[dropcap]టం[/dropcap]గ్! టంగ్! టంగ్!
టంగ్ టంగ్ టంగ్ టంగ్ టంగ్
ఎన్నెన్ని లయలో! ఎన్నెన్ని హొయలో!
వీనులవిందైన శబ్దం వింటూనే
పిల్లలంతా పరుగే పరుగు!
పొద్దున్నే తయారవుతూనే
చద్దన్నం తిని అమ్మకు ముద్దిచ్చి
పలకా బలపం పట్టుకుని
బడిగంట కోసం ఎదురు చూపు!
బడిగంట కొట్టగానే
అది ప్రార్థనకు పిలుపే!
తరగతుల వారీగా బారులు తీరి
భారత పతాక ముందు
ఎన్నెన్ని పద్యాలో! ఎన్నెన్ని పాటలో!
పిరియడ్ లను తెలియచేసే గంట!
గురువులు బిరబిర తరగతుల వ్రాల!
గుండ్రని జిలేబీ లాంటి
అ ఆ లు పలకపై దిద్దీ దిద్దీ
ఎర్రగా కందిన వేలు చూసుకుంటూ
నోటితో ఊదుకుంటూ
ఎదురుచూపులు!
చిన్న ఇంటర్వెల్ గంట
అందరికీ నచ్చేనంట!
జీళ్ళూ, పప్పుండలూ
ఊరేసిన ఉసిరికాయలు
మామిడి ముక్కలు
కాకెంగిలి తిళ్ళూ
చెలులతో గెంతులూ!
ఊరంతా వినిపించే
బడిగంట పిల్లల్లో
చైతన్యాన్ని నింపే గంట!
భాష పట్ల మమకారాన్ని
లెక్కలతో ధైర్యాన్ని
పరిసరాల విజ్ఞానం
ఉత్సుకతనూ, వికాసాన్నీ
గంటలో ఎంతెంత నేర్చామో!
జీవితానికో క్రమశిక్షణ
నేర్పిన బడిగంట!
చదువు పట్ల ఆసక్తిని
గురువుల పట్ల వినయాన్ని
ఆటలతో ఆరోగ్యాన్ని
బాల్య స్నేహంలోని మాధుర్యాన్ని
తొలిగా అందించినది బడిగంటే!
నాడు విద్యార్థినిగా
క్రమశిక్షణ నేర్చాను!
నేడు గురువుగా
క్రమశిక్షణ నేర్పాను!
అందుకే బడిగంట
చిన్నారి బడి పిల్లలలో
ఆనందాన్ని నింపే గంట
చైతన్యాన్ని పెంచే గంట!