తెలుగు వెలుగు 1: శ్రీ అయ్యగారి సాంబశివ రావు (ఏ.ఎస్. రావు)

7
3

ఎప్పటికప్పుడు పెరుగుతున్న మానవుని మేధ మూడు నాలుగు శతాబ్దాల క్రితం కారణాలడగడం మొదలెట్టింది. విశ్లేషించింది, వింగడించింది, విస్తరించింది. చందమామను తన పెరట్లో నాటింది. పరమాణువులోని నటరాజ నృత్యాన్ని పార్టికల్ ఛాంబర్‌లో ప్రదర్శించింది. ఈనాటి మానవుని శ్రీవిద్య ‘సైన్స్’ అనబడే జిజ్ఞాసార్జన.

అటువంటి జిజ్ఞాస కలిగి ప్రపంచంలో ఎంతో ఖ్యాతిని పొందిన భారతావని ముద్దుబిడ్డలెందరో! వారిలో మన తెలుగువారు గర్వించ తగిన వ్యక్తి శ్రీ ఏ.ఎస్. రావు(అయ్యగారి సాంబశివరావు) గారు.

బాల్యం, విద్యాభ్యాసం:

ఏ.ఎస్. రావు గారు సెప్టెంబర్ 20, 1914న పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో శ్రీ వెంకటాచలం, సుందరమ్మ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించారు. పదవతరగతి వరకు తణుకులో చదువుకున్నారు. విజయనగరం మహారాజ కళాశాలలో ఇంటర్మీడియేట్ పూర్తిచేశారు. చదువు మీద అతని ఆసక్తి, పట్టుదల చూసి అతని తల్లి ఆవిడ పెళ్ళిపట్టు చీర రెండు రూపాయలకి అమ్మి అతనిని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి పంపారు. అక్కడ ఏ.ఎస్. రావు రోజుకి ఒకపూటే తింటూ చాలా కష్టపడి చదివి విజ్ఞానశాస్త్రములో మాస్టరు డిగ్రీలో గోల్డ్ మెడల్ సంపాదించారు. ఆ తరువాత అక్కడే అధ్యాపకునిగా ఆరు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. అతని విద్వత్తు చూసి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ సూచన మేరకు, ‘టాటా’ ఏ. ఎస్. రావుని స్టాన్‌ఫాడ్ యూనివర్సిటికి పంపారు. 1947లో స్టాన్‌ఫాడ్ యూనివర్సిటీ వారు అతనికి ఫాకల్టీగా ఉద్యోగం ఇచ్చి నెలకు లక్షా యాభై వేలు ఇస్తానన్నా ఆ అవకాశాన్ని తిరస్కరించి తిరిగి భారతదేశానికి వచ్చి టాటా సంస్థలో పనిచేశారు.

భారతదేశం తిరిగి వచ్చాక సాంబశివరావుగారు అణుశక్తి విభాగములో అణు శాస్త్రవేత్తగా ఎన్నో ప్రయోగాలు చేశారు. భారతదేశం గర్వించ తగిన శాస్త్రవేత్తలు హోమీ భాభా, విక్రం సారాభాయ్, సూరి భగవంతంతో కలిసి ‘భాభా కమిటి’ అని ఒక ఒక ఎలక్ట్రానిక్స్ కమిటీ యేర్పాటు చేయబడింది. ఇది పరిశ్రమల అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అధ్యయనం భారతదేశంలో ఎలా ఉండాలో పరిపూర్ణ నివేదికను, సూచనలను అందజేసింది. విద్యుత్ ఉత్పాదనపై రావుగారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఈ రోజుల్లో మనము ఎదురుకుంటున్న విద్యుత్ సంక్షోభాన్ని ముందుగా ఊహించి ఎలాంటి పరిమితులు లేని సౌరశక్తిని ఇందుకోసం వాడొచ్చని సూచించారు. అణు విద్యుత్ తయారీపై అపోహలను తొలగించి నాణ్యమైన విద్యుత్‌ని అందించాలని చెప్పారు. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) లో కాస్మిక్ కిరణాలపై పరిశోధనల్లో డాక్టర్ ఏ.ఎస్. రావు అద్భుత విజయం సాధించారు. ఆసియా ఖండంలోనే మొదటిసారిగా భారత్ రూపొందించిన అణు రియాక్టర్ అప్సరకు కంట్రోల్, మానిటరింగ్ పరికరాలను సమకూర్చారు. దేశ, విదేశాల పత్రికల్లో వెలువడిన వారి వ్యాసాలు ఇప్పటికీ అణుశాస్త్ర విద్యార్థులకి మార్గదర్శనం చేస్తున్నాయి.

భాభా కమిటీ నివేదిక భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అభివృద్ధికి మొదటి నమూనా అయింది. 1967 ఏప్రిల్ 11 లో భారత ప్రభుత్వం హైదరాబాదులో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇ.సి.ఐ.ఎల్) అనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్థాపించింది. దానికి ఛైర్మన్‌గా సారాభాయి, ఏ.ఎస్.రావు మేనేజింగ్ డైరక్టర్‌గా వ్యవహరించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నలుపు-తెలుపు టీవీలు, కంప్యూటర్లను రూపొందించారు.

ఎన్నో ప్రాంతాల వారికి, ఎన్నో వేలమందికి ఉద్యోగవకాశాలు లభించాయి. విభిన్న రంగాలకు ఉత్పత్తులను అందజేస్తూ సంస్థ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, చంద్రయాన్ 32 మీటర్ డీఎస్ఎన్ యాంటీనా, బ్రహ్మోస్ మిసైల్ చెక్అవుట్ వెహికల్, అణువిద్యుత్ కంట్రోల్ సిస్టమ్స్, మేజర్ అట్మాస్పెరిక్ చెరెంకోవ్ ఎక్స్పెరిమెంట్ (మేస్) టెలిస్కోప్, నిషేధిత ప్రాంతాల్లో భద్రతకు రోడ్డు బ్లాకర్, ఎక్స్‌రే బ్యాగేజ్‌ల రక్షణ, అంతరిక్షం తదితర రంగాలకు పలు ఉత్పత్తులను అందించింది.

భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్, మొట్టమొదటి సాలిడ్ స్టేట్ టి.వి., మొట్టమొదటి యర్త్ స్టేషన్ యాంటీనా, మొట్టమొదటి ఎలెక్ట్రిక్ వోటింగ్ మిషన్ ఇ.సి.ఐ.ఎల్. కే గర్వకారణాలు.

ఆ సంస్థకు ఏ.ఎస్. రావు చేసిన కృషికి, ఉపాధి సామర్థ్యాన్ని విశేషంగా పెంచినందుకు గాను భారత ప్రభుత్వం 1971 లో రావుగారిని ఎలక్ట్రానిక్స్ కమిషన్‌లో ముఖ్య సభ్యునిగా నియమించింది. ఆ సంస్థలో పని చేసేవారికి ఎంతో సహాయసహకారాలు అందించేవారు ఏ.ఎస్.రావు గారు. రావుగారు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి, యునైటెడ్ నేషన్స్‌లో జరిగే అణుశక్తి ఉపయోగాలపై శాంతి సమావేశాల వంటి అనేక అంతర్జాతీయ సమావేశాలకు భారతదేశం తరపున పాల్గొన్నారు. ఆయన అనేక విజ్ఞాన పత్రికలకు సంపాదకునిగా, సలహామండలి సభ్యునిగా పని చేశారు. అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్‌కు కూడా సంపాదకునిగా పనిచేశారు.

ఈ.సి.ఐ.ఎల్. లో పని చేసేవారి కొరకు మౌలాలి ప్రాంతం దగ్గర 120 ఎకరాల స్థలాన్ని భారత ప్రభుత్వం సహాయంతో వారికి ఇల్లు కట్టుకోడానికి కేటాయించారు. ఏ.ఎస్. రావు మీద అభిమానంతో ఆ ప్రాంతానికి ‘ఏ.ఎస్. రావు నగర్’ అని పేరు పెట్టారు. ఆ ప్రాంతంలోనే ఏ.ఎస్. రావు గారి విగ్రహం కూడా నెలకొల్పారు.

నిరాడంబరతకు ప్రతిరూపంగా నిలిచేవారు రావుగారు. పదవి విరమణ చేశాక ఒకసారి ఆర్. టి.సి. బస్‌లో ప్రయాణిస్తూ కండక్టర్‌తో “ఏ.ఎస్. రావ్ నగర్ కి ఒక టికెట్టు” అని అడిగి తీసుకున్నారు. చిల్లర లేనందుకో మరెందుకో ఆ కండక్టర్, రావు గారిని విసుకున్నాడుట. ఇంతలో ఎవరో ఆ వ్యక్తి ఏ.ఎస్. రావు అని చెప్పాక ఆయన నిరాడంబరానికి ఆశ్చర్యపోయి నమస్కరించాడు.

కుటుంబం:

1938వ సంవత్సరంలో ఏ.ఎస్. రావు గారికి అన్నపూర్ణతో వివాహం అయ్యింది. వారికి ముగ్గురు కుమార్తెలు, నలుగురు కుమారులు.

అవార్డులు, పురస్కారాలు:

  • 1960లో పద్మశ్రీ పురస్కారం,
  • 1965 లో శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం
  • 1969 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు,
  • 1972 లో పద్మ భూషణ్ పురస్కారం,
  • 1974 లో ఫెలో ఆఫ్ ఇండియన అకాడెమీ ఆఫ్ సైన్సెస్,
  • 1976 లో ఫిక్కీ అవార్డ్ ఆఫ్ ఔట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇంజనీరింగ్,
  • 1977 లో ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) వారి నేషనల్ డిజైన్ అవార్డు,
  • 1988 లో ఆంధ్రప్రదేశ్ అకాడెమీ ఆఫ్ సైన్స్ యొక్క విశిష్ట శాస్త్రవేత్త అవార్డు,
  • 1989 లో డా.నాయుడమ్మ స్మారక బంగారు పతకం ఆయన్ని వరించాయి.

రావు గారి శత జయంతి సందర్భంగా భారత తపాలశాఖ వారు ఒక ప్రత్యేక తపాల కవర్‌ను 16-11-2014న విడుదల చేశారు

రావుగారు పదవీ విరమణ చేశాక నాచారంలో ఉండేవారు. సందర్శకులను అనుమతించేవారు కాదు. దయచేసి సందర్శకులు రావద్దని బోర్డు పెట్టుకున్నారు. ఉద్యోగంలో ఉండగా ఎందరికో సాయం చేశారు. ఉద్యోగ విరమణ తరువాత తానేమీ సహాయం చెయ్యలేని స్థితి కనుకనే ఎవరినీ నిరాశ పరచడం ఇష్టం లేక బోర్డు పెట్టానని అన్నారు. ఎప్పుడూ మూసి ఉండే ఆ ఇంటి గేట్లు మిత్రులెవరైనా ఫోన్ చేస్తే మాత్రమే తెరుచుకునేవి. అక్టోబర్ 31 2003 న ఏ.ఎస్. రావు గారు పరమపదించారు.

దేశం గర్వించే శాస్త్రవేత్త, ఇంజనీర్, దార్శనికుడు, మానవతావాది శ్రీ ఏ.ఎస్. రావు గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here