[dropcap]ప్ర[/dropcap]తీ రోజూ సాయంత్రాలు
మా శరీరాలు యంత్రాలు
వలువలను మార్చేస్తాం
విలువలను వదిలేస్తాం
పాలిపోయిన వదనాల్ని
కాలిపోయిన పెదవుల్ని
రంగులతో నింపేస్తాం
హంగులతో కనిపిస్తాం
నఖ క్షతాల్ని కప్పేస్తాం
నక్షత్రాల్ని పూయిస్తాం
పాపాయిలను మరుస్తాం
రూపాయలనే తలుస్తాం
చీకటి పరుచుకోగానే
వాకిట నిలబడతాం
నిత్యం చేసే ఈ పరకాయ ప్రవేశం
మేం రోజూ చేసే నరకాయ ప్రవేశం.