విద్యా మాఫియాపై ఎక్కుపెట్టిన బాణం ‘ధిక్కారం’

2
3

[box type=’note’ fontsize=’16’] “కార్పోరేటు విద్య యొక్క దారుణాలను వెలుగులోకి తెచ్చిన నవల ‘ధిక్కారం’. ఉమ్మడి రాష్ట్రంలోని విద్యా మాఫియాపై ఎక్కుపెట్టిన బాణం సింహప్రసాద్ గారి ‘ధిక్కారం’ నవల” అంటున్నారు గోపగాని రవీందర్ ఈ సమీక్షలో. [/box]

[dropcap]’మ[/dropcap]నిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే’ అని ప్రముఖ విద్యావేత్త, సామాజిక దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే మాట మనందరికి ఆదర్శం. విద్య మనిషి వికాసానికే కాదు మానవ జాతి మనుగడకు అత్యంత అవసరమైనది. అవని మీద అంకురించిన అక్షరాలే విద్య. పేద, ధనిక తేడా లేకుండా అందరికి అందాల్సిన జ్ఞాన సంపదే విద్య. దేశాలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, మాట్లాడే భాషలు వేరు కావచ్చు, రాతలు వేరు కావచ్చు కానీ మనిషి విచక్షణకు జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం విద్యతోనే సాధ్యం. ఏ దేశంలోనైతే విద్య అందరికి అందుబాటులోకి వస్తుందో ఆ దేశం అభివృద్ధి మార్గంలో పయనిస్తుంది.

అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల్లో కూడా చదువు మోయలేని భారంగా మారింది. విద్యా మాఫియా కోట్ల వ్యాపారంతో సాగుతుంది. పరిశ్రమల యజమానులకు రాయితీలను ఇచ్చినట్లుగా, ట్రస్టుల పేరుతో నిర్వహిస్తున్న సామాజిక సేవా ముసుగులో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న తీరును, కార్పోరేటు విద్య యొక్క దారుణాలను వెలుగులోకి తెచ్చిన నవల ‘ధిక్కారం’. ఉమ్మడి రాష్ట్రంలోని విద్యా మాఫియా పై ఎక్కుపెట్టిన బాణం ‘ధిక్కారం’ నవలంటే అతిశయోక్తి కాదు. కథా, నవలా రచయితగా ప్రసిద్ధులైన సింహప్రసాద్ గారు ఈ నవలను రచించారు. నవ తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దాశరథి రంగాచార్య స్మారక నవలల పోటి’ (2017)లో ద్వితీయ బహుమతిని పొందిన నవలిది. తెలుగు రాష్ట్రాల్లో విద్యావేత్తగా మరియు ఐ.ఐ.టి. గురుబ్రహ్మగా ప్రఖ్యాతి పొందిన చుక్కా రామయ్య గారికి ఈ నవలను అంకితమివ్వడం అభినందనీయం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్పోరేట్ విద్యలో అగ్రస్థానాలకు చెందిన రెండు ప్రముఖ విద్యాసంస్థల పూర్వాపరాలను అధ్యయనం చేసి, ఒక పద్ధతి ప్రకారం చిత్రించిన నవలిది. విద్య, ఆరోగ్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని ప్రగతిశీలుర డిమాండ్. ఆర్థిక సరళీకరణ వలన వచ్చిన గ్లోబలీకరణలో డబ్బు ప్రాధాన్యం పెరగటంతో, మానవీయ విలువల పతనం, అమెరికా డాలర్ల వేట, ఇంజనీర్లు, డాక్టర్లు కావడమే జీవితాశయాలుగా చెలామణి కావడంలో సహజంగానే అదే దారిలో కొట్టుకపోవడం మొదలైంది. ఒకప్పటి విలువలకు స్థానం లేకుండా అయ్యిందని ఈ నవలలో మూడు తరాల్లో చూపించారు.

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బ్రహ్మం గారు. అందరిచేత గౌరవంగా ‘మా మాస్టారు’ అని గౌరవం పొందుతారు. ఆయన మాటంటే వేదవాక్కు ఆ ఊరి ప్రజలకు. ఆయన ఏకైక కొడుకు వెంకట రమణ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ గణితంలో బంగారు పతకము సాధించాడు. విజయవాడ దగ్గరలో ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం వస్తుంది. ఉద్యోంలో చేరటానికి వెళ్ళుతుంటే చెప్పిన మాటలు విద్య విశిష్టతను తెలియజేస్తాయి.

‘భూముల్ని, ఆస్తుల్ని విలువ గట్టినట్లు విద్యకు కూడా విలువ కడుతున్నారు. పిల్లలు బాగా సంపాదించడానికి ఏ చదువు పనికొస్తుందో అదే చదివించాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. వారి ఆశల్ని మరింత పెంచుతూ, భ్రమల్లో ఉంచుతూ డబ్బు చేసుకుంటున్నాయి విద్యాసంస్థలు. ఆ ధోరణి సరికాదు. చదువంటే విద్యార్థుల విజ్ఞానాన్ని, శీలాన్ని, సత్ప్రవర్తనని, సామాజిక బాధ్యతను పెంపొందించేది. విద్య యొక్క ప్రథమలక్ష్యం అక్షరజ్ఞానం. అంతే తప్ప పెద్ద జీతంలో ఉద్యోగం సంపాదించటం కాదు. కాని తగిన ఉద్యోగం సంపాదించుకోవడానికి అర్హుణ్ణి చేస్తుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృకథం ఏర్పరచటం, సామాజిక స్పృహ కల్గించడం, సామాజిక బాధ్యతలు స్వీకరించేలా సన్నద్ధం చెయ్యడం గురువు చెయ్యాలి. ఏ సమాజమైనా సరే నిరంతరం పురోగమనంలో ఉండాలంటే విద్యకు ఈ లక్షణం తప్పనిసరిగా ఉండాలి. చదువు సమాజంలోని రుగ్మతలకు చికిత్స చేసే దివ్య ఔషధం కావాలి. ఇది గుర్తుంచుకుని, నీ వృత్తిని ఒక పవిత్ర బాధ్యతగా భావించి నడచుకో’.

‘మీ మాటలు శిరోధార్యమని, నేను మీ బిడ్డనని, ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి అవుతానని, మీ మాటలు స్ఫూర్తినిచ్చాయ’ని, తండ్రికి బదులిచ్చారు. ఆదర్శ గురువును కావాలని ఆ క్షణంలోనే మనస్సులో ప్రతిజ్ఞ చేసుకుని బయలుదేరిన మ్యాప్స్ లెక్చరర్ రమణ జీవితంలోని ఎత్తుపల్లల కథ ఇది.

కొత్తగా నిర్మించిన భవనంలో ‘భూషణం రెసిడెన్ఫియల్ కాలేజ్’ను ఏర్పాటు చేశారు. కాలేజిని స్థాపంచిన భూషణం గూర్చి కాలేజి ప్రిన్సిపాల్ రామారావు రమణతో అంటాడు. ‘పూర్వాశ్రమంలో ఆయన పశువుల బేరగాడయ్య. ఆ సంగతి ఆయనే గొప్పగా చెప్పాడు. ఉండి, పెనుగొండ, పాలకొల్లు సంతల్లో పశువులు అమ్మటం, కొనటం చేసేవాడంట. తర్వాత కొన్నాళ్ళు బెల్లం, చింతపండు వ్యాపారం చేశాట్ట. ఆ తర్వాత భీమవరం పండ్ల వర్తకులతో కలిసి హైదరాబాద్‌లో ద్రాక్షతోటలు లీజుకు తీసుకున్నట్ట. అందులో బాగా మిగలగా ఏకంగా తోటలే కొనేశాట్ట.

కోన్నాళ్ళు కోళ్ళ ఫారాలు నడిపాట్ట. ఆ నగరం ఇబ్బడిముబ్బడిగా పెరిగేసరికి భూములకి ఎక్కడలేని విలువా వచ్చేసిందట. అక్కడ కొంత భూమి అమ్మి ఇక్కడ కొని ఇదిగో ఈ బిల్డింగులన్నీ కట్టేసి కాలేజీ పెట్టేశాడు. కాలేజీ నడపటమంటే కోళ్ళఫారం నడపటం అనుకుంటున్నాడు పిచ్చోడు’. ఆ పిచ్చోడు భూషణమే తన విద్యాసంస్థల పేరిట వేలకోట్ల వ్యాపారం ఎట్లా చేసాడో చెప్పిన కథిది.

కొత్త కాలేజీ కాబట్టి విద్యార్థులు చేరటం కష్టం. అందుకు భూషణం తన కాలేజీలో చేరిన లెక్చరర్లతో ఇంటింటికి తిరిగి, కాలేజీ గూర్చి గొప్పగా చెప్పి విద్యార్థులను అడ్మిషన్ చేయాలని ఆదేశిస్తాడు. మొదటి రోజు నలుగుర్ని చేర్పిస్తారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను అడుగుతాడు భూషణం. ఎమ్సెట్ క్లాసులు మిగతా కాలేజీల్లో రెండవ సంవత్సరం చెబుతున్నారని, ఆ కాలేజీల్లోకే విద్యార్థులను పంపుతామంటున్నారని రమణ చెప్పుతాడు. మనం మొదటి సంవత్సరం నుండే మొదలు పెట్టుతున్నామని ప్రచారం చేయండి అంటాడు భూషణం. ఈ ఐడియా పనిచేయడంతో ఎం.పి.సి, బై.పి.సి. సెక్షన్లు నిండిపోయినవి. మొదటి సంవత్సరం ఫలితాల్లో మ్యాథ్స్‌లో 97 శాతం మార్కులు సాధిస్తారు. ఫిజిక్స్‌లో తక్కువ మార్కులు వస్తే ఆ లెక్చరర్ ను చెడామడా తిట్టేస్తారు. మంచి ఫలితాలు రావాలి ‘రమణా’ అంటూ భూషణం గారు ఒత్తిడి పెంచుతాడు. ఉద్యోగంలో కొత్త. ఫలితాలు మంచిగుంటే జాబ్‌కు గ్యారంటి ఉంటుంది. ఇంకా బాగా కష్టపడి విద్యార్థులను ప్రిపేర్ చేస్తారు.

సంవత్సరాంతపు పరీక్షలు అయిపోగానే ఇంటికి వెళ్ళడు రమణ. అప్పటికే తనకు జోడిగా ఎవరైతే బాగుంటుందోనని వెతికే పనిలో పడ్డారు అమ్మనాన్నలు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న లలితతో వివాహం అవుతుంది. భూషణం గారి పైరవితో తనకు దగ్గరగా ఉన్న పాఠశాలకు బదిలీ అవుతుంది.

మొత్తం మీద ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకు ఆశిస్తారు కాని రాదు. ఫణికుమార్‌కు మ్యాథ్స్‌లో స్టేట్ ర్యాంకు వస్తుంది. మొదటి బ్యాచ్ తోనే మంచి ఫలితాలు సాధించారనే పేరు వస్తుంది. ఎమ్సెట్లో ఇంజనీరింగ్‌లో కొన్ని సీట్ల ర్యాంకులు వచ్చినప్పటికి మెడిసిన్లో ఒక్క సీటు కూడా రాదు. తమకు పోటీగా ఉన్న నెల్లూరు శేషారెడ్డి వాళ్ళకు చాలా సీట్లు వస్తాయి. ఆ రహస్యం ఏమిటని భూషణం గారు అడుగుతారు. లాంగ్ టర్మ్ బ్యాట్లు నడుపుతారని తెలుస్తుంది. మనం మొదలు పెడుదామని ‘భూషణం అకాడమి’ అని ప్రారంభిస్తారు. నిర్వహణ మొత్తం రమణకు అప్పజెప్పుతారు. దాంతో అతనికి కాస్త ప్యాకేజీ కూడా పెరుగుతంది.

శేషారెడ్డి విజయాలకు గల కారణాలను తెలుకోవడానికి భూషణం గారు, రమణ, బోటని లెక్చరర్ శివస్వామి ముగ్గురు కలిసి నెల్లూరులోని ఆ విద్యా సంస్థల పనితీరును తెలుసుకుంటారు. వాళ్ళు ఇచ్చే స్టడీమెటిరియల్, వసతి సౌకర్యాలను గూర్చి పరిశీలన చేసివస్తారు. ఇక్కడ కూడా అలాంటి వసతులను ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్యను పెంచకుంటారు. ఎమ్సెట్ ఫలితాల్లో మొదటి ర్యాంకు రావాలని భూషణం గారి ఆర్డర్. ఫలితాలు వస్తాయి. మొదటి ర్యాంకు రాదు. దాంతో రమణలో ఆందోళన కల్గుతుంది. మా ప్రయత్నం బాగానే చేశాము అనుకుంటారు. చిట్టిబాబు వచ్చి మన అకాడమికి మొదటి ర్యాంకు వచ్చిందని చెప్తాడు. వచ్చిన అబ్యాయిని లక్ష రూపాయాలతో కొన్నారని, మీరు మాత్రం ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పడం వలన అతనికి ర్యాంకు వచ్చిందని ఎవరైన అడుగితే చెప్పాలని చెప్పి పోతాడు. ఉదయం అన్ని దినపత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలతో ఈ వార్త సంచలనం అవుతంది. రమణగారి పేరు మారుమోగుతుంది. భూషణం విద్యాసంస్థలు ప్రముఖ పట్టణాలలో వెలుస్తాయి. పోటీలో నెగ్గాలంటే మొదటిస్థానంలో ఉండాలి. ఎన్ని వక్రమార్గాలైన డబ్బుతో సక్రమం అవుతాయనేది భూషణం ఆలోచనలు. మరో సంవత్సరం ఎమ్సెట్‌లో మొదటి ర్యాంకు కోసం భూషణం లీకైన పేపర్ పట్టుకొస్తాడు.

రాత్రికి రాత్రే వేరే పేపర్లుగా తయారు చేసి, ఈ విషయం పిల్లలకు తెలియకుండా మాదిరి పేపర్లు అని పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాల్లో విద్యార్థుల హవా కొనసాగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విద్యాసంస్థలో చేర్పించాలని పోటీపడుతారు. సీట్లు అయిపోయినవని పేపరు ప్రకటనలు ఇస్తారు. ఇంకా ఒత్తిడి మరిన్నీ డబ్బులు వచ్చిపడుతాయి. ఈ లోపున రమణకు అక్షర జన్మిస్తుంది. ఇల్లు కూడా కట్టుకుంటాడు. అతని ప్యాకేజి మరింత పేరుగుతుంది. భూషణం విద్యాసామ్రాజ్యం విస్తరించటంలో రమణ గారి పాత్ర తక్కువది కాదు. లెక్చరర్ల మానేస్తే ఒకరికొరం చేర్చుకోవద్దని ఒప్పందం చేసుకుంటారు. అందుకని లెక్చరర్ల కప్పగంతులు లేకుండా చేసుకున్నారు. కావాల్సినంత రాజకీయ నాయకుల, అధికారుల అండ లభిస్తుంది.

ఇంజనీరింగ్, మెడికల్ హవా తర్వాత దేశంలోని ఐఐటిల్లో చదవడం మీద క్రేజు పెరిగింది. అందులో సీటు సంపాదించడం అంత సులువైన విధానం కాదు. బట్టీ పద్ధతిలో చదివితే రాదు. విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడు భూషణం గారు ఐఐటి రామయ్య గారి బోధన, కోటలో వెలిసిన కోచింగ్ సెంటర్ల బోధన పరిశీలన చేసి ప్రత్యేక బ్యాచ్‌ను తీసుకుంటాడు. వారిని చదువు పేరుతో రుద్దడమే. మెరిట్ అమ్మాయి భాగ్యలక్ష్మి ఒత్తిడికి తట్టుకోలేక హస్టల్ భవనం మీంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ వార్త కూడా బయటకు రాకుండా మేనేజ్ చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించి వాళ్ళ విద్యాసామ్రాజ్యాన్ని విస్తరిస్తారు. భూషణం కొడుకు అమెరికాలో యం.బి.ఏ. చేసి ఈ విద్యాసంస్థలకు చక్రవర్తి అవుతాడు. శేషారెడ్డి సంస్థల వారసురాలుతో వివాహం జరగడంతో రెండు సంస్థలు ఒకే విధానంలోకి మారిపోతాయి. పాఠశాలలు స్థాపించి ప్రాథమిక విద్య నుండే ధనదాహం తీర్చుకుంటారు. లలిత కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ పాఠశాలకు ప్రిన్సిపాల్ అవుతుంది.

రమణ తన తండ్రి గార్కి కాలేజీ మొత్తం చూపించాలనే కోరిక కలుగుతుంది. అనుకున్నదే తడువుగా ఆయనను వెంటబెట్టుకుని తీసుకపోతాడు. అక్కడి వాతావరణం, ఆ బిల్డింగులను చూసి రకరకాల వ్యాఖాలను చేస్తాడు. అందులో కొన్ని ఇలా ఉంటాయి. ‘చదువు చదువు చదువు తప్ప ఒక వినోదం, ఒక ఆట విడుపు, ఒక విశ్రాంతి, ఒక విహారం ఏమి అక్కర్లేదా? విద్యార్థులు రోబోల్లా మారిపోవాలా…. నూరు పూలు వికసించనీ, వేల ఆలోచనలు సంఘర్షించనీ అంటారు. ఈ రొడ్డ కొట్టుడు చదువుతో ఇంకేం వికసిస్తాయి. ఇంకే సంఘర్షిస్తాయి. వీటిని విద్యాసంస్థలు అనకూడదురా. డబ్బు సంపాదించే ఉపాయాలు నేర్పే కేంద్రాలు అనాలి. ఇంకేదో కొత్త పేరు కనుక్కోవాలి’. తండ్రి మాటలు పాతచింతకాయ పచ్చడిలా అనిపించాయి రమణకు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక కొన్ని మూతపడుతాయి. పని చేస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కవగా ఉంటుంది. మాతృభాషలో బోధన వలన ఉపాధి అవకాశాలు ఉండవని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పించడం మొదలౌతుంది. దాంతో ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులుపడిన పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులను కూడా అమ్ముకొని చదువుల మీద పెట్టుబడి పెడతారు. తల్లిదండ్రుల ఆసలు ఈ విద్యాసంస్థలకు కాసులు కురిపిస్తాయి. ఈ కఠోర విషయాలను చాలా వాస్తవంగా కథలో భాగంగా చిత్రికరించారు రచయిత.

రమణ, లలితల కూతురు అక్షర. చిన్నప్పటి నుండే ఆమె తాతగారైన బ్రహ్మం గారి ఆశయాలను ఆకలింపు చేసుకుంటుంది. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుంటుంది. అన్యాయం తన ముందు జరిగితే తలవంచుకొని పోదు. అందుకే శాంతికి అండగా నిలబడుతుంది. తల్లిదండ్రులు తనకోసం మంచి జీవితం కోసం డాక్టరు కోర్సు చదవాలని పట్టుపట్టిన వినకుండా తన కిష్టమైన ప్రభుత్వ కాలేజీలో సి.ఇ.సి. గ్రూప్‌లో చేరుతుంది. ఆదివారాలు గ్రామాల్లోని పేదపిల్లలు చదువుకోవడం కోసం జరిగే చైతన్యం కార్యక్రమాల్లో పాల్గొంటుంది. సామాన్య పేదప్రజానీకానికి సేవాచేయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది.

కార్పోరేట్ కాలేజీల్లో చదివించి, అమెరికా వంటి దేశాలకు తమ పిల్లలు డాలర్ల కోసం ఎగిరిపోవాలనే తల్లిదండ్రులకు మాదిరిగా నిలిచారు సుగుణ దంపతులు. చిన్నప్పటినుండే డాలర్లు సంపాదించే చదువును చదివించాలని ఇంజనీరింగ్ చదివిస్తారు. కొడుకు రవీంద్రబాబు అమెరికాకు వెళ్ళాక డాలర్లు కూడా పంపుతాడు. పెళ్లి తర్వాత కొడుకు వీళ్ళను పట్టించుకోవడం మానేస్తాడు. మీరు చెప్పినట్టుగానే చదువుకున్నాను నా జీవితం నన్ను బతకనీయండని తల్లిదండ్రులనే దూరం పెట్టుతాడు. తల్లికి ఆరోగ్యం చెడి, చనిపోయిన అంత్యక్రియలకు కూడా రాడు. బతికున్న తండ్రికి దిక్కెవరు? కనీస మానవ విలువలు కూడా పాటించని చదువులను ఏమనాలి? కథలో భాగంగానే వచ్చే ఈ కథనం మనందర్ని ఆలోచింపజేస్తుంది.

సుబ్బరామయ్య కొడుకు లక్ష్మీనరసింహ స్వామి. అతనికి పరుగు పందెమంటే ఇష్టం. ఆటల కాలేజీలో చేరుతాను అంటే తండ్రి వినిపించుకోడు. భూషణం విద్యాసంస్థల్లో చేరి గొప్పవాడివి కావాలని, తన అరెకరం పొలం అమ్మి కాలేజీలో చేర్పిస్తాడు. జైలు లాంటి చోట ఉండకుండా ఒకరోజు అక్కడి నుండి హైదరాబాదు పారిపోయి తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా నిర్మించుకుంటాడు. సినిమా డైరెక్టర్‌గా విజయం సాధించడంతో తన తండ్రికి ఆరెకరాల పొలం కొనిచ్చి తండ్రిలో ఆనందాన్ని చూస్తాడు. ఇల్లాంటి విజయగాథల్ని కూడా ఈ నవలలో చదువుకుంటాము.

విఠల్ విద్యార్థి సంఘ నాయకుడు. వైద్య విద్యార్థి. రమణ గారికి అతనికి జరిగిన సంభాషణ ఆసక్తికరంగా జరుగుంది. వైద్యం ద్వారా మంచిగా డబ్బు కూడా సంపాదింవచ్చునని రమణ గారు అంటే తనకు పేదలకు ఉచితంగా సేవ చేయాలనే ఆశయముందంటాడు. డబ్బు ప్రస్తావన వచ్చిన సందర్భంలో ఇలా అంటాడు. ‘మాస్టారూ! డబ్బు ప్రాణం లేని ఒక వస్తువు. కాని మాట్లాడకుండానే శాసిస్తుంది. చేతులు కదిలించకుండానే మానవ సంబంధాలను చెడగొడుతుంది. కదలకుండానే మనుషుల్ని పరుగులు పెట్టిస్తుంది. తన ఆకర్షణలో పడినవారిని అవినీతి పంకిలంలోకి తోసేస్తుంది. తన మీద వ్యామోహం ఏమైనా చేయిస్తుంది. కత్తులు దూయిస్తుంది. కుత్తుకలు తెగ్గోయిస్తుంది. రక్తం పారిస్తుంది. అలాంటి డబ్బు వెంట, సుఖాలు తప్ప ఆనందం ఇవ్వలేని డబ్బు మూట వెంట పరుగులు పెట్టమంటారా మాస్టారూ? డబ్బు సంస్కృతికి నన్నూ జై కొట్టమంటారా మాస్తారూ?”.

భూషణం విద్యాసంస్థల అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తారు రమణ. ఆయన గారి భావాలకు పూర్తి విరుద్ధమై ఆశయాలతో అక్షర పోరాటం సాగుతుంది. యజమాని భూషణంను ఎదిరించలేక, కూతురు చర్చలను సమర్థించలేక ఆందోళనతో ఉంటాడు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం పేద పిల్లలకు ఉచితంగా చేర్చుకోవాలని ఉంటుంది. అక్షర నాయకత్వంలో భూషణం ఆధ్వర్యంలోని పాఠశాలల్లో అమలు చేయాలని పాఠశాల ముందు బస్తీ వాళ్ళతో కలిసి ధర్నా చేస్తుంది. మొత్తం మీద ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నుండి చేర్చుకోమనే లెటర్‌ను తీసుకుని, ఆధికారులు ఇచ్చిన హామీతో విరమిస్తుంది. ఈ సందర్భంలో ఉత్తరప్రదేశ్‌లో ‘మై స్కూల్ మై వాయిస్’ నినాదంతో పనిచేస్తున్న సమీనాబానో పోరాటాన్ని గూర్చి తెలుసుకుంటాం.

యజమానిని మోసం చేసిన ‘చిట్టిబాబు’ కథ ఆత్మహత్యతో ముగుస్తుంది. అక్షర ఉద్యమంలో చురుగ్గా ఉందని తెలిసి, భూషణం ఎలాంటి ప్రతీకార చర్చలను తీసుకుంటాడోనని రమణలో అర్థం కాని భయం. అక్షర హైదరాబాద్ లోని సెంట్రల్ యునివర్సిటీలో పి.హెచ్.డి.కి ఎంపిక కావడంతో అక్కడకు వెళ్ళుతుంది. ‘కాకతీయా’ అకాడమీ పేరుతో తెలంగాణ, ఆంధ్రవ్యాప్తంగా రాజకీయ నాయకుల అండతో కొత్త విద్యాసంస్థలను నెలకొల్పుతారు. ఆ యజమాన్యం వారు అర్ధరాత్రి రమణ గారి ఇంటికి వచ్చి కోటి రూపాయాల ప్యాకేజీ ఇస్తామని హైదరాబాద్‌కు తీసుకవస్తారు. భార్య లలితకు కూడా కూకట్‌పల్లిలో పనిచేయడానికి ఆఫరిస్తారు. రాజీనామా లేఖను భూషణం గార్కి అందించి రమ్మని రమణ వాళ్ళతో కలిసి వెళ్ళుతాడు. తర్వాత వార్తల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా రమణ సార్‌ను కిడ్నాప్ చేశారని ప్రచారం చేస్తారు.

సెంట్రల్ యునివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య మీద పెద్దఎత్తున విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు. అక్షర చాలా చురుగ్గా పాల్గొంటుంది. అక్షరను కలిసి జరిగిన విషయం చెప్పుతాడు. అమ్మ కూడా వస్తుందని మనం కలిసి ఉండచ్చని అంటాడు.

అతిధిగృహంలోకి వచ్చిన నలుగురు రౌడీలు రమణను బలవంతంగా ఎత్తుకపోతారు. బాగా కొట్టుతారు. సెల్ ఫోనులో ఆదేశాలు ఇస్తున్న భూషణం కంఠాన్ని గుర్తుపట్టుతాడు. ఆగ్రహంగా నాలుకను నరకమనే మాటను వింటారు రమణ. అటుగా వచ్చిన ఒక యువకుడు ఇంట్లో జరుగుతున్న హింసను చూసి మాష్టారును చంపుతున్నారని అరవడంతో, అక్కడున్న ప్రజలు రావడంతో వదిలొపోతారు రౌడీలు. విపరీతమైన దెబ్బలతో అస్పత్రిలో చేర్పిస్తారు. మొత్తం మీద ఆ గండం నుండి బయటపడి మరో జన్మ పొందారు రమణ గారు.

ఇరవైఐదు శాతం విద్యార్థులను భూషణం విద్యాసంస్థల్లో చేర్చుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారిచేస్తుంది. వాటి అమలు కోసం విద్యార్థి సంఘాలు కార్యాచరణకు దిగుతాయి. మొత్తం మీద పేద విద్యార్థులకు ఆ కార్పోరేట్ పాఠశాలల్లో అడ్మిషన్ దొరుకుంది. విద్యార్థి సంఘం విజయం సాధిస్తుంది. ఈ ఊపుతో కార్పోరేట్ విద్యకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సమావేశాలను ఏర్యాటు చేస్తారు. రమణ సార్‌ను కూడా ఆహ్వానిస్తారు. ఆయన పోదామని ఇంటి బయటకు రాగానే భూషణం గారు బొకేతో ఎదురువస్తారు. కోరుకున్న ప్యాకేజీని ఇస్తాను రమ్మని అంటాడు. అప్పుడు రమణ ఇలా అంటారు. ‘ఇదిగో నా నాలుక చూడు దివ్యంగా ఉంది. నీ మెహర్బానీ మాటలూ, ప్యాకేజీలు నా కళ్ళకు సంకెళ్ళు వేయలేవు. నేనిప్పుడు ఆజాదీని. ఇన్నాళ్ళు గాడ్ ఫాదర్ అనుకున్నాను. సొసైటీ డెవిల్‌వీ, స్టేట్ ఎనిమీవీ అని నీకు నువ్వే ఋజువు చేసుకున్నావు. నీ నిజరూపం బట్టబయలైనందుకు నాకు హ్యాపీగా ఉంది’.

ఒక స్పూర్తి, ఒక ఆగ్రహం, ఒక ఆరాధన, ఒక ఆలోచన వంటి అక్షర ఉపన్యాసం సభికులను ఆకట్టుకుంటుంది. ‘పనిలో, గనిలో, కార్ఖానాలో ఉన్న పేద విద్యార్థుల్ని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చడం ద్వారా నిరూపించాం. రోహిత్ వేములకు జరిగగిన అన్యాయం మొత్తం అణగారిన వర్గాలకూ జాతులకూ జరిగిన

ద్రోహంగా మొత్తం దేశం గుర్తించేలా చేశాం. అంతా కదిలి ఏకత్రాటి మీదకు వచ్చేలా చేయగలిగాం. ఇప్పుడు మన బాణాన్ని విద్య ప్రైవేటీకరణ మీద, కార్పొరీకరణ మీద, సర్కారు విద్యా విధానాల మీద, బహుళ జాతి సంస్థల మీద ఎక్కుపెట్టాం. విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలని, కాషాయీకరణని ఆపాలని, విద్యా బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మనది పీల గొంతు కావచ్చు. రేపు దేశం నలుమూలల్నుంచీ ఎన్నో గొంతులొచ్చి కలుస్తాయి. అప్పుడది ప్రచండ ఘోషగా మారుతుంది. ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి తీరుతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమిద్దాం. అంతిమ విజయం మనదే. యువశక్తిదే!’ వారి అడుగుజాడల్లో వెంకటరమణగారు పిడికిలి బిగించి చేరటంతో నవల ముగుస్తుంది.

ఈ నవలకు ముందుమాట రాసిన ప్రముఖ రచయిత్రి ఓల్గా గారు తన మాటలో ఇలా అంటారు. ‘ఎవరైనా అంతరాత్మ, డబ్బు రెండు ఉన్నవారు ఈ పుస్తకాన్ని ఒక లక్ష కాపీలు ముద్రించి కార్పోరేట్ కాలేజీల దగ్గర పిల్లలకూ, వారి తల్లిదండ్రులకూ పంచి పెడితే బాగుండుననిపిస్తుంది.’. మంచి సూచన చేశారు. మార్పును ఆశించే వారంతా చదవాల్సిన ఒక మంచి పుస్తకమిది. ‘జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య’ అన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి స్పూర్తితో, వర్తమాన కార్పోరేట్ విద్యా మాఫియా మీద ఉద్యమించడానికి ఈ నవలందించిన ప్రేరణతో యువత ముందడుగేయాలి. సమరశీలమైన సృజనను సమాజానికి అందించిన సింహప్రసాద్ గారు అభినందనీయులు.

***

ధిక్కారం (నవల)

రచన: సింహప్రసాద్

పేజీలు: 216

వెల:120/-

ప్రతులకు: పాలపిట్ట బుక్స్,

16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ,

సలీమ్ నగర్, మలక్‌పేట్, హైదరబాద్-500036, చరవాణి: 9848787284

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here