వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-40

2
4

[dropcap]వేం[/draopcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. ప్రాణ స్నేహితుడు

“సురేంద్రా, సాయంత్రం ఆరు గంటలకు ఓసారి పార్కుకు రాగలవా, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి” మిత్రుడికి కాల్ చేసి చెప్పాడు మధు.

“వస్తానుగానీ, దేని గురించి మాట్లాడాలి?” అడిగాడు సురేంద్ర.

“నిన్ను ఓ సాయం అడిగితే చేస్తావేమోనని” చెప్పాడు మధు.

“సాయం అని మెల్లగా అడుగుతావెందుకు, నువ్వు చిన్నప్పటినుండీ నా ప్రాణ స్నేహితుడివి, ఏం అడిగినా కాదనకుండా తప్పకుండా చేస్తా కదా, దానికి అనుమానమెందుకు?, సాయంత్రం పార్కులో కలుద్దాంలే” అన్నాడు సురేంద్ర.

సాయంత్రం… పార్కులో….

“చెప్పు మధూ, ఏదో సాయం అన్నావ్, ఇంతకీ అమ్మా, నాన్న ఎలా వున్నారు?” మధును ప్రశ్నించాడు సురేంద్ర.

“నాన్నకు రాత్రి పక్షవాతం వచ్చింది, హాస్పిటల్‌లో జాయిన్ చేయించా” బాధగా చెప్పాడు మధు.

“అయ్యో, అలాగా, అయినా అంకుల్‌కు సిగరెట్, మందు త్రాగే అలవాటు కూడా లేదే?ఎందుకు వచ్చిందబ్బా” ఆత్రుతగా అన్నాడు సురేంద్ర.

“ఎన్నేళ్ళు గడిచినా మా చెల్లికి పెళ్ళి చేయలేనేమోననే ఆందోళన, బాధతో ఈమధ్య మరీ తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఈ ముప్పు తెచ్చుకున్నాడు, ఇప్పుడు దాని గురించే నీతో మాట్లాడాలని రమ్మన్నా” జవాబిచ్చాడు మధు.

“ఏమైనా డబ్బు సాయం కావాలా?”అడిగాడు మధు.

“అది కాదు, నీకు మా కుటుంబం గురించి చాలా బాగా తెలుసు, మాకు కులాల పట్టింపులు అస్సలు లేవు, నీకు ఎలాగూ క్రితం నెలలో జాబ్ వచ్చింది కదా, మా చెల్లిని నువ్వు పెళ్ళి చేసుకుంటావేమో అడుగుదామని”అన్నాడు మధు.

“ఏమాత్రం కట్నం ఇవ్వగలరేమిటి?” అడిగాడు సురేంద్ర.

“తగిన డబ్బు లేకనే, కట్నం ఇచ్చుకోలేకనే కదా ఇన్నాళ్ళూ మా నాన్న మా చెల్లికి పెళ్ళి చేయలేనిది” చెప్పాడు మధు.

“కానీ మధూ, మా నాన్నకు అమ్మకు కులాల పట్టింపులు వున్నాయ్, పైగా నా జాబ్ చూసి ఎవరైనా ఇచ్చే మంచి కట్నంతోనే మా చెల్లి పెళ్ళి చేయాలనుకుంటున్నాడు మా నాన్న, మరేం అనుకోకు” చెప్పాడు ‘ప్రాణ స్నేహితుడు’ మధు.

2. సందేహం

“రజనీ, పిల్లాడు ఇంట్లో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు?” మధ్యాహ్నం సమయంలో ఇంటికి రాగానే కొడుకు గురించి భార్యను అడిగాడు దేవేంద్ర.

“స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి గ్రౌండుకు వెళ్ళాడండీ” జవాబిచ్చింది రజని భర్తకు.

“వెళ్ళి ఎంతసేపయ్యింది?” మళ్ళీ అడిగాడు దేవేంద్ర భార్యను.

“ఉదయం పదింటికి మీరు అటు వెళ్ళగానే తను కూడా వెళ్ళాడండీ” చెప్పిందామె.

“ఇప్పుడు సమయం రెండు గంటలు కావస్తోంది, ఎక్కడ ఏ పొరంబోకు పనులు చేస్తున్నాడో, రానీ వెధవను, నాలుగు తగిలిస్తేగానీ బుద్ధి రాదు” కోపంగా అన్నాడు దేవేంద్ర.

మరో పావు గంట తర్వాత…..

“ఎక్కడకు వెళ్ళావురా వెధవా ఇంతసేపు? “

పదేళ్ళ కొడుకు మెల్లగా ఇంట్లోకి రావడం గమనించిన దేవేంద్ర కొడుకును నిలదీశాడు.

“మరే నాన్నా, నా ఫ్రెండ్సంతా క్రికెట్ ఆడుదాం రమ్మని పిలిస్తే గ్రౌండుకు రమ్మని పిలిస్తే వెళ్ళివుంటి” వినబడీ వినబడనట్లు సమాధానమిచ్చాడు ప్రవీణ్ తండ్రికి.

“ఇవాళ ఆదివారం కదా, కాస్తంత సేపు న్యూస్ పేపర్ చదువుకోరాదా, లోకజ్ఞానం అయినా తెలుస్తుంది” చెప్పాడు దేవేంద్ర కొడుక్కి ఆరోజు దినపత్రిక అందిస్తూ.

“సరే నాన్నా” అంటూ పేపర్ అందుకున్నాడు ప్రవీణ్.

“ఏమిట్రా అది?”ప్రశ్నించాడు దేవేంద్ర కొడుకు వంక సందేహంగా చూస్తూ.

“ఏ.సి.బి. వాళ్ళంటే తప్పు చేసిన అవినీతి ఉద్యోగులను అరెస్ట్ చేసే గవర్నమెంట్ పోలీసులు కదా” అడిగాడు ప్రవీణ్ తండ్రిని.

“వాళ్ళు చేపలు పట్టరు కదా?”మరో ప్రశ్న వేశాడు ప్రవీణ్.

“పట్టరు” బదులిచ్చాడు దేవేంద్ర.

“మరయితే ఈ పేపర్‌లో ‘ఏ.సి.బి.అధికారులు విసిరిన వలకు చిక్కిన అవినీతి చేపలు’ అని వుందేంటి?” కొడుకు అడిగిన డవుటనుమానానికి నోరు వెళ్ళబెట్టక తప్పలేదు దేవేంద్రకు.

3. స్వర్గం-నరకం

‘పదో తరగతి పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ మహతీకృష్ణ’ ఆ రోజున రాష్ట్రంలోని పత్రికలన్నీ ఈ వార్తను ప్రముఖంగా బ్యానర్లు కట్టాయి.

“కన్నా, ఈ క్షణం కోసమేరా, ఇన్నాళ్ళూ నేను ఎదురుచూసింది, నీ పేరు, ఫోటో పత్రికల్లో, టీవీల్లో చూస్తుంటే ‘స్వర్గంలో’ తేలియాడినట్లుంది” ఉద్విగ్నంగా చెప్పాడు తండ్రి.

“కానీ నాన్నా, నువ్వు కోరుకున్న ఈ క్షణం కోసం నేను ఇంటికి వందల మైళ్ళదూరంగా వుండి నిత్యం నిద్రాహారాలు సరిగ్గా లేక, నా అందమైన బాల్యాన్ని పోగొట్టుకుని తీవ్ర ఒత్తిడులతో ఈ పదేళ్ళూ ఎంత ‘నరకయాతన’ అనుభవించానో నీకేం తెలుసు” కళ్ళల్లో నీళ్ళు ఉబుకుతుండగా తన బాధకు మనసులోనే పీక నొక్కేశాడు మహతీకృష్ణ.

4. సమాధానం

“సంజూ, వచ్చే వారమే నీకు ఆపరేషన్” నెల క్రితం రోడ్డు ప్రమాదంలో రెండు కళ్ళకు చూపు పూర్తిగా కోల్పోయిన కూతురితో చెప్పింది తల్లి.

“వద్దమ్మా ప్లీజ్, నేను ఇలాగే వుంటా” అంది పన్నెండేళ్ళ కూతురు గాభరాగా.

“ఎందుకే, అలా అంటున్నావు?”తల్లి ప్రశ్నలో ఆందోళన.

“దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట అమ్మాయిలపై, ఆడవాళ్ళపై జరుగుతున్న పాశవిక దాడుల వార్తల్ని పత్రికల్లో, టీవీల్లో చూసి కుమిలిపోవడం కంటే ఇలాగే చాలా బాగుంది నాకు” తల్లికి కూతురి సమాధానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here