99 సెకన్ల కథ-22

2
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. న్యాయమా? ధర్మమా?

“సామీ, మా గ్రామం ఓళ్ళు మీ కాడికి పంపారు… మా నాయన రోడ్డు మీకుండే అయిదెకరాల పొలంలో చివారికి కట్టుకొన్న ఇల్లు మా తమ్ముడికి, దాని ముందున్న పొలం నాకూ ఇచ్చాడు. ఆయనంటే మాకు పానం. రెండేల్లయింది. విల్లు రాసి సొర్గానికెల్లిపోయాడు…” అంటూ ఆ విల్లు చూపించాడు దుర్గయ్య – గుండి రాజన్న శాస్త్రిగారికి.

అప్పుడే భాగవత ప్రవచనం ముగించుకుని లేవబోతున్న శాస్త్రిగారు ఆగారు. ఆ విల్లు చూశారు.

“సమస్య ఏమిటి నాయనా?”

తమ్ముడు గవరయ్య అందుకున్నాడు.

“అన్న పొలం చేసుకుంటున్నాడు సామీ. నేను సుట్టుపక్కల గ్రామాల్లో బోర్లు బాగు చేస్తూండా. తిరిగేదానికి కష్టమవుతా వుందని ఓ పాత కారు కొన్నా సామీ. అది నా ఇంటిదాకా యెల్లేందుకు అన్న పొలంలోంచి దారి అడుగుతుండా. పంట జాగా పోతుందని అన్న ఈనంటే ఈనంటన్నాడు. ఊల్లో ఓల్లు ఏం చెప్పలేక మీ కాడికి …”

అపరవ్యాసుడని ఆ పరగణా అంతా పేరుపొందిన రాజన్న శాస్త్రిగారి దగ్గరికి ధర్మపురి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇలా వస్తూనే వుంటారు. నుదుట విభూతి రేఖలు, ఒంటిని కప్పకుండా భుజాన వేలాడుతున్న కండువా, ప్రశాంతమైన చూపు, చిరునవ్వు …

“నాయనా, మీకు న్యాయం కావాలా? ధర్మం కావాలా?”

అన్నదమ్ములిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

“తేడా ఏటి సామీ?” ఇద్దరూ అడిగాడు.

“న్యాయం కాలానుగుణంగా మారుతూంటుంది. ధర్మం ఎన్ని యుగాలైనా మారదు.”

“ఆ… ఆ మారందేదో చెప్పండి సామీ.”

రాజన్న శాస్త్రి ఓ కథ చెప్పారు:

ఒక గొప్ప రాజు వున్నాడు. పెద్దకొడుకు నీలాగా మంచివాడు. రాజు తన తరువాత అతన్ని రాజుని చేయాలనుకున్నాడు. కాని అతని చిన్న భార్య – తన కొడుకే రాజకావాలి, పెద్ద కొడుకు అడవులకి పోవాలి – అంది. అతను నీలాగా మంచివాడు కదా! వెంటనే రాజ్యం వదిలేసి పెళ్ళాంతో కలిసి వెళ్ళిపోయాడు …

దుర్గయ్య ఆపాడు. “గవరా, ఇది సీతా రాముల కథే కదా!”

“అవునన్నా.”

శాస్త్రిగారు నవ్వారు. అయినా ఆపలేదు:

….అలా అడవికెళ్ళిపోయిన రాముడి దగ్గరికి తమ్ముడు భరతుడు వెళ్ళి, ‘అన్నా, నువ్వు పెద్దవాడివి కాబట్టి ఈ రాజ్యం నీది… మా అమ్మ తప్పు చేసింది. నువ్వు వచ్చేయ్, నీ రాజ్యం తీసుకో’ అని బ్రతిమాలాడు.

కాని రాముడు ఒప్పుకోలేదు. ‘నేను అలా చేస్తే నాన్న మాట తప్పినట్లవుతుంది. రానంటే రాను వనవాసం అయ్యేదాకా’ … అన్నాడు.. ఆ ఇద్దరిలో ఎవరిది తప్పు?

ఆ ఇద్దరూ మొహాలు చూసు కున్నారు. “ఎవుర్దీ తప్పులేదు. అయినా నాన్న మాట ఇనాలి కదా సామీ!”

“అదే ధర్మం. మీరు కూడా మీ నాన్న మాట ఇనండి.”

ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. “ఆ విల్లులో ఇంకేమీ చెప్పలేదు సామీ..ఆయన ఎలా సెబితే అట్టాగే చేస్తాం కదా!”

ఆ ఋషి మందహాసం చేశారు.

“అందులో చివరి వాక్యం చదవండి. ఏ వివాదం వచ్చినా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి – అని రాశాడు.”

“అంటే ఏమిటి సామీ?”

“నీ చర్యలవల్ల నీ తమ్ముడికి కష్టం కలగరాదు. నీ తమ్ముడి చర్యలవల్ల నీకూ కష్టం కలగరాదు. అంతే.”

కొద్ది సెకన్లు ఒకరినొకరు చూసుకున్నారు.

“సరే, గవరా, నీకు రోడ్డు జాగా నేను గిఫుటుగా ఇస్తాలేరా” అనేశాడు అన్న.

గవర మొహం వెలిగిపోయింది.

“సంతోసమే అన్నా. కాని గిఫుటుగా వద్దన్నా. నేనీగలిగిన ధర తీస్కోని ఇయ్యి అన్నా…”

అన్నదమ్ములిద్దరూ ఆ ఋషికి పాదాభివందనం చేశారు.

(గోదావరి తీరంలో ఆ ‘సామి’కి గుడి కట్టారు ధర్మపురివాసులు… వాస్తవ కథ).

2. అత్తగారు – ఆరు గంటల కాఫీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళా సంఘం ప్రాంగణమంతా మహిళల శక్తితో నిండిపోయింది. మహిళా శక్తి మీద పాటలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అమ్మాయిలు వేదిక మీదకు వచ్చి, నారీ శక్తి గురించి గీతాలు పాడుతున్నారు. శేషయ్య ఒకే ఒక మగ అతిధి.

మరో ముఖ్య అతిధి ఒక 90 ఏళ్ళ వృద్ధురాలు శాంతాదేవి – భర్త కాలం చేశాక, తన ఆస్తినంతా దాన ధర్మాలకు ఖర్చుపెడుతూ, ‘వైదేహి’ బాలికల ఆశ్రమానికి గౌరవ అధ్యక్షురాలిగా వుంటూన్నారు.

సభ మొదలైంది. అధ్యక్షుల తొలి పలుకులు, మధ్యలో మలి పలుకులు, మాటిమాటికీ పలుకులు నడుస్తున్నాయి. అంతలో వేదిక ముందు వరుసలో చాలా అట్టహాసంగా తయారై వచ్చి, కుర్చీలో కాలుమీద కాలు వేసుక్కూర్చొని, తదేకంగా చరవాణిని నడిపిస్తున్న స్త్రీ మీద శేషయ్య గారి దృష్టి పడింది.

ఆలోచనలు ఆరు మాసాలు వెనక్కి వెళ్ళాయి.

ఈమె తన ఇంటికి వచ్చింది. కూతురికి పెళ్ళయి రెండు నెలలయిందిట. ఆ అమ్మాయికి అత్తగారి వైఖరి నచ్చలేదుట. ఎందుకంటే రోజూ పొద్దుటే ఆరు గంటలకి ఆవిడకి కాఫీ ఇవ్వాలి. ఈ అమ్మాయికి ఏడు ఏడున్నర దాకా నిద్రలేవటమే అలవాటు లేదు. అసలు పుట్టింట్లో వాళ్ళమ్మే ఏనాడూ పని చెప్పలేదుట.”అమ్మకి కాఫీ సకాలానికిచ్చేలా చూసుకో” అని భర్త చెప్పాట్ట. ఈ పని తనవల్ల కాదని తేల్చుకుంది. భర్త మంచివాడే కాని, అతనికి ఒకే ఒక్క కోరిక – అమ్మకి సకాలంలో కాఫీ ఇవ్వాలి. నచ్చలేదు. పుట్టింటికొచ్చేసింది. ఏం చేయాలి? వేరు కాపురమా ? లేక ….?

అధ్యక్షులు ప్రకటించారు. “సహస్ర చంద్ర దర్శనం చేసిన నగర ప్రముఖులు శేషయ్యగారి సందేశం విందాం…” శేషయ్య వెంటనే లేచి, శాంతాదేవి కాళ్ళకి నమస్కరించారు. మైకు అందుకున్నారు.

“ఆ మధ్య నా దగ్గరికి ఒక తల్లి తన కూతురుతో వచ్చింది. ఆ కూతురు ఎలా పెరిగిందో ఏమో గాని, అదిగో – ఈ వేదిక ముందు వరుసలో కూర్చున్నావిడలాగానే కూర్చొని, అలాగే ఫోను తిప్పుకుంటూ, నేనేదన్నా అడిగితే, ఆ తెలుగమ్మాయి ఆంగ్లంలో జవాబిస్తూ …’నేనెప్పుడిస్తే అప్పుడే కాఫీ తాగేలా చేయాలి తాతగారూ. లేదంటే ఆవిడకి…’ అని తర్జని చూపించింది….”

అంతా నిశ్శబ్దంగా వింటున్నారు.

“… ధర్మరాజు ఒక చక్రవర్తి. ఆయన పట్టమహిషి ద్రౌపది. అయినా, ఆమె దినచర్యలో అతి ముఖ్యమైన భాగమేమిటంటే –

‘నిత్యమార్యామ్యహం కుంతీం వీరసూం సత్యవాదినీం,

స్వయం పరిచరామ్యేతాం పానాచ్ఛాదన భోజనైః ‘-

మా అత్తగారి అన్ని అవసరాలను నేనే స్వయంగా గమనించుకుంటుంటాను – అంది.

ఇప్పటి కాలంలో అంత సేవ చేయకపోయినా, కుటుంబ పెద్దల్ని కనీసం ప్రేమతో చూడలేమా… ప్రేమతో ప్రపంచాన్నయినా జయించవచ్చుగదా!…”

ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు?

“చౌడు ఉరికిన నేలలో ఎంత మంచి బీజాలు జల్లినా, సు-ఫలసాయం లచించదు. మంచి బీజాలతో సాగుచేయటానికి మంచి క్షేత్రం వుండాలి కదా! అందుకే, చౌడు నేల సారవంతం అయ్యేలా జిప్సంతో శుద్ధి చేస్తాం. … మంచి అల్లుడిని వెతికి తేవాలని చూస్తాం. అల్లుడు ఎంత ఉత్తముడైనా, మన ఆడపిల్లలకి సత్సంతానం కలగాలంటే, వాళ్ళని సంస్కారంతో పెంచాలి కదా…”

ఇక్కడ ఆగారు శేషయ్య.

మహిళా ప్రేక్షకులంతా ఉత్కంఠతో వింటున్నారు.

“పండిత వాక్యం ఏమిటంటే, కుమార్తెకు సంస్కారం ఇవ్వటంలో కీలక బాధ్యత తల్లిదే……!”

90 ఏళ్ళ శాంతాదేవి లేచి నిలబడి చప్పట్లు కొట్టింది.

కరతాళ ధ్వనులు మ్రోగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here