[dropcap]ఈ[/dropcap] మధ్య కాలంలో నేను చదివిన బాల సాహిత్యంలో నాకు నచ్చిన పుస్తకం ‘కొండలలో వింతలు’.
ఆంగ్లంలో ‘Magic in the Mountains’ అనే పేరుతో నిమి కురియన్ వ్రాసిన పిల్లల నవలకి ఇది తెలుగు అనువాదం. కొల్లూరి సోమ శంకర్ తెలుగులో అందించారు.
అనువదించిన పుస్తకంలా అనిపించని ఈ బాలల నవల చదువుతుంటే ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. పిల్లలనే కాదు పెద్దలను కూడా ఆసక్తిగా చదివించే ఈ పుస్తకం నుంచి పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
***
తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు అక్కాతమ్ముళ్ళ చుట్టూ ఈ కథ నడుస్తుంది. వారు తమ ఊరి నుండి కున్నూరులో ఉండే వాళ్ళ పిన్ని దగ్గరకు వచ్చేయడం, అక్కడి పరిసరాలకు, పరిస్థితులకు అలవాటు పడడం పాఠకులకు కుతూహలం కలిగిస్తుంది.
తోటలో వాళ్ళకి ఒక పిల్లి పిల్ల కనబడడం, వాళ్ళు ఉత్సాహంగా దాన్ని అనుసరించి వెళితే, అక్కడ తోపులో సంజనా బెనర్జీ అనే ఓ మహిళ కలిసి వాళ్ళకి జరగబోయే సంఘటనలు సూచించి, వాళ్ళను హెచ్చరించడం ఉత్సుకత కలిగిస్తుంది.
ఒక టైలర్ షాపులో కలిసిన మేడమ్ లదీదా అనే ఆవిడ ఈ పిల్లలపై అకారణంగా కోపగించుకుని, అనవసరంగా అరిచి, వాళ్ళను తనతో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది.
పిల్లలు ఊర్లోని ఒక బేకరీ యజమానితో పరిచయం పెంచుకుంటారు. ఆయన తన సైకిలు కనబడకుండా పోవడం గురించి చెప్తే, పిల్లలిద్దరూ చాలా తెలివిగా ఆయన సైకిల్‍ని తీసుకెళ్ళి వాడుకుంటున్నదెవరో కనుక్కుంటారు.
***
అనుకోని ప్రమాదం ఎదురవుతుంది వాళ్ళకో రోజు.
పిల్లి పిల్ల అరుపులకి అర్ధరాత్రి తమ గదిలోంచి బయటకు వస్తే ఓ ఎర్ర తివాచీ వాళ్ళని ఎత్తుకుపోయి, ఓ పాడుపడిన బావిలో దించుతుంది. అక్కడ్నించి ఓ మాట్లాడే పాము వాళ్ళని ఓ ఇంట్లోకి తీసుకెళ్ళడం ఆశ్చర్యం, భీతి కలిగిస్తాయి. ఇవి పాతకాలపు చందమామ కథల్లో రాజకుమారుడికి ఎదురయ్యే మాయల్లా, విఠలాచార్య సినిమాలోని సంఘటనల్లా అనిపిస్తాయి. అక్కడ ఆ పాము వాళ్ళకి చూపించిన సినిమా వాళ్ళకి భయం కలిగిస్తుంది.
అది మేడమ్ లదీదా ఇల్లనీ తెలుసుకుంటారు పిల్లలు. అక్కడ తన స్ఫటికం తనకివ్వమని లదీదా పిల్లలని అడుగుతుంది. తమకే స్ఫటికం గురించి తెలియదంటారు పిల్లలు. వాళ్ళకి ఓ వారం గడువిచ్చి, ఇంటికి పంపేస్తుంది లదీదా.
పిల్లల పిన్ని ఇంట్లో దొంగలుపడి ఆ స్ఫటికాల గురించి వెతుకుతారు. వాళ్ళకి అవి దొరకకపోవడంతో స్టోర్ రూమ్ అంతా చిందరవందర చేసి పోతారు.
మేడమ్ లదీదా, తన స్నేహితుడితో కలిసి పిల్లల పిన్నిని కిడ్నాప్ చేయిస్తుంది. పిల్లలు బేకరి యజమాని సాయంతో ప్రొఫెసర్ వరదాచారిని కలుస్తారు.
ఆ స్ఫటికాల గొప్పతనమేమిటో, వాటి అసలు యజమానులు ఎవరో పిల్లలకి బేకరి యజమాని చెబుతారు. ఆ స్ఫటికాలు ఓ ప్రాచీన తెగకు చెందినవని, బ్రిటీషు వారు వారి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో – తెగవారు అంతా చెల్లాచెదురైపోతున్నప్పుడు భద్రపరచమని ముగ్గురు వ్యక్తులకి ఒక్కో స్ఫటికం ఇస్తారు. ఆ మూడు స్ఫటికాలను ఒక చోట చేరుస్తే అద్భుత శక్తులొస్తాయని భావించే లదీదా కుట్రలు పన్నుతుంది.
పిల్లలు, వరదాచారి ఇంకా బేకరీ యజమాని కలిసి వెతుకుతూ, పిల్లల పిన్ని బందీగా ఉన్న ఇంటిని గుర్తిస్తారు. పిన్నిని విడిపించడం, నేరస్థులని పోలీసులకు పట్టించడం అంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది.
సంజనా బెనర్జీ, మేడమ్ లదీదాల మధ్య సంబంధం చివరిదాకా తెలియకపోవడం కథలో ట్విస్ట్! మాయా ఎర్ర తివాచీ, మాట్లాడే పాము ఇంద్రజాలం అని తెలుస్తుంది.
చివర్లో విలువైన ఆ స్ఫటికాలన్నీ అసలు హక్కుదారులైన ఆ ప్రాచీన తెగకి చెందిన వ్యక్తికే దక్కుతాయి.
ఈ నవల ద్వారా పిల్లలు పర్యావరణం కాపాడుకోడం గురించి, ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా తెలివిగా నడుచుకోవడం గురించి నేర్చుకుంటారు.
అనువాదకుడి శైలి మనల్ని ఈ కథలోని ఒక పాత్రలా చేసి మనం కూడా అక్కడ ఉన్నట్టు, ఆ యా సంఘటనలలో భాగస్వాములయినట్టు అనిపించేలా సాగింది.
***
కొండలలో వింతలు (పిల్లల నవల)
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
పేజీలు: 112, వెల: ₹70.00
ప్రచురణ, ప్రతులకు:
మంచి పుస్తకం
ఇంటి నెం. 12-13-439,
1వ వీధి, తార్నాక, సికింద్రాబాదు- 500 017,
ఫోన్: 94907 46614
info@manchipustakam.in
ఆన్‌లైన్‌లో తెప్పించుకునేందుకు