మంచి తెలుసుకున్న దెయ్యం

0
3

[dropcap]అ[/dropcap]క్కడ పెళ్ళి జరుగుతోంది. బాజా బజంత్రీలు మ్రోగుతున్నాయి. అందరికీ అల్పాహార విందు కూడా జరుగుతోంది.

ఉన్నట్టుండి పెండ్లి కుమారుడి తండ్రి నారాయణ పెండ్లి కుమార్తె తండ్రి హనుమయ్యని ఇవ్వాల్సిన కట్నమే కాకుండా అదనంగా అయిదు వేల వరహాలు ఇవ్వాలని కర్కశంగా అడుగుతున్నాడు.

ఈ గొడవ విన్న పెద్ద మనుషులు నారాయణకు అదనపు కట్నం అడగటం పాపం అని చెప్పసాగారు. అయినా డబ్బు మీద అమిత ఆశ గల నారాయణ పెద్దమనుషుల మాటలు లెక్క చెయ్యలేదు. డబ్బు ఇవ్వాల్సిందేనని మంకు పట్టు పట్టాడు!

నారాయణ కుత్సితబుద్ధికి అందరూ విసుక్కుని వెళ్ళిపోయారు.

పాపం హనుమయ్యకు పెండ్లి ఆగిపోతుందేమో అన్న భయం పట్టుకుని శేట్ ఛమన్ లాల్ వద్దకు వెళ్ళి అయిదువేల వరహాలు అధిక వడ్డీకి తెచ్చి నారాయణకు ఇచ్చి పెండ్లి జరిపించాడు.

***

అలా కాలం జరిగి పోతోంది. పెండ్లి అయిపోయిన సంవత్సరం తరువాత నారాయణకు జబ్బు చేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఆ జబ్బు నయం కావడం లేదు!

వియ్యంకుడి సంగతి తెలుసుకుని హనుమయ్య అతని వద్దకు వెళ్ళి “నారాయణా, నీకు జబ్బు చేసినందుకు చాలా బాధ పడుతున్నాను, నా వలన ఏ సహాయం కావాలన్నా చేస్తాను, నీవు డబ్బుకు కూడా ఇబ్బంది పడకు, నా చేతనైనంతలో సహాయం చేస్తాను”అని ఎంతో మంచిగా చెప్పాడు.

ఆ మాటలు విన్న నారాయణకు హనుమయ్య మంచితనం అర్థం అయింది! ‘అయ్యో, కట్నానికి అంత ఏడిపించానే’ అని బాధ పడ్డాడు. ‘అతను ఇచ్చిన అదనపు కట్నం ఇచ్చివేయాలి’ అనుకున్నాడు.

కానీ అప్పటికే కాలం మించి పోయింది! వైద్యం పనిచేయలేదు! నారాయణ చనిపోయాడు.

కానీ, డబ్బు కోసం చేసిన పాపాల వలన, అదనపు కట్నం అడిగినందు వలన అతని ఆత్మ ఒక దెయ్యంగా మారిపోయింది!

అలా దెయ్యంగా మారిన నారాయణ దెయ్యంలో కాస్త విచక్షణా జ్ఞానం మిగిలి ఇకనైనా మంచి చెయ్యాలని అది నిర్ణయించింది.

అది ఒక పెద్ద మర్రి చెట్టు మీద నివాసం ఏర్పరుచుకుని ఊరిలో జరిగే విశేషాలను గమనించేది!

ఆ మర్రి చెట్టుకు కొంత దూరంలో ఒక కల్యాణ మంటపం ఉంది. అక్కడొక పెండ్లి జరుగుతోంది.

అది సరదాగా ఆ పెండ్లి చూడటానికి వెళ్ళింది. వంటశాలలోకి వెళ్ళి వంటల ఘుమ ఘుమలు ఆస్వాదించ సాగింది! అది ఏ పదార్థం తినలేదు, ఎందుకంటే అది కేవలం ఒక గాలి రూపం కనుక!

ఇంతలో పెళ్ళి మంటపం వెనుక దానికి గోల వినబడింది! ఆ గోలేమిటో చూద్దామని అది అక్కడికి వెళ్ళింది.

పెళ్ళికుమారుడి తండ్రి పెళ్ళి కుమార్తె తండ్రిని అదనపు కట్నం అడుగుతూ కాబోయే వియ్యంకుడితో కర్కశంగా మాట్లాడుతున్నాడు!

తను అప్పట్లో చేసిన తప్పుని ఈ పెండ్లికొడుకు తండ్రి చేస్తున్నాడని తెలుసుకుని అతనికి తగిన బుధ్ది చెప్పాలని నారాయణ దెయ్యం అనుకుంది.

అతను పెండ్లికుమార్తె తండ్రిని అడిగినప్పుడల్లా అదృశ్యంగా అతని వీపు మీద బలంగా దెబ్బలు వెయ్యసాగాడు. ఆ హఠాత్పరిమాణానికి అక్కడ అందరూ ఆశ్చర్య పోయారు! ఎందుకు ఆ విధంగా జరుగుతోందో పెండ్లి కొడుకు తండ్రి తెలుసుకోలేక పోయాడు!

అప్పుడు అదృశ్యంగా ఉన్న నారాయణ దెయ్యం అతనితో ఈ విధంగా చెప్పంది – ఆ మాటలు అతనికి మాత్రమే వినబడ సాగాయి. “చూడు, నీవు అదనపు కట్నం అడగటం మహాపాపం, అందుకే కట్నాన్ని కట్నపిశాచి అంటారు! నీలాగే నేను నా కొడుకు పెండ్లి చేసినపుడు అదనపు కట్నం కోసం నా వియ్యంకుడిని పీడించాను, తరువాత నాకు పెద్ద జబ్బు చేసి చచ్చి పోయి ఈ దెయ్యంగా మారాను!

నేను కట్న దురాచారాన్ని రూపు మాపితే నాకు ఈ దెయ్యం రూపం నుండి విముక్తి లభిస్తుంది, నీవు కట్నానికి పీడిస్తే నీవు దెయ్యంగా మారుతావు” అని అతనికి అర్థం అయ్యేట్టు చెప్పాడు.

దెయ్యం చెప్పిన మాటలకు అతనిలో మార్పు వచ్చి పెండ్లి కూతురు తండ్రితో ఈ విధంగా చెప్పాడు “అయ్యా, బుద్ధి గడ్డి తిని తమరిని అదనపు కట్నం అడిగాను. అసలు మాకు కట్నమే వద్దు, అందరం కలిసి ఈ కట్న దురాచారాన్ని రూపు మాపుదాం” అని ఆప్యాయంగా పెండ్లి కూతురు తండ్రి చేతులు పట్టుకుని చెప్పాడు.

అతనిలో వచ్చిన మార్పుకి పెండ్లి కూతురి తండ్రి ఆశ్చర్య పోయాడు.

దెయ్యం రూపంలో ఉన్న నారాయణ ఎంతో సంతోషించాడు. అతను కట్న పిశాచి రూపు మాపేందుకు చేసిన కృషి వలన నారాయణకు దెయ్యం రూపం నుండి విముక్తి లభించింది!

మనస్సా, వాచా ఎవరూ కట్నం కోరకూడదు. అది మహా పాపం, ఆడపిల్లల తండ్రులను కట్నం కోసం ఏడిపించ కూడదు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here