నా వలపు తోటలోకి నీ రాక కోసం ఎదురుచూస్తూ…!?

1
3

ఒకనాటి ప్రభాత రాగంలో

నీ రూపం నన్ను అలరించింది…

దశాబ్దాల నీ ఎడబాటు

నన్ను ఎంతగా క్రుంగదీసినా…

నేటి నిరాశాంధకారంలో కూడా

నీ అందం నన్నలాగే మురిపిస్తోంది!

మొదలూ చివరా… రెండూ లేని

నా జీవన వ్రాతప్రతిలో

నీవు సశేషమై నిలిచావు!

నా హృదయ సామ్రాజ్య సింహాసనంపై

నిరంతరం నన్ను ఉద్రేకపరుస్తోన్న

స్వర్ణ సాలభంజికవు నీవు!

నాటి…

నా యవ్వన విలాసమయ జీవితమంతా

నీ కోసమే వెచ్చించాను ప్రియ సఖీ…!

నేటి…

శేషించిన వార్దక్య కాలం కూడా

నువ్వు పంచి ఇచ్చిన

అనుభూతుల స్మృతులతోనే…!

ఈ ప్రపంచం…

నన్ను చూసి నవ్వుతోంది ప్రేయసీ!

వయసు మళ్ళిన పిచ్చివాడు

ప్రేమ గీతాలాలాపనలతో

ఊహల్లో విహరిస్తున్నాడని

ఈ లోకం…

నన్ను పరిహసిస్తోంది!

అయినా…

నీతో నేను పంచుకున్న

అనుభూతుల జ్ఞాపకాలు

గుబులు గులాబీలై…

ఎదలో చేరి సందడి చేస్తూ

పట్టరాని విరహాగ్నిని

కవితాక్షరాలుగా మార్చి

నీకు అక్షరాభిషేకం చేస్తున్నాయి!

ప్రేయసి కోసం నిరీక్షించడంలో…

ఆమె రాకను ఊహించుకుంటూ

కాలాన్ని ఖర్చు చేస్తూ బ్రతకడంలో…

ఎంత ఆనందముందో

ఈ పిచ్చి జనాల కేం తెలుసు?

నా కనురెప్పలు మూసుకొని

తదేక దీక్షతో…

నీ రాకను ఊహించుకుంటోన్న

మధురమైన ఘడియలు చాలవా…

నేను పది కాలాల పాటు

పదిలంగా జీవించడానికి!?

అదిగో… అటు చూడు…!

నీ పాదాల సవ్వడి…

నీ కాలి అందియల

ఘల్లు ఘల్లు శబ్ద తరంగాలు…!

విరగబూసిన నా వలపు తోటలో

ప్రేమ కుసుమాలు నీ ఆగమనాన్ని వీక్షించి

నీకు ఆత్మీయ స్వాగతం పలికిన వేళ…

నా రెండు చక్షువులు

నీ చరణాల వాలి

తృప్తిగా స్పృశించాయి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here