కాజాల్లాంటి బాజాలు-62: పాపం యాజులుబాబాయి..

2
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంోభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]యా[/dropcap]జులుగారని మాకు బాబాయి వరసయే వారొకరుండేవారు. ఆ రోజుల్లో అంటే డెభ్భైలు యెనభైల్లో ఆయన మంచి వయసులో వుండేవారు. అన్నింట్లోనూ మహా ఉత్సాహంగా వుండేవారు. ఆడపనీ, మగపనీ అనికాని, పనివాడు చేసేదీ, యజమాని చేసేదీ అనికానీ ఆయనకేమీ పట్టేదికాదు. ప్రతీపనీ చేసేస్తాననేవారు. ఒకవేళ రాకపోతే నేర్చుకుని మరీ చేసేస్తాననేవారు. అలాగే కొన్ని తెలీని పనులు నేర్చుకున్నారు కూడానూ..

ఊళ్ళలో ఎవరింట్లోవాళ్ళు విడివిడిగా వండుకుంటున్నాకూడా అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ల మధ్య యిళ్ళల్లో ఈ ఇంటి కూర ఆ యింటికీ, ఆ యింటి పచ్చడి ఈ యింటికీ వెడుతూనే వుండేవి.

వేసంకాలం వచ్చేసరికి పనసకాయలు వచ్చేవి. పనసకాయ పొట్టు కొట్టడం ఒక కళ. కూరకోసం పనసపొట్టు అంతా పెసరబద్దల్లా ఒకేలాగ వుండేలా కొట్టడమంటే మాటలు కాదు. దానికి చాలా పట్టుదల, ఏకాగ్రత వుండాలి. అందులో మా యాజులుబాబాయి నిష్ణాతుడు. పనసకాయలకాలం వచ్చిందంటే ఇంక బాబాయికి చేతినిండా పనే. ప్రతిరోజూ ఎవరో ఒకరి చెట్టుకాయ బాబాయిని వెతుక్కుంటూ వచ్చేసేది. ఇంకంతే. మా బాబాయి పరవశించిపోయేవాడు. అదేదో పెద్ద యజ్ఞమన్నట్టు చేసేవాడు. పెరటి అరుగుమీద ఒక గోనెపట్టా పరిచేవాడు. దానిమీద తాతగారి పెద్దపీటని తిరగేసి వేసేవాడు. పనసకాయ మధ్యలో వున్న దూలానికి అట్లకాడ వెనకవైపుకుండే సన్నగా వున్న వూచని గట్టిగా గుచ్చిపెట్టేవాడు. పిల్లల్లో ఒకళ్ళం వెళ్ళి అమ్మమ్మ నడిగి చిన్న గిన్నెలో నూనె తెచ్చి పక్కన పెట్టేవాళ్ళం. పక్కన మరో చిన్న ప్లేటులో పసుపు తెచ్చి వుంచేవాళ్లం. అంతే.. ఇంక పిల్లల మందరం ఎదురుకుండా కూర్చుని బాబాయి అంత పెద్దకాయనీ సన్న పొట్టులా మార్చడం ఆశ్చర్యంగా చూస్తుండేవాళ్లం.

ఇలా ప్రతిపనిలోనూ ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకుంటూ, ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలా ఉంటున్న బాబాయికి ఒక విషయంలో మటుకు ఎదురుదెబ్బ తగిలింది. అదేవిటంటే ఆయన ఎంతో ఇష్టపడి, ముచ్చటపడి నేర్చుకున్న వడ్రంగిపనిలో ప్రతిభావంతుడు కాలేకపోవడం. బాబాయికి ఎందుకో దేవుడికి మందిరాలు అవీ చెయ్యాలని చాలా కోరికగా వుండేది. దానికోసం ఆయన వడ్రంగిపని నేర్చుకున్నాడు. ఇంట్లో దానికి కావల్సిన పనిముట్లన్నీ సమకూర్చుకున్నాడు. ముఖ్యంగా చెవిలో పెన్సిల్ మటుకు మహా అందంగా పెట్టుకునేవాడు. అది చూసి పిల్లలమందరం పెద్దయాక వడ్రంగిపనులే చేసెయ్యాలని నిర్ణయాలు కూడా తీసేసుకున్నాం. కానీ అదేవిటో పాపం యాజులుబాబాయి కుర్చీ తయారు చేస్తే నాలుగుకోళ్ళూ నాలుగు కొలతలతో వుండేవి. ఆ కుర్చీ మామూలుగానే సరిగా నిలబడేది కాదు.. ఇంక దాని మీద కూర్చునే సాహసం ఎవరు చేస్తారు!

ఇంకిది పని కాదని ముందు చిన్న సామానేదైనా చేద్దామని మా నాన్నమ్మగారు కూర్చుందుకు చిన్న స్టూల్ లాంటిది చెయ్యాలని మొదలెట్టేడు. ఆ రోజుల్లో దాన్ని కుర్చీపీట అనేవారు. పాపం నాన్నమ్మ.. బాబాయిని చిన్నబుచ్చడం ఇష్టంలేక దానిమీద కూర్చోబోయింది. కానీ మా తాతగారు నాన్నమ్మగారి ముచ్చటనికాదని ఆ స్టూల్ తీసికెళ్ళి దానిమీద ఆయన చదువుకునే వ్యాసభారతం పెట్టేసుకున్నారు. తాతగారి చేతల్లోని అంతరార్థం బోధపడిన బాబాయి మరింక వడ్రంగిపని జోలికి వెళ్ళకూడదనుకున్నాడు. కానీ మనసులోని కోరికని ఆపుకోవడం ఆయన వల్ల కావటంలేదు. యాజులుబాబాయి పడుతున్న బాధని చూసిన మా పెద్దమామయ్యగారు బాబాయికి ఒక బ్రహ్మాండమైన సలహా ఇచ్చేరు. ఆయన స్నేహితులొకరు ఉన్నారుట.. అయన దగ్గరికి బాబాయిని పంపించేరు.

ఆయన ఏం చేస్తూంటారంటే.. దేవుళ్ళ చిత్రపటాలు అమ్ముతుంటారుకదా.. వాటిని కొనుక్కొచ్చి, సన్నగా ప్లై వుడ్ లాంటిది దొరుకుతుంది కదా.. ఆ ప్లైవుడ్ మీద అంటించి, చాలా చాలా సన్నని రంపంతో ఆ బొమ్మలను పటంలో చూపించినట్టు కట్ చెయ్యాలన్న మాట. శ్రీరామ పట్టాభిషేకం పటం వుంటే దానిని ప్లైవుడ్ మీద అంటించి ఆ పటం చుట్టూ వున్న బోర్డర్ దగ్గర సన్నని రంపంతో కట్ చెయ్యాలన్నమాట. అంటే ఆ దేవుడి చిత్రపటం గుండ్రంగా వుంటే గుండ్రంగా, కోలగా వుంటే కోలగా వచ్చేస్తుందన్నమాట. పటం కింద గట్టి అట్టలాగా ప్లై వుడ్ వుంటుంది కనక ఆ పటానికి కింద చిన్న మేకుతో దిమ్మలాంటిది కొట్టేస్తే ఆ దేవుడి బొమ్మ అందంగా నిలబడుంటుంది. అంతే కాకుండా ఆ బొమ్మలో దేవుళ్ళ కిరీటాలకీ, చీరలూ, జాకెట్ల అంచులకీ కాస్త జిగురు రాసి పైన బంగారంరంగు రజనుకానీ, వెండిలా మెరిసే రజను కానీ అంటిస్తే ఇంక ఆ బొమ్మ ఎంతగా మెరిసిపోయేదో… ఇలాంటి బొమ్మలు చేసి ఆయన తెలిసున్నవాళ్లందరికీ ఇచ్చేవారు.

ఈ బొమ్మలు చెయ్యడం చాలా నచ్చేసింది యాజులుబాబాయికి. కష్టపడి కుర్చీలకీ, మందిరాలకీ చెక్క కట్ చేసి, మేకులు కొట్టి నానాహైరానా పడక్కర్లేదు. కొలతలూ గట్రా అక్కర్లేదు. హాయిగా సన్నటి రంపంతో ఆ పటానికి తగ్గట్టు కట్ చేసుకుంటూ పోవడమే… ఇట్టే బొమ్మ తయారైపోతుంది. అంతే ఇంక మా యాజులుబాబాయి విజృంభించేసేడు. ఎంచక్క మన కెంతమంది దేవుళ్ళో.. బోల్డు దేవుళ్లబొమ్మలు కొనుక్కొచ్చేసి అలా ప్లైవుడ్‌కి అతికించేసి, చెమ్కీరంగు అంటించేసి అందరికీ ఇచ్చేవాడు. ఆ రోజుల్లో మా వాళ్లందరిళ్ళలోనూ బాబాయి చేసిచ్చిన కళాఖండాలే కనిపించేవి. కొత్త వాళ్ళెవరైనా ఇది బాగుందండీ అంటే చాలు.. మూడోరోజు వాళ్ళింటికి ఆ బొమ్మ వెళ్ళిపోయేది. అలా మా యాజులుబాబాయి మా ఇంట్లో మా అందరికన్నా ప్రసిధ్ధుడైపోయేడు.

ఇంతకీ ఇప్పుడు మా యాజులుబాబాయి యెందుకు గుర్తొచ్చాడంటే మా ఇంటి కెదురుగా వుండే రెండోక్లాసు చదువుకునే పాప ఇవాళ తను చేసేనంటూ నాకొక బొమ్మ తెచ్చి చూపించింది. అదిలాగే కాస్త దళసరి అట్టమీద ఫెవికాల్‌తో పుస్తకంలో వచ్చే కార్టూన్ బొమ్మ అతికించి, దాన్ని బొమ్మకి తగ్గట్టు అట్టని కట్ చేసి, ఆ బొమ్మ వేసుకున్న బట్టలమీద కాస్త రంగు పులిమి తీసుకొచ్చి చూపించింది. రెండోక్లాసు చదివే పిల్ల చేసేంత సులభమైపోయింది ఈ పని ఈ రోజుల్లో.. ఆ రోజుల్లో దీనికోసం యాజులుబాబాయి పడిన తాపత్రయం తల్చుకుంటే ఇప్పుడు “పాపం…యాజులుబాబాయి”..అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here