భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 22

0
6

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 22” వ్యాసంలో తాడిపత్రి లోని ‘శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం, తాడిపత్రి

[dropcap]ఆం[/dropcap]ధ్రప్రదేశ్‌లో అద్భుతమైన శిల్పకళతో అలరారే ఆలయాలని చూడాలనుకుంటున్నారా? అయితే మీరు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వెళ్ళాల్సిందే. అక్కడ వున్న రెండు ప్రాచీన ఆలయాలు, బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, చింతల వెంకటేశ్వరస్వామి ఆలయం శిల్ప కళా నిధులు.

ఇందులో ముందు రామలింగేశ్వరస్వామి ఆలయం దర్శిద్దాము. ఇది పెన్నా నది ఒడ్డున వున్నది. నిర్మాణ సమయం విజయనగర సామ్రాజ్య కాలం. విజయనగర సామ్రాజ్య మండలాధీశుడైన తిమ్మనాయుడు 16వ శాతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారని ఇక్కడ వున్న బోర్డు ద్వారా తెలిసిన విశేషం. ఆలయ ఉత్తర, దక్షిణ దిశలందుగల అందమైన గాలి గోపురాలు ఆనాటి విజయనగర శిల్పకళా నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గాలి గోపురాల గోడలపైన చెక్కబడిన సొగసైన శిల్పాలను చూడటానికి శిల్ప కళారాధకులకు ఎంత సమయమైనా సరిపోదు.

విజయనగర రాజులు కళలకు అత్యంత గౌరవమిచ్చేవారు. వారి పరిపాలనా కాలంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా అద్భుతమైన శిల్పకళ చూడవచ్చు.

భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుడిని దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో ఆలయ గోడల మీదున్న శిల్పాలను సందర్శించినప్పుడు అంతే మంత్రముగ్ధులవుతారు. రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఆలయానికి వున్న గోపురాలలో మూడు శిథిలమైనాయి. వాటి భాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల భాగంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ముఖమండపం, కళ్యాణమండపం, అంతరాళం, గర్భగుడి అనే ప్రధాన విభాగాలున్నాయి. ఇంకా ఇదే ఆవరణలో కుడివైపున వీరభద్ర, చండీ ఆలయాలు కళ్యాణమండపం, రామాలయం పార్వతీ దేవి ఆలయాలున్నాయి. వీరభద్రుడు ఇక్కడ క్షేత్ర పాలకుడు. మండపాలపై రాతిపుష్పాలు, ఆలయ కుడ్యాలపై విజయనగర పాలకుల రాజముద్రిక అయిన వరాహం, సూర్యచంద్రులు, కత్తి కనిపిస్తాయి. కుడ్యాలపై నాట్యకారిణల నృత్యభంగిమలు కనువిందు చేస్తాయి. మరియు శ్రీమహావిష్ణువు దశావతారాలను, పురాణ గాధలను మనోహరంగా మలచారు శిల్పులు.

స్ధల పురాణం

పూర్వం ఇదంతా దండకారణ్య ప్రాంతం. రామాయణ గాథలోని తాటకి ఇక్కడ నివసించేదనీ, శ్రీరాముడు ఆవిడని చంపితే ఆవిడ శరీరం ఇక్కడే పడ్డదనీ, అందుకే ఈ ఊరి పేరు వివిధ రూపాలనంతరం తాడిపత్రి అయిందని ఒక కధనం. ఇంకొక కధ ప్రకారం పూర్వం ఇక్కడ తాడి చెట్లు ఎక్కువగా వుండేవనీ, ఆ ఆకులతోనే అందరూ ఇళ్ళు నిర్మించుకునేవారనీ, అందుకే తాళపత్రి, తాటిపత్రి, తాడిపత్రి అయిందంటారు.

తాటకిని చంపటంవల్ల వచ్చిన స్త్రీ హత్యా దోషం పోగొట్టుకోవటానికి శ్రీరామచంద్రుడు స్వయంగా ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశారంటారు. అందుకనే రామలింగేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. బ్రాహ్మణుడైన రావణుడిని చంపడం వల్ల వచ్చిన పాపం నుండి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారు, అలా ప్రతిష్ఠింపబడిన శివలింగాలలో ఇది కూడా ఒకటని ఆలయ పూజారుల కథనం.

విశేషం

ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఇక్కడి శివలింగం. ఈ శివలింగం నదికి 8 అడుగుల ఎత్తున, ఎత్తయిన పీఠంపైన వున్నది. అయినా ఏడాదిలో 365 రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతునే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా, ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది.

ఇక్కడ ఉత్తరాభి ముఖంగా ఒక మండపంలో కాశీ లింగం వున్నది. దీనిని కాశీనుంచి ఆంజనేయస్వామి స్వయంగా తెచ్చారుట.

ఉత్సవాలు

ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు ఫాల్గుణమాసం శుద్ధ తదియ వరకు 11 రోజులపాటు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here