తెలుగు కథ – ఏరిన ముత్యాలు 3

3
5

[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]

పరిచితమైన దృశ్యమే – పట్టించుకోము! సలీం కథ: ‘నరకకూపం’:

[dropcap]ఈ[/dropcap] ‘ఏరినముత్యాలు’ శీర్షికని ఆలోచించినప్పుడు రెండు విషయాలు నా మనసులో నాటుకున్నాయి. ఒకటి – కథా వస్తువు ఇంతకు ముందే తెలుగు కథా సాహిత్యంలో Untouched దై వుండాలి. రెండు – ఆ కథ జీవితాన్ని అన్వేషించేదిగా ఉండాలి. జీవితంలోని సంభవాల మూల సూత్రాల్ని అన్వేషింపజేయాలి. అలాంటివే వస్తాయి ఈ సీరీస్‌లో.

సాధారణ జీవన సంఘటనలుగా కనిపించే సంఘటనలు – అరుదైన కథాసృజన చేసే రచయితకి అ-పూర్వమైన వస్తువులుగా కనిపిస్తాయి. “నన్ను గురించి కథ వ్రాయవూ?” అని అతన్ని ఊపిరి సలుపుకోనివ్వకుండా వేధిస్తాయి. అలా వేధించిన వస్తువుకి, ఇతివృత్తాన్ని కూర్చుకుని, లక్ష్య శుద్దితో కథనాన్ని ఇస్తాడు ఆ రచయిత. అలాంటి అరుదైన రచయితల్లో ఒకరు సలీం. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత. విడిగా బహుమతులకి లెక్కే లేదు! సలీం నవలాకారుడుగా – సీరియల్ సీరియల్ రచయిత! సలీం రాసిన ఒక అపూర్వమైన కథ – ఈ ‘సంచిక’లో! కథ పేరు ‘నరకకూపం’. 17.08.2016 నవ్య వీక్లీలో వచ్చింది.

‘నరకకూపం’ కథ ఉత్తమ పురుషలో నడుస్తుంది. “ఇప్పుడు నా వయస్సు నలభై ఏళ్ళు. ఇన్నేళ్ల జీవితంలో స్వర్గం ఎలా ఉంటుందో ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. నరకం మాత్రం ప్రతిరోజూ చూస్తున్నాను” అంటూ ఆత్మకథ చెబుతున్నాడు. ఎవరూ? డ్రైనేజీ పైపులు లీకవుతుంటే, ఆ గట్టర్ లోకి కొండచిలువ నోట్లోకి దిగి శుభం చేసే అతను. అతను ఈ దుర్భర దుర్గంధ భరితమైన ‘కంపు’ బతుక్కి ఎలా అంటుకుపోవాల్సి వచ్చిందో – నేపథ్యపు రొదగా, అతని మనసు మాట్లాడుతుంది. 14వ ఏట తొలిసారి దీనిలోకి తలపెట్టాడు. నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్ళాలంటే – మరే పనీ చేతగాక, దీనిలో దిగబడి పోయాడు. ప్రస్తుతం కథ- అతని ‘దినచర్య’గానే తెలుస్తుంది మనకు. ఆ పనిలో ఉన్నాడతను. అయితే మధ్యలో అతని వల్లగాక, అతని అసిస్టెంట్-సింగన్న-పాతికేళ్ళకు మించని బక్కపలచని ఎలుకపిల్లలాంటి కుర్రాడుని డ్రైనేజీలోకి దింపాడు. పొడవాటి తాడుని నడుముకు కట్టుకుని, కొసని ఇతనికిచ్చాడు. దాన్ని వదులుతూ, సింగన్న ప్రయాణాన్ని గమనిస్తూ ఉండటం ఇతని డ్యూటీ. సింగన్న లోపలికి ప్రవేశించిన తర్వాత బయట కూచుని, రేపు తన కూతురి పెళ్లిచూపులకు రాబోయే వారి గురించిన ఆలోచనలో పడ్డాడు ఇతను! తెలివితెచ్చుకుని చూస్తే గుండె గుభిల్లుమంది. గట్టర్‌లో దూరంగా సింగన్న శవం….!

ఈ చావు అతన్ని నిలువునా కుంగదీసింది. మర్నాటి పెళ్ళిచూపుల్ని గురించి అంతఃక్షోభ పెరిగిపోయింది. వచ్చే వారికి తాను డ్రైనేజీ బాగుచేసే వాణ్ణని చెప్పవద్దని భార్యనీ, కూతుర్నీ ప్రార్థిస్తూ ఉంటాడు.

ఇక్కడ కథలో మలుపు. తండ్రి ఆవేదన అంతా వినివిని కూతురు అంటుంది- “ఆ వచ్చే వాళ్ళకి నిజం చెబుదాం. నిన్నూ, నువు చేస్తున్న పనిని ఇష్టపడని వ్యక్తి నాకు భర్తగా వద్దు… నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. … నాన్నా… నువ్వు అమ్మకోసం, నా కోసం, నా చదువుకోసం డ్రైనేజీ మురికినంతా కౌగిలించుకుంటున్నావు. చూడు… అందుకూ నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకు గౌరవం. నువ్వు నా హీరోవి నాన్నా. నాకే కాదు, అమ్మకు కూడా” అంది.

ఒక్కసారిగా అతనికి జ్ఞానోదయమైంది. ఇన్నాళ్ళు తాను నరకం గురించి ఆలోచిస్తూ, తన ఇంట్లో ఉన్న స్వర్గాన్ని గమనించుకోలేదని అర్థమైంది… వాళ్ల ప్రేమకు పాత్రుడు కావటంకన్నా స్వర్గం ఏముంటుంది అని సంతృప్తిగా ఊపిరిపీల్చుకున్నాడు. ‘ఆ స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్ని ప్రేమగా తడిమింది’ అంటూ కథ ముగిసింది.

వర్తమాన సామాజిక దుస్థితిలోని ఒక చీకటికోణం మీద ‘టార్చ్‌లైట్’ ‘ఫోకస్’ ఇది. 60 ఏళ్ళ క్రితం డా॥ కొలకలూరి ఇనాక్ గారు ‘పశ్చాద్భూమి’ కథ రాశారు. ‘ఓపెన్ టాయ్‌లెట్స్’ (పాయఖానా)లోని మలశుభ్రత, దాన్ని ఊరవతలకి చేర్చే దారుణమైన దుర్భర దినచర్య గురించిన వాస్తవ జీవనచిత్రణ ఆ కథ. ఈ నరకకూపం అంతకంటే దుర్భరమైన జీవన విషాద చిత్రణ!

నగరంలో డ్రైనేజీ, దాని అస్తవ్యస్త నిర్వహణ, దాని కారణంగా కొందరి ‘జీవిక’ దుస్థితికి దర్పణంగా వచ్చిందీ కథ. ఆ దుస్థితిని చూస్తూ – అనాసక్తతతో, ఉదాసీనతతో ఆ దుర్గంధానికి ముక్కు మూసుకుని పక్కకు తప్పుకుపోయే నగరజీవికీ ఆలోచనా ప్రేరకం ఈ కథ. అలాగే, సింగన్న లాంటి బడుగుబతుకులు ఇలా బలికాకుండా, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణని మెరుగుపరచవలసిన అవసరాన్నీ పరోక్షంగా పాలకుల దృష్టికి తెస్తున్న కథ ఇది.

ఈ కథలో మరో ప్రత్యేకమైన విశేషం-మానవజీవిత విలువ (Human life value) ని ఉన్నతీకరించటం. చేసే పనిని బట్టి మనిషిని గౌరవించటం లేక అగౌరవించటం కాక – యథాతథ స్థితిలో – ఉన్న వాస్తవంలో ఆ మనిషిని ‘మనిషి’గా గౌరవించటం వాంఛనీయమనే సందేశాన్ని అందించారు రచయిత.

చదివినవారు మరచిపోలేని ఒక నిస్సహాయతని, జీవనవేదనని కథాగతం చేసిన సలీం అభినందనీయుడు. అతని సాంఘిక జీవన పరిశీలనాశక్తికీ, సృజనాత్మక రచనా కృషికీ జోహారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here