జయజయహే మహిషాసురమర్దిని

0
3

[dropcap]‘దు[/dropcap]ర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వపటుత్వ సంపదల్’ అన్నాడు పోతన. మువురమ్మల మూలపుటమ్మగ లక్ష్మి, సరస్వతి, పార్వతి రూపములుగ వరప్రదాయిని దుర్గ అని కవివాణి. శివానిగ పేరుపడిన పార్వతి పరమశివునికి అర్ధభాగము. శివుని ఆజ్ఞపై దుర్గాసురుడనే రాక్షసుని చంపి దుర్గ అయింది.

త్రిపురాసుర సంహారము చేసిన శివుడు, శివాని చేత దుర్గగ దుర్గాసుర సంహారము చేయించి అర్థభాగముగ దుష్టశిక్షకురాలిగ ఖ్యాతి నిచ్చాడు. శరణనన్నవారిని రక్షించే దుర్గగ జగజ్జనని అర్చామూర్తి రూపము మహిషాసురమర్దినిగ దసరాపండుగగా విఖ్యాతమైన విషయము తెలుసుకోదగ్గది..

శివానందలహరిలో శంకరభగవత్పాదులు ‘అస్తోకత్రిభువన శివాభ్యాం’’ అని ముల్లోకములకు శుభము కలిగించు దంపతులు పార్వతీపరమేశ్వరులని నమస్కరించారు. అసలు పార్వతిది కాళిరూపము. భద్రకాళి. మహాకాళిగ శివునితో సమానముగ ప్రళయ తాండవము చేసే ఉగ్రరూపము. ఆ ఉగ్రప్రచండ రూపము కారణముగానే మహిష, చండముండులనే రాక్షస సంహారము చేసింది. చాముండి, మహిషాసురమర్దినిగ దేవతలను మెప్పించింది

పార్వతి చాముండిగ మహిషాసురమర్దినిగ కపాలి, కృష్ణపింగలి, కైటభనాశిని రూపములుగ కూడ ఉగ్రమే. కాని కుమారి, అపర్ణ, ఉమ, శాకంబరి, స్వేత, కృష్ణ, హిరణ్యాక్షి, విరూపాక్షి పేర్లతో సాత్వికరూపము కూడ ఉంది. వేదములలో అంబికగ పేర్కొనబడింది. తైత్తరీయ అరణ్యకాలు ఉపనిషత్తులలో కాత్యాయని, కన్యాకుమారిగ పేరు కనిపిస్తుంది. కాని దసరా ఉత్సవ నవదుర్గార్చన పేరుతో  దేవీనవరాత్రులుగ పదిరోజుల పండగై అందింది.

రురుడనే అసురుని కుమారుడు దుర్గాసురుడు. బ్రహ్మవరప్రసాది. ముల్లోకకంటకుడు. ఆ దుర్గాసుర సంహారానికి శివుడు పార్వతిని దుర్గగ అవతరించడానికి అనుమతించాడు. దేవిభాగవతములోనేకాక ఈ వృత్తాంతమును, స్కాంద పురాణములో అగస్త్యుడు స్కందునికి చెప్పాడు. దుర్గాసురుని చంపి దుర్గాదేవిగ ప్రత్యేక రూపముగ పూజలందుతోంది. మార్కండేయ పురాణములోను, వామన పురాణములోను ఈ దుర్గ మహామాయగ వర్ణింపబడింది. ఈశ్వరుడుతో సహా విష్ణు, బ్రహ్మాది దేవతలు మహిషాసురుడనే రాక్షసుని ఎదుర్కోలేకపోతే దాల్చిన రూపము మహామాయ. రాక్షస వికారచేష్టలకు సింహస్వప్నమైన సింహవాహిని.

మహామాయ రూపముకనుకనే దుర్గాసుర సంహారానికి ముందు రక్తబీజుడనే లోకకంటక రాక్షసుడిని కాళిరూపముదాల్చి నిర్వీర్యుని చేయగలిగింది. రక్తబీజుని శరీరమునుండి భూమిమీదపడే ప్రతిబిందువు రక్తబీజుడిగ మారుతుంది. కాళిభయంకరరూపము  దుర్గగా యుద్దసమయాన వడితో యుద్ధము చేస్తూ కాళిగ తన నాలుక చాచి రక్తబీజుని రక్తాన్ని నేలమీద పడకుండా ఆస్వాదించింది. బెంగాలులో కలకత్త కాళిదేవాలయములో ఈ కాళి అర్చారూపము దర్శింవచ్చు. కలకత్తా కాళిక రామకృష్ణపరమహంసకు పిలిస్తే పలికేదని చెబుతారు. దుర్గ ఆమె సౌందర్య అర్చారూపముగ శంకరాచార్యుని సౌందర్య లహరి.

మహాకాళిని ప్రపంచమంతా అర్చించారని ఋజువులున్నాయిట! విచారణీయమైనా ఆసక్తికలిగిస్తున్నాయి. కాలిఫోర్నియా దేశవీరవనిత పేరు కాలాఫియా కాళిని ధ్వనిస్తుంది అంటారు. పాశ్చాత్యదేశాల ప్రాచీనదేవత koliada కాళి కావచ్చునని గ్రీకులు kalanada, Latin దేశస్థుల calenda పదాలు నేటి కేలండరు పదాలుగ మన కాళిగ తులనాత్మక పరిశీలనలో కొత్తకోణాలు అనేవారివి విమర్శనాత్మకము.

మహిషుని చంపినందుకు మహిషాసురమర్దినిగాను, దుర్గాసురుని చంపినందుకు దుర్గగాను నవరాత్రులపాటు విజయగాథలుగ పదవరోజు ముగింపుగ దసరాపండుగ ఉత్సవముగ జరుపుకుంటున్నాము. ఈ రాక్షస సంహార సమయాన సింహహినిగ దుర్గ కాత్యాయినిగ కీర్తింపబడింది. చండముండులను, మహిషుని చంపడానికి దేవతలందరూ ఆమెకు తమ తేజస్సును, ఆయుధములను ఇచ్చారు. వింధ్యపర్వత ప్రాంతములో యుద్ధము చేసి మహిషుని చంపింది. మహిషుడు రక్తబీజుడు సహాయకుడిగ దుర్గను దున్నపోతు ఆకారంలో ఎదుర్కొన్నాడు.

దుర్గ అనగానే వాహనమైన సింహం దిగి దున్నపోతు రూపములో ఉన్న మహిషుని చంపుతున్న విగ్రహము దసరా ఉత్సవాలలో కనిపిస్తుంది. కాని ఆమె కనకదుర్గగ పులివాహనము మీద ఉండి దుర్గాసురుని చంపుతున్న విగ్రహాలు కూడ ఉన్నాయి. ఆమె కనకదుర్గగ మారి పులివాహనము ఎంచుకోవడానికి కారణం ఉంది. పార్వతికి కాళి అని పేరు. నల్లగా ఉన్నావని శివుడు పరిహాసమాడాడు. అందుచేత ఒంటికాలిమీద నిలబడి తపస్సుచేసి బ్రహ్మను మెప్పించి బంగారుఛాయను పొందింది. ఆ తపస్సు సమయంలో ఒక పెద్దపులి పార్వతిని కనిపెట్టుకుని ఉండేది, దాని సేవాభావానికి మెచ్చి వాహనముగా చేసుకుంది. కనకపుఛాయ వచ్చిన కారణంగా కనకదుర్గగా పేరుకెక్కింది. దేవీభాగవతము, ఇతరపురాణాలు 64 దేవీ రూప అర్చా మూర్తులు ఉన్నాయంటున్నాయి. తెలుగువారికి బెజవాడకనకదుర్గ ఆరాద్యదైవము.

దుర్గ మహామాయగ యశోద గర్భాన జన్మించింది. శ్రీకృష్ణుని సోదరిగా కూడ పూజనీయ అయింది. భాగవతములో శ్రీకృష్ణుడు దుష్టసంహారము శిష్టరక్షణ చేసాడు. అష్టాదశపురాణాలలో భాగవతము చేరింది. దేవీ భాగవతము రచన స్త్రీశక్తి నిరూపణకు ప్రసిద్ధ భాగవతనామపురాణమైంది. కాశీ విశాలాక్షి, అన్నపూర్ణల వలె కామాక్షి, మీనాక్షిగ దక్షిణభారతదేశ ప్రసిద్ధము. మహాలక్ష్మి. మహాసరస్వతి రూపములుగ దుర్గ మువురమ్మల మూలపుటమ్మగ అర్చా మూర్తి. బహురూపిణిగా పూజనీయ. గ్రామదేవతలు దుర్గాంశలుగానే భావిస్తారు.

సతీదేవిగ ఆమె దక్షయజ్ఞ సమయాన శరీరము దగ్ధము చేసుకుంది. ఆమె శరీర భాగములు పడినచోట్లు శక్తి పీఠములుగ ఖ్యాతిగాంచాయి. అందుచేత ఆమెకు సహస్రనామాలున్నాయి. బహు అర్చామూర్తు లున్నాయి. లలితగా ఆమెకుగల సహస్ర నామస్తోత్రములు దుర్గాశక్తివే. ‘గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ’….ఆనందమగ్న హృదయ స్సద్య పులకితోఽభవత్ ….తేన తుష్ట మహాదేవి తవాభీష్టం ప్రదాస్యతి అని దశరాత్రులు స్తోత్రము చేసే దసరా పండుగ దుర్గా విజయదశమి రూపములు.

దసరా అంటే దేవీపూజ పదిరాత్రులు అర్థముగా భావిస్తున్నాము. ఇళ్ళలో పూజామందిరములో సరే దేశమంతటా పందిళ్ళు వేసి అర్చా మూర్తిని నెలకొల్పడముంది. రోజుకొక్క దేవీఆకారమునకు అర్చన నైవేద్యాలు జరుపుతారు. పదవరోజునాడు  నవరాత్రులు పూజలందుకున్న అర్చామూర్తిని నదిలో లేక చెరువులో నిమజ్జనము  చేస్తారు. సాధారణముగ పాడ్యమి తిథితో పూజ మొదలు.

1వ రోజు శ్రీ లక్ష్మి, 2వ రోజు శ్రీగాయత్రి, 3వ రోజు శ్రీ అన్నపూర్ణ, 4వ రోజు శ్రీలలిత, 5వ రోజు శ్రీ బాలాత్రిపురసుందరి, 6వ రోజు శ్రీసరస్వతి, 7వ రోజు శ్రీదుర్గ, 8వ రోజు శ్రీ మహిషాసురమర్దిని, 9వరోజు శ్రీరాజరాజేశ్వరి రూపిణిగ అర్చిస్తారు. అష్టమి, నవమి, దశమి తిథులలో పూజా మూర్తులు లేదా నవరాత్రులు ఆరాధనా పూజా అర్చామూర్తులులో కొన్నిప్రాంతాలలో పేర్లు వేరుగా కనిపించినా పూజా నైవేద్య విధానమొక్కటే.

పేర్లు వేరుగా నవరాత్రి మూర్తులు దుర్గాదేవి అవతార మూర్తిగ బహునామములు ధ్వనించడం ఈ పండుగ ప్రత్యేకత. బెంగాలు ప్రజలు దుర్గ అంటారు. మైసూరు దసరాఉత్సవాలు చాముండేశ్వరిని ధ్వనిస్తాయి. చత్తీస్‌గడ్, బస్తరు ప్రాంతము దంతేశ్వరిమాతకు అంటారు. మహారాష్ట్రులు లలిత అంటారు. ఐదవరోజుగాని ఏదో ఒకరోజునగాని ఆంధ్రప్రాంతముతోసహా దేశమంతటామాత్రం సరస్వతీపూజ ఉంటుంది.

విజయదశమి ప్రత్యేకత కలిగి ఉంది. పాండవులు అజ్ఞాతవాస సమయాన విజయముకోరి దుర్గను కొలిచారు. విరాటుని కొలువులో ప్రవేశించేముందు ఆమెను ప్రార్థించి జమ్మిచెట్టుపై ఆయుధములు దాచారు. అందుకే శమీపూజ చేస్తున్నాము. కురుక్షేత్ర యుద్ధ విజయప్రాప్తికి అర్జునుడు దుర్గారాధన చేసినరోజది. శ్రీరాముడు కూడ విజయదశమి పేరు సార్ధకముగ ఆ రోజున రావణసంహారము చేశాడు. పాండవుల విజయప్రాప్తి, రామవిజయముగ ఆయుధపూజ, ఫ్యాక్టరీలలో యంత్రపూజ, ద్విచక్ర, త్రిచక్ర సంబంధ ఉపయోగ వాహనములుకు పూజ, రామలీల జరుకోవడం దసరాకు ఆకర్షణీయ పండగైంది.

దక్షిణభారతములో శమీ పూజతోబాటు ఉత్తరభారతదేశ రామలీలను కూడ జరుపుతూ సంస్కృతికి ఎల్లలు చెరిపేస్తున్నారు. ఉత్తరభారతీయులు తొమ్మిదిరోజులు రామలీల ఉత్సవముగా దసరా జరుపుతారు. ఆ తొమ్మిదిరోజులూ ఊరూవాడ రామాయణ ఘట్టములను ప్రదర్శించే కళాకారులతో కలకలలాడుతుంది, పదవరోజున రావణ, కుంభకర్ణ, మేఘనాథ దిష్టిబొమ్మలను రామలక్ష్మణ వేషదారణతో అగ్నిబాణము వేసి దహనము చేస్తారు. కులుప్రాంతము, హిమాచలప్రదేశ్ లోను 150-200 దేవతాఉత్సవ విగ్రహాలు రామునికి వివిధ వాహనాలపై ఊరేగింపుగా పాల్గొనడం దక్షిణ భారత దసరానిమజ్జన మహిషాసురమర్దిని దుర్గాఉత్సవ కోలాహలము తలపిస్తుంది.  దసరా భారతీయుల అందరి పండుగ.

రామవిజయము, పాండవ విజయము అనుగ్రహించిన దుర్గ దుష్టరాక్షససంహారము విజయదశమి. చెడుపై మంచివిజయము సాధించిందని భారతీయులందరూ ఏకత్మగా పలికే మాట. జయ జయ జయజయదుర్గ దుర్గాదేవి శరణమ్.. జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here