవలం ఆ కప్పు టీ పంచుకోవడం కోసం రోజంతా ఓపిగ్గా ఎదురు చూసే ఇమ్రోజ్ గురించి చెబితే ఎంతమంది అర్థం చేసుకుంటారు? వారు ఒకరికొకరు రాసుకున్న లేఖలలో ఎక్కడా శారీరిక ఆకలి కనిపించదు. తమ మనసులోని ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా ఒకరి పైకొకరికున్న నమ్మకం ఒకరి అవసరం మరొకరు గౌరవించుకున్న విధానం కనిపిస్తుంది. ప్రేమ అంటే మంచంపై చేరడం కాదు, మనసులోకి చేరడం అని చెప్తే నవ్విపోయే తరం ఇది. అయినా నవ్విపోదురు కాక నాకేటి చేటు అని మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చినా రాకపోయినా చెప్పుకుంటూ పోయే మొండితనం నాది. అందుకే ఈ పుస్తకాన్ని ఎక్కువ మంది చదవాలనే ఆశతో ఇది ఈ వారం మీతో పంచుకుంటున్నాను. విదేశీ పుస్తకాలనే ‘సంచిక’లో పరిచయం చేస్తూనే ఉన్నా ఈ పుస్తకాన్ని పంచుకోవడం అవసరం అనిపించి ఈ వారం దీన్నీ మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ అనుభూతుల వానను ఆస్వాదించిన తరువాత ప్రేమ అనే భావం పట్ల కొంతైనా గొరవం కలిగితీరుతుంది. ప్రేమ అనే అనుభవాన్ని ఆస్వాదించడానికి మనలో రావల్సిన మార్పు కొంతైనా అవగాహన కొస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here