[box type=’note’ fontsize=’16’] ‘ట్విన్ సిటీస్ సింగర్స్’ శీర్షికన – “అలనాటి రాణి నించి ఈ నాటి శ్రేయ ఘోషల్ పాటల వరకు – తెలుగు హిందీ పాటలను అవలీలగా పాడగలను..” అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న సుజాత పట్టస్వామి గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. ఇది క్రిందటి వారం తరువాయి. [/box]
***
♣ మీ అభిమాన గాయని మణులెవరు?
* నేనెక్కువగా సుశీలమ్మ, జానకమ్మ పాటలు పాడుతుంటాను. జానకి గారి పాటలంటే తెగ మక్కువ. అయితే నా స్వరానికి గాయనీ మణులందరి గాత్రాలు ఒదుగుతాయని పలువురు ప్రశంసిస్తుంటారు. కాబట్టి, అన్నీ పాడతాను.
♣ లేటెస్ట్ సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్ కూడా పాడగలరా?
* ఆహా! అలనాటి రాణి, భానుమతి, ఎస్.వరలక్ష్మి, జమునా రాణి, గారి పాటల దగ్గర్నించీ, ఇటు హిందీలో శంషాద్ బేగం నించి శ్రియా ఘోషల్ వరకు.. అలనాటి మా ఇల్లు చిత్రం నించి ఈ నాటి బాహుబలి వంటి లేటెస్ట్ సినిమా గీతాలన్నీ ప్రాక్టీస్ లో వున్నాయి. స్టేజ్ మీద ఎవరు ఏ పాట కోరినా వెంటనే పాడగలను.
♣ ఓ మెరుపైన జ్ఞాపకం వుందన్నారు ఇందాక మాటల్లో?
* అవునండి. ఒక సారి నేనొక్క దాన్నే సోలో పెర్ఫామన్స్ ఇవ్వాల్సిల్సివచ్చింది. డాక్టర్స్‌కి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ సత్కార సభని తలపెట్టారు. ఆ కార్యక్రమం ఉదయం పది నించి మధ్యాన్నం 3 గం వరకు. నా పాటలు ఓ అరగంట ప్రోగ్రాం అనుకున్నారు. సన్మాన గ్రహీతలందరూ విచ్చేసారు. ముఖ్య అతిథిగా మేయర్ శ్రీ రామ్మోహన్ గారు.. వారు మెహబూబ్‌నగర్‌లో హెల్డప్ అవడంతో అతిథులని, ప్రేక్షకులని పాటలతో అలరించి ఆకట్టుకోవాల్సిన బాధ్యత నా మీదుంచారు పెద్దలు. ఓ అరగంట అనుకున్న ప్రోగ్రాం.. రెండున్నర గంటలు మూడున్నర గంటలు అయింది. నేను నా పాటల్లో లీనమై పోయాను. పాట పాటకి చప్పట్లు మోగాయీ. అలుపన్నదే లేదు. నేను ఏకధాటిగా మూడున్నర గంటలు పాడాను అంటే ఇప్పటికి వండర్‌గా వుంటుంది. ఈ సంఘటన తలపుకొచ్చినప్పుడలాను! అంతా ఆ తల్లి కృప!
♣సిని విభావరీలు నిర్వహించాలంటే.. ఖర్చుతో కూడిన పని అంటుంటారు?
* అవునండి. అందులో సందేహం లేదు. ప్రోగ్రామ్ చేయడం అంటే మాటలు కాదు. అంతా డబ్బుతో కూడుకునే వుంటుంది. స్పాన్సరర్స్ వున్నా, మిగిలే మాట పక్కన పెట్టి, మన చేతి నించి డబ్బు పడకుండా వుంటే చాలు..అదే పది వేలు అనిపిస్తుంది. అదీ కాకుండా, ఎవరైనా ఓ పైసా మన కార్యక్రమానికి ఇవ్వాలి అంటే.. క్వాలిటీ వుండాలనేది మరచిపోకూడదు. స్పాన్సరర్స్ తోడైతే ప్రొఫెషనల్ సింగర్స్‌తో, లైవ్ ఇచ్చి, లైవ్లీగా లవ్లీగా ప్రెజెంట్ చేయాలన్న తపన సదుద్దేశం నిర్వహకులకి వుండాలి. అప్పుడే స్పాన్సర్షిప్ దొరుకుతుంది. నేను ఏదో ఆశించి ప్రోగ్రాం తలపెట్టాను. తలపెట్టాకే, నాకు స్పాన్సర్షిప్ దొరుకుతుంది. అది చిన్న కార్యక్రమమో, పెద్ద కార్యక్రమమో.. ఏదైనా సరే.. మెరుగైన సినీ సంగీతాన్ని ముందుగానే డిజైన్ చేస్తాను. బహుశా! అదే – సుజారమణ సక్సెస్ వెనక దాగిన రహస్యం అనుకుంటాను.
♣ అయితే, సీనియర్ సింగర్స్ వుంటే ప్రోగ్రామ్ సక్సెస్ అనుకోవచ్చా?
* అది కొంత వరకు నిజమే అయినా, టాలెంటెడ్, ఔత్సాహిక గాయనీ గాయకులతో కూడా హిట్ ప్రోగ్రాం చేయొచ్చు. పాత కెరటాలు ధృఢమైనవే.. కానీ కొత్త కెరటాలూ మెరుపైనవే.. రెండూ కలిస్తే.. ఆ అందమే వేరు. నేనెప్పుడూ కొత్త వారితో పాడించడంలో ఏ మాత్రం వెనకడుగేయను.
♣ మీరింత చలాకీగా, ఉత్సాహంగా ప్రోగ్రామ్స్ చేయడం వెనక గల స్ఫూర్తి?
* అసలు విషయాన్ని గట్టిగా చెప్పాలి అంటే.. ప్రతి మగాని విజయం వెనక ఒక స్త్రీ వున్నట్టే, నా విజయం వెనక మా వారి పూర్తి సహాయ సహకారులున్నాయని ఎంతో గర్వంగా చెబుతాను. వారు లేనిది నేను లేను. వారి ప్రోత్సాహం, ప్రోద్బలాలు లేకపోతే.. ఈ నాటి ఈ సింగర్ సుజాతా లేదు, సుజారమణ అకాడెమీ వుండేది కాదు.
♣ మీ వారికి అభినందనలు. మీ భవిష్యత్తు కార్యక్రమాలేమిటి, ఏమనుకుంటున్నారు?
* భవిష్యత్తు ప్రణాళికలు అంటే, జనరంజకమైన కార్యక్రమాలను చేయాలని, నూతన గాయనీ గాయకులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని వుంది. బీద విద్యర్ధులకు, కళాకారులకు వృధ్ధాప్యంలో వున్న నిస్సహాయులకు అర్ధిక సహాయం అందించాలనే ఆర్తి వుంది నాలో. శాస్త్రీయ సంగీతం సంగీతం పట్ల మక్కువ గల వారికి ఉచిత తర్ఫీదు ఇవ్వాలనే అభిలాష మెండుగా వుంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే, ఆచరణలోకి తీసుకు వస్తాను.
♣ మీ కెరీర్ మీకు తృప్తి నిస్తోందా?
* తృప్తికరంగానే వుందండి. వంశీ, కిన్నెర, యువకళా వాహిని లాంటి మెగా సంస్థలలో పాడి పలువురి సినీ ప్రముఖుల ప్రశంసల అందుకుని, శెభాష్ అనిపించుకున్నాను. ఇంతకు మించి అదృష్టం ఏం కావాలి అనిపిస్తుంది. మనసు తృప్తిగా వుంది.
ఈ గొప్ప తనం నాది కాదు. ఇలాటి మహాద్భుత అవకాశాలను నాకిచ్చి ప్రోత్సహించిన సాంస్కృతిక సంస్థల అధినేతలకే ఈ ఘనత అంతా చెందుతుంది.
♣ మీ విజయాల గురించి చెప్పండి?
* 2016 ఒరిస్సా, కటక్‌లో ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ 24వ యానివర్సరీ సందర్భంగా ‘వోకల్ కాంపిటేషన్’ లో పాల్గొని, ఎక్సెలెంట్ పెర్ఫార్మెన్స్‌గా సర్టిఫికేట్‌తో బాటు, ప్రశంసలను, సత్కారాన్ని అందుకోవడం నా సంగీత ప్రయాణం లో నేను మరచిపోలేని సన్నివేశం.
* తిరుపతిలో మహతి ఆడిటోరియంలో శ్రీ వై.ఎస్.రామకృష్ణ గారు నిర్వహించిన సిని విభావరీలలో రెండు సార్లు ప్రోగ్రామ్స్‌లో పాల్గొని, అప్పటి చైర్మన్, గౌరవనీయులు శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా మెమెంటోని అందుకోవడం, వేదిక మీద మరో ప్రముఖురాలు, సంగీత విదుషీమణి శ్రీమతి ద్వారం లక్ష్మి గారి చేత సత్కరించబడటం.. ఆ ఆనంద పరవశపు క్షణాలు మరపురావు.
* సభలో ముందు సీట్లో అసీనులైన ఈ ప్రముఖుల ముందు స్టేజ్ మీద పాడటం, మెప్పించడం అంటే అప్పటి ఉద్వేగ క్షణాలు ఎప్పుడు తలచుకున్నా కొత్త అనుభూతిని కలిగిస్తుంటాయి.
* ఏ.వి.కాలేజ్ లో జరిగిన ఎల్డర్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి కార్యక్రమంలో పాల్గొని, ప్రముఖుల ప్రశంసలను అందుకోవడం ఓ దివ్యానుభూతిని కలిగించింది.
* ఆంధ్రప్రదేశ్ దేవాదాయా శాఖామాత్యులు, ఎమ్మెల్యే గారు ఇంకా నగర ప్రముఖులు విచ్చేయడం ఆనాటి నా కార్యక్రమ ప్రత్యేక విశేషాలుగా చెప్పాలి.
* నాలుగు గంటలు నిరాఘటంగా, నిరాటంకంగా ఒక్క దాన్నీ, వేదిక మీద పాడిన ఓ కార్యక్రమం ఓ మైలు రాయి వంటిది.
* ఏడుగురి సినీ గాయనీమణుల గళ హార గానాలను నేనొక్కదాన్నే ఆలపించిన ఆ ప్రోగ్రామ్ నా గాన ప్రస్థానంలో ఓ కలికితురాయి వంటిది.
* భద్రాచలంలో ఐటీసీ వారి పెద్ద ఈవెంట్ చేసాం. తెలుగు హిందీ హిట్స్ ప్రోగ్రాం చేసాం. గ్రాండ్ సక్సస్ అయింది. కిక్కిరిసిన ప్రేక్షకులే మాకు ఓ గొప్ప సక్సెస్ సింబల్. మన హైదరాబాద్ నించి పెద్ద టీం తీసుకెళ్ళాను.
* అలానే భద్రాచలం రాములవారి సన్నిధిలో తనివి దీరా రాముని కీర్తనలు గానించిన భక్తి గీతాల కార్యక్రమం.
* ధర్మవరం, భీమవరం మావూళ్ళమ్మ జాతర లో పాల్గొన్న కార్యక్రమం..
* ఈ ఏడాది జనవరి 2020 లో.. నా సంస్థ తరఫున ఓ భారీ యెత్తు కార్యక్రమం విజయవాడలో చేయడం జరిగింది. నలభై సంవత్సరాలుగా కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా, సాగిస్తూ పేరు పొందిన శ్రీ శారదా కళా సమితి విజయవాడ వాళ్ళతో కలిసి నిర్వహించిన ఈ భారీ కార్యక్రమం నా సంస్థకి గొప్ప పేరుని తెచ్చిపెట్టింది.
* మియాపూర్‌లో మా చేతుల మీదుగా ‘ కళామాధురి..’ ఓ కళా సంస్థని ప్రారంభ ఆవిష్కరణ జరిగింది.
* సినీ నటి శ్రీమతి జమున గారితో కలిసి ప్రయాణించడం, ఒకే రూంని కలిసి పంచుకోవడం, అనేకానేక సినిమా సంగతులు, అనుభవాలు, విశేషాలు పంచుకోవడం, ఓ మరపు రాని అనుభవం. అలా వారికి నేను సన్నిహితురాలినైనందుకు ఆనందంగా వుంది.
* ఈ నెలలో వంశీ రామరాజు గారి ఆధ్వర్యంలో వంశీ ఇంటర్నేషనల్ వారు అంతర్జాతీయ స్థాయీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొప్ప విశేషం ఏమిటంటే.. విభావరిలో పన్నెండు దేశాలనించి గాయనీ గాయకులు పాల్గొనడం జరిగింది. అందులో నేనూ పాల్గొనే అరుదైన అవకాశం దొరకడం నా అదృష్టం!
* అలానే, మరో సారి – ఎనిమిది దేశాలనించి పాల్గొన్న గాయనీ గాయకులతో వేదికని పంచుకున్నాను.
* మా సుజా రమణ అకాడెమీ – వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అవార్డ్స్ ఇచ్చి, ఆ మేధావులను గౌరవ పూర్వకంగా సత్కరించి సన్మానించుకోవడం జరిగింది. దానిలో భాగంగా – డి రామానాయుడు గారి అవార్డ్ విజయ కుమార్ గారికి, రామలక్ష్మి గారికి, మార్చ్ 8 న సుంకరపల్లి శైలజ గారిని, అలానే.. ఫిల్మ్ జర్నలిజంలో పితామహులు అయిన శ్రీ ఇంటూరి వెంకటేశ్వర రావు గారి పేరు మీద అవార్డ్‌ని అపోలో హాస్పిటల్స్ అధినేత శ్రీ శ్రీనివాసులు గారికి ఇవ్వడం జరిగింది.
* 2018 లో – సప్తస్వర మాలిక సంస్థ వ్యవస్థాపకులైన శ్రీ మురళీధర్ గారు అపర పి బీ శ్రీనివాస్ గా వాసికెక్కిన గాయకులు వారు! వారి కొలాబెరేషన్ లో మా పాటలు చాలా హిట్ అయ్యాయి. నా కార్యక్రమాలలో ఆ గాయకుని పాత్ర ఓ ప్రత్యేకం. అలానే వారి సంస్థలో నా పార్టిసిపేషన్ తప్పని సరి అన్నట్టుగా మా ప్రయాణం సాగుతోంది.
* యు.కె.లో బర్మింగ్‌హాంలో మన వాళ్ళు నిర్వహించిన శ్రీరామ నవమి ఉత్సవాలలో.. మహామహులైన విద్యా వేత్తలు, జ్ఞాన పండితులు కొలువైన ఆ సభలో.. వేదిక మీద రెండు సంవత్సరాలు వరసగా రెండు సార్లు.. రామదాసు కీర్తనలు ఆలపించడం.. నిజంగా మరపురాని సంఘటనగా పేర్కొనాలి. అలానే, ఆస్ట్రేలియా సిడ్నీ లో కూడా ప్రదర్శనలివ్వడం జరిగింది.
♣ సాధక బాధకాలు ఏవైనా వున్నాయా?
* స్పాన్సర్ షిప్ లేక అవస్థలు పడుతున్నాం. ఇది నా ఒక్కరి బాధే కాదు. అన్ని కళా సంస్థల వారిదీనూ. పర్సనల్ సేవింగ్స్ కూడా కరిగించి కార్యక్రమాలు చేయడం అవుతోంది.
కరోనా అంతరించి, గొప్ప కాలమొకటి ఉద్భవిస్తుంది. అప్పుడు ప్రోగ్రామ్స్ చేయడం ఎలా అనే ప్రశ్న ఉదయిస్తుంది. చేతి డబ్బులు పెట్టడం కష్టతరం..
ఆర్కెస్ట్రా పెట్టి విభావరీలు చేయాలంటే అదనంగా మరో పదీ పదిహేను వేలౌతుంది. ఎంత వరకు భరించగలం? ఆ కళాకారులనెలా ఆదుకోగలం? నా ఆవేదనకి జవాబు దొరకడం లేదు. ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోతోంది. ఈ వేదన నాకు మాత్రమే పరిమితం కాదండి.. అన్ని అసోసియేషన్స్ వారిదీనూ. వ్యక్తిగతంగా చెప్పాలీ అంటే నాకు ఆర్కెస్ట్రా లైవ్ ప్రోగ్రాం అంటే అమితమైన ఇష్టం. కానీ చిన్న చిన్న సంస్థలకి ఈ వ్యయం మోయలేని భారమౌతోంది.. అందని చందమామ చందమే అవుతోంది.
♣ ఆన్ లైన్ మాగజైన్స్ చదువుతారా?
* అన్నీ కాదు కానీ, ‘సంచిక’తో నాకు పరిచయం వుంది. నా సహ గాయనీ గాయకుల ఇంటర్వ్యూలని చూస్తుంటాను. చదువుంటాను. పాఠకాభిరుచులకు అద్దం పడుతున్న మాగజైన్! చాలా బావుంటోంది. ‘సంచిక’లో నా ఇంటర్వ్యూ రావడం ఎంతో ఆనందంగా వుంది. పత్రిక సంపాదకులకు, మీకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
♣ థాంక్సండి. నమస్తే.
* మీకూ, ప్రియమైన పాఠకులకు నా వినమ్రపూర్వక నమస్సులు.
***
Songs links
1, kotta gaa reku vichchena.. in 4K-Kothaga Rekkalochena_Suja Ramana Cultural Academy 20-6-2018
2, mayadari..chinnodu
17 Mayadari Chinodu_ SujaRamana Cultural Academy 22–11-2017
3,. in 4K – GROUP SONG _Mera Karma Tu- Suja Ramana Cultural Academy 20-6-2018
4. tolisari mimmulni choosindi modalu_ SujaRamana Cultural Academy 9-1-2018
5. Suja Ramana Cultural Academy || Online Sangeetha Vibhavari Session 1 || Live || trinet Live TV
6. 23 Himagiri sogasulu_ SujaRamana Cultural Academy 22–11-2017