[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]
9
[dropcap]ప్ర[/dropcap]తి కూలీ ఒక తొక్కివేయబడ్డ బలిగా, ప్రతి పాదం ఒక్కో రుడాలిగా మారిన సందర్భానికి నేను కూడా సాక్షీభూతంగా నిలిచాను. బతుకులు కూలిన వలస కూలీల స్థితిగతుల్ని సీరియస్‌గా ఆలోచించారా? కడుపులు ఖాళీ అయిన వారిని చూస్తున్నారే కానీ దేశ భవనం నిలబడాలంటే ఇటుకలుగా పేర్చుకున్నది వాళ్ళేనన్న ఇంగితం నీకెందుకు రావడం లేదు సహవాసీ.. వాళ్ళ త్యాగాల మీదే మీరంతా కోటలు కట్టుకున్నారని, వారి శ్రామికతలోనే మీ సౌకర్యాలు బాగుంటున్నాయని మీకు మాత్రం తెలీదా.. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరని ఎంతో కాలం క్రితమే మీ మహాకవి శ్రీశ్రీ ప్రశ్నించలేదా? చెప్పులు కొనే స్థోమత లేక కాళ్ళు బొబ్బలెక్కి, ఆదుకొనే మనుషులు కానరాక, నెత్తిమీద బరువులతో, చంకన బిడ్డలతో చేతిలో సంచితో మండుటెండలో వాళ్ళు నడుస్తుంటే నాకే కళ్ళకు నీళ్లొచ్చాయి. నీ మనసు అది చూసి కూడా కరగలేదా? మేం భోజనాలు పెట్టాం, ఆశ్రయం ఇచ్చాం అంటే సరిపోతుందా.. అసలు వాళ్ళు ఎన్ని కోట్ల మంది వున్నారోనన్న లెక్కలన్నా మీ దగ్గరున్నాయా? నమ్మకం పోగొట్టుకున్నాక మళ్ళీ వాళ్ళను రప్పించుకోవటం ఏ యజమానికైనా ఎంత కష్టమో అర్థం అవుతోందా? రెండు నెలల జీతాలు ఇవ్వటానికి విముఖత చూపించే యజమాని, వాళ్ళ కష్టంతోనే తాను ఇంత ధనవంతుడిగా ఎదిగానన్న సత్యాన్ని మాత్రం విస్మరిస్తున్నాడు. ఇదెంత నగుబాటు? ఓ మనిషీ ఒక్కసారైనా నిన్ను నువ్వు తరచి చూసుకోవా?
దేహంలో షట్చక్రాలున్నాయని బలంగా చెప్పగలిగిన నువ్వు దేశంలోని చక్రాల గురించి కూడా ఆలోచించాలి కదా, వలస అంటే మానవాళి ప్రగతి ప్రస్థానమని నమ్మావు కాబట్టే కదా బస్సుల్ని, రైళ్లని, విమానాల్ని కనిపెట్టి అత్యంత దూరాన్ని అతి తక్కువ కాలంలో చేరుకోవడం కోసం నీ మేధకి పదును పెట్టుకున్నావ్. కానీ ఇన్నాళ్ళకి మళ్ళీ నీ కాళ్ళకి పని పడిందా.. స్వప్న భగ్న చరిత్రను పాదాలు మాత్రమే రాయగలవని ఇప్పటికైనా నీకు అర్థం కాకపోవడం శోచనీయం. కన్న బిడ్డలని, కన్న వారిని బొడ్రాయి దగ్గరే వదిలేసి నమ్మిన బంటులా నీతో నడిచి వచ్చిన వాళ్ళ కురచ కలలిప్పుడు కూలిపోయాయి. ఇటుకలు సిమెంటుతో నువ్వు కట్టుకున్న కాంక్రీట్ శ్మశానాన్ని నీకు మాత్రమే వదిలేసి వాళ్ళంతా ఊరి దారి పట్టారు. రక్త మాంసాల బొక్కల గూడులే లేకపోతే నువ్వింత సౌకర్యవంతంగా బతకగలిగేవాడివా? వాళ్ళకింత కూడు, గూడు కల్పించలేనంత స్వార్థపరుడిగా ఎలా మారావ్? ఈ మహా వలసయాత్రలో లోహాన్నంతా తమ శ్రమ శక్తితో లొంగదీసుకున్న ఆ శ్రమైక జీవులు ఆకలి లోకాన్ని మాత్రం జయించలేకపోయారు.
నేను నీకొక కథ చెప్పాలి. చెప్పటమేంటీ, నువ్వే దృశ్యాన్ని ఊహించుకుంటూ చదువుకో. ఇదొక అభాగిని కథ. తన స్వగతంలోనే ఈ కథని చదువుదాం. ఎవరి అనుభవాలు వారు చెపితేనే బావుంటుంది కదా.
‘ఏంది? ఈ రాత్రి కన్నా వస్తావా?’ వెకిలిగా నవ్వుతూ అడిగాడు రంగడు నా పక్క నుండి వెళుతూ చిన్న గొంతుతో..
సంకలో బిడ్డ–నెత్తి మీద మూట– భుజానికి సంచితో అడుగు తీసి అడుగు భారంగా వేస్తున్న నేను ఉలిక్కిపడ్డాను. వాడి గొంతు వింటే చాలు నాకు బతుకు మీద ఆశపోతుంది మరి.
కోపంగా ఉరిమి చూశాను.
‘వస్తావులే నాకు తెల్సు’ అంటూ కన్ను గీటుతూ నన్ను దాటిపోయాడు. అలసట శరీరానిదో.. ఇప్పుడు విన్న మాటల మూలంగా మనసుకు వచ్చిందో కానీ ఆగాలనిపించింది.
బిడ్డనెత్తిన చుట్టిన తుండుగుడ్డ తీసి పక్కన కూర్చోబెట్టి నెత్తిమీద సామాను దింపుకొని రోడ్డు పక్కనే సతికిలపడ్డాను..
ఏడుకొండల జాతరకు పోతున్న రీతిలో ఎక్కడ చూసినా నడుస్తున్న జనమే కన్పిస్తున్నారు. ఆకలితో ఊగుతూ కొందరు – మందులో జోగుతూ కొందరూ – భారంగా నడుస్తూ కొందరు– పిల్లల్ని మోస్తూ కొందరు.. అందరికీ ఎవరో ఒకరు ఉన్నారు. నాకూ నా బిడ్డకి తప్ప – బిడ్డని బలంగా దగ్గరకు లాక్కున్నాను.. కనీసం ఇద్దన్నా వుంది.. బ్రతుకు మీద ఆశలా అనుకుంటూ దాని ముఖంలోకి చూశాను.
ఈసురోమంటూ దీనంగా చూసింది.
ముఖమంతా నల్లటి చారికలు కట్టి ఉంది. అది ఏడ్చి ఏడ్చి కావచ్చు. నిరంతర ఎండకు కావచ్చు. చెమట ఉప్పుకి కావచ్చు. అవును మరి 6 రోజులుగా నడుస్తూనే ఉన్నాం.. కర్నాటక నుండి బయలుదేరి నిజామాబాద్‌కి పోవాలి– వికారాబాద్ దాటి హైదరాబాద్ వైపుగా కదులుతున్నాం అందరం..
బయలుదేరినప్పుడు ఎందరమో వున్నాం.. ఏ రాష్ట్రం వారు ఆ రాష్ర్టాల దారి పట్టాక కొత్తవారు చేరుతూ.. పాతవారు మారుతూ అంతా గందరగోళమే. రోజుకోవార్త.. బస్సులు నడుస్తున్నాయని.. రైళ్ళు బయలుదేరాయని.. మన కోసం ట్రక్కులు వున్నాయని ఏదో ఒక ఆశ..
మధ్యలో కొంత మంది తింటానికి ఏదో ఒకటి పెడ్తున్నారు.. ఒక్కోరోజు దొరికింది.. ఒక్కోరోజు అదీ లేదు.. పోలీసులు పట్టుకుంటున్నారని రోడ్ల మీద కాకుండా తుప్పల్లో నుండి నడుస్తూ రాష్ట్రాన్ని దాటాం.. తెలుగు రాష్ట్రంలోకి దొంగచాటున వచ్చామని తెలిస్తే మళ్ళీ వెనక్కు పంపేస్తారట.. అదో భయం..
సంచిలో దాచుకున్న ప్లాస్టిక్ బాటిల్ తీశాను. అడుగున ఎక్కడో నీళ్ళు కన్పించాయి. ఉసూరంది ప్రాణం.. ఉన్న కాస్త నీళ్ళు బిడ్డ నోటికి అందించాను. ఆబగా తాగింది. కాసేపట్లో సల్లబడుతుంది. చీకట్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ నడవటం .. కాళ్ళు వాచిపోయి పుండ్లు పడ్డాయి. వట్టి కాళ్ళతో నడుస్తున్నానని వికారాబాద్‌లో దయకల్గిన తల్లి చెప్పులిచ్చింది. అవి పెద్దవైపోవటంతో అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నాయి. తీసేద్దామంటే బొబ్బలు చిదిమి రక్తం కారుతుంది.
బిడ్డ పాదాలు చూశాను. 3 యేళ్ల పిల్ల.. దాని కాళ్ళు కూడా అలాగే వున్నాయి. దాని పాదాలకు చెప్పులుండేవి.. రాత్రి నిద్రలో జోగుతూ నా సంకలో వుండగానే ఎక్కడో ఒక చెప్పు వదిలేసింది. ఒక్క చెప్పుతోనే పొద్దున్నుంచీ నడ్చింది. ఇప్పుడు నడవలేక ఏడుపు.. ఈ సామానుతో నడవలేక నా బాధ నాది.. అప్పటికే 5,6 పాత్రలు ముందే అమ్మేశాను పక్కింటి వారికి.. మధ్యలో వండుకోవడానికి కావాలని 4,5 తెచ్చుకున్నాను.
పాడు కడుపు.. పేదోడికి ఇంత పెద్ద ఆకలౌతుందేంది? ఈ ఆకలి లేకుండా వుంటే ఎవరిళ్ళల్లో ఆళ్ళం వుండేవాళ్ళం కదా.. పస్తులు అలవాటైపోయినోల్లం.. కానీ నడక.. మరీ ఇన్నొద్దులు ఎప్పుడు నడవలే. అవ్వ చెప్పగ ఇన్నా.. అప్పట్లో అందరం నడిచి పోయేవాల్లంట.. మా అవ్వ నడిసే బొంబై పోయిందట. మా తాతలో ఇల్లు కట్టె పనికి కుదిరి. ఎట్లా పోయారో. నే నడవట్లే.. అట్లనే.. బతుకు మీద ఆశ.. తర్వాతేమైందో తెల్సుకోవాలనుందా.. కాస్త ఆగు మరి. ఈ సారి కల్సినప్పుడు చెప్తాను.
(సశేషం)